Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

తెలుగు భాష అమలులో నల్లగొండ మేటి !

$
0
0

నల్లగొండ, మే 13: నల్లగొండ కలెక్టరేట్‌లో విరసిన తెలుగు భాష వికాస పరిమళాలు నానాటికి దిగ్విణీకృతమవుతున్నాయి. కలెక్టర్ నందివెలుగు ముక్తేశ్వర్‌రావు చొరవతో అధికార భాష..మాతృభాష తెలుగు అమలుకు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతుండగా కలెక్టరేట్‌లోని ప్రతి కార్యాలయంలో అధికారిక ఉత్తర, ప్రత్యుత్తరాలు, ఉత్తర్వులు సాధ్యమైన మేరకు తెలుగు భాషలోనే సాగేందుకు దోహదం చేస్తున్నాయి. కంప్యూటర్ వినియోగంతో సాగించే కార్యకలాపాల్లోనూ తెలుగునే ఉపయోగిస్తుండటం ఆసక్తికరం. తెలుగు భాష అమలులో కలెక్టర్ కార్యాలయం, గ్రామీణాభివృద్ధి సంస్థ(డిఆర్‌డిఏ), ప్రణాళిక శాఖ, గృహనిర్మాణ, పౌరసరఫరాలు, డ్వామా, భూసేకరణ విభాగాలు ముందంజలో ఉన్నాయి. ఆయా శాఖలలో తెలుగు భాష సమర్ధవంత అమలుకు, ఆంగ్ల వినియోగాన్ని క్రమంగా నివారించేందుకు కార్యాలయ వినియోగ తెలుగు పదకోశాలను రూపొందించుకోవడం విశేషం. ప్రభుత్వ పరంగా గ్రామీణాభివృద్ధి శాఖ నుండి అధిక కార్యక్రమాలు అమలవుతున్న నేపధ్యంలో 6వేల మహిళా స్వయం సహాయక బృందాల్లోని 6లక్షల 60వేల మంది సభ్యుల ద్వారా తెలుగు భాష విస్తృత అమలుకు ఉన్న సదావకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఆ శాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు తెలుగు భాష అమలును ముందుకు దూకిస్తున్నాయి. డిఆర్‌డిఏ పిడి రాజేశ్వర్‌రెడ్డి తెలుగు భాష అమలుకు ప్రత్యేక కార్యాలయ తెలుగు పదకోశం రూపకల్పనతో పాటు తెలుగు భాష ప్రశస్తిని వివరిస్తు ముద్రించిన గోడ పత్రాలను మహిళా సంఘాలకు పంపిణీ చేస్తు తెలుగు భాష అమలును విస్తృతం చేస్తున్నారు. కలెక్టరేట్‌లో అధికార భాష అమలు ప్రభావం మండలాల్లోని ఆయా ప్రభుత్వ శాఖలన్నింటిపై పడుతుండగా అక్కడ కూడా తెలుగు భాష వినియోగం అనివార్యమవుతుండగా క్రమంగా అధికార భాష అమలు విస్తృతమవుతుంది. ఇప్పటికే తెలుగు భాష అమలు కోసం కలెక్టర్ చేపట్టిన కార్యక్రమాలు రాష్టస్థ్రాయిలో జిల్లాను అగ్రగామిగా నిలుపగా, గుర్తింపుగా జిల్లాకు ప్రభుత్వం ఉత్తమ తెలుగు భాష అమలు జిల్లాగా అవార్డు సైతం అందించడం గమనార్హం. అయితే పరిపాలనలో పూర్తి స్థాయిలో తెలుగు భాష అమలు కోసం కలెక్టర్ మరిన్ని కార్యక్రమాల అమలు దిశగా కలెక్టర్ కార్యాలయ అధికారి అంజయ్యకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించగా ఎప్పటికప్పుడు ఈ విషయమై పర్యవేక్షణ సాగుతుండటంతో అధికార భాష అమలు ఆశించిన లక్ష్యాల దిశగా సాగిపోతుండటం మాతృభాష పరిరక్షణకు శుభపరిణామం.
కలెక్టరేట్‌లో అధికార భాష సంఘం సభ్యుల పరిశీలన
నల్లగొండ కలెక్టరేట్‌లో అధికార భాష తెలుగు అమలు జరుగుతున్న తీరుతెన్నులను సోమవారం రాష్ట్ర అధికార భాష సంఘం డిప్యూటీ కార్యదర్శి మనోరంజని, పరిశీలక సభ్యులు డిప్యూటి కలెక్టర్ సునిత, ఏడి వై.ఎల్.ఎన్.నరసింహ్మరావులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు డ్వామా, డిఆర్‌డిఏ, డిఎస్‌వో, హౌజింగ్, కలెక్టరేట్ కార్యాలయంలో తెలుగు భాష అమలు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఆయా కార్యాలయాల్లో తెలుగుభాషలో రూపొందించిన ఉత్తర, ప్రత్యుత్తరాలు, దస్త్రాలు, ఉత్తర్వులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముక్తేశ్వర్‌రావుతో పాటు ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులతో సమావేశమయ్యారు. అనంతరం వారు మాట్లాడుతు తెలుగు భాష అమలులో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా మేటిగా ఉండి ఇతర జిల్లాలకు ఆదర్శ ప్రాయంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ ముక్తేశ్వర్‌రావు చొరవతోనే అధికార భాష అమలు ముందుకు సాగుతుందని ఇదే రీతిలో ఇతర జిల్లాల కలెక్టర్లు కూడా తెలుగు భాష అమలుకు కృషి చేయాలని ఆశిస్తున్నామన్నారు. నేడు అధికార భాష దినోత్సవం సందర్భంగా నల్లగొండ కలెక్టరేట్‌లో జరిగే కార్యక్రమానికి అధికార భాష సంఘం చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ హాజరవుతారని వారు తెలిపారు.

అక్షయ తృతీయకు మంచి ఆదరణ
* బంగారం దుకాణాల కిటకిట
చిట్యాల, మే 13: బంగారం అంటే ప్రతి ఒక్కరికి మక్కువే.. అందులోను మహిళలకు అందమైన ఆభరాణాలైతే మరీ మక్కువ. అందుకే ప్రతి ఒక్కరు బంగారాన్ని కొద్దోగొప్పో కొనుగోలు చేస్తుంటారు. అందునా ‘అక్షయ తృతీయ’ సందర్భంగా బంగారాన్ని కొనుగోలు చేసినట్లయితే సిరులు కలిసి వస్తాయనే నమ్మకంతో బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఉత్సుకతను చూపించారు. అక్షయ తృతీయ రోజుకున్న ప్రాధాన్యతను వస్తున్న ఆదరణను చూసి అక్షయ తృతీయ ఆదరణకు విసృత ప్రచారం జరుగడంతో అందుకు ప్రాదాన్యత పెరిగినది. ప్రతి అక్షయ తృతీయ రోజున బంగారాన్ని, ఆభరణాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబరిచారు. ఈఅక్షయ తృతీయ రోజున సోమవారం మండల కేంద్రంలో బంగారాన్ని, ఆభరణాలను ప్రజలు కొనుగోలు చేసేందుకు రావడంతో బంగారు దుకాణాలు కిటకిటలాడాయి. ఇటీవలే బంగారు ధరలు తగ్గడంతో వాటి కొనుగోలుకు సామాన్య ప్రజలు ఆసక్తిని చూపుతున్నారు. ఉన్నత కుటుంబానికి చెందిన వారు అందమైన ఆభరణాలు, బంగారాన్ని కొనుగోలు చేయగా బంగారం ధర ఎక్కువగానే ఉన్నప్పటికినీ తమ ఇళ్ళంతా బంగారమయం కావాలని ఆకాంక్షిస్తూ బంగారాన్ని కొనుగోలు చేశారు. మద్య తరగతి కుటుంబానికి చెందిన వారు వారికి తోచినంతగా బంగారాన్ని కొనుగోలు చేశారు. వివాహాలకు బంగారాన్ని, ఆభణాలను కొనుగోలు చేసే వారు కూడా దుకాణాలకు రావడంతో నూతన వధువువులు వారి బంధువులతో కిటకిటలాడాయి. బంగారాన్ని, బంగారంతో చేయబడిన చిన్నపాటి ఆభరణాలను కొనుగోలు చేసందుకు పెద్దఎత్తున ప్రజలు తరలిరావడంతో బంగారం దుకాణాలు సందడిగా మారాయి.

జైల్‌లో నూతన బ్యారక్స్ నిర్మాణంకు కృషి
* జైల్ సందర్శించిన జైళ్లశాఖ డిఐజి కేమనాయుడు
నల్లగొండ , మే 13: జైల్‌లో ఖదీల అనువుగా నూతన బ్యారక్స్ నిర్మాణానికి కృషి చేస్తానని జైళ్లశాఖ వరంగల్ రేంజ్ డిఐజి కేమనాయుడు తెలిపారు. సోమవారం ఆయన జిల్లా కేంద్రమైన నల్లగొండ పట్టణంలోని జిల్లా జైల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు, జైల్ ఆవరణలోని బావి, ఖదీలు ఉండే బ్యారక్స్ వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా జైల్‌లోని బావిలో పుడిపోయిందని దానిలోని పుడిక తీస్తే ఉపయోగంలోకి వస్తుందని ఇసుకను, పుడికను తీయించాలని సూచించారు. ఖదీల సంక్షేమం కోసం అనే కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జైల్ సూపరిండెంట్ రాజమహేష్, జైలర్ దేవుల్లా, డిప్యూటీ జైలర్ పాండచారిలు ఉన్నారు.

మన ఊరి పిల్లలు మనబడిలో చదవాలి
* యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి, డిఇవో జగదీష్
నల్లగొండ , మే 13: యుటిఎఫ్ ఆధ్వర్యంలో ‘మన ఊరి పిల్లలు మన బడిలోనే చదువాలి’ అనే నినాదంతో ముద్రించిన పోస్టర్లను సోమవారం డైట్ కేంద్రంలో యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నర్సిరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి ఆచార్య జగదీష్‌లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, బలోపేతంలో భాగంగా నగర, పట్టణ, మండల, డివిజన్ కేంద్రాల్లో అవగాహణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు పాఠశాలలో విద్యార్థుల నమోదు కార్యక్రమంలో పాల్గొని పేర్లను నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్‌రెడ్డి, రాములు, నాయకులు బలరాం, వెంకటేశ్వర్లు, రాజేందర్‌రెడ్డి, సైదిరెడ్డి, ఆనంద్, లక్ష్మినారాయణ, నాగిరెడ్డి, ఖాజ తదితరులు పాల్గొన్నారు.

మహిళా రుణాల్లో అగ్రగామి జిల్లా
ప్రభుత్వ పురస్కారం దక్కించుకున్న జిల్లా
రుణ పంపిణీ లక్ష్యం 417కోట్లు..పంపిణీ 454.35కోట్లు
నల్లగొండ, మే 13: స్వయం సహాయ మహిళా సంఘాల(ఎస్‌హెచ్‌జి) ఆర్ధిక ప్రగతికి చేయూతనందించడంలో రాష్ట్రంలో నల్లగొండ జిల్లా అగ్రగామిగా నిలిచింది. జిల్లా స్వయం సహాయ మహిళా సంఘాలకు 2012-13ఆర్ధిక సంవత్సరంలో 417కోట్ల రుణ పంపిణీ లక్ష్యంగా పెట్టుకోగా 25,211సంఘాలకు 454.35కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను పంపిణీ చేయడంలో జిల్లా గ్రామీణాభివృద్ధి, ఇందిరాక్రాంతి పథం విభాగాలు విజయవంతమయ్యాయి. వరుసగా మూడేళ్ల పాటు నూరు శాతం రుణ పంపిణీ లక్ష్యాలను అధిగమించడంలో జిల్లా యంత్రాంగం సాగించిన కృషి ఫలించి ఈ ఏడాది జిల్లాకు మహిళా రుణ పంపిణీలో లక్ష్య సాధనకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం దక్కడం విశేషం. 2010-11లో 244.49కోట్ల పంపిణీ లక్ష్యంగా పెట్టుకోగా 257.93కోట్లను 18,705సంఘాలకు పంపిణీ చేశారు. 2011-12లో 332.91కోట్ల రుణ పంపిణీ లక్ష్యంగా పెట్టుకోగా 20,897సంఘాలకు 347.85కోట్లు పంపిణీ చేశారు. 2012-13సంవత్సరంలో 417కోట్లు లక్ష్యంగా పెట్టుకుని 454.35కోట్ల రుణ పంపిణీతో 109శాతం రుణ పంపిణీ లక్ష్యం సాధించడం జరిగింది. బ్యాంకు లింకేజీల రుణ పంపిణీ లక్ష్యాలను అధిగమించడంలో జిల్లా కలెక్టర్ ఎన్. ముక్తేశ్వర్‌రావు బ్యాంకర్లతో ఎప్పటికప్పుడు నిర్వహించిన సమీక్షలు, బ్యాంకర్ల సహకారం కీలక భూమిక వహించింది. అటు పావులా వడ్డీ పథకంలోనూ ఇప్పటికే 45,009సంఘాలకు 18.05కోట్లు సంఘాల ఖాతాల్లో జమ చేశారు. వడ్డీ లేని రుణాలలో భాగంగా నెలవారి వడ్డీలేని రుణాల 2012జూలై 1నుండి 2013్ఫబ్రవరి వరకు 59,551సంఘాలకు 25.72కోట్ల మాఫీ నిధులను సంఘాల ఖాతాల్లో జమచేశారు. జిల్లా మహిళా సంఘాల బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యాల సాధనలో సాధించిన ప్రగతిని అభినందిస్తు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు అందించిన పురస్కారాన్ని మంత్రి సునితాలక్ష్మారెడ్డి జిల్లా డిఆర్‌డిఏ పిడి రాజేశ్వర్‌రెడ్డికి అందించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతు మహిళా సంఘాల క్రియాశీలత..బ్యాంకర్ల సహకారంతో జిల్లా మహిళా సంఘాల బ్యాంకు లింకేజీ రుణ పంపిణీ లక్ష్యాలను సాధించడం జరిగిందన్నారు. మునుముందు మహిళాభ్యున్నతి కార్యక్రమాల అమలులో ఇదే స్ఫూర్తితో ముందుకు సాగనున్నట్లుగా ఆయన తెలిపారు.

సిఎంను మారుస్తారనేది అపోహలే
మంత్రి దానం
యాదగిరిగుట్ట, మే 13: సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని మారుస్తారనేది అపోహ మాత్రమేనని ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అధిష్టానంచేతిలో మాత్రమే ఉందని కార్మికశాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. సోమవారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామివారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం విలేఖరులతో మాట్లాడారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటుచేయడానికి మంత్రులందరం కలసి సిఎంతో చర్చించి అన్నివిధాల ప్రయత్నం చేస్తున్నామని, ఈ విషయంలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసికట్టుగా ఉన్నామన్నారు. కొండ సురేఖ కాంగ్రెస్‌పార్టీ నాయకులకు సోదరిలాంటిదని, ఆమె తిరిగివస్తానంటే స్వాగతిస్తామన్నారు. తెలంగాణ విషయంలో హైకమాండ్ ఏనిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని మంత్రి దానం పేర్కొన్నారు. గతంలో ఎవ్వరూ చేయనంతగా ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని సిఎం కిరణ్ అనేక పథకాలతో ప్రజల హృదయాలలో చిరస్థాయిగా మిగులుతారన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, మన బియ్యం, బంగారు తల్లీ మంచి ఆదరణ పొందాయన్నారు.

ఈ నెల 16నుండి జూన్ 15వరకు ఓటర్ నమోదు సర్వే
చింతపల్లి, మే 13: మండలంలోని పలు గ్రామాలలో ఈనెల 16నుండి జూన్ 15వరకు ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటర్ నమోదు కార్యక్రమం సర్వే నిర్వహించనున్నట్లు తహశీల్దార్ పర్హిన్ షేక్ తెలిపారు. సోమవారం విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2013జనవరి 1నాటికి 18సంవత్సరాలు నిండిన యువతీ యువకులు తమ కలర్ ఫోటోలతో ఓటర్‌నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఫోటోలు సరిగ్గా రాని వారి నుండి కొత్తగా కలర్ ఫోటోలు సేకరించడం జరుగుతుందని తెలిపారు. పేర్లు తప్పులు ఉన్నట్లయితే సవరించడం జరుగుతుందని ఆమె తెలిపారు. గ్రామాల్లో లేని వారి పేర్లను ఓటర్ లీస్టు నుండి తొలగించడం జరుగుందని, అదేవిధంగా కొత్త వారిని నమోదు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇంటినెంబర్ తప్పని సరిగా ఉండాలని సూచించారు. ఇందిరమ్మ పచ్చతోరణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండలంలో గజం భూమి కూడా వ్యర్థం కాకుండా ఇందిరమ్మ పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా చెట్ల పట్టాలు ఇవ్వడానికి సర్వే నిర్వహిస్తునట్లు ఆమె తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో డిప్యూటి తహశీల్దార్ కృష్ణస్వామి, ఆర్ ఐ మొబిన్, విఆర్‌వోలు శ్రీనివాస్‌రెడ్డి, బాబురావు, యాదయ్య, రాజేశ్వరి తదితరులు ఉన్నారు.

ఎఎమ్మార్పీ ద్వారా చెరువులు, కుంటలు నింపాలి
* సిపిఎం జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహ్మరెడ్డి
నల్లగొండ , మే 13: ఎఎమ్మార్పి కాల్వ ద్వారా కట్టంగూర్, నకిరేకల్, కేతేపల్లి మండలాలలోని చెరువులను, కుంటలను నింపి ప్రజలకు తాగు నీరందించాలని సిపి ఎం జిల్లా కార్యాదర్శి నంద్యాల నర్సింహ్మరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. సోమవారం కట్టంగూర్, నకిరేకల్, కేతేపల్లి, మండలాలకు చెందిన ప్రజలు కలెక్టరేట్ ఎదుట తాగునీటికై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల మాట్లాడుతూ తీవ్ర వర్షాభావం, భూగర్భ జలాలు అడుగంటడంతోపాటు కరవుతో గ్రామాల్లో తాగేందుకు నీరు లేక ప్రజలు అవస్తలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఎ ఎమ్మార్పి కాల్వ ద్వారా తాగునీటికి చెరువులు, కుంటలు నింపి వెంటనే ఆయా మండలాల ప్రజలకు తాగునీరందించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ ఎన్.ముక్తేశ్వర్‌రావుకు అందించారు. ఈ కార్యక్రమంలో కట్టంగూర్, నకిరేకల్, కేతేపల్లి మండలాల ప్రజలు, సిపి ఎం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఉన్నారు.

విష జ్వరాలతో మంచం పట్టిన గిరి జనం
* నెలలోనే ముగ్గురు మృతి
* ఇంటింటా జ్వరాలు... ఏడుగురి పరిస్థితి విషమం
నేరేడుచర్ల, మే 13: నేరేడుచర్ల మండలంలోని గిరిజన గ్రామమైన శూన్యపహాడ్‌లో విష జ్వరాలతో ఒక నెలలోనే ముగ్గురు మృతి చెందగా మరో ఏడుగురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండి ఇంటింటా జ్వరాలు రావడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన రమావత్ సరోజ(20)కు తీవ్రమైన జ్వరం రావడంతో మిర్యాలగూడలోని జ్యోతి ఆసుపత్రిలో చికిత్స చేయించగా పరిస్థితి విషమంగా ఉండడంతో హైద్రాబాద్‌లోని స్పార్న్ ఆసుపత్రికి తరలించగా అక్కడ కూడా తగ్గకపోవడంతో గాంధి ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పటికి పరిస్థితి చేయిజారిపోవడంతో సోమవారం మృతిచెందింది మృతురాలికి ఒక సంవత్సరం బాబు, భర్త ఉన్నారు. సోమవారం గ్రామానికి మృతదేహం చేరడంతో గిరిజనుల రోదనలతో తండా విషదఛాయలు నెలకొన్నాయి. గత శుక్రవారం విషజ్వరం రాగా సపావత్ హేమ్లా(47) సుమారు నెల క్రితం రమావత్ సునీత(33)లు మృతిచెందారు. అంతేకాకుండా రమావత్ దోర్జి(35), హైద్రాబాద్‌లోని స్పార్న్ ఆసుపత్రిలో రమావత్ మంగ్తా(55), యశోద ఆసుపత్రిలో రమావత్ బీకి(40), మిర్యాలగూడలో రమావత్ కిరి(60), లావూత్యా రంగి(40), శూన్యపహాడ్‌లో రమావత్ సంధ్య(8), రమావత్ మోతియ(35), రమావత్ నవీన్(12)లు నార్కట్‌పల్లిలో చికిత్స పొందుతున్నారు. విష జ్వరాలు సోకడానికి గ్రామస్థుల అపరిశుభ్రత కారణమని అధికారులు చెప్తుండగా పరిసర ప్రాంతంలోని సిమెంట్ పరిశ్రమల నుండి, థర్మల్ పవర్ స్టేషన్ నుండి వెదజల్లే కాలుష్యమే కారణమని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. జ్వరాలు సోకగానే అందుబాటులో ఉన్న ఆర్‌ఎంపిలను ఆశ్రయించడం తాత్కాలిక వైద్యం చేయించుకోవడంతో కాలాయాపన జరిగి జ్వరం తీవ్రత పెరిగి రక్తకణాలు పడిపోవడం వల్ల మృతికి కారణమవుతుందని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు.
తహశీల్దార్, వైద్యాధికారి సందర్శన
విషజ్వరాలతో ముగ్గురు మృతిచెందగా విషయం పలువురి పరిస్థితి విషమంగా ఉన్న విషయాన్ని తెలుసుకొన్న తహశీల్దార్ లక్కా అలివేలు, వైద్యాధికారి సురేష్‌రెడ్డిలు సోమవారం గ్రామాన్ని సందర్శించారు. తహశీల్దార్ పరీజ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించి 2వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందచేశారు. గ్రామంలో ఇల్లిల్లు తిరిగి రోగాల బారినపడిన వారిని పరామర్శించి పలుసూచనలిచ్చారు. వైద్యాధికారి సురేష్‌రెడ్డి జ్వరాలు వచ్చిన వారిని పరీక్షించి రక్త నమూనాలు సేకరించి విషజ్వరాలకు కారణం తెలుసుకోవడానికి పూణెలోని ల్యాబరేటరికి పంపుతున్నట్లు తెలిపారు. గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఇంత అభివృద్ధి ఎన్నడూ చూడలేదు
* బిసి సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య
మఠంపల్లి, మే 13: రాష్టస్థ్రాయిలో మంత్రిగా తాను చాలాసార్లు పర్యటించినా హుజూర్‌నగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందినంతగా మరే ప్రాంతాన్ని చూడలేదని బిసి సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. సోమవారం ఆయన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డిలతో కలిసి మట్టపల్లిలో నిర్మించనున్న రజకసంఘ సత్రానికి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ అభివృద్దికి ఉత్తమ్ చేసిన కృషిని అభినందించకుండా ఉండలేకపోతున్నానని ఆయన అన్నారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ 1100ఏళ్ళ చరిత్ర కలిగిన మట్టపల్లి మహాక్షేత్రాన్ని పర్యాటక కేంద్రాన్ని తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని అన్నారు. తాను ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు మట్టపల్లి రహదారి సరిగా లేకపోవడంతో 11కోట్లతో హుజూర్‌నగర్ వరకు రోడ్డు వేయడం జరిగిందన్నారు. త్వరలో 50కోట్లతో నిర్మించనున్న హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణంతో ఆంధ్రకు, తెలంగాణాకు మద్య వారధిగా ఉండడమేగాక హుజూర్‌నగర్ అభివృద్దికి దోహదపడుతుందని అన్నారు. సాగర్ ఆయకట్టు చివరిప్రాంతం కావడంతో బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు 18వేల ఎకరాలకు లిఫ్టులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ రజకుల అభివృద్ది కోసం జిల్లా కేంద్రంలో కమ్యూనిటిహాల్ నిర్మాణానికి ఏడుకుంటల స్థలం కేటాయించి ఎంపి నిధుల నుండి నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. రజకుల అభివృద్ది కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషిచేస్తుందని అన్నారు. అనంతరం మండలంలోని గుండ్లపల్లిలో 4.50కోట్లతో నిర్మించిన సిసిరోడ్డును, రఘునాధపాలెంలో 2.65కోట్లతో నిర్మించిన బిటి రోడ్డును ప్రారంభించారు. అనంతరం రఘునాధపాలెం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, స్థానిక నేత సీతారామయ్య ఆధ్వర్యంలో మంత్రుల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం మట్టపల్లి నృసింహున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ కమిటి పాలకవర్గం పూర్ణకుంభం స్వాగతం పలికారు. స్వామివారి చిత్రపటాలను అర్చకులు ఆశీర్వాదాలను అందచేశారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ లింగయ్య, సిఇ శ్రీనివాసరావు, సిఇఇ గిరీష్‌కుమార్, హౌజింగ్ డిఇ చలపతిరావు, ఎఇ కోటయ్య, తహశీల్దార్ సత్యనారాయణ, యాదగిరి, మండలపార్టీ అధ్యక్షుడు మంజునాయక్, సాముల శివారెడ్డి, మనె్నం శ్రీనివాస్‌రెడ్డి, బ్రహ్మారెడ్డి, ఆలయ కమిటి చైర్మన్ చెన్నూరి నర్సింహారావు, ఈఓ లక్ష్మణరావులతోపాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

అధికార భాష సంఘం సభ్యుల తనిఖీలు * నేడు కలెక్టరేట్‌కు బుద్ధప్రసాద్ రాక
english title: 
nalgonda

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>