Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఉప ప్రణాళిక నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తా

$
0
0

అల్లూరు, మే 13: ఉప ప్రణాళిక నిధులతో ఎస్‌సి, ఎస్‌టి గ్రామాలను అభివృద్ధిచేస్తానని కావలి శాసనసభ్యులు బీద మస్తాన్‌రావు అన్నారు. సోమవారం ఇందిరమ్మ కలలు కార్యక్రమంలో భాగంగా మండలంలోని గాలిదిబ్బలు, రాయపేట, ఎర్రపుగుంట, సింగారెడ్డిదినె్న తదితర కాలనీల్లో ఆయన పర్యటించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ 12500కోట్లు ప్రవేశపెట్టగా ఈ నిధులతో గ్రామాలను అభివృద్ధి పరిచేందుకు చర్యలు చేపడతామన్నారు. బడ్జెట్‌లో 25శాతం నిధులు ఖర్చుచేసేందుకు చట్టం వచ్చిందని, ఈచట్టం తేవడానికి కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఎం తదితర పార్టీలు కృషిచేశాయన్నారు. కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా వున్నప్పటికీ ప్రతి గిరిజన కాలనీ, దళితవాడలో తిరుగుతూ వారి సమస్యల పట్ల తక్షణమే స్పందిస్తున్నానన్నారు. రాబోయే పది సంవత్సరాల కాలంలో ఈ నిధులతో అంతా అభివృద్ధి మయం అవుతుందన్నారు. గ్రామాల అవసరాలను గుర్తిస్తూ సమస్యలు తానే తెలుసుకుంటున్నానన్నారు. ఎస్‌సి ఎస్‌టి కాలనీల్లో వారికి సరైన వౌలిక వసతులు లేవన్నారు. తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున బిఎంఆర్ చారిటబుల్ ట్రస్టుద్వారా స్వంత నిధులతో తాగునీటికి సరఫరా చేస్తున్నామన్నారు. రాయపేట గ్రామంలో 5వేల లీటర్లతో వాటర్ ట్యాంక్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో తాను కొన్ని హామీలు ఇచ్చానని వాటిని తప్పకుండా నెరవేరుస్తానని తన స్వగ్రామం ఇస్కపల్లి అయినందున చుట్టుపక్కల గ్రామాలన్నింటిని అభివృద్ధి పథంలోముందుకు తీసుకు వెళ్తానన్నారు. కాలనీల్లో సిమెంట్‌రోడ్డు, విద్యుత్‌దీపాలు, అంగన్‌వాడీ భవనాలు, సైడ్‌కాలువలు, ఉప ప్రణాళిక నిధులతో అభివృద్ధి చేసుకోవాలని గ్రామస్థులను కోరారు. రేషన్‌కార్డులు, పింఛన్‌లు తదితర సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి వారికి న్యాయంచేయాలన్నారు. అంతేకాకుండా జాబ్ కార్డు కలిగి వున్న ప్రతి ఒక్కరు ఉపాధిహామీ పనులు చేసుకోవాలని ఆయన కోరగా జాబ్‌కార్డు వున్నాగాని క్షేత్ర సహాయకులు సమగ్ర సమాచారం తమకు ఇవ్వనందున పనులు లేక అల్లాడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొనిరాగా వెంటనే స్పందించి సిబ్బందిని ప్రశ్నించడంతో వారి వద్ద సరైన సమాధానాలు రాకపోవడంతో మస్తాన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేసి నిరక్ష్యరాస్యులైన ప్రజలకు ఏపనులు వున్నాయో సమాచారం ఇచ్చి వారికి పనులు కల్పించే దిశగా గ్రామాలలో పనులు నిర్వహించాలన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సాయిరాజ్ తండ్రి వెంకయ్యకు 50వేల రూపాయల చెక్కును అందించారు. అలాగే మండలంలో ఇద్దరికి ఎన్‌ఆర్‌జిఎస్ చెక్కులను ఆయన అందచేశారు. ఈకార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఎంపిడి ఓ ప్రత్యూషా, మేడావిజయ్‌కుమార్‌రెడ్డి, మాజీ జడ్‌పిటిసి సభ్యుడు గిరిధర్, డి టి నరసయ్య, ఏ ఇ సుబ్బారావు, ఓంకార్, భాస్కర్‌రెడ్డి, ఐకెపి ఏపి ఎం నరసింహం, ఎస్ ఐ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

బీదకు సమస్యలు వెల్లువ
అల్లూరు, మే 13: మండలంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ కలలులో భాగంగా కావలి ఎమ్మెల్యే బీదకు ప్రజలు తండోపతండాలుగా తమ సమస్యలను ఆయన ముందుకు తీసుకు వస్తుండటంతో ఓర్పుతో పలు అర్జీలను పరిశీలిస్తూ వారి సమస్యలను అధికారుల ముందు వుంచి తక్షణమే పరిష్కార మార్గం చూపడంతో కొందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలలో అధికంగా తాగునీటి సమస్య, వృద్ధాప్య పెన్షన్‌లు, నూతనంగా నిర్మించుకోబోయే ఇందిరమ్మ ఇళ్ళు తదితర సమస్యలను ఆయన ముందుకు తీసుకొని రాగా ప్రతి గ్రామంలో స్వయంగా సమస్యలు వున్న చోటకు వెళ్ళి వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ జిల్లాస్థాయి అధికారులతో వెంటనే ఫోన్‌లో సంప్రదించి సమస్యల పట్ల అవగాహన కల్పించి పరిష్కార మార్గం చూపడంతో స్థానిక ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. 80సంవత్సరాల వృద్ధుడు పాడేటి చౌడయ్య తనకు పింఛన్ లేదని ఎమ్మెల్యే వద్ద వాపోయాడు. వెంటనే ఆయన స్పందించి తక్షణమే పింఛన్‌తోపాటు 35కేజీల అంత్యోదయకార్డును ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా గ్రామంలోని యువత సమస్యలపై వెంటనే స్పందించి అధికారుల దృష్టికి లేదా తన దృష్టికి తీసుకొని రావాలని, ఇలాంటి వృద్ధులు నడవలేని స్థితిలో వుండగా సహాయ సహకారాలు వుండాలని ఆయన కోరారు.

పాత్రికేయుని మృతికి బిజెపి సంతాపం
నెల్లూరు, మే 13: వెంకటగిరి ప్రాంతంలో సీనియర్ పాత్రికేయునిగా సేవలందిస్తూ మృతి చెందిన కొండగుంట రామకృష్ణ ఆత్మకు శాంతి కలగాలంటూ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి సురేష్‌రెడ్డి, కార్యదర్శులు కాకు విజయలక్ష్మి, జిల్లా అధ్యక్షులు పి సురేంద్రరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా సమాజసేవకు విశేషంగా కృషి చేశారని వారు గుర్తు చేశారు. జర్నలిజంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారన్నారు. అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న రామకృష్ణ మరణం తీరని లోటని అభిప్రాయపడ్డారు. ఇదిలాఉంటే ఏపియుడబ్ల్యూజె (ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు) నెల్లూరుజిల్లా ఉపాధ్యక్షులు జిలానీఖాన్ మరో ప్రకటనలో సంతాపం వెలిబుచ్చారు.

రైతు సదస్సుకు బస్సులు సిద్ధం
వరికుంటపాడు, మే 13: రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం నిర్వహిస్తున్న రైతు సదస్సుకు వరికుంటపాడు మండలం నుంచి రెండు బస్సులు సిద్ధం చేశామని స్థానిక వ్యవసాయాధికారి ప్రతాప్ తెలిపారు. సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ కావలిలో ఈ నెల 15న రైతు సదస్సు జరుగుతుందన్నారు. తిమ్మారెడ్డిపల్లి బస్సు తమ ఆధ్వర్యంలో జన సమీకరణ జరుగుతుందన్నారు. జి కొండారెడ్డిపల్లి బస్సుకు మండల వ్యవసాయ విస్తరణ అధికారి రాజ ఆధ్వర్యంలో జనాన్ని సమీకరిస్తున్నట్లు వివరించారు. రైతుచైతన్యయాత్రలో తమకు వచ్చిన సమస్యలపై చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పెద్దసంఖ్యలో రైతులు తరలిరావాలని ఆయన కోరారు.

మూగబోతోన్న సెల్‌ఫోన్లు
వరికుంటపాడు, మే 13: మండల పరిధిలోని పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో బిఎస్‌ఎన్‌ఎల్ టవర్ తరచూ మరమ్మతులకు గురవుతోంది. దీని కారణంగా పెద్దరెడ్డిపల్లితోపాటు చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. అత్యవసర సమయాల్లో సెల్‌ఫోన్లు పనిచేయకపోవడంతో అనేక అగచాట్లు తలెత్తుతున్నాయని స్థానికులు చెపుతున్నారు. బిఎస్‌ఎన్‌ఎల్ అధికార్లకు ఎన్ని పర్యాయాలుగా ఫిర్యాదు చేసినా స్పందించడం లేదన్నారు. అధికారులు వెంటనే స్పందించి సెల్‌టవర్‌ను మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

కంప్యూటర్‌లో ఉచిత శిక్షణ
నెల్లూరు, మే 13: శ్రీ రామకృష్ణ సేవాసదన్ నేతృత్వంలో కంప్యూటర్‌లో ఉచిత శిక్షణా కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆ సంస్థ కార్యదర్శి బత్తిన సాయికుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద 150వ జయంతోత్సవాల్ని పురస్కరించుకుని కంప్యూటర్ శిక్షణ ఉచితంగా ఇవ్వాలని భావిస్తున్నామన్నారు. సి, సి++, బేసిక్ థియరీ, ప్రాక్టికల్స్, స్పోకన్ ఇంగ్లీష్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, సాప్ట్ స్కిల్‌లలో 30రోజులపాటు ఈ శిక్షణ ఉంటుందన్నారు. యువతీ యువకుల్లో నైతిక ప్రవర్తన, దేశభక్తి, సామాజిక బాధ్యత, తల్లిదండ్రులు, పెద్దలపట్ల బాధ్యతాయుతమైన విలువలు పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తున్నట్టువివరించారు. తల్లిదండ్రులంతా ఇంజనీరింగ్‌లో చేరబోయే తమ పిల్లలను ఈ ఉచిత శిక్షణా కార్యక్రమానికి పంపించాలన్నారు. ఈ తరగతులు పిహెచ్‌డి, ఎంటెక్, ఎంఏ వంటి కోర్సులు చదివిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే, పారిశ్రామిక రంగ నిపుణులచే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శిక్షణ అనంతరం విద్యార్థులకు శ్రీరామకృష్ణమఠం స్వామిజీ ప్రశంసాపత్రాలు అందజేస్తారన్నారు. నగరంలోని చంద్రారెడ్డి డిగ్రీ కళాశాల, కోవూరు సాధన కోచింగ్ సెంటర్, బుచ్చిరెడ్డిపాళెం హౌస్‌తోటలోని కెఎఆర్ జూనియర్ కళాశాలల్లో ఈ శిక్షణ ఉంటుందన్నారు. ఎంసెట్ పరీక్ష రాసి ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులంతా ఈ కార్యక్రమాన్ని సద్వినియోపరచుకోవాలన్నారు. ఇందుకుగాను ఎంసెట్ హాల్ టిక్కెట్ చూపాలన్నారు.

కాంట్రాక్టర్లకు ‘దక్షిణ’ కాలువ
గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన జడ్పీ మాజీ చైర్మన్ కాకాణి
నెల్లూరు, మే 13: సోమశిల దక్షిణ కాలువ కాంట్రాక్టర్లకు వరంలా మారిందే తప్ప రైతులకు కనీస ప్రయోజనం కూడా కలగడం లేదంటూ నెల్లూరుజిల్లా పరిషత్ మాజీ చైర్మన్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు కాకాణి గోవర్దనరెడ్డి వాపోయారు. సోమవారం ఉదయం గ్రీవెన్స్‌సెల్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీ్ధర్‌ను సంప్రదించి ఈ మేరకు ఓ వినతిపత్రాన్ని అందజేశారు. దక్షిణ కాలువ లైనింగ్ నిర్మించిన అనతికాలంలోనే ధ్వంసం కావడం బాధాకరమన్నారు. నీటి విడుదలకే ధ్వంసమైన తీరు ఆవేదనకు గురి చేస్తోందన్నారు. దీంతో నీటి ప్రవాహం పంటలకు చేరక రైతన్నలు నానా అగచాట్లకు గురైన వైనాన్ని వివరించారు. తాను వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీకి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వివిధ సమస్యల్ని ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.

గ్రీవెన్స్‌సెల్‌కు అర్జీల వెల్లువ
నెల్లూరు, మే 13: ప్రజావిజ్ఞప్తుల దినంలో భాగంగా స్థానికులు పెద్దసంఖ్యలో కలెక్టరేట్‌కు తరలివచ్చి తమతమ సమస్యలపై మొరపెట్టుకున్నారు. సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చారు. గ్రీవెన్స్‌సెల్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ బి లక్ష్మీకాంతం, వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈదురుగాలులకు నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి డిమాండ్
నెల్లూరు, మే 13: ఈదురుగాలులు, వడగండ్లవానలతో నష్టపోయిన రైతులకు కూడా ప్రభుత్వం తరఫున పరిహారం అందజేయాలంటూ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి సురేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. సాధారణంగా భారీ వర్షాలు, వరదల వేళల్లోనే ప్రభుత్వ నష్టపరిహారం అందుతుంటుందన్నారు. అయితే తాజాగా చూస్తే ఈదురుగాలులతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల రైతాంగం వేల కోట్ల రూపాయల్లో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం నగరంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ జాతీయ నేత మురళి మనోహర్ జోషితోపాటు సురేష్‌రెడ్డి కూడా హాజరై రాష్ట్రంలో రైతుల సమస్యలపై మాట్లాడారు. గతంలో లైలా, జల్ తుఫాన్ సందర్భాల్లో రైతులకు నష్టపరిహారం ఇంతవరకు అందలేదని వాపోయారు. రైతులు గిట్టుబాటు ధరల్లేక అల్లాడుతున్నా ప్రభుత్వం నుంచి సానుకూల ధోరణి లేకపోవడం బాధాకరమన్నారు. రైతుల ఆత్మహత్యలు నానాటికీ అధికమవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. కాగా, ఉద్యానవన పంటలకు పరిహారంగా అందజేస్తున్న ప్రభుత్వ మొత్తం చాలా తక్కువగా ఉంటుందని సన్నపరెడ్డి పేర్కొన్నారు. ఒక బత్తాయి చెట్టుకు అందజేస్తున్న పరిహారం కేవలం వంద రూపాయలుగానే ఉంటోందన్నారు. అయితే అదే బత్తాయి చెట్టును నరికి తోట అవతల పడేసేందుకు కూలీకి ఇస్తున్న మొత్తం 150రూపాయలుగా ఉంటుందన్నారు. ఏడు సంవత్సరాలపాటు ఒక నిమ్మమొక్కను చెట్టుగా చేస్తేగాని ఫలదీకరణ ప్రక్రియ ప్రారంభం కాదనే సంగతి గుర్తు చేశారు. ఇదిలాఉంటే జిల్లాలో చెరకు రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. జిల్లాలోని మూడు ఫ్యాక్టరీల నుంచి అరవై కోట్ల రూపాయల వరకు రైతులకు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. కోవూరు సహకార చక్కెర కర్మాగారానికి సాక్షాత్తు జిల్లా కలెక్టరే చైర్మన్‌గా ఉన్నా రైతుల వెతలు తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ మేనేజింగ్ డైరెక్టర్ సుధాకర్‌రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని గుర్తు చేశారు. సాధారణంగా చెరకుకు తొమ్మిదిశాతంకుపైగానే రికవరీ ఉంటుండగా కోవూరు ఫాక్టరీలో మాత్రం ఆరుశాతంగానే ఉన్నట్లు గణాంకాలు చెపుతున్నాయన్నారు. ఈ ఫ్యాక్టరీపరంగా 12కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందన్నారు. ఫ్యాక్టరీలో ఉన్న 12కోట్ల రూపాయల చక్కెర నిల్వల్ని వెంటనే విక్రయించి రైతులకు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇదిలాఉంటే పొదలకూరు మండలంలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ వైఖరి ఘోరాతిఘోరంగా తయారైందని దుయ్యబట్టారు. రైతులు అందజేసిన 2.56కోట్ల లక్షల టన్నుల చెరకుతో చక్కెర ఉత్పత్తి చేసి విక్రయించుకున్నారన్నారు. అయితే రైతులకు చెల్లించాల్సిన 22 బకాయిల్లో మాత్రం రిక్తహస్తం ప్రదర్శిస్తున్న వైనాన్ని తాము స్వయంగా ఆ ఫ్యాక్టరీని సందర్శించిన సందర్భంలో తెలిసిందన్నారు. నాయుడుపేట ఎంపి షుగర్స్‌ఫ్యాక్టరీ కూడా 26కోట్ల రూపాయల వరకు రైతులకు చెల్లించాల్సి ఉందని సన్నపరెడ్డి దుయ్యబట్టారు. విలేఖర్ల సమావేశంలో ఇంకా బిజెపి రాష్ట్ర మరో ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, నాయకులు భాస్కర్, జీవరత్నం, అన్నం శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

ఆసుపత్రులకు మంచాలిస్తా : నీళ్ల వెంకయ్య
నెల్లూరు, మే 13: స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు నూరు మంచాలు ఇచ్చేందుకు సిద్ధం చేసినట్లు సోషల్ వర్కర్ నీళ్ల వెంకయ్య తెలిపారు. సోమవారం ఉదయం నెల్లూరు నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంచాలతోపాటు పరుపులు కూడా అందజేస్తానన్నారు. విలేఖర్ల సమావేశంలో ఇంకా కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్టు అధినేత సుబ్బారావుకూడా పాల్గొన్నారు.

3వ రోజు కౌనె్సలింగ్‌లో 212 మంది అయ్యోర్ల బదిలీ
జాబితాలో మార్పులపై ఉపాధ్యాయ సంఘాల నిరసన
ఒకరు సస్పెన్షన్
నెల్లూరు, మే 13: జిల్లా ఉపాధ్యాయ బదిలీల పర్వం ఆందోళనలు, ఆక్రందనల నడుమ కొనసాగుతోంది. సోమవారం స్థానిక కస్తూర్భా కళాక్షేత్రంలో ఈ ప్రక్రియ చేపట్టారు. గత రెండు రోజులుగా డిఇఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ కౌనె్సలింగ్ వేదికను రద్దీకి అనుగుణంగా మార్పు చేశారు. కాగా, ముందుగా ప్రకటించినట్లు ఎస్జీటిల జాబితాల్లో రెండువందల మంది ఉపాధ్యాయులకు మూడవ రోజున కౌనె్సలింగ్ చేపడతామని ముందుగా ప్రకటించారు. అయితే వంద మందికి మాత్రమే కౌనె్సలింగ్ నిర్వహించడంతో సహా ఇతర అంశాల్లో చోటుచేసుకుంటున్న అవకతవకల్ని ఉద్దేశించి యూటిఎఫ్‌తో సహా వివిధ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాయి. కళాక్షేత్రంలోకి రాబోతున్న ఉపాధ్యాయ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. జాబితాల్లో మార్పుల వలనే ఎస్జీటిల్లో వంద తరువాత వారికి మంగళవారం కౌనె్సలింగ్ జరుగుతుందని డిఇఓ మువ్వా రామలింగం తరఫున ప్రకటన వెలువడింది. ఇదిలాఉంటే మూడవ రోజున తెలుగు పండితులు 200 మందికిగాను 49 మందిని బదిలీ చేశారు. హిందీ 170కుగాను 38 మందిని, పిఇటిలు 95 మందికి 11 మంది, క్రాఫ్ట్ ఏడుగురిలో ముగ్గురు, చిత్రలేఖనంలో ఆరుగురికి ఇద్దరు, ఎస్‌జిటిల్లో ఉర్దూ 82కు 22మంది, ఎస్‌జిటి తెలుగు 100 మందికిగాను 87 మందిని బదిలీలకు అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి. ఇదిలాఉంటే నెల్లూరు రూరల్ మండలం మాదరాజగూడూరు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు కౌనె్సలింగ్‌లో తనకు కోరుకున్న చోటకు బదిలీ కావాలని తప్పుడు ధ్రువీకరణ పత్రాలు జతపరిచాడు. అయితే అతను అధికార్లకు పట్టుబడటంతో డిఇఓ మువ్వా రామలింగం అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.

ఘనంగా అల్లూరి వర్ధంతి
నెల్లూరు, మే 13: నగరంలోని సుబేదారుపేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో కేతా అంకులు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విప్లవజ్యోతి అల్లూరు సీతారామరాజు 129వ వర్ధంతి వేడుకను ఘనంగా చేపట్టారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో అక్షరకవి వరదా శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. పంచాగ్నుల విశే్వశ్వరశర్మ అల్లూరు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఇంకా ఉమ్మడిశెట్టి వెంకటసుబ్బయ్య, కొప్పర్తి అంకయ్య, నాగశివపార్వతి, చక్రపాణి, పద్మనాభరావు, మంగళగౌరి విప్లవగీతాలు ఆలపించి అందరినీ అలరించారు. ఈకార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో కళాకారులు పాల్గొనడం విశేషం.

సీనియర్ జర్నలిస్టు మృతి పత్రికా రంగానికి తీరని లోటు: ఎమ్మెల్యే కురుగొండ్ల
రాపూరు, మే 13: దాదాపు మూడు దశాబ్దాలపాటు ఒకే పత్రికలో పాత్రికేయునిగా సేవలందిస్తూ మృతి చెందిన సీనియర్ జర్నలిస్టు కె రామకృష్ణ మృతి పత్రికా రంగానికి తీరని లోటని వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ చెప్పారు. వెంకటగిరిలో ఒక దినపత్రికలో విలేఖరిగా పనిచేస్తూ ఆదివారం మృతి చెందిన కె రామకృష్ణ అంతిక్రియలు సోమవారం జరిగాయి. ఆయన మృతి సమాచారం తెలుసుకున్న జిల్లాకు చెందిన పలువురు విలేఖర్లు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారితోపాటు గూడూరు శాసనసభ్యులు బల్లి దుర్గాప్రసాదరావు, వెంకటగిరి శాసనసభ్యులు రామకృష్ణ సోమవారం ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అన్ని రాజకీయ పార్టీల వారితో మమేకంగా ఉంటూ పత్రికా రంగానికి వనె్న తెచ్చాడని అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన అంత్యక్రియలకు వీరితోపాటు రాపూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెన్ను బాలకృష్ణారెడ్డి, డక్కిలి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పోలంరెడ్డి వెంకటరెడ్డి, విలేఖరులు, సహకార సంఘం అధ్యక్షులు వెలిగంటి రమణారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కుమారుడు రామ్‌కుమార్‌రెడ్డి, బాలాయపల్లి సహకార సంఘం అధ్యక్షుడు రావి రవివర్మలతోపాటు అనేక మంది ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

వివాహిత అనుమానాస్పద మృతి
తోటపల్లిగూడూరు, మే 13: మండలంలోని కోడూరు నడిమిపాలెంలో వివాహిత మరణించగా, దానిని అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసిన సంఘటన సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు కోడూరు పంచాయతీ వెంకటేశ్వరపాలెంకు చెందిన పామంజి నరసింహాం కుమార్తె జయమ్మకు (27) అదే పంచాయతీ పరిధిలోని నడిమిపాలెం వాసి కొండూరు బుజ్జమ్మ కుమారుడు రవితో రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి 10 నెలల కుమారుడు ఉన్నాడు. అయితే పెళ్ళయినప్పటి నుండి వీరి కుటుంబంలో తరచు గొడవలు జరగటంతోపాటు పలు సందర్భాలలో స్థానికులు రాజీ చేశారు. ఈ సందర్భంలో సోమవారం ఉదయం తన భార్య జయమ్మ తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులకు తెలిపారు. ఇది ఆత్మహత్య కాదని, భర్త, అత్త కలిసి తన కూతురుని చంపేశారని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు జయమ్మ మృతిపై పలు సందేహాలు ఉండటంతో అనుమానాస్పదమృతిగా నమోదు చేసారు. తహశీల్దారు రేవతి సమక్షంలో పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్టు ఎస్‌ఐ సాంబశివరావు తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాను అమలుకు అన్ని కులాలతో కమిటీలు ఏర్పాటు చేయాలి
కోవూరు, మే 13: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాను అమలుకు రాష్ట్ర స్థాయి నుండి గ్రామస్థాయి వరకు ఎస్సీ, ఎస్టీలలోని అన్ని కులాలను కలుపుకొని కమిటీలను ఏర్పాటు చేయాలని ఎంఆర్‌పిఎస్ జిల్లా మీడియా కన్వీనర్ వినె్సంట్ డిమాండ్ చేశారు. సోమవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు మండల స్థాయిలో వృత్తి శిక్షణ కేంద్రాలను, సోలార్‌సిస్టమ్‌తో కూడా ఇన్వర్టర్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ సాయిబాబాకు వినతిపత్రం సమర్పించారు. ఈకార్యక్రమంలో మస్తానమ్మ, రమాదేవి, సరోజనమ్మ, శేషయ్య, యానాదయ్య తదితరులు పాల్గొన్నారు.

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్‌ఐ
కోవూరు, మే 13: మండలంలోని పడుగుపాడు సెంటర్‌లో కోవూరు ఎస్‌ఐ వెంకటరమణ చలివేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు మల్లికార్జునరెడ్డి, అన్ను తదితరులు పాల్గొన్నారు.

గ్రీవెన్స్‌డేలో అర్జీల వెల్లువ
కోవూరు, మే 13: పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌డేలో అర్జీదారులు తహశీల్దార్ సాయిబాబాకు అర్జీలు సమర్పించారు. రేషన్‌కార్డుల మంజూరు, పెన్షన్ల మంజూరు, ఆధార కేంద్రాల ఏర్పాటు చేయాలని తహశీల్దార్‌కు విన్నవించుకున్నారు. ఈకార్యక్రమంలో ఎంపిడిఓ నాగరాజకుమారి, ఆర్‌ఐ మధుబాల, విఆర్‌ఓలు, కార్యదర్శులు పాల్గొన్నారు.

ఇందిరాభవన్‌లో సంబరాలు
నెల్లూరు, మే 13: కర్ణాటక 28వ ముఖ్యమంత్రిగా సిద్ధ రామయ్య ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నెల్లూరులోని ఇందిరాభవన్‌లో పిసిసి కార్యదర్శి ఉడతావెంకట్రావుయాదవ్, పిసిసి బిసిసెల్ కన్వీనర్ కనకట్ల రఘురామ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి, స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ సిద్ధరామయ్య దాదాపు 40సంవత్సరాలు తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపొట్లను ఎదురుకుని మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పలు కీలక మదవులను అనుభవించి స్వశక్తిగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని తెలిపారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల ప్రజలను రాజకీయంగా ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకుని పోయేందుకు తన వంతు కృషి చేశారని పేర్కొన్నారు. సిద్ధ రామయ్య ఏ పదవికి అలకరించి ఆ శాఖకు వనె్న తెచ్చే విధంగా ఎనలేని కృషి చేశారని తెలిపారు.
ఆయన 1978లో పంచాయతీ బోర్డు మెంబర్‌గా రాజకీయ అరగ్రేటం చేసిన రామయ్య పార్టీకి చేసిన సేవలను గుర్తిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం కర్నాటక ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అరుణమ్మ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షడు బాలసుధాకర్, అనురాధ, పద్మావతమ్మ,లక్ష్మమ్మ, ఉడత నరసింహారావు యాదవ్, ఏడు కొండలు, మునుస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ఆనంకు ఘన స్వాగతం
నెల్లూరు, మే 13: అనారోగ్యకారణంగా హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి సోమవారం నగరానికి వచ్చారు. తమ నాయకుడు త్వరగా కోలుకోవాలని అనేక దేవుళ్లకు స్థానిక నేతలు పూజలుచేశారు. ప్రజల పూజలు ఫలించి ఆనం వివేకానందరెడ్డి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో హైదరాబాద్ నుండి చార్మినర్ ఎక్స్‌ప్రెస్ రైలులో సోమవారం నెల్లూరున్‌కు చేరుకోవడంతో రైల్వేస్టేషన్‌లో ఆయన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ముందుగా డిసిసి ఇన్‌చార్జ్ చాట్ల నరసింహారావు, పిండి సురేష్, మాజీ కార్పొరేటర్లు నెల్లూరు రైల్వే స్టేషన్ చేరుకుని ఆయన్ని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. రైల్వే స్టేషన్ నుండి నేరుగా ఇరుకళల పరమేశ్వరి దేవాయాలనికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుబ్రహ్మణ్యస్వామిగుడిలో కూడా పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి నేరుకు స్వగృహనికి చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం పలువురు అధికారులు, కార్యకర్తలను కలిసి కాసేపు ముచ్చటించారు. తరువాత మూలాపేట శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివేకానందరెడ్డి ఆరోగ్యంగా నెల్లూరుకు చేరుకున్న సందర్భంగా నెల్లూరుసిటీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి, డిసిసి చైర్మన్ ధనంజయరెడ్డి శివాలయంలో కలిసి అభినందనలు తెలిపారు. సాయంత్రం 6గంటలకు స్వగృహం నుండి సీమా సెంటర్ వరకు కాలి నడకన బయలుదేరి అభిమానులు, కార్యకర్తలను పలకరించారు. సీమా సెంటర్‌లో ఉన్న తమ కార్యకర్తలను కలుసుకుని వారితో కాసేపు రాజకీయాలపై చర్చించారు.

కాలువ పూడిక తీత పనులు పరిశీలన
నెల్లూరుసిటీ, మే 13: రాష్ట్ర మునిసిపల్‌శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి ఆదేశాల మేరకు నగరంలో ఉన్న అన్ని పంట కాలువ పూడిక తీత పనులను ఒక ప్రణాళిక ప్రకారం చేపడుతున్నట్లు శానిటరీ ఇన్‌స్పెక్టర్ సూపర్‌వైజర్ శివనాగేశ్వరరావు తెలిపారు. సోమవారం అందులో భాగంగా డిఆర్‌డిఎ కార్యాలయం వద్ద గల కాలువ పూడిక తీత పనులను చేపట్టారు. నగరంలో ఉన్న మురికి కాలువ పూడికతీత పనులు చేపడుతున్నట్లు తెలిపారు. దోమల బారిన నుండి ప్రజలను కాపాడేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించి కాలుల పూడిక పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్ర, గిరి తదితరులు పాల్గొన్నారు.

సింహపురి ఆర్ట్ మూమెంట్స్ పోటీ నాటికలు
ఘనంగా ప్రారంభం
నెల్లూరు , మే 13: సింహపురి ఆర్ట్ మూమెంట్స్ నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో స్థానిక టౌన్‌హాల్ ఓపెన్ ఆడిటోరియం జడ్ నవనాథరావు కళాప్రాంగణంలో సోమవారం సాంఘిక పోటీ నాటికలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మైఖేల్ ఫౌండేషన్ అధ్యక్షులు తుంగా నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ బి శ్రీ్ధర్, అమరావతి కృష్ణారెడ్డి, పి కృష్ణమూర్తి, చలంచర్ల భాస్కర్‌రెడ్డి, డాక్టర్ ఈదూరు సుధాకర్ ప్రారంభకార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. సభానంతరం పివి భవానీప్రసాద్ రచన, గోపరాజు విజయ్ దర్శకత్వంలో ప్రత్యేక ప్రదర్శనగా ‘ఒక్క మాటే చాలు’ నాటిక ప్రదర్శించారు. అనంతరం పోటీ నాటిక ‘సంచలనం’ ప్రదర్శించారు. శ్రీమూర్తి కల్చరల్ అసోసియేషన్ కాకినాడ వారు తులసి బాలకృష్ణ రచన, సిఎస్ ప్రసాద్ దర్శకత్వంలో ఈ నాటిక ప్రదర్శించారు. కళాంజలి కల్చరల్ అకాడమి కరీంనగర్ వారు బండారి దేవరాజు రచన, దర్శకత్వంలో మా ప్రేమకు న్యాయం కావాలి నాటిక ప్రదర్శించారు. కార్యక్రమాలను కళాపరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు జెఎస్‌ఆర్ ఆంజనేయులు, చిల్లర సుబ్బారావు, టి సురేష్‌బాబు,జి చంద్రశేఖర్‌రెడ్డి, ఎన్ సుధాకర్‌రెడ్డి బిరదవోలు రామిరెడ్డి పర్యవేక్షించారు. కళాభిమానులు కళాకారులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు గమనం, రాత్రి 8.15 గంటలకు అతి సర్వత్ర వర్జయేత్, పచ్చబొట్టు నాటికలు ప్రదర్శిస్తారు.

వైభవంగా అక్షయ తృతీయ
నెల్లూరు , మే 13: అక్షయ తృతీయ సందర్భంగా నగరంలోని బంగారు దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిసాయి. లక్ష్మీదేవికి అతి ముఖ్యమైందిగా భావించే ఈ పండుగరోజు బంగారు ఆభరణాలు కొనుగోలుచేస్తే సంవత్సరం అంతా మంచి జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో ఉండడంతో ఈ పండుగకు ప్రాముఖ్యం ఏర్పడింది. ఈసందర్భంగా ఒక్క గ్రాము లక్ష్మీ డాలరు మొదలు లక్షల రూపాయల విలువచేసే బంగారు ఆభరణాలను కొనుగోలు చేశారు. అక్షయ తృతీయ సందర్భంగా బంగారు దుకాణాల్లో ప్రత్యేక డిస్కౌంట్లతో కొనుగోలుదారులను ఆకట్టుకున్నారు. పలు దుకాణాల్లో లక్ష్మీదేవి విగ్రహాలనుఏర్పాటుచేసి పూజలు నిర్వహించారు. పలువురు వ్యాపారులు కొనుగోలుదారులు దుకాణంలో కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలను అదే దుకాణంలో లక్ష్మీదేవి పూజలో ఉంచి అందచేశారు. ఈసందర్భంగా బంగారు దుకాణాలను ముస్తాబుచేశారు. ముందుగానే దుకాణాల్లో పలువురు ఆభరణాల కోసం ఆర్డర్లు ఇచ్చినా అక్షయ తృతీయ రోజే ఇంటికి తీసుకువెళ్లే సంప్రదాయం ఉండడంతో దుకాణాలు ఖాతాదారులు, కొనుగోలుదారులతో కిక్కిరిసాయి. అదేవిధంగా పలు ఆలయాల్లో ఈసందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకారం చేశారు. ఆలయాల్లో భక్తుల సందడి కనిపించింది.

పోలీస్ గ్రీవెన్‌సెల్‌లో ఎస్పీకి వినతుల వెల్లువ
* న్యాయం చేయాలని పలువురు విజ్ఞప్తి
నెల్లూరు, మే 13: స్థానిక పోలీస్ కవాతుమైదానంలోని ఉమేష్‌చంద్రకాన్ఫరెన్స్‌హాలులో సోమవారం నిర్వహించిన పోలీస్‌గ్రీవెన్‌సెల్‌కు పలు ప్రాంతాలల నుండి వచ్చిన బాధితులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మొత్తం 70పైచిలుకు వచ్చిన ఫిర్యాదులల్లో కొన్ని లీగల్‌సెల్‌కు సిఫార్సు చేశారు. న్యాయం చేయాలని పలువురు ఎస్పీ వద్ద బోరనవిలపించడంతో స్పందించిన ఆయన త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని సంబంధిత సర్కిల్స్ సిఐలు, ఎస్సైలను ఆదేశించారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని పలువురు బాధితులు వాపోగా అలాంటివి ఉంటే నేరుగా తనని కలిసి ఫిర్యాదు చేయవచ్చనని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ అదనపు ఎస్పీ మూర్తి, నెల్లూరునగర, రూరల్, గూడూరు, ఆత్మకూరు, కావలి డిఎస్పీలు పి వెంకటనాధ్‌రెడ్డి, బాల వెంకటేశ్వరరావు, చౌడేశ్వరి, రాజమహేంద్రనాయక్, పి ఇందిర, సిఐలు వై జయరామసుబ్బారెడ్డి, పి వీరాంజనేయరెడ్డి, కోటారెడ్డి, కెవి రత్నం, ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి, మద్ది శ్రీనివాసరావు, జి మంగారావు, రామారావు, సుధాకర్‌రెడ్డి, రత్తయ్య, సాంబశివరావు, పలువురు సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

స్థలాన్ని కబ్జా చేశారు: రిటైర్డ్ తహశీల్దార్
కోవూరుకు చెందిన రిటైర్డ్ తహశీల్దార్ ఎస్‌కె మస్తాన్‌బాషాకు సంబంధించి నగరంలోని స్థానిక డైకస్‌రోడ్డు సమీపంలో 20 అంకణాల ఇంటి స్థలం ఉంది. ఆ స్థలాన్ని స్థానికంగా ఉన్న దుగ్గిబోయిన బాబ్జి అనే వ్యక్తి కబ్జా చేసి బెదిరిస్తున్నాడని, ఎన్నిసార్లు కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రిటైర్డ్ తహశీల్దార్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీవెన్‌సెల్‌లో అర్జీని స్వీకరించిన ఎస్పీ తక్షణం సంఘటనపై విచారించి చర్యలు తీసుకోవాలని డిఎస్పీని ఆదేశించారు.
ఆర్టీసిలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడు
ఎపిఎస్‌ఆర్‌టిసిలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తన వద్ద 3లక్షల 10వేల రూపాయలను తీసుకొని మోసం చేశాడని సతీష్ అనే యువకుడు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. స్పందించిన ఆయన తక్షణం కేసు నమోదుచేసి నిందితుడ్ని అరెస్ట్ చేయాలని సంబంధిత సిఐను ఆదేశించారు.
వరకట్నం వేధింపులు: శైలజ
తన భర్త అదనపు కట్నం తీసుకోరావాలని వేధిస్తున్నాడని, కట్నం తీసుకోరాకుండా వేరే వివాహం చేసుకునేందుకు సిద్ద పడుతున్నాడని డక్కిలి మండలం ఆల్తూరుపాడు గ్రామానికి చెందిన మామిడి శైలజ బోరున విలపించింది. తన భర్తతోపాటు అత్త, మామ కూడా తనపై దాడిచేస్తున్నారని, తన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. బాధితురాలు కన్నీటిని చూసి చలించిపోయిన ఎస్పీ తక్షణం వేధింపుల భర్తపై కేసు నమోదుచేయాలని వెంకటగిరి సిఐ శ్రీనివాసులురెడ్డిని ఆదేశించారు.

ఎమ్మెల్యే బీద స్పష్టం
english title: 
sub plan

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>