Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సిఎం పర్యటన సక్సెస్

$
0
0

నిజామాబాద్, మే 13: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటన విజయవంతం కావడంతో కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం కనిపించింది. ప్రత్యేకించి సిఎం టూర్‌ను ప్రతిష్టాత్మకంగా భావిస్తూ విస్తృత ఏర్పాట్లు చేసిన జిల్లాకు చెందిన రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖా మంత్రి సుదర్శన్‌రెడ్డి సిఎం వద్ద మంచి మార్కులే కొట్టేశారు. బోధన్ పట్టణంలో సోమవారం నిర్వహించిన రైతు సదస్సులో జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో రైతులు, మహిళలు తరలిరావడం అధికార పార్టీ నేతలకు ఊరటనందించింది. మండుతున్న ఎండల తీవ్రత వల్ల జన సమీకరణ ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, ఎక్కడికక్కడ అధికారులు, పార్టీ శ్రేణులను పురమాయిస్తూ వాహనాలను సమకూర్చడంతో సుమారు 15వేల పైచిలుకు మంది సిఎం సభకు తరలివచ్చారు. దీంతో రైతు సదస్సు ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. భారీ సంఖ్యలో హాజరైన ప్రజానీకాన్ని చూసి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సైతం ఎంతో ఉత్సాహంగా పాల్గొని రైతులను ఆకట్టుకునే రీతిలో ప్రసంగించారు. పలువురు తెలంగాణవాదులు సభలోకి చేరుకుని నినాదాలు చేసినప్పటికీ, సభ విజయవంతానికి అది ఆటంకం కాలేకపోయింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన ప్రసంగంలో రైతాంగానికి అందిస్తున్న సేవలు, అమలు చేస్తున్న పథకాల గురించి అవగాహన కల్పించేందుకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును ఉద్దేశించి గత టిడిపి హయాంతో, ప్రస్తుత కాంగ్రెస్ పాలనను బేరీజు వేస్తూ విమర్శనాస్త్రాలు గుప్పించారు. అయితే ఒక్క టిడిపిపైనే విమర్శలు చేయడం మినహా, ఇతర ప్రతిపక్ష పార్టీల గురించి నామమాత్రంగానైనా ప్రస్తావించకుండా హుందాగా వ్యవహరించారు. రైతాంగానికి, వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వం చేకూరుస్తున్న ప్రయోజనాలను వల్లెవేస్తూ వారి అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం చేశారు. రైతులను వడ్డీ లేని రుణాలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూనే, రుణ మాఫీని ప్రకటించే అవకాశాలు ఎంతమాత్రం లేవని సిఎం కరాఖండీగా తేల్చి చెప్పారు. ఇది ప్రతీకూలమైన అంశమే అయినప్పటికీ కల్లబొల్లి మాటలతో మోసగించే విధానం కాంగ్రెస్ పార్టీకి రాదనే సంకేతాలను అందించినట్లయ్యింది. కాగా, అన్ని నియోజకవర్గాల నేతలను సంతృప్తిపర్చే రీతిలో బోధన్, జుక్కల్, నిజామాబాద్ సెగ్మెంట్లలో చేపట్టనున్న సుమారు 160కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా రైతు సదస్సు వేదిక వద్దే శంకుస్థాపనలు చేయించారు.
సిఎం సదస్సుకు డిఎస్ దూరం
కాగా, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బోధన్‌లో పాల్గొన్న రైతు సదస్సుకు జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, పిసిసి మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ దూరంగా ఉండిపోయారు. ముఖ్యమంత్రి పర్యటన ఖరారైన నాటి నుండి కూడా డిఎస్ ఈ విషయంలో వౌనంగానే ఉంటున్నారు. జిల్లాకు చెందిన మంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నీ తానై వ్యవహరించడంతో కినుక వహించిన డిఎస్ సిఎం పర్యటనకు దూరంగా ఉండిపోయారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వాస్తవంగానే సిఎం పర్యటనను పురస్కరించుకుని ముద్రించిన ఆహ్వాన పత్రాల్లో కానీ, ఫ్లెక్సీలపై కానీ డిఎస్ పేరు ఎక్కడా ముద్రించలేదు. బోధన్ పట్టణంలో ఏర్పాటు చేసిన బ్యానర్లు, కటౌట్లలోనూ ఆయనకు స్థానం దక్కలేదు. అప్పటికీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌సింధేను సభా వేదికపై తగిన గౌరవం ఇస్తూ ప్రసంగించే అవకాశం కల్పించడమే కాకుండా, ఆహ్వాన పత్రికల్లోనూ ఆయన పేరును ముద్రించారు. ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ ఫొటోను సభావేదిక బ్యానర్‌లో ప్రచురించారు. ఈ కారణంగానే డిఎస్ మనస్తాపం చెంది ఉంటారని, ఫలితంగా సిఎం జిల్లా పర్యటనలో భాగంగా హాజరైన సదస్సుకు దూరంగా ఉండిపోయారనే ప్రచారం జరిగింది. డిఎస్ మినహా జిల్లాకు చెందిన ఇతర కాంగ్రెస్ నేతలంతా సదస్సులో పాల్గొన్నారు.

సిఎం సభలో తెలంగాణ నినాదాలు
నిరసనకారుల అరెస్టు
నిజామాబాద్, మే 13: రైతు సదస్సులో పాల్గొనేందుకు సోమవారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి హాజరైన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బహిరంగ సభలో ప్రసంగించేందుకు సిద్ధమైన సమయంలో ఒక్కసారిగా తెలంగాణవాదులు పైకి లేచి జై తెలంగాణ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ పరిణామంతో కాంగ్రెస్ నేతలు కొద్దిసేపు తొట్రుపాటుకు గురైనప్పటికీ, వెంటనే తేరుకుని ముఖ్యమంత్రికి అనుకూలంగా ప్రతి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఇదంతా షరా మామూలేనంటూ తేలిగ్గా కొట్టిపారేశారు. తెలంగాణ నినాదాలు చేస్తున్న వారిని ఉద్దేశించి సిఎం మాట్లాడుతూ, ‘వాళ్లను పట్టించుకోకండి...కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా గట్టిగా చప్పట్లు కొడితే ఆ శబ్దానికే కొట్టుకుపోతారు’ అని వ్యాఖ్యానిస్తూ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను మరింత ఉత్సాహపర్చారు. దీంతో వారు పెద్దపెట్టున కరతాళధ్వనులు చేయగా, ఈ జోరును 2014వరకు కొనసాగించాలని సిఎం సూచించారు. కాగా, సిఎం సభలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టినప్పటికీ నిరసనకారులు సభలోకి చేరుకుని పెద్దపెట్టున తెలంగాణ నినాదాలు చేయడంతో పోలీసులు అవాక్కయ్యారు. అతికష్టం మీద సుమారు 20మంది జెఎసి నాయకులు, పిడిఎస్‌యు కార్యకర్తలను సభ నుండి బలవంతంగా బయటకు తీసుకెళ్లి అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. సిఎం సభలో గలాభా సృష్టించే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు బోధన్‌తో పాటు నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో జెఎసి నేతలు, విద్యార్థి సంఘాల బాధ్యులను ముందస్తుగానే అరెస్టులు చేశారు. సిఎం సభా ప్రాంగణం వద్ద ఐజి రాజీవ్త్రన్, జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్‌ల నేతృత్వంలో దాదాపు వేయి మందికి పైగా పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. అయినప్పటికీ తెలంగాణవాదులు వారి కళ్లుగప్పి సభా ప్రాంగణంలోకి చేరుకుని నినాదాలు చేయడం ద్వారా పోలీసు అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టించారు.

ఒక్క రూపాయి ఇవ్వనన్న వ్యాఖ్యలను సిఎం వెనక్కి తీసుకోవాలి
బిజెపి శాసనసభాపక్ష నేత యెండల లక్ష్మీనారాయణ
ఆర్మూర్, మే 13: తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ఒక్క రూపాయి ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండంటూ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెనక్కి తీసుకోవాలని బిజెపి శాసనసభాపక్ష నేత, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం ఆర్మూర్‌లో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి సహనం కోల్పోయి ఆవేశంతో తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనంటూ చెప్పడం సమంజసం కాదన్నారు. అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంటుందని అన్నారు. ఇప్పటికైనా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రాంతంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రచారానికి వస్తున్నారో లేదా రైతుల కోసమా అన్న విషయంపై స్పష్టత ఇవ్వాలన్నారు. బోధన్‌లోని నిజాంసుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనపర్చుకోవాలని, ఆర్మూర్ ప్రాంతానికి చెందిన రైతులకు ఎర్రజొన్న బకాయిలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. గల్ఫ్ బాధితులను ఆదుకొని బడ్జెట్లో 2 వేల కోట్ల రూపాయలను కేటాయించాలన్నారు. గల్ఫ్ బాధితుల కోసం కార్పోరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు, రుణాలు ఇవ్వాలని అన్నారు. జాబ్‌మేళాలు ఎండమావులుగానే మిగిలిపోయాయని, గల్ఫ్ బాధిత కుటుంబాలు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పసుపుకు గిట్టుబాటు ధర కల్పించాలని, సేద్యం జూదం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ సమావేశంలో బిజెపి క్రమశిక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోక భూపతిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్, బద్ధం లింగారెడ్డి, శివరాజ్, ఆకుల శ్రీనివాస్, ద్యాగ ఉదయ్, నూతుల శ్రీనివాస్‌రెడ్డి, అనిల్, రాజేష్, ఆకుల రాజు, పోల్కం వేణు, ధోండి ప్రకాష్, లింగన్న తదితరులు పాల్గొన్నారు.

కౌలు రైతు చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌దే
వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ
బోధన్, మే 13:రాష్ట్రంలో కౌలురైతు చట్టాన్ని తీసుకొచ్చిన ఘణత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని వ్యవసాయ శాఖా మంత్రి కన్నా లక్ష్మినారాయణ అన్నారు. సోమవారం బోధన్‌లో జరిగిన రైతు చైతన్య సదస్సులో మంత్రి మాట్లాడుతూ 2500 కోట్ల రూపాయలతో యాంత్రిక వ్యవసాయానికి శ్రీకారం చుట్టామని ఇందులో ఐదు వందల కోట్లు సబ్సిడీ ఇచ్చామన్నారు. ప్రతీ ఏటా ఇన్‌పుట్ సబ్సిడీని పెంచుతున్నామని మంత్రి వివరించారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటి రంగంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 300 కోట్లు ఉన్న వ్యవసాయ బడ్జెట్‌ను 2900 కోట్లకు పెంచామని, క్వింటాల్ వరిధాన్యం ధరను 1280 వరకు పెంచామన్నారు. 71కోట్లు ఉన్న విత్తన సబ్సిడీని 300 కోట్లకు పెంచామని తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు చేపడుతోందన్నారు. రైతులు పంటలలో ఆధునిక పద్దతులు పాటించి అధిక దిగుబడులు సాధించేలా గ్రామ గ్రామాన రైతు చైతన్య యాత్రలు నిర్వహించడం జరిగిందన్నారు. రాబోయే ఖరీఫ్ కోసం రైతులను అన్ని విధాలుగా సిద్దం చేయడం జరిగిందని, అలాగే అన్ని డివిజన్ కేంద్రాలలో రైతు చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు. 2004కు ముందు రాష్ట్రంలో వ్యవసాయం అంతగా ప్రాధాన్యత పొందలేదని, కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చిన తర్వాతనే వ్యవసాయ రంగానికి గుర్తింపు అనేది వచ్చిందన్నారు. తమపై విమర్శలు చేసే పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం ఏమి చేయలేకపోయాయన్నారు.
సింగూర్ నీళ్లు నిజాంసాగర్‌కు ఇవ్వాలి
సింగూర్ రిజర్వాయర్ నుండి 10 టిఎంసిల నీటిని బ్యాలన్సింగ్‌గా ఉంచుకుని మిగులు జలాలను నిజాంసాగర్‌కు వదలాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖా మంత్రి సుదర్శన్‌రెడ్డి కోరారు. రైతు చైతన్య సదస్సులో మంత్రి మాట్లాడుతూ నిజాంసాగర్ ఆధునీకరణ కోసం 150 కోట్లు కేటాయించాలని అన్నారు. జిల్లాకు మెడికల్ కళాశాలకు పెద్ద ఎత్తున నిదులు ఇవ్వడం వలన నేడు ఆ కళాశాల ప్రారంభానికి సిద్దమయ్యిందన్నారు. ప్రథమ సంవత్సరం వంద సీట్లతో కళాశాలను ప్రారంభించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రాణహిత చేవెళ్ల పథకం ద్వారా నిజామాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డిలకు నీళ్లు వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. నిజామాబాద్ జిల్లాలో మరికొన్ని సాగునీటి వనరులకు నిదులు అవసరమున్నాయని వాటిని మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలన్నారు. బోధన్‌లో మినీ స్టేడియం నిర్మాణానికి నిదులు వచ్చినప్పటికీ ఒక పాలిటెక్నిక్ కళాశాల అవసరం ఉందని సిఎం దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ యూనివర్శిటీ అభివృద్దికి ప్రత్యేక చొరవ చూపాలన్నారు. నిజామాబాద్ జిల్లా అభివృద్దికి ముఖ్యమంత్రి అన్ని విధాలుగా సహకరిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

జిల్లాలో పార్టీ పటిష్టతకు పాటుపడాలి
బిజెపి సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి రవీందర్‌రాజ్
నిజామాబాద్ టౌన్, మే 13: జిల్లాలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి విఆర్.రవీందర్‌రాజ్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రవీందర్‌రాజ్, అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ, రాష్ట్ర సంఘటన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటేలా కార్యకర్తలు, నాయకులు ప్రజాదరణ పొందాలన్నారు. ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం, టిడిపి పార్టీలు మోసం చేస్తున్న విషయాన్ని వివరిస్తూ విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. పార్టీ పటిష్టతకు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయాలని, గ్రామీణ స్థాయిలో పార్టీ మనుగడ సాధించేలా కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. యుపిఎ హయాంలో అవినీతి పెట్రేగిపోతోందని, కళంకిత మంత్రుల దోపిడీతనం వాయిదా పద్ధతిలో బహిర్గతం అవుతోందని అన్నారు. దేశంలోని అన్ని రంగాల్లో అవినీతి రాజ్యమేలుతోందని, అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలతో బిజెపి ప్రభంజనం సాగాలని, 2014 ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావడానికి ఈ ఎన్నికలు దోహదపడతాయని అన్నారు. గ్రామ స్థాయి నుండి పార్టీని పటిష్టపర్చేందుకు మండలాలు, అసెంబ్లీ స్థాయిలలో సదస్సులు నిర్వహించాలని వారు సూచించారు. జిల్లా స్థాయిలో పార్లమెంట్ ప్రజా చైతన్య సదస్సులు, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వర్క్‌షాప్‌లను నిర్వహించి కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రచారం విస్తృతంగా సాగించి, ఎన్‌డిఎ హయాంలోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు లోక భూపతిరెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్, తోట గోపాల్, గీతాసాయిరెడ్డి, జాలిగం గోపాల్, గజం ఎల్లప్ప, ముక్కా దేవేందర్‌గుప్తా, గంగమ్మ, బాల్‌రాజ్‌తో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటన విజయవంతం
english title: 
cm

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles