Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కెటిపిపి కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా

$
0
0

పరకాల , మే 13: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కెటిపిపిలో కాంట్రాక్టు కార్మికులు సోమవారం ధర్నాకు దిగారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ధర్నా సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ప్రధాన గేటు ఎదుట ధర్నా నిర్వహిస్తునే వంటవార్పు నిర్వహించి అక్కడే భోజనాలు చేశారు. అధికారులు స్పష్టమైన హామి నిస్తే తప్ప సమ్మెను విరమించేది లేదంటూ కార్మికులు సమ్మె కొనసాగించడంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. చెల్పూర్‌లో కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రారంభమై ఇప్పటికి 6 సంవత్సరాలు గడుస్తున్నా భూనిర్వాసితులకు పర్మినెంట్ ఉద్యోగాలను జెన్‌కో యాజమాన్యం కల్పించలేదని దుయ్యబడుతూ కాంట్రాక్టు కార్మికులు నిర్వహిస్తున్న మెరుపు సమ్మెకు భూనిర్వాసితులు కూడా మద్దతు పలికి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూనిర్వాసితులు, కాంట్రాక్టు కార్మికులు మాట్లాడుతూ జెన్‌కో ప్రారంభించే సమయంలో భూములు కోల్పోయిన సమయంలో అప్పటి డైరెక్టర్లు, సీఈలు విద్యార్హతలతో సంబంధం లేకుండా భూనిర్వాసితులందరికి కెటిపిపిలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని కాంట్రాక్టు కార్మికులందరికి హామి ఇచ్చారని పేర్కొన్నారు. కెటిపిపి కాంట్రాక్టు కార్మికుల శ్రమతో జాతీయ స్థాయిలో రెండో స్థానం, రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించిందన్నారు. కొంత మంది జెన్‌కో అధికారులు, రాజకీయ నాయకుల అండదండలతో కాంట్రాక్టు కార్మికుల నడ్డి విరుస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా జెన్‌కో అధికారులు స్పందించి థర్మల్ పవర్ ప్రాజెక్టులో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరికి వెంటనే శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని, భూనిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కాగా భూపాలపల్లి టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణ కూడా ధర్నాకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 98 జిఓ ప్రకారం భూనిర్వాసితులకు ఉద్యోగం కల్పించాలని, పవర్ ప్రాజెక్టులో పని చేస్తున్న కార్మికులను శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని కోరారు. కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు గురించి కనీసం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడలేని దయనీయమైన స్థితిలో కెటిపిపి అధికారులు ఉన్నారని చెప్పారు. 98 జిఓ ప్రకారం భూనిర్వాసితులకు ఉద్యోగం కల్పించాలని లేని యెడల సమ్మెను మరింత ఉద్ధృతం చేయడానికి టిడిపి ఎమ్మెల్యేలందరితో కలిసి సమ్మె నిర్వహిస్తామని తెలిపారు. సమ్మె నిర్వహిస్తున్న కార్మికులకు వివిధ పార్టీల నాయకులు మద్దతు ప్రకటించారు.

వృషభ, జింకవాహనాలపై ఊరేగిన భద్రకాళి
హన్మకొండ, మే 13: వరంగల్‌లోని చారిత్రక భద్రకాళి-్భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాల రెండవరోజు సోమవారం అమ్మవారు వృషభ, జింక వాహనాలపై ఊరేగారు. వేదపండితుల మంత్రోచ్చరణలమధ్య అమ్మవారి విశేషగుణ చిహ్నాలను ప్రదర్శించారు. బ్రహ్మోత్సవాలలో విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూప నందేంద్ర పాల్గొన్నారు. అంతకుముందు ఆలయ ప్రధానార్చకులు శేషు ఆధ్వర్యంలో అమ్మవారికి నిత్యాహ్నికం, వర్ధనిపూజ, ద్వారతోరణ పూజ, అగ్ని ప్రతిష్ట, సర్వతోభద్ర, నవగ్రహవాస్తు, యోగినిపూజలు జరిపారు. అనంతరం చతుస్తానార్చ్భేరిపూజ, భేరితారణం జరిపిన అనంతరం వృషభవాహనసేవ నిర్వహించారు. ఆతర్వాత ధ్వజారోహణ జరిపిన అనంతరం గుడిమల్ల విజయకుమారాచార్యుల ఆధ్వర్యంలో బలిహరణ నిర్వహించారు. నేడు అక్షయతృతీయను పురస్కరించుకుని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్త జనం పోటెత్తింది. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ ఇవో కట్టా అంజనీదేవి ఏర్పాట్లు చేసారు.
పదవి వ్యామోహంతోనే పార్టీ వీడిన కడియం
ఎమ్మెల్యే రేవూరి * తెలంగాణపై మహానాడులో తీర్మానం * అప్పటిదాకా వేచి ఉండగలరా అని ప్రశ్న
హన్మకొండ, మే 13: ‘కడియం శ్రీహరికి ఒక వ్యభిచారిణికి ఉన్న నిబద్ధత లేదు.. తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన ద్రోహం, కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలను బట్టే మేము ఆయనపై విమర్శలు చేస్తున్నాం’ అని శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం వరంగల్ హంటర్‌రోడ్డులోని టిడిపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెలాఖరులో జరిగే మహానాడులో టి-టిడిపిఫోరం నాయకులు తెలంగాణపై తీర్మానం చేయించగలరా అని కడియం సవాల్ చేసారని చెబుతూ.. మహానాడులో తీర్మానం చేయించేవరకు కడియం శ్రీహరి ఏపార్టీలో చేరకుండా ఉండగలరా అని ఎదురు ప్రశ్నించారు. జెఎసి ఆధ్వర్యంలో కడియం తెలంగాణకోసం ఉద్యమిస్తే తాము మద్దతు పలుకుతామని స్పష్టం చేసారు. కానీ ఆయన రాజకీయ ప్రయోజనాల కోసమే టిడిపిని వీడారని మండిపడ్డారు. తాను మతిభ్రమించి మాట్లాడుతున్నాననడం అర్ధరహితమని, తన రాజకీయ జీవితంలో తప్పుగా మాట్లాడిన సందర్బం ఇప్పటివరకు లేదని అన్నారు. 28సంవత్సరాల రాజకీయ జీవితాన్ని ఇచ్చి, తొమ్మిదన్నర సంవత్సరాలు మంత్రి పదవి కట్టబెట్టి, రాష్ట్ర కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో సభ్యునిగా కీలక పదవులు అప్పజెప్పితే కన్నతల్లిలాంటి పార్టీపై, పార్టీ నాయకత్వంపై వ్యాఖ్యలతో టిడిపికి తీరని ద్రోహం చేసిన కడియం శ్రీహరి పదవి వ్యామోహంతోనే పార్టీని వీడారని ధ్వజమెత్తారు. కడియం పార్టీకి రాజీనామా చేయడంపై తమకెలాంటి అభ్యంతరంలేదని, అర్ధరహితమైన వ్యాఖ్యలు చేసి ప్రజల్లో పార్టీని చులకన భావం చేసిన కడియంను రాజకీయ వ్యభిచారి అనడంలో ఎలాంటి తప్పులేదని అన్నారు. వ్యభిచారులకు కూడా ఒక పద్ధతి ఉంటుందని కనీసం అది కూడా పాటించని వ్యక్తిని ఏమనాలని ప్రశ్నించారు. గతంలో హరీశ్వర్‌రెడ్డి, గంప గోవర్ధన్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గంగుల కమలాకర్ పార్టీ వీడిన సమయంలో పార్టీపై, అధినాయకత్వంపై ఎలాంటి విమర్శలు చేయలేదనే విషయాన్ని కడియం గుర్తుకు తెచ్చుకోవాలని హితువు పలికారు. తెలంగాణ గురించి పార్టీ వీడానని చెబుతున్న విషయం పచ్చి మోసమని, తెలంగాణకోసం వెళితే నాన్ పొలిటికల్‌గా ఉండి జెఎసితో కలిసి ఉద్యమించాలని కోరారు. రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ కడియం వ్యాఖ్యలు రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని అన్నారు. సామాన్యవ్యక్తికి జన్మనిచ్చి, ఆర్థికంగా, సామాజికంగా ఆదుకున్న పార్టీని విమర్శిస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్లేనని పేర్కొన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడబోయిన బస్వారెడ్డి పాల్గొన్నారు.

పచ్చతోరణం పథకంలో 60 వేల మంది గుర్తింపు
* కలెక్టర్ రాహుల్ బొజ్జా
బాలసముద్రం, మే 13: ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పచ్చతోరణం పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు 60 వేల మంది నిరుపేద ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులను గుర్తించామని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జాయింట్ కలెక్టర్ ప్రద్యుమ్నతో కలసి నిర్వహించిన విలేఖరుల సమావేశంలో రాహుల్ బొజ్జా మాట్లాడుతూ గ్రామాలలో నివసించే నిరుపేదలను గుర్తించి గ్రామాలలో నిరూపయోగంగా ఉన్న పొరంబోకు భూములు, రోడ్డు, చెరువు, కాలువ పక్కన ఉన్న ఖాళీస్థలాలలో చెట్లను నాటించి వాటి ద్వారా వచ్చే ఫలసాయాన్ని వారికి అందజేయాలనే ఉద్ధేశంతో చెట్లు నాటడానికి సాగుకు యోగ్యంగాలేని 50వేల ఎకరాల ప్రభుత్వభూమిని గుర్తించామని చెప్పారు. ఒక్కొక్క లబ్ధిదారుడికి 200 మొక్కలకు మించకుండా చెట్ల పట్టాలు ఇస్తామని, వాటి ఫలసాయాన్ని అనుభవించే హక్కు కూడా లబ్ధిదారుడికే వర్తిస్తుందని తెలిపారు. పచ్చతోరణం పథకాన్ని జిల్లాలో సంపూర్ణంగా అమలు చేయడానికి జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సుల ద్వారా 89500 ఆర్జీలు స్వీకరించామని, వీటిలో భూసమస్యలు పరిష్కరించాలని కోరుతూ 44వేలమంది ఎస్సీ, ఎస్టీలు ఆర్జీలు చేసుకున్నారని అన్నారు. రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఈనెల 30వ తేదీలోగా పూర్తిస్థాయిలో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్ర్తినిధి పథకం కింద జిల్లాలో 54కోట్ల రూపాయల నిధులను అందజేయాలనే లక్ష్యం కాగా ఇప్పటివరకు 52కోట్ల రూపాయలను గ్రామైఖ్య సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద పంపిణీ చేయడం ద్వారా రాష్ట్రంలోనే వరంగల్ జిల్లా మొదటిస్థానంలో నిలిచిందని కలెక్టర్ చెప్పారు. స్ర్తినిధి పథకం కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు 48 గంటల్లో రుణాలు అందించే అవకాశం కల్పించామని, ఈ పథకాన్ని మహిళా సమైఖ్య సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయుటకు 180 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ రబీ సీజన్‌లో రైతుల నుండి అధిక మొత్తంలో ధాన్యం కొనుగోలు చేసి డబ్బులను సత్వరంగా రైతులకు చెల్లింపులు చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలోనే మొదటిసారిగా ఆన్‌లైన్ పద్ధతిలో చెల్లింపులు చేసేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు. రైతులకు త్వరితగతిన డబ్బులు అందజేయడానికి వీలుగా ఆన్‌లైన్ ద్వారా వారి బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తామని తెలిపారు. ఇప్పటివరకు 111 ఐకెపి కేంద్రాలలో ప్రయోగత్మకంగా 2.48 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి 31.75 కోట్ల రూపాయలను ఆన్‌లైన్ ద్వారా నేరుగా రైతుల అకౌంట్లలో బదిలీ చేశామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకోసం 2011 జనాభా లెక్కల ప్రకారంగా గ్రామపంచాయితీలవారిగా వివరాలు సేకరించి ఈనెల 18వ తేదీలోగా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ట్రెనీ కలెక్టర్ చక్రధర్‌బాబు, జడ్పీ సిఇఓ ఆంజనేయులు, డిఆర్‌డిఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

శారద పీఠాధిపతి ఆధ్వర్యంలో
వైభవంగా కుంభాభిషేకం
హన్మకొండ, మే 13: వరంగల్ నగరంలోని రామలింగేశ్వరస్వామి దేవాలయంలో సోమవారం కుంభాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. శారద పీఠాధిపతి స్వరూపనందేంద్ర సరస్వతి కరకమలములతో ఈ కుంభాభిషేక ప్రతిష్ట అనేకమంది భక్తుల సమక్షంలో విశేషంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టి.రత్నాకర్, పరిచారకులుగా రాజేష్, బ్రహ్మోత్సవాల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. సాయంత్రం 6.30గంటలకు జరిగిన శాంతి కల్యాణంలో కాసం మల్లిఖార్జున దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో టి.కృష్ణమూర్తి, మల్లిఖార్జున్, ఓంప్రకాశ్, సత్యనారాయణ, మంత్రి బస్వరాజు సారయ్య సతీమణి లక్ష్మి, వేయిస్తంభాల ఆలయ అర్చకులు గంగు ఉపేంద్రశర్మ పాల్గొన్నారు.
టిడిపిని విమర్శిస్తే
కడియంకు పుట్టగతులుండవు
* ఎమ్మెల్యే దయాకర్‌రావు
స్టేషన్ ఘన్‌పూర్, మే 13: రాజకీయ జన్మనిచ్చిన టిడిపిని, అధినేత చంద్రబాబునాయుడిని విమర్శిస్తున్న కడియం శ్రీహరికి పుట్టగతులుండవని తెలంగాణ టిడిపి ఫోరం కన్వీనర్, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. సోమవారం మండలకేంద్రంలోని మా గార్డెన్‌లో టిడిపి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. టిడిపికి కడియం రాజీనామా చేయడంతో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, సీతక్క, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, జిల్లా అధ్యక్షుడు బస్వారెడ్డి, నాయకులు వేం నరేందర్‌రెడ్డి, ఈగ మల్లేశం హాజరయ్యారు. ఈ సందర్భంగా దయాకర్‌రావు మాట్లాడుతూ వ్యక్తిగత స్వార్థం కోసం తెలంగాణ సెంట్‌మెంట్‌ను అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందడానికే టిడిపికి కడియం రాజీనామా చేశాడని ఆరోపించారు. మూడుదశాబ్దాల క్రితం ఉండడానికి సరిగా ఇళ్లులేని పరిస్ధితిలో కడియంను టిడిపి ఆదరించి, అన్నివిధాల సపర్యలు చేసినా టిడిపిని వీడడం ఆయన సంస్కారానికే వదిలేస్తున్నట్లు చెప్పారు. గతాన్ని మరచి టిడిపి కార్పొరేట్ స్థాయి నాయకులకే ప్రాధాన్యత ఇస్తుందని తన లాంటి దళితుడికి పార్టీలో స్థానం లేదని టిడిపిని విమర్శించడం కడియం దిగజారుడు తనానికి నిదర్శనమని నర్సంపేట ఎమ్మెల్యే రేవూరిప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. తొమ్మిది సంవత్సరాలుగా మంత్రిగా, పార్టీ కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతూ అన్నివిధాలా రాజకీయ లబ్దిపొందిన కడియం పార్టీని వీడడం సరైందికాదని అన్నారు. దశాబ్దన్నరకాలంగా తెలంగాణవాదం కడయంకు వినిపించలేదా, ఇపుడే తెలంగాణ ఉద్యమంపై ఎందుకు మమకారం పుట్టుకొచ్చిందో తెలంగాణ ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఐదుమండలాలకు చెందిన పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

పెట్టుబడులు తగ్గిస్తేనే రైతులకు మేలు
* ఎమ్మెల్యే శ్రీ్ధర్
హన్మకొండ , మే 13: పంటలసాగులో రైతులు పెట్టుబడులు తగ్గించి వ్యవసాయం చేస్తేనే మేలు జరుగుతుందని వర్థన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీ్ధర్ అన్నారు. అందుకు వ్యవసాయ విస్తరణ పెంచేందుకు శాస్తవ్రేత్తలు కృషి చేయాలని తెలిపారు. సోమవారం ములుగురోడ్డు సమీపంలోని వరంగల్ వ్యవసాయ పరిశోధనస్థానంలో రైతు చైతన్య సదస్సుకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా జెడిఎ నాగేశ్వర్‌రావు అధ్యక్షతన జరిగిన రైతు సదస్సులో రైతులు వివిధ అంశాలపై అధికారులతో వాగ్వివాదానికి దిగారు. తమకు ఎరువులు, విత్తనాలు సక్రమంగా అందడం లేదని, పంటల్లో గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు తెలిపారు. కొన్ని విత్తన కంపెనీలు కల్తీ విత్తనాలు, రసాయన ఎరువులు తయారు చేసి రైతులను మోసం చేస్తున్నా పట్టింపులేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని గీసుకొండకు చెందిన చంద్రారెడ్డి, హసన్‌పర్తి మండలం గుంటూరుపల్లికి చెందిన రమ అనే మహిళారైతుతోపాటు జఫర్‌గడ్ మండలం రఘునాథ్‌పల్లి గ్రామానికి చెందిన గోపుస్వామి అనే రైతు, మరికొందరు రైతులు రైతు సదస్సులో ఎమ్మెల్యేతోపాటు అధికారులను నిలదీశారు. యంత్రాల కొనుగోలులో సబ్సిడీ తక్కువ ఇస్తున్నారని, ఏడుగంటల విద్యుత్‌కు బదులు మూడు, నాలుగు గంటలే విద్యుత్‌ను సరఫరా చేయడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు పేర్కొన్నారు. ఎట్టకేలకు అధికారులు ఇలా మరోసారి జరగకుండా చూస్తామని, క్షమించమని కోరడంతో రైతులు శాంతించారు. అనంతరం ఎమ్మెల్యే కొండేటి మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటానని అన్నారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకే రైతు సదస్సులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇటీవల వడగళ్లవర్షంతో మామిడి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. వాటికి నష్టపరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. ఇప్పటికే రైతులను దళారులు మోసం చేస్తున్నారని గ్రహించిన ప్రభుత్వం ఐకెపి సెంటర్లద్వారా రైతులు పండించిన పంటలను కొనుగోలు చేస్తోందని వివరించారు. అదేవిధంగా రైతులకు నేరుగా బ్యాంక్ ఎకౌంట్‌లను తీసి వారు పండించిన పంటలపై వచ్చే ఆదాయాన్ని వారి ఎకౌంట్‌లో వేసేందుకు చర్యలు చేపట్టిందని అన్నారు. యంత్రాల కొనుగోలులో 90 శాతం సబ్సిడీని రైతులకు అందించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ను కోరతానని ఎమ్మెల్యే రైతులకు హామీ ఇచ్చారు. అదనపు జాయింట్ కలెక్టర్ సంజీవయ్య మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్‌లో 13.30 లక్షల పత్తివిత్తనాల ప్యాకెట్లు అవసరం కాగా అందులో మైకోకు చెందిన పత్తివిత్తన ప్యాకెట్‌లు 3.80 లక్షలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని అన్నారు. గతంలో కేవలం 1.50 లక్షల పత్తిప్యాకెట్‌లు మాత్రమే అందుబాటులో ఉండేవని కానీ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని ప్రభుత్వం మరింత పెంచిందని అన్నారు. ఒక మైకో కంపెనీకే చెందిన పత్తివిత్తన ప్యాకెట్‌లు కొనుగోలు చేయకుండా అన్ని కంపెనీల పత్తిప్యాకెట్‌లు అందుబాటులో ఉంటాయని వాటిని కొనుగోలు చేసి పంటల్లో అధిక దిగుబడి సాధించవచ్చని అన్నారు. రసాయన ఎరువులను తగ్గించాలని అదనపు జెసి సూచించారు. ఈ రైతు సదస్సులో పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ శంకర్‌రెడ్డి, వరంగల్ వ్యవసాయ పరిశోధానాస్థానం ఎడిఆర్ విష్ణువర్థన్‌రెడ్డి, వ్యవసాయశాస్తవ్రేత్తలు చేరాలు, ఉమారెడ్డి, సుదర్శన్, డిసిసి డైరెక్టర్ ఆనందం, గుడెప్పాడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పింగిళి వెంకట్‌రెడ్డి, హన్మకొండ పిఎసిఎస్ వైస్ చైర్మన్ జన్ను మంజుల, మాజీ జెడ్పీటిసి ఘంటా నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

మద్దతు పలికి సమ్మెలో పాల్గొన్న భూ నిర్వాసితులు * టిడిపి మద్దతు
english title: 
dharna

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>