కందుకూరు, మే 13 : ఇన్నాళ్లు రామాయపట్నం పోర్టు నిర్మాణం విషయంలో వౌనం దాల్చిన వారు, సహకరించని వారు ఇప్పుడు పోర్టు పోయిందని గగ్గోలు పెడుతున్నారన్నారని, పోర్టు ఎక్కడికి పోలేదని, పోర్టు ఏర్పాటు చేసి తీరతానని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి మంత్రి మహీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. కందుకూరులోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో తనను కలిసిన విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ రామాయపట్నం వద్ద పోర్టు నిర్మాణం జరిగితే మరో 15 సంవత్సరాల వరకు అభివృద్ధి పనులకు గాను, విస్తరణకు గాను అవసరమైన భూమి ఇప్పటికే అందుబాటులో ఉందని అలాంటిచోట నిర్మాణం జరిగి తీరుతుందని తాను భావిస్తున్నట్లు మహీధర్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక వాడలుగా (ఏపిఐఐసి) చిత్తూరు, మెదక్, ప్రకాశం జిల్లాల ఎంపికకు ప్రతిపాదనలు పంపగా గతంలో చిత్తూరు, మెదక్ జిల్లాలను మాత్రమే ఎంపిక చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాను కూడా పారిశ్రామిక వాడల అభివృద్ధి జాబితాలో చేర్చినట్లు ఆయన తెలిపారు. దీనివల్ల జిల్లాలోని కనిగిరి నియోజకవర్గ పరిధిలోని కనిగిరితోపాటు సిఎస్‌పురం మండల పరిధిలోని 3వేల ఎకరాలలో పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందుతుందన్నారు. గతంలో కూడా కొంతమంది సోమశీల, రామతీర్థం జలాశయాలు రావడం కష్టతరం అని ప్రచారం చేశారని, అయితే తాను వాటిని సాధించి తీసుకొచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం కూడా రామయపట్నం పోర్టుని సాధించి తీసుకువస్తానన్న నమ్మకం తనకు ఉందని మహీధర్‌రెడ్డి తెలిపారు.
నేనెవరిని భూములు కొనుగోలు చేయమనలేదు
రామాయపట్నం వద్ద పోర్టు నిర్మాణం జరుగుతుందని, భూములు కొనుగోలు చేస్తే బాగా లాభపడతారని తానెవరని ప్రోత్సహించలేదని మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను చాలా మందిని ఆప్రాంతంలో భూములు కొనుగోలు చేయమన్నానని, పోర్టు నిర్మాణం జరుగుతుందని ముందుగానే చెప్పి ప్రోత్సహించానని పలువురు ఆరోపిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఏ ఒక్కరిని ఏనాడు భూములు కొనుగోలు చేయమనిగాని, రియల్ ఎస్టేట్ చేయమనిగాని తాను చెప్పలేదని ఖరాఖండిగా చెప్పారు. ఎవరైనా అలాంటి దుష్ప్రచారం చేస్తే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. తానుగాని, తన బంధువులు గాని ఆప్రాంతంలో భూములు కొనలేదని, అలాంటి ఆలోచనే తనకు రాలేదని అన్నారు. ఎవరెన్ని మాట్లాడినా రామాయపట్నం పోర్టు నిర్మాణం జరిగి తీరుతుందని మహీధర్‌రెడ్డి అన్నారు. ఇప్పటికీ రామాయపట్నం పోర్టు నిర్మాణంపై తన ఆశలు సజీవంగా ఉన్నాయని, ప్రజానీకం కూడా అపోహలకు గురి కావద్దని, వదంతులు నమ్మవద్దని మహీధర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
నెల్లూరులో పోర్టు ఏర్పాటుకు 40మంది ఎంపిలు సంతకాలు చేశారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా భావించి కేంద్రం అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపిన రామాయపట్నం పోర్టు నిర్మాణం కోసం ముందుకు రాని పలువురు ఎంపిలు నెల్లూరు జిల్లా దుగరాజుపట్నం వద్ద పోర్టు నిర్మాణానికి ప్రతిపాదిస్తూ సంతకాలు చేశారని, దాని గురించి తాను ఏమి మాట్లాడనని మహీధర్‌రెడ్డి అన్నారు. తిరుపతి ఎంపి చింతా మోహన్ సంతకాలు చేయమంటే దాదాపు 40మంది ఎంపిలు అందుకు అనుకూలంగా సంతకాలు చేశారని, రామాయపట్నం పోర్టు కోసం తాను ఒంటరిగానే సాధించి తీరుతానని తెలిపారు. ఈవిలేఖరుల సమావేశంలో ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లా కలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ తదితరులు ఉన్నారు.
జిల్లాలో కళతప్పిన అక్షయ తృతీయ
వెలవెలబోయిన బంగారు దుకాణాలు
ఒంగోలు, మే 13:జిల్లాలో అక్షయ తృతీయ కళతప్పింది. అక్షయ తృతీయ రోజైన సోమవారం బంగారాన్ని కొనుగోలు చేస్తే శుభం కలుగుతుందని అన్నివర్గాల ప్రజలు భావిస్తుంటారు. ఓపక్క కరవు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలు కావటం, మరొకపక్క బంగారం ధరలు పెరగటంతో కూడా ఈ పరిస్థితి ఏర్పడినట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో జిల్లావ్యాప్తంగా అక్షయ తృతీయ సందర్భంగా ఒకే రోజున ఐదుకోట్ల రూపాయల మేర విక్రయాలు జరగ్గా ప్రస్తుతం సుమారు రెండుకోట్ల రూపాయల వరకు మాత్రమే విక్రయాలు జరిగినట్లు వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. పెద్దపెద్ద బంగారం షాపుల యజమానులు ఆఫర్లను కూడా ప్రకటించారు. ఎంత బంగారం కొనుగోలు చేస్తే అంత వెండి ఉచితంగా ఇస్తామని యజమానులు ప్రకటించినా ప్రజల నుండి స్పందన రాలేదు. ఈ ఏడాది బంగారం ధరలు భారీగా పెరిగి పడిపోయాయి. దీంతో కూడా బంగారం ధరలు రానున్న రోజుల్లో మరింతగా తగ్గుముఖం పడతాయన్న భావనలో ప్రజలు ఉన్నారని వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో సవర బంగారం ధర 24వేల రూపాయలు ఉండగా ఆ ధర 19 వేల రూపాయలకు పడిపోయింది. దీంతో బంగారం కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎగబడ్డారు. గతంలో ఎన్నడూలేని విధంగా బంగారం కొనుగోళ్ళు భారీగా పెరిగాయి. బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ప్రజలు క్యూకట్టారు. అనంతరం సవర బంగారం ధర 20,600 రూపాయలకు పెరగటంతో మళ్ళీ బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ప్రజలు వెనకంజ వేశారు. తిరిగి సవర బంగారం 19వేల రూపాయల కంటే తక్కువకు వస్తుందని, ఆ సమయంలో కొనుగోలు చేయవచ్చుననే భావనలో ప్రజలు ఉన్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం మాత్రం చిన్నచిన్న ముక్కుపుడకలు, కాసులను మాత్రమే ప్రజలు కొనుగోలు చేసి సంతృప్తి చెందారు తప్ప పెద్దపెద్ద ఆభరణాలను కొనుగోలు చేయడం లేదని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇదిలాఉండగా అక్షయ తృతీయపై కరవు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. జిల్లాలో కరవు పరిస్థితులు ఏర్పడటంతో ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గింది. అదేవిధంగా కోట్ల రూపాయలు వెచ్చించి జిల్లాలోని చుట్టుపక్కల గ్రామాల్లో సైతం భూములను వ్యాపారులు, ప్రజలు కొనుగోలు చేశారు. కాని రియల్‌బూమ్ మాయం కావటంతో అన్నివర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది వ్యాపారులు బంగారాన్ని, భూములను తాకట్టుపెట్టి మరీ భూములను కొనుగోలు చేశారు. కాని వారి ఆశలు అడియాశలయ్యాయి. గతంలో ఎగబడి భూములను కొనుగోలు చేసినవారు సైతం నేడు ఆ భూముల వైపు వెళ్ళేందుకు ముందుకురాని పరిస్థితి ఏర్పడింది. మొత్తంమీద జిల్లాలో అక్షయ తృతీయ కళతప్పటంతో బంగారం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
అనధికారిక మద్యంషాపుల రద్దుపై
సిఎం హామీ నెరవేరేనా..?
మార్కాపురం, మే 13: మహిళల ఉద్యమంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నెలరోజుల్లో అనధికారిక మద్యంషాపులను ఎత్తివేయాలని ఎక్సైజ్‌శాఖ అధికారులను ఆదేశించినప్పటికీ అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. ఇటీవల తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పాదయాత్రలో భాగంగా అధికారంలోనికి రాగానే అనధికారిక మద్యంషాపులను రద్దు చేస్తానని ప్రకటించడంతో ముందస్తుగా ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి హడావుడిగా సమీక్ష సమావేశం నిర్వహించి నెలరోజుల్లోపు అనధికారిక మద్యంషాపులను రద్దు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఎక్సైజ్‌శాఖ అధికారులను ఆదేశించారు. వైన్‌షాపుల యజమానులకు అదనపు ఆదాయంగా ఉన్న అనధికారిక మద్యంషాపుల రద్దుకు సహకరిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. లక్షల రూపాయలు వెచ్చించి వేలంపాటల ద్వారా షాపులను దక్కించుకోగా కౌంటర్లలో నామమాత్రపు వ్యాపారం జరుగుతుండటంతో ప్రధాన ఆదాయం బెల్టుషాపుల నుంచే సమకూరుతుంది. ఈ పరిస్థితుల్లో వ్యాపారులు ఎక్సైజ్‌శాఖ అధికారుల ఆదేశాలను పాటించి రద్దు చేస్తారా..? నాటి సిఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆదేశాల మాదిరే బుట్టదాకలవుతాయా అన్నది మహిళల్లో వ్యక్తం అవుతున్న భావన. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ అధికారులకు వైన్‌షాపుల యజమానులు నెలసరి మాముళ్ళు అందిస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంఆర్‌పి రేట్లకు కౌంటర్లలో మద్యం విక్రయిస్తుండటంతో అక్కడ ఆదాయ వనరులు అంతంత మాత్రంగా ఉండటంతో బెల్టుషాపుల నిర్వహణకు అడ్డుచెప్పకపోవడంతో ఆ ఆదాయంలో మాముళ్ళు చెల్లిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా సిఎం కిరణ్ ఆదేశాలను ఎక్సైజ్‌శాఖ అధికారులు ఏమాత్రం అమలు చేస్తారోనన్న అనుమానం మహిళల్లో వ్యక్తం అవుతుంది. ఇదిలా ఉంటే త్వరలో జరగనున్న పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికలు తమకు వరంగా మారి గ్రామీణప్రాంతాల్లో అధిక ఆదాయం తెచ్చి పెడుతాయని ఆనందిస్తున్న వైన్‌షాపుల యజమానులకు ముఖ్యమంత్రి జారీచేసిన ఆదేశాలు అశనిపాతంలా మారాయని పలువురు వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.
వ్యాపారుల ఆందోళన
గ్రామీణ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు చేసేందుకు లక్షల రూపాయలకు పాటలు పాడి అనధికారిక షాపులను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అనధికారిక షాపులను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో లక్షలు వెచ్చించి అనధికార షాపులు నిర్వహిస్తున్న వారి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. గతఏడాది దసరా నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పాటలు పాడి షాపులు నిర్వహిస్తున్నారు. ఆరునెలల సమయం ఉండగానే ప్రభుత్వం రద్దు ప్రకటన చేయడంతో ఆందోళన చెందుతున్నారు.
రైతు సదస్సులో సమస్యల వెల్లువ
కందుకూరు, మే 13: రైతు చైతన్యయాత్రలో బాధితులు తమ ఆవేదనను వెలుబుచ్చారు. అధికారులను ప్రశ్నల వర్షంతో కుదిపేశారు. సోమవారం స్థానిక టిఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోజరిగిన రైతు సదస్సులో పలువురు రైతులు తమ ప్రాంతాలలోని సమస్యలపై ఏకరవు పెట్టారు. శింగరాయకొండ మండలం పెద కనుమళ్ళ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే రైతు మాట్లాడుతూ తాను మీసేవలో పాసుపుస్తకం కోసం దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా ఇంతవరకు మోక్షం లభించలేదని, అలాగే గ్రీవెన్స్‌సెల్‌లో అనేకసార్లు అర్జీ కూడా అందజేశానన్నారు. పాసుపుస్తకం ఉంటేనే విత్తనాలు ఇస్తామని అధికారులు అంటున్నారని, అయితే ఇంతవరకు తనకు పాసుపుస్తకం ఇవ్వలేదని, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమకు పాసుపుస్తకం ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కనుమళ్ళ చెరువు ప్రజల ఉపయోగం కోసం కాకుండా కొంతమంది ఆక్రమణ దారులు కబంధ హస్తాలలోకి వెళుతుందని, చెరువును కాపాడాలని మంత్రి మహీధర్‌రెడ్డికి, కలెక్టర్ విజయకుమార్‌కు విన్నవించుకున్నారు. అందుకు స్పందించిన మంత్రి మీరిచ్చిన అర్జీ సక్రమంగా ఉంటే వెంటనే పరిశీలించి పాసుపుస్తకం అందజేస్తారని,
అందులో తేడా ఉంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు. జరుగుమల్లి మండలానికి చెందిన శ్రీనివాసులు అనే రైతు మాట్లాడుతూ నీటి సరఫరా ఉన్న ప్రాంతాలలో పండే పంటల గురించే కాకుండా నీటి వనరులు లేని ప్రాంతాలలో ఎలాంటి పంటలు వేయాలేదానిపై కూడా అధికారులు రైతులకు వివరించాలని కోరారు. పిసిపల్లి మండలం వేపగానిపల్లి గ్రామానికి చెందిన కమ్మ నరసింహరావు మాట్లాడుతూ విద్యుత్ కోతల వలన తాన ఐదెకరాల బత్తాయి తోటను 4లక్షల రూపాయలకే అమ్ముకున్నట్లు వాపోయారు. పొన్నలూరు నుంచి ఇంజన్ తీసుకొని వెళితే గంటకు ఐదులీటర్లు డీజిల్ అవుతుందని, రోజుకి 4వేల రూపాయల ఇంజన్ బాడుగ పోతే తాము ఏమి తినాలో చెప్పాలని ఆయన అధికారులను కోరారు. తమకు ఎలా పంటలు పండించాలో తెలుసునని, మీరు సక్రమంగా విద్యుత్ సరఫరా చేస్తే చాలు అని ఆయన అన్నారు. కనిగిరి మండలం పునుగోడు గ్రామానికి చెందిన కొండారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ ప్రతి అరగంటకు పోతుందని, ఇంటికి వెళ్లే సమయానికి వస్తుందని, మరలా పొలానికి తిరిగి వచ్చే సరికి సరఫరా మరలా నిలిచిపోతుందని, అసలు సరఫరా ఎన్ని గంటలు ఇస్తారో, ఎప్పుడెప్పుడు ఇస్తారో తెలపాలని కోరారు. పొన్నలూరు మండలం రావులకొల్లు గ్రామానికి చెందిన కంచర్ల కృష్ణయ్య మాట్లాడుతూ పందిరి కూరగాయలు పది ఎకరాల వారికే సబ్సిడీ ఇస్తారా, ఒక ఎకరా ఉన్న వారికి ఇవ్వరా అని అడిగారు. తనకు నాలుగు ఎకరాలు ఉందని, ఒక ఎకరా పందిరి కూరగాయలు పండిస్తానని అధికారుల చుట్టూ తిరిగితే మీకు లేవు ఎస్సీ, ఎస్టీలకు మాత్రమేనని చెప్పారని వాపోయారు. ఓసిలకు సబ్సిడీ కింద ఇవ్వరా అని అడిగారు. ఈవిధంగా మరొక రైతు మాగ్రామంలో విత్తనాలను సక్రమంగా అందజేయడం లేదని ఫిర్యాదు చేశారు. పలు విషయాలకు మంత్రి మహీధర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయకుమార్ అధికారుల తరపున వారే జవాబు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసమే ఇలాంటి సదస్సులను ఏర్పాటు చేశామని, మీరు వెల్లబుచ్చిన అభిప్రాయాలు అన్నింటిని పరిగణలోకి తీసుకుని వాటిపై సమీక్షించనున్నట్లు చెప్పారు.
ప్రత్యేకత చాటుకున్న స్టాల్స్
కందుకూరు, మే 13: కందుకూరు టి ఆర్ ఆర్ కళాశాలలో సోమవారం నిర్వహించిన రైతు చైతన్య యాత్ర ముగింపుసభలో వ్యవసాయ అనుబంధశాఖల ప్రతినిధులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేకత చాటు కున్నాయి. వివిధ పథకాలు, వ్యవసాయ కార్యక్రమాలపై ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి స్టాల్స్‌ను ప్రారంభించారు. వ్యవసాయ శాస్తవ్రేత్తలు స్టాల్స్‌లోని అంశాలను వివరించారు. ఉద్యానవనశాఖ, సూక్ష నీటిపారుదల, వ్యవసాయ సాంకేతిక సలహా కేంద్రం, పట్టుపరిశ్రమ, సుస్థిర వ్యవసాయం, కృషి ఉత్పత్తులు, మత్స్యశాఖ, మార్కెటింగ్‌శాఖ, పశుసంవర్థకశాఖ, విద్యుత్‌శాఖకు సంబంధించిన స్టాళ్లను మంత్రి మహీధర్‌రెడ్డి పరిశీలించారు. స్టాళ్లను పరిశీలించిన వారిలో ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లా కలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు తోకల కొండయ్య, దారపునేని చంద్రశేఖర్, కె శ్రీనివాసులు, డిఆర్‌డిఎ పిడి పద్మజ, వ్యవసాయ సంయుక్త సంచాలకులు దొరసాని, కందుకూరు ఆర్‌డిఓ టి బాపిరెడ్డి, పలువురు అధికారులు, నాయకులు ఉన్నారు.
శాస్ర్తియ పద్ధతులతో అధిక దిగుబడులు
రైతులకు మంత్రి మహీధర్‌రెడ్డి సూచన
కందుకూరు, మే 13: వ్యవసాయంలో శాస్ర్తియ పద్ధతులను అవలంబించాలని, ఆధునిక పోకడలపై రైతులు చైతన్యవంతమై ప్రభుత్వ పథకాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని అభివృద్ధి చెందాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఒంగోలు పార్లమెంట్‌సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన సోమవారం స్థానిక టిఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో కందుకూరు డివిజన్ రైతుసదస్సు ముగింపు సభ జరిగింది. ఈసదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మహీధర్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయంలో రైతులు ఆధునిక, సాంకేతిక పద్ధతులను వినియోగించుకుని అధిక దిగుబడులు పొందాలన్నారు. రైతులు వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించుకుని అధిక దిగుబడులు పెంచుకొనేందుకు వ్యవసాయశాఖ అధికారుల సూచనలను పాటించాలన్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు సరైన అవగాహన కల్పించడంలో వ్యవసాయశాఖ వెనుకంజలో ఉందన్నారు. ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం అనేక రకాల పథకాలను ప్రవేశపెడుతుందని ఆయన తెలిపారు. శాస్తవ్రేత్తలు ఒకచోట చేరి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. రైతుల్లో మనోధైర్యం కల్పించేందుకే రైతు సదస్సులను ఏర్పాటు చేశామని, రైతన్నల వెంట తాము ఉన్నామని భరోసా ఇవ్వడంతోపాటు వారికి కష్టనష్టాలలో ప్రభుత్వం చేదోడువాదోడుగా ఉంటుందన్నారు. బ్యాంకులు రుణాలను సక్రమంగా ఇవ్వకపోతే అధికారులకు ఫిర్యాదు చేయాలని, గ్రామస్థాయిలో లోపాలు ఉంటే ఉన్నతాధికారులకు తెలపాలన్నారు. ఈ రైతు సదస్సుకు అధ్యక్షత వహించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ దేశంలోనే మన రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డికి దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. రైతు సమస్యలను పరిష్కరించేందుకు రైతు సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. 2004లో యుపిఏ ప్రభుత్వం ఏర్పడిందని అప్పట్లో క్వింటా 720రూపాయలు ఉన్న వరి ధాన్యం, ప్రస్తుతం 1400రూపాయలకు పెరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పొగాకు పంట 170మిలియన్ల క్వింటాళ్ళ వరకు పండిస్తే ఒక్క ఒంగోలు పార్లమెంట్ పరిధిలోనే 85మిలియన్ల పొగాకు పండుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఏడాది పొగాకుకు గిట్టుబాటు ధర కోసం కేంద్రంపై ఒత్తిడి తేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల వైపు కూడా రైతులు మొగ్గు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ మాట్లాడుతూ గత నెల రోజుల నుంచి గ్రామస్థాయిలో రైతుచైతన్య యాత్రలు నిర్వహించామని, మార్కాపురం, ఒంగోలు డివిజన్‌స్థాయి రైతు సదస్సులు నిర్వహించామని, ముగింపు సభను కందుకూరులో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతు సదస్సుల వల్ల రైతులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. రైతులు శాస్తవ్రేత్తల సూచనలు, సలహాలు తీసుకోవడం వలన దిగుబడులు పెంచుకోవచ్చునని ఆయన తెలిపారు. జిల్లాలో శనగ పంటకు గిట్టుబాటు కల్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. అలాగే మిర్చి కొనుగోలు కేంద్రంకు 60లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఒంగోలులో ఈకేంద్రానికి సంబంధించిన పనులు త్వరలో మొదలు పెడతామని ఆయన తెలిపారు. జిల్లాలో మిర్చి, పొగాకు, శనగ పంటలతోపాటు, సుబాబుల్ తదితర పంటలకు కనీస మద్దతు ధరలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మే నెల కావడం వలన విద్యుత్ సమస్యలు అధికంగా ఉన్నాయని, త్వరలోనే విద్యుత్ సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కనిగిరి శాసన సభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ రైతు సమస్యలను ఎప్పుడైనా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈసదస్సులో కనిగిరి, కందుకూరు, కొండపి ఎఎంసి చైర్మన్లు దారపునేని చంద్రశేఖర్, తోకల కొండయ్య, జి శ్రీనివాసులు, డిఆర్‌డిఎ పిడి పద్మజ, జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు దొరసాని, మత్స్యశాఖ ఎఫ్‌డిఓ రంగనాథన్‌బాబు, డ్వామా పిడి రమేష్‌కుమార్, విద్యుత్‌శాఖ ఎస్‌ఇ హరనాథరావు, కందుకూరు ఆర్‌డిఓ టి బాపిరెడ్డి, వ్యవసాయ అనుబంధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలువురు ఉత్తమ ఆదర్శ రైతులకు మంత్రి మహీధర్‌రెడ్డి, ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డి చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.
అపార్ట్‌మైంట్ పైనుండి పడి ఒకరి మృతి
చీరాల, మే 13: స్థానిక పోలీసుస్టేషన్ ఎదురుగాగల అపార్టుమెంట్ పైనుంచి కిందపడి ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పర్చూరు మండలం చెరుకూరు గ్రామానికి చెందిన ఎలక్ట్రిషియన్లు సంకూరి రాంబాబు (35) మృతి చెందగా, నాలి నాగయ్య అనే యువకుడు గాయాలపాలయ్యాడు. ఆ ఇద్దరు ఎలక్ట్రిక్ సామాన్లు కొనేందుకు చీరాల వచ్చారు. మద్యం సేవించిన ఇద్దరు అపార్టుమెంట్‌లోని లిఫ్ట్‌గోడపై కూర్చుని మాట్లాడుకుంటుండగా ప్రమాదవశాత్తు తూలి పైనుంచి కిందపడ్డారు. ఒకరిపై ఒకరు పడటంతో కిందపడిన రాంబాబు అక్కడికక్కడే మృతి చెందగా నాగయ్య తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న 108 వాహనసిబ్బంది క్షతగాత్రుడిని చీరాల ఏరియా వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కొత్తపట్నం మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
ఎంపి మాగుంట హామీ
కొత్తపట్నం, మే 13: మండలాన్ని ప్రత్యేక నిధులతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం ఆయన అల్లూరు, కొత్తపట్నం గ్రామాల మధ్య శిథిలావస్థకు చేరిన వంతెన పునఃనిర్మాణ కార్యక్రమానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభకు మాజీ ఎంపిపి వాయల మోహన్‌రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఎంపి మాగుంట మాట్లాడుతూ 3 కోట్ల 90 లక్షల వ్యయంతో వంతెనను 10 నెలల్లో పూర్తిచేసి 2014 ఫిబ్రవరి మాసంలో ప్రారంభించేలా ప్రణాళిక తయారుచేస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు 3 కోట్ల 50 లక్షల వ్యయంతో నల్లవాగుపై వంతెన నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఒంగోలు నుండి కొత్తపట్నం బీచ్ వరకు డబుల్ రోడ్ల పనులు పూర్తయిన తరువాత 6 కోట్ల 50 లక్షల నిధులతో కొత్తపట్నం బీచ్‌ను పర్యాటక రంగంగా తీర్చిదిద్దబోతున్నట్లు తెలిపారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి సొంత నిధులతో అభివృద్ధి చేయబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేనిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఇఇ సుధాకర్, మండల తహశీల్దార్ ఎం రాజ్‌కుమార్, ఎంపిడివో కుసుమ కుమారి, మార్కెటింగ్ యార్డు చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం, సిహెచ్ నర్సమ్మ, గొర్రెపాటి శ్రీను, మార్కెటింగ్ యార్డు డైరెక్టర్ మోటుపల్లి యానాది తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా శిలా విగ్రహాల ప్రతిష్ఠ
మద్దిపాడు, మే 13: స్థానిక వేంకటేశ్వర స్వామి ఆలయం గర్భగుడి ముఖద్వారం వద్ద జయ విజయులు, స్వామిపాదాలు, బలిపీఠం, నాగశిలాశాసన విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం సోమవారం ఉదయం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆగమశాస్త్ర వేదపండితులు శ్రీమాన్ పరాంకుశం సాయికృష్ణమాచార్యులు (టిటిడి ) ఆధ్వర్యంలో నిర్వహించారు. రుత్విక్‌ల వేదమంత్రోచ్ఛరణల మధ్య హోమం, కుంభాభిషేకం, కళావిన్యాసం, శిఖరకలశ తదితర కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు మద్దిపాడు దీక్షితులు గోపయ్య, ప్రసాద్, మారుతీ, గ్రామపెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం స్వామివారి కల్యాణం వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల మధ్య వైభవంగా జరిగింది. వందలాది మంది భక్తులు కల్యాణాన్ని కనులారా భక్తిశ్రద్ధలతో తిలకించారు. అనంతరం సహస్త్ర విష్ణునామ పారాయణం, గోవిందనామాలను మహిళలు సుమధురంగా పఠించి భక్తులను అలరింప చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ ఇవో పి అంజనాదేవి, శ్రీహరి, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని ప్రతిష్ఠా విశేష పూజలను తిలకించారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
మేదరమెట్ల, మే 13: గుర్తుతెలియని వాహనాన్ని కారు ఢీకొన్న సంఘటనలో యువకుడు మృతి చెందగా ఇద్దరు తీవ్రగాయాల పాలైన సంఘటన మేదరమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం వేకువజామున జరిగింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం వనదుర్గాపురానికి చెందిన ముగ్గురు యువకులు కారులో గుంటూరు వెళుతున్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు మండలంలోని కొరిశపాడు గ్రామం వద్ద గల శ్రీసాన్ గ్లాస్ ఫ్యాక్టరీ ఎదురుగా గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి కాకర్లపూడి మహేష్ (20) అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద వార్త తెలిసిన మేదరమెట్ల ఎస్‌ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పూజలను అడ్డుకోబోయిన పోలీసులు
ఒంగోలు, మే 13: ఒంగోలులోని దిబ్బలరోడ్డులో గల ఓవర్‌హెడ్ ట్యాంకు వద్ద ఉన్న ఖాళీ స్థలంలో సోమవారం స్థానికులు కొందరు శ్రీ సీతారాముల స్వామి విగ్రహాలను ఏర్పాటుచేసి పూజలు చేస్తుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, భక్తుల మధ్య స్వల్ప వివాదం నెలకొంది. దీనిపై స్పందించిన ఒంగోలు తాలూకా సిఐ శ్రీనివాసన్ మాట్లాడుతూ, చట్ట ప్రకారం ఖాళీ స్థలంలో విగ్రహాలు పెట్టి పూజలు చేస్తుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే ప్రభుత్వ స్థలాల్లో విగ్రహాలు పెట్టి పూజలు చేస్తే సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందని, భక్తులు ఆలోచించి చట్టప్రకారం అనుమతులు తీసుకొని పూజలు నిర్వహించుకోవాలని భక్తులకు సిఐ సూచించారు.