Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మళ్లీ మొదలు

$
0
0

ఏలూరు, మే 13 : కేంద్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు నేపధ్యంలో మరోసారి మంత్రివర్గ విస్తరణ తెరపైకి రావడం, వెనువెంటనే కావూరి వర్గంలో ఆశలు రేగడం మొదలైంది. కావూరికి ఈసారైనా కేంద్ర మంత్రివర్గంలో బెర్త్ లభిస్తుందా అన్న మీమాంస తీవ్రస్థాయిలోనే రేగుతోంది. దాదాపు యుపి ఏ-2లో మంత్రివర్గ విస్తరణ జరగడం ఇదే ఆఖరిసారన్న అంచనాల నేపధ్యంలో ఇంతకుముందు తీవ్ర అసంతృప్తికి గురై పదవికి కూడా రాజీనామా సమర్పించి ఆ తరువాత చల్లబడ్డ కావూరి అభ్యర్ధిత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటారన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వాస్తవానికి ఇంతకుముందు జరిగిన మంత్రివర్గ విస్తరణలో కావూరికి బెర్త్ ఖాయమని ప్రచారం జరిగిపోగా చివరి నిమిషంలో ఆ అవకాశం ఆయనకు దూరమైంది. దీంతో అసంతృప్తికి గురైన కావూరి సాంబశివరావు అధిష్టానం తీరుపై కినుక వహించి పదవికి రాజీనామా సమర్పించారు. ఆతరువాత పరిణామాల్లో ఆయన ఏకంగా పార్టీకి కూడా దూరం అవుతారన్న ఊహాగానాలు చెలరేగాయి. ఆయన కూడా అప్పట్లో కొంతవౌనంగా వుండిపోయి ఇటువంటి ప్రచారాలకు మరికొంత ఊతాన్ని అందించారని చెప్పుకోవాలి. చివరకు మంత్రివర్గ విస్తరణ వ్యవహారంలో తన అసంతృప్తిని దిగమింగుకుని పదవికి సమర్పించిన రాజీనామాలు కూడా విరమించుకున్నారు. ఆ తరువాత నుంచి యధాప్రకారం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా పార్లమెంటరీ వ్యవహారాల్లో కూడా కొంత చురుగ్గానే కనిపిస్తూ వచ్చారు. ఇటీవల పార్లమెంటులో ఎన్‌టి రామారావు విగ్రహాన్ని ప్రతిష్టించే సందర్భంలోనూ సహచర ఎంపిలతో కలిసి కావూరి సాంబశివరావు, పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలుసుకుని చర్చలు జరిపినట్లు కూడా పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా గత మంత్రివర్గ విస్తరణ అనంతరం కావూరి సాంబశివరావు ఇటీవలే తన కార్యకలాపాలను యధావిధిగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కోల్‌గేట్, రైల్వేబోర్డులో పదవుల విషయంలో వివాదాలకు లోనై సుప్రీంకోర్టుతో వ్యాఖ్యానాలు చేయించుకుని చివరకు విపక్షాల తీవ్రస్థాయి ఆందోళన నేపధ్యంలో కేంద్ర మంత్రివర్గంలో కీలకమైన ఇద్దరు మంత్రులు రాజీనామాలు సమర్పించి తప్పుకోవడం తెలిసిందే. రానున్న కాలం ఎన్నికల సమయం కావడంతో ఇప్పటి వరకు పడ్డ అవినీతి ముద్రను చెరిపేసుకునేందుకు యుపి ఏ -2 ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిలో భాగంగానే మంత్రివర్గ విస్తరణ చేపట్టి కొందరు సీనియర్లకు పార్టీ వ్యవహారాలను అప్పగించడంతోపాటు మరికొంతమందిని మంత్రివర్గంలోకి తీసుకునే యోచన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యమే ఇప్పుడు జిల్లాలోనూ కావూరికి అవకాశం లభిస్తుందన్న ఆశలకు కారణమవుతోంది. దాదాపు అయిదుసార్లు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన కావూరి సాంబశివరావు అన్ని విధాలా కేంద్ర మంత్రి పదవికి అర్హుడని ఇంతకుముందే పలుమార్లు ప్రచారం జరిగింది. ఆయన కూడా తనకు మంత్రి పదవి దక్కడంలో పూర్తి న్యాయం వుందని కూడా పలుమార్లు వ్యాఖ్యానించారు. అధిష్టానం తన సీనియార్టీని, తన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కూడా ఆయన కోరుతూ వచ్చారు. అదే సమయంలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తరించి వున్న కావూరి వర్గం ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి అందివ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఆయన వర్గం అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రానున్న పరిణామాలు ఏ విధంగా వుంటాయి, మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా? దానిలో కావూరికి అవకాశం లభిస్తుందా అన్న అంశాలు వేచి చూడాల్సిందే.

కిరణ్, బాబు ఇద్దరూ దోషులే...
*సమయం వచ్చినపుడు బుద్ధి చెప్పండి * మరో ప్రజాప్రస్థానం యాత్రలో షర్మిల పిలుపు
చింతలపూడి, మే 13: రాష్ట్రంలో ప్రజలెదుర్కొంటున్న కష్టాలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, విపక్ష నేత చంద్రబాబునాయుడు ఇద్దరూ కారకులేనని, సమయం వచ్చినపుడు వారిద్దరికీ బుద్ధిచెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ సోదరి షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు అండతోనే కిరణ్‌కుమార్ ప్రభుత్వం ప్రజలపై లక్షల కోట్ల భారం మోపుతోందన్నారు. విపక్ష నేతగా ప్రభుత్వం తీసుకునే ప్రజావ్యతిరేక కార్యక్రమాలను తిప్పికొట్టాల్సిన చంద్రబాబు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారన్నారు. షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర జిల్లాలో సోమవారం రెండో రోజుకు చేరుకుంది. ఈసందర్భంగా చింతలపూడి మండలం రాఘవాపురంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఎదురవుతున్న కష్టాలతో ప్రజలెవరూ అధైర్యపడవద్దని, రాజన్న రాజ్యం కోసం జగనన్నకు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలను కిరణ్ ప్రభుత్వం కుదించేసిందన్నారు. పేద విద్యార్థులకు ఉపయోగపడే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని సైతం సక్రమంగా అమలుచేయడంలేదన్నారు. విద్యుత్ చార్జీల పెంపు, సర్‌చార్జీల పేరుతో ప్రజలపై దాదాపు 30 వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం మోపిందని, ఇదంతా చంద్రబాబు అండ కారణంగానే ప్రభుత్వం చేయగలుగుతోందన్నారు. ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలనే ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని తెలుగుదేశం పార్టీ అందుకే వ్యతిరేకిస్తోందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు చంద్రబాబూ కారకుడని షర్మిల ధ్వజమెత్తారు.
2000 కిలోమీటర్లకు చేరువలో...
షర్మిల సాగిస్తున్న మరో ప్రజాప్రస్థానం యాత్ర ఈ నెల 15వ తేదీ నాటికి 2000 కిలోమీటర్లకు చేరనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం రావికంపాడు గ్రామంలో పైలాన్‌ను ఆవిష్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ సందర్భంగా అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి కూడా హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఆలస్యంగా ఉపాధ్యాయుల బదిలీల కౌనె్సలింగ్
ఏలూరు, మే 13 : సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీ కౌనె్సలింగ్ సోమవారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో 4 గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. సాంకేతిక పరమైన ఇబ్బందుల కారణంగా ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌన్సిలింగ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. ఈ కారణంగా కౌన్సిలింగ్‌నకు హాజరైన 900 మంది ఉపాధ్యాయులు తమ వంతు వచ్చేంత వరకు చెట్ల కింద పడిగాపులు కాయాల్సి వచ్చింది. తొలుత బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న 1 నుంచి 900 మంది ఉపాధ్యాయులకు ఉదయం 10 గంటలకు కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని అధికారులు ప్రకటించారు. దీంతో జిల్లా నలుమూలల నుంచి ఉదయం 9 గంటల ప్రాంతానికే ఎంతో వ్యయప్రయాసలకోర్చి ఉపాధ్యాయులు జడ్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎస్‌జిటిల రేషనలైజేషన్, బదిలీ కౌన్సిలింగ్ కలిపి మరికొద్ది సేపటిలో ప్రారంభమవుతుందని అధికారులు తొలుత ప్రకటించారు. అయితే డి ఎస్‌సి-2008లో ఎంపికై పనిచేస్తున్న 82 మంది ఉపాధ్యాయులకు విద్యాశాఖాధికారులు షోకాజు నోటీసులు గతంలో జారీ చేశారు. వీరంతా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో వుంది. డి ఎస్‌సి-2008లోనే ఎంపికైన 19 మంది తెలుగు, ముగ్గురు ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్లకు కూడా షోకాజు నోటీసులు జారీ అయ్యాయి. అయితే వీరిని రేషనలైజేషన్‌లో భాగంగా బదిలీ కౌన్సిలింగ్‌నకు హాజరుకావాలంటూ వారి పేర్లను జాబితాలో చేర్చారు. దీనిపై సంఘాల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. అంతేకాకుండా తుది జాబితాలో పలు అభ్యంతరాలను కూడా విద్యాశాఖాధికారులు పరిష్కరించాల్సి వచ్చింది. ఈ రకంగా డి ఎస్‌సి-2008లో ఎంపికై షోకాజు నోటీసులు అందుకున్న వారిని మినహాయించేందుకు, ఎస్‌జిటిల అభ్యంతరాలను పరిష్కరించేందుకు విద్యాశాఖాధికారులు, సిబ్బంది నాలుగు గంటల సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కౌన్సిలింగ్ ప్రారంభించి ఉపాధ్యాయులు తాము కోరుకున్న పాఠశాలలకు బదిలీ ఉత్తర్వులు పొందారు. సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతానికి సుమారు 500 మంది ఉపాధ్యాయులకు బదిలీ కౌన్సిలింగ్‌ను అధికారులు నిర్వహించారు. కౌన్సిలింగ్‌లో డివై ఇవోలు మద్దూరి సూర్యనారాయణ, జోగేశ్వరరావు, ఎడివి ప్రసాద్, రామకృష్ణంరాజు, ఎడి -1 డి సుభద్ర, సూపరింటెండెంట్లు అన్నపూర్ణ, అజీజ్ తదితరులు పాల్గొన్నారు. దీనిపై డి ఇవో ఆర్ నరసింహరావు మాట్లాడుతూ సోమవారం రాత్రి ఎంత ఆలస్యమైనప్పటికీ కౌన్సిలింగ్‌నకు హాజరైన ఉపాధ్యాయులందరికీ కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీ ఉత్తర్వులను అందజేస్తామని అన్నారు. మంగళవారం నుంచి కౌన్సిలింగ్‌ను మరింత వేగవంతంగా నిర్వహిస్తామన్నారు. కౌన్సిలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు.

పోలవరం నిర్వాసితులకు
మెరుగైన సౌకర్యాలకు చర్యలు
జాయింట్ కలెక్టర్ బాబూరావు నాయుడు
ఏలూరు, మే 13 : జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్వాశిత పేదలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టరు డాక్టర్ టి బాబూరావునాయుడు చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం సాయంత్రం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు తీరుపై అధికారులతో ఆయన సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాశిత పేద కుటుంబాలలో వెయ్యి మంది నిరుద్యోగ యువతకు ఉపాధి సౌకర్యాలు కల్పించడానికి రాజీవ్ యువకిరణాల ద్వారా వివిధ వృత్తుల్లో ప్రత్యేక శిక్షణ అందించేందుకు ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జెసి బాబూరావునాయుడు ఐటిడి ఎ పివో సూర్యనారాయణను ఆదేశించారు. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి వున్న గిరిజన యువతకు వెంటనే అవసరమైన వాహనాలను కొనుగోలు చేసి అందించాలని తద్వారా ఆ వాహనాలను ఐటి డి ఎ పరిధిలో వినియోగించేలా చర్యలు తీసుకోవాలని దీనివల్ల అటు గిరిజన యువతకు ఉపాధి కలిగించడమే కాకుండా ఐటి డి ఎ పరిధిలో పనిచేస్తున్నానన్న ఆనందం వారిలో కలుగుతుందని చెప్పారు. తొలిదశగా 15 వాహనాలను గిరిజన యువతకు అందించాలని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురయ్యే ఏడు గ్రామాలలోని పేదలకు 1566 గృహాలు మంజూరు చేయడం జరిగిందని వాటిలో 352 గృహాలు పూర్తికాగా మరో 50 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని జెసి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాశితులకు భూమికి భూమి అందించేందుకు అవసరమైన భూమి కొనుగోలు చేస్తామని, దేశంలో ఎక్కడా కూడా అమలు చేయనంత మెరుగైన సౌకర్యాలను పోలవరం ప్రాజెక్టు నిర్వాశితులకు కల్పించి మెరుగైన జీవన పరిస్థితులు కల్పిస్తామని ఆయన చెప్పారు. సమావేశంలో డ్వామా పిడి ఎన్ రామచంద్రారెడ్డి, డి ఎస్‌వో లక్ష్మీనారాయణ, పోలవరం ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
నేడు టికె శ్రీదేవి ఏలూరులో సమీక్ష
రాష్ట్ర ఆర్ అండ్ ఆర్ కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ, ఇరిగేషన్, సి ఎడి శాఖ ఎక్స్ అఫిషియో టికె శ్రీదేవి మంగళవారం హైదరాబాదు నుండి విమానంలో గన్నవరం చేరుకుని 11 గంటలకు ఏలూరులో జరిగే జిల్లాస్థాయి పోలవరం ప్రాజెక్టు మోనటరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం భోజనం అనంతరం గన్నవరం నుండి హైదరాబాదు బయలుదేరి వెళ్తారు.

24 గంటల్లోగా చేపల చెరువుల తవ్వకాలు నిలిపివేయకపోతే కఠిన చర్యలు:జెసి
ఏలూరు, మే 13 : ఉండి మండలంలో అక్రమ చేపల చెరువుల తవ్వకాలు జరుగుతున్నాయంటు ఫిర్యాదులందుతున్నాయని 24 గంటల్లోగా చేపల చెరువుల తవ్వకాలు నిలిపివేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు ఉండి తహశీల్దార్‌ను హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన వందలాది ఫిర్యాదులను జెసి స్వయంగా పరిశీలించి పరిష్కారానికి తగు ఆదేశాలుజారీ చేశారు. ఉండి మండలం ఉనుదుర్రు గ్రామంలో, మహాదేవపట్నం శివారు ఉప్పరగూడెంలో అక్రమ చేపల చెరువుల తవ్వకాలు యుద్ధప్రాతిపదికపై ప్రొక్లైనర్ల ద్వారా జరిగిపోతున్నాయని దీనివల్ల తమ పంట భూములు దెబ్బతినే ప్రమాదమున్నదని పలువురు రైతులు జెసికి వినతిపత్రాలు సమర్పించారు. ఉండి మండలం ఉనుదుర్రు గ్రామంలో 600 ఎకరాల భూమిలో 80 ఎకరాలు అక్రమ చేపల చెరువులు తవ్వుతున్నారని ఎటువంటి డ్రైనేజీ సౌకర్యం కూడా లేదని దీనివల్ల తమ భూములు దెబ్బతింటాయని దాట్ల శ్రీరామమూర్తిరాజు జెసికి ఫిర్యాదు చేశారు. ఉండి మండలం మహదేవపట్నం, ఉప్పరగూడెం దెయ్యాలతోటలో అక్రమ చేపల చెరువుల తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బ్రోకర్లు విచ్చలవిడిగా తిరుగుతూ ముడుపులు తీసుకుంటున్నారని గుత్తుల నాగేశ్వరరావు ఆరోపించారు. దీనిపై జెసి స్పందిస్తూ ఉండి తహశీల్దార్‌తో ఆ ప్రాంత మత్స్యశాఖాధికారితో ఫోన్‌లో మాట్లాడుతూ ప్రభుత్వం నియమనిబంధనల ప్రకారం చేపల చెరువులకు అనుమతి ఇవ్వాలే తప్ప అక్రమ చేపల చెరువులు తవ్వితే సంబంధిత తహశీల్దారు బాధ్యులు అవుతారని ఆ ప్రాంత మత్స్యశాఖాధికారిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డెల్టాలో చేపల చెరువుల అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని వాటిని పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉండే చేపల చెరువులను ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించకూడదని ఆయన హెచ్చరించారు. భీమడోలు మండలం పూళ్ల శివారు ఎం ఎం పురంలో భూదాన యజ్ఞ బోర్డు 550.47 ఎకరాల భూమిని 232 మందికి పంపిణీ చేసినట్లు రికార్డుల్లో ఉందని కానీ వాస్తవంగా 70 మంది ఆ గ్రామంలో లేని వారి పేర్లుతో పట్టాలున్నాయని 26 మందికి రెండేసి సార్లు పట్టాలు ఇచ్చినట్లు రికార్డులో చూపించారని ఈ విషయంపై విచారణ జరిపి న్యాయం చేయాలని సవరం నాగేశ్వరరావు అనే వ్యక్తి జెసికి ఫిర్యాదు చేశారు. దీనిపై తగు నివేదిక సమర్పించాలని తహశీల్దార్‌ను జెసి ఆదేశించారు. సోమవరప్పాడు శివారు మల్కాపురంలో మురుగుకాల్వ ఆక్రమణలకు గురి అయ్యిందని దాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు.
గ్రామీణ ఇ-సేవలో ఆఫ్ లైన్ కొనసాగించాలి
జిల్లాలోని గ్రామీణ మీ-సేవ కేంద్రాలలో కరెంటు బిల్లులు స్వీకరణ కార్యక్రమం ఆఫ్ లైన్ నుండి ఆన్‌లైన్ చేయాలని ఆదేశాలు రావడంతో ఇ-సేవ కేంద్రాలు కొంత ఇబ్బందులకు గురి అవుతున్నాయని కొంతకాలం ఆఫ్ లైన్‌లోనే బిల్లులు స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రామీణ ఇ-సేవ సొసైటీ నాయకులు జెసిని కోరారు. గత తొమ్మిది సంవత్సరాలుగా 487 కోట్ల రూపాయలు కరెంటు బిల్లులు వసూలు చేసి సకాలంలో చెల్లిస్తున్నామని, దీనివల్ల 300 కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయని, ఆన్‌లైన్ చేయడం వల్ల కొంత జాప్యం జరుగుతున్నదని త్వరలోనే పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌కు ఇ-సేవలు సిద్ధం అవుతాయని, కావున కొద్ది నెలల పాటు ఆఫ్‌లైన్‌లోనే కరెంటు బిల్లులు వసూలు చేసుకోవడానికి అనుమతించాలని పలువురు కోరారు. వికలాంగుడైన ఎండి జువేద్ అహ్మద్ ప్రజావాణిలో విజ్ఞప్తిని అందిస్తూ 75 శాతం వికలాంగత్వం ఉన్న తనకు ఉపాధి కల్పించాలని కోరారు. దీనిపై జెసి స్పందిస్తూ ఈ విషయంపై సమగ్ర పరిశీలన చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని డి ఆర్ డి ఎ పిడి వై రామకృష్ణను ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లా మూగ వికలాంగుల అసోసియేషన్ వారు తమ విజ్ఞప్తిని అందిస్తూ సుమారు వంద మంది కలిగిన మూగ వారికి ఇళ్ల స్థలాలు అందించాలని ఆ సంఘ ప్రధాన కార్యదర్శి సిహెచ్ తాతారావు కోరగా జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ ఈ విషయాన్ని సానుకూలంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తన కొడుకు గంధం రాజేష్ ట్రిపుల్ ఐటి చదువుతున్న విద్యార్ధి గత ఆగస్టు నెలలో హత్యకు గురయ్యాడని, కొడుకు మారణాన్ని తట్టుకోలేక తన భర్త కూడా గుండె ఆగి చనిపోయాడని గంధం భూలక్ష్మి వాపోయింది. తనకు ఆర్ధిక సహాయాన్ని అందించి ఆదుకోవాలని కోరింది. ఈ విషయంపై డి ఆర్‌వో ఎం మోహనరాజు స్పందిస్తూ గంధం భూలక్ష్మికి జాతీయ కుటుంబ సహాయ పధకం కింద ఆర్ధిక సహాయం అందించడంతోపాటు ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రతిపాదనలు పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో హౌసింగ్ పిడి సత్యనారాయణ, డ్వామా పిడి ఎన్ రామచంద్రారెడ్డి, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ కెవి ప్రభాకరరావు, డి ఎస్‌వో లక్ష్మీనారాయణ, బిసి సంక్షేమాధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి వైశాఖ మాస బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు
ద్వారకాతిరుమల, మే 13: శ్రీవారి వైశాఖ మాస బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 20 నుండి 28 వరకు కల్యాణ మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఆలయాన్ని రంగులతోను, విద్యుత్ దీప తోరణాలతోను సుందరీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ ప్రధాన రాజగోపురం మెట్ల దారిపై రంగులు వేస్తున్నారు. అలాగే ఆలయ పరిసర ప్రాంతాలు, రాజగోపురాలపై విద్యుత్ తోరణాలు అమరుస్తున్నారు. ఆలయ ఆవరణలో ధ్వజస్తంభం వద్ద చలువ పందిర్ల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవ వేడుకలకు ఆలయం ముస్తాబవుతోంది.
పాస్‌పోర్టు కార్యాలయం ఏర్పాటుకు మున్సిపాలిటీ అనుమతి
భీమవరం, మే 13: పాస్‌పోర్టు కార్యాలయం భీమవరం మున్సిపాల్టీకి చెందిన అల్లూరి సీతారామరాజు భవనంలో ఉచితంగా ఏర్పాటు చేసేందుకు భీమవరం మున్సిపాల్టీ అంగీకరించిందని నర్సాపురం ఎంపి కనుమూరి బాపిరాజు వెల్లడించారు. సోమవారం సాయంత్రం భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులతో కలిసి మున్సిపల్ అల్లూరి సీతారామరాజు భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపి బాపిరాజు మాట్లాడుతూ పాస్‌పోర్టు కార్యాలయాన్ని భీమవరంలో ఏర్పాటుకు 3 నెలల క్రితమే కేంద్రం అనుమతించిందన్నారు. అయితే స్థలం సమస్య ఎదురైందన్నారు. మల్టీప్లెక్స్ కాంప్లెక్స్‌లో ఏర్పాటుకు పరిశీలించినప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల అక్కడ ఏర్పాటు సాధ్యపడలేదన్నారు. దీంతో భీమవరం మున్సిపాల్టీ ముందుకు వచ్చి అల్లూరి సీతారామరాజు ఆడిటోరియాన్ని పాస్‌పోర్టు సేవాకేంద్రం ఏర్పాటుకు ఉచితంగా అందించేందుకు అంగీకారం తెలిపారన్నారు. గతంలో పాస్‌పోర్టు కావాలంటే చెన్నై వెళ్ళాల్సి వచ్చేదన్నారు. అయితే ఎన్నో మార్పుల అనంతరం కృష్ణా, గోదావరి జిల్లాలకు ప్రజలకు అందుబాటులో ఉండేలా భీమవరానికే పాస్‌పోర్టు కేంద్రం మంజూరు కావడం ఈ ప్రాంతానికే ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జిల్లా అధికారులు కూడా సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకోవాలని బాపిరాజు కోరారు. కార్యక్రమంలో ఆయన వెంట భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు, మున్సిపల్ కమిషనర్ జివివిఎస్‌ఎన్ మూర్తి, ఎఎంసి ఛైర్మన్ ఎఎస్ రాజు తదితరులున్నారు.
కాళీపట్నం నుండి భీమవరానికి డబుల్ రోడ్డు
కాళీపట్నం నుండి భీమవరానికి డబుల్‌రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని ఎంపి కనుమూరి బాపిరాజు వెల్లడించారు. ఇప్పటికే కాళీపట్నం నుండి భీమవరం వైపువచ్చేందుకు రూ.10 కోట్లు మంజూరు కాగా, రోడ్డు భీమవరం వరకు చేరాలంటే మరో రూ.8 కోట్లు అవసరం ఉంది. ఈ నిధులను కూడా సోమవారమే మంజూరు చేస్తున్నట్లు సంబంధిత ఉన్నతాధికారులు తన దృష్టికి తీసుకువచ్చినట్లు బాపిరాజు వెల్లడించారు.
భీమవరం-పెద అమిరం వరకు డబుల్ రోడ్డు
భీమవరం నుండి పెద అమిరం వరకు జువ్వలపాలెం రోడ్డులో డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆర్ అండ్ బి ఉన్నతాధికారులను ఎంపి బాపిరాజు కోరారు. ఇప్పటికే గరగపర్రు రోడ్డులో డబుల్ రోడ్డు పనులకు అనుమతి వచ్చిందని, ఈ రోడ్డులో కూడా డబుల్ రోడ్డు నిర్మాణానికి అనుమతి వస్తే, భీమవరం పరిసర ప్రాంతాల నుండి ఎటువంటి ట్రాఫిక్ సమస్య ఎదురుకాకుండా భీమవరం చేరేందుకు అవకాశం ఉంటుందన్నారు. అలాగే పట్టణంలో ప్రధాన రోడ్ల వెంబడి కొన్ని ప్రాంతాలు ఖాళీగా ఉన్నందున, వాటిని షాపింగ్ మాల్స్‌కాని, పార్కింగ్ స్థలాలుగా గాని ఉపయోగిస్తే బాగుంటుందని భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు, కమిషనర్ మూర్తికి సూచించారు. కాగా మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఎఎస్ రాజు కూడా ఎంపి వద్ద పలు సూచనలను చేశారు.
ఈదురుగాలులతో అరటి, మొక్కజొన్నలకు తీరని నష్టం
పెదవేగి, మే 13 : అకస్మాత్తుగా ఆదివారం రాత్రి సంభవించిన పెను తుఫాను భీభత్సానికి మండలంలోని అరటి, మొక్కజొన్న, వరిపంటలు నష్టపోయాయి. మండలంలోని బాపిరాజుగూడెం, వేగివాడ, మత్తివరం, కన్నాపురం, చక్రాయగూడెం గ్రామాల్లో పెనుతుపాను ఈదురుగాలులతో భీభత్సం సృష్టించింది. ఇందుకు కారణంగా అరటి తోటలు, మొక్కజొన్న పంటలు నేలకొరగగా, కళ్లాల్లో వున్న ధాన్యం, మొక్కజొన్న కండెలు తడచిపోయాయి. రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో వున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారిణి డి రాధిక మాట్లాడుతూ సోమ, మంగళవారాల్లో మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేస్తామన్నారు.

*కావూరికి బెర్త్‌పై ఆశలు*ఒక్క్ఛాన్స్ అంటున్న ఆయన వర్గం
english title: 
one chance

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles