శ్రీకాకుళం, మే 13: జిల్లాలోని బంగారం షాపులపై జిల్లా తూనికలు, కొలతలు శాఖాధికారులు సోమవారం ఆకస్మిక దాడి చేసారు. సుమారు 35 షాపులను తనిఖీ చేసిన అధికారులు ఎనిమిదింటిపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా తూనికలు కొలతల శాఖాధికారి కె.రవికుమార్ ధృవీకరించారు. ఇదిలా ఉంటే సోమవారం అక్షయ తృతీయ సందర్భంగా ఎంతోకొంత వ్యాపారం చేసి లా భాలు గడిద్దామనుకున్న వ్యాపారుల ఆశలకు నీళ్లు చిమ్ముతూ అధికారులు దాడులు నిర్వహించడం బంగారం వ్యాపార వర్గాల్లో ఆందోళన చోటుచేసుకుంది. గత కొంత కాలంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్ట డం, వ్యాపారం తిరోగమన దిశగా పయనిస్తుండగా వ్యాపార వర్గాలు కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులకు కొలతలు, నాణ్యతల్లో మోసంచేస్తున్నాయన్న ఫిర్యాదులు లేకపోలేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న అధికారులు దాడులు నిర్వహించడం, కేసులు నమోదు చేయడం ముదావహమే అయినా, అక్షయ తృతీయ సందర్భంగా దాడులు నిర్వహించడమే పలు అనుమానాలకు తావిస్తుంది. బంగారం వర్తకంలో పట్టణంలో కొంతమేర నాణ్యత, కొలతల్లో పర్వాలేకపోయినప్పటికీ, మండల కేంద్రాల్లో, పల్లెల్లో వినియోగదారులు మోసపోతున్న సందర్భాలపై ఫిర్యాదులు అనేకం. ఈ విషయం తూనికలు, కొలతలు శాఖ అధికారులకు తెలిసినా, సిబ్బంది లేమిని సాకుగా చూపిస్తూ కార్యాలయంలో మచ్చుకైనా కానరాని అధికారులు, నేడు ఏకపర్యాయం 35 షాపులపై దాడులు చేసి తనిఖీలు నిర్వహించడం విశేషం. ఇందులో కారణాలేమైనప్పటికీ దాడులతో వర్తకుల మదిలో ఆందోళన చోటుచేసుకుంది. కేసులు నమోదు చేసిన ఎనిమిది షాపులు 1యంజి ఆక్యురసీ కాటాలు వాడలన్న నిబంధనను ఉల్లంఘించారని, వినియోగదారులకు ఇచ్చే బిల్లులో బంగారం రేటుతో పాటు నాణ్యత పేర్కొనడం లేదని అభియోగం. అయితే ఈ నిబంధనలు ఎంతమంది షాపు యజమానులు పాటిస్తున్నారన్నది అధికారులకే ఎరుక. బంగారం షాపులో ప్రభుత్వపరంగా ఉన్న రసీదు ఇచ్చిన దాఖలా ఏషాపులోనూ లేదు అన్న విషయం అధికారులకు ఈనాటికి గుర్తుకువచ్చినట్లుంది. అదీ అక్షయ తృతీయను పురస్కరించుకొని ప్రభుత్వ నియమనిబంధనలు గుర్తుకురావడం పలు విమర్శలకు తావిస్తుంది. కేసులు నమోదు చేసిన ఎనిమిది షాపుల వివరాలు కోరగా, అవి తాము చెప్పకూడదన్నది ఉన్నతాధికారుల సూచనగా తూనికలు, కొలతలు శాఖ అధికారులు పేర్కొనడం ఇందులో గూడార్ధం ఆదేవుడికే ఎరుక.
ప్రభుత్వ నిబంధనలు పాటించనివారిపై కేసులు నమోదుచేశాం-రవికుమార్
బంగారం వర్తకంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకుండా పాతకాటాలనే వాడుతున్నారని, బిల్లులో వివరాలు రాయాల్సి ఉన్నప్పటికీ అటువంటివి పాటించడం లేదని 35 షాపులపై దాడులు నిర్వహించి, ఎనిమిది షాపులపై కేసులు నమోదు చేశామని జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి కె.రవికుమార్ ఆంధ్రభూమికి తెలిపారు. కేసులు నమోదు చేసిన షాపుల పేర్లు వెల్లడించకూడదన్నది ఉన్నతాధికారుల నిర్ణయంగా పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
పొందూరు, మే 13: ఇక్కడకు సమీపంలోని వాండ్రంగి రైల్వేగేటు దగ్గరలో పొందూరు-రాజాం రహదారిపై సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి చికిత్సకై తరలించారు. వివరాల్లోకి వెళితే, మండల కేంద్రంలో ఆదివారం జరిగిన పెళ్లికి గుంటూరుకు చెందిన దండా శివ, తూటి వెంకటరమణలు తమ కుటుంబాలతో వచ్చారు. సోమవారం ఆనందపురంలోని సాయిమందిరాన్ని చూసేందుకు వారి పిల్లలు దండా సాయి, తూటి గౌరీశంకర్‌తోపాటు విశాఖకు చెందిన మాడుగుల సతీష్‌కుమార్‌లు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. రైల్వేగేటుకు దగ్గరలో పాలునిల్వ కేంద్రం వద్ద బస్సును ఓవర్‌టాక్ చేస్తుండగా ఎదురుగావస్తున్న లారీ ఢీకొట్టి వారిపై నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో దండా సాయి(12), తూటి గౌరీశంకర్(19)లు అక్కడికక్కడే మృతిచెందగా తీవ్రగాయపడ్డ సతీష్‌కుమార్‌ను అంబులెన్స్ ద్వారా శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకుని నిర్జీవంగా పడివున్న సాయి, గౌరీశంకర్‌లను చూసిన వారి రోధన ప్రతీ ఒక్కరినీ కలచివేసింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకులను పోగొట్టుకున్న వారి తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. ప్రమాద విషయాన్ని పొందూరు పోలీసుల ద్వారా తెలుసుకున్న సిగడాం పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి శవపంచనామా అనంతరం మృతదేహాలను పోస్టుమార్టంకై రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సబ్-ఇన్‌స్పెక్టర్ల కొరత!
శ్రీకాకుళం, మే 13: జిల్లాలో ఖాళీగా ఉన్న పోలీసు స్టేషన్లలో సబ్-ఇన్‌స్పెక్టర్ల నియామకం జరగకపోవడంతో శాంతిభద్రతల పరిరక్షణ కత్తిమీద సాముగా మారింది. ఇప్పటికే జిల్లాలో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిన నేపధ్యంలో ఎస్సై పోస్టులు ఖాళీగా ఉండడంతో ప్రజల గోడు పట్టించుకునే నాధుడే ఆయా పోలీసు స్టేషన్లలో కరువవుతున్నారు. దిగువస్థాయి సిబ్బంది ఉన్నా ఫిర్యాదుదారులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేని దుస్థితి నెలకొంది. దీంతో ఫిర్యాదుదారులు పోలీసు స్టేషన్ చుట్టూ ప్రదక్షణలు చేయాల్సి వస్తుంది. గతంలో ఎన్నడూలేని విధంగా జిల్లాలో సబ్-ఇన్‌స్పెక్టర్ల పోస్టులు నెలలు తరబడి భర్తీ చేయకుండా వదిలేసారు. జిల్లాలో పోలీసు స్టేషన్ల అప్‌గ్రేడ్ చేసిన తర్వాత ఎస్సై పోస్టుల సంఖ్య పెరిగినప్పటికీ, వాటికి తగ్గట్టుగా నియామకాలు మాత్రం జరగలేదు. ఫలితంగా శాంతిభద్రతలు పరిరక్షణతోపాటు, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్దీకరణలో సమస్యలు ఎదురవుతునే ఉన్నాయి. ఈ నేపధ్యంలో ప్రజలకు పోలీసు సేవలు పూర్తిస్థాయిలో అందని పరిస్థితి దాపరించింది. జిల్లాలో 11 పోలీసు ఠాణాలకు అర్జంట్‌గా సబ్-ఇన్‌స్పెక్టర్లను నియమించాల్సి ఉంది. అయితే నెలలు గడుస్తున్నా పోస్టింగ్‌లు మాత్రం భర్తీ కావడం లేదు. ఇటీవల తొమ్మిది మంది ఎ.ఎస్సైలకు ఎస్సైలుగా పదోన్నతి లభించినప్పటికీ, వారికి పోస్టింగ్‌లు ఇవ్వలేదు. గతంలో ఆ స్టేషన్లలో పనిచేసిన ఎస్సైలకు సి.ఐ.లుగా పదోన్నతులు వచ్చి బదిలీలపై వెళ్లగా, నేటి వరకూ వారి స్థానాల్లో కొత్తవారిని నియమించలేదు. దీంతో ఆయా పోలీసు స్టేషన్ల పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. ప్రజల గోడు తీర్చాల్సిన స్టేషన్ హౌస్ ఆఫీసర్లు లేకపోవడంతో దిగవస్థాయి సిబ్బంది ఆడింది ఆటగా, పాడిందే పాటగా సాగుతుంది. ఈ నేపధ్యంలో ఎస్సై పోస్టుల భర్తీగా త్వరితగతిన జరగాల్సి ఉన్నా, రాజకీయ జోక్యంతో నిలిచిపోతున్నాయి. బదిలీల ఉత్తర్వులపై విశాఖ రేంజ్ డి.ఐ.జి. స్వాత్రిలక్రా కసరత్తు చేస్తున్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్లు పెరగడంతో ఆ ఉత్తర్వులు విడుదల కాలేదు. ఇచ్చాపురం నుంచి జె.ఆర్.పురం వరకూ 11 పోలీసు స్టేషన్ హౌస్‌లకు అధికారులు కావల్సివుంది. ఇచ్చాపురం టౌన్, కంచిలి, పలాస, టెక్కలి, కోటబొమ్మాళి, శ్రీకాకుళం ఒన్ టౌన్, రాజాం, హిరమండలం, సరుబుజ్జిలి, జె.ఆర్.పురం పోలీసు ఠాణాలకు సబ్-ఇన్‌స్పెక్టర్లు లేరు. డైరక్టు రిక్రూట్‌మెంటు ఎస్సైలకు పెద్ద స్టేషన్లు, రాంకర్లకు చిన్న స్టేషన్లు, సామర్థ్యం కలిగిన స్టేషన్ హౌస్ అధికారులకు పాలనాపరమైన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని క్రైం ఎక్కువ కలిగిన స్టేషన్లను అప్పగించాల్సిన అధికారం ‘దొర’దే! కాని - పవర్ సెంటర్లు సానుభూతిపరులు, సామాజిక అస్త్రాలు బేరేజీవేసి ఒత్తిళ్లు పెంచడం వల్ల పోస్టింగ్‌ల కథ కంచికి చేరుకుంది. ఇటువంటి ప్రత్యేక పరిస్థితులు పోలీసుశాఖపై పడడం జిల్లాలో తొలిసారి. అక్కడక్కడ బదిలీల కోసం రాజకీయ నేతలు సిఫార్సులు చేయడం పరిపాటైనప్పటికీ, వారి సామర్థ్యం బట్టి స్టేషన్ హౌస్‌లు కేటాయింపులు చేయడం పోలీసుబాసులకు అలవాటే. నేడు ఆ పరిస్థితులు కన్పించడం లేదు. పీసీసీ చీఫ్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, చివరికి ఎమ్మెల్యేలు సైతం పోలీసుశాఖపై పెత్తనం చేస్తుండడంతో ఖాళీలతో గల ఠాణాలకు పోస్టింగ్‌లు నిలిచిపోయాయన్నది నగ్న సత్యం. ముక్కుసూటిగా వ్యవహారించే విశాఖ రేంజ్ డి.ఐ.జి. స్వాత్రిలక్రా గతంలో జిల్లాతో సంబంధం కలిగిన విజిలెన్స్ ఎస్పీగా ఉన్న అనుభవంతో పొలిటికల్ ఒత్తిళ్లను పక్కనపెట్టి సమర్థులకే పోస్టింగులు ఇవ్వాలన్న సంకల్పంతోనే ఆమె ఉత్తర్వులు నిలిపివేసినట్లు తెలుస్తోంది.
రెండు నెలలుగా ఖాళీగా ఉన్న రాజాం స్టేషన్‌కు అక్కడ మంత్రి తాను సూచించిన అధికారికి చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్‌ను నియమించాలని పోలీసుశాఖపై ఒత్తిడిపెంచినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇక జె.ఆర్.పురం విషయానికి వస్తే ఒకవైపు పీసీసీ చీఫ్ మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే సిఫార్సులు ఉన్నతాధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పలాస - టెక్కలి నాదంటే నాదని కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే వాదులాడుకోవడమే వారు చెప్పిన అధికారులను నియమించలేని పరిస్థితి ఏర్పడింది. కేంద్ర మంత్రి మాట ఆది నుంచి జిల్లా పోలీసుబాస్ కొట్టిపారేస్తుండడంతో ఆమె కూడా నేరుగా హైదరాబాద్ పోలీసుబాసులతో సిఫార్సులు చేయిస్తూ శ్రీకాకుళం జిల్లా పోలీసుబాసును ఇరకాటంలో పెడుతున్న పరిస్థితులు తెలిసినవే. ఈ నేపధ్యంలో పలాస ఎమ్మెల్యే సిఫార్సులు సైతం పక్కనపెట్టడం గమనార్హం. హిరమండలం ఠాణా పోస్టింగ్‌పై మరో మంత్రి ఆశీస్సులు కలిగిన సబ్-ఇన్‌స్పెక్టర్‌ను నియమించాలన్న ఫోర్సు పనిచేయడం లేదు. సరుబుజ్జిలి ఠాణా వరకూ వస్తే ఆమదాలవలస ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య ఆధిపత్యంతో నిలిచిపోయింది. శ్రీకాకుళం ఒన్ టౌన్ సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టింగ్ ఇస్తామన్నా ఎవరూ ముందుకు రావడం లేదు. దీనికి కేవలం ఇటీవల జిల్లాను కుదిపేసిన ‘రౌడీమూకలు’ కారణం. ఈ తరహా ఒత్తిళ్ల కారణాలతో ఎస్సై భర్తీలు తీవ్ర జాప్యం నెలకొంది.
ఖాళీలు త్వరలో భర్తీ చేస్తాం : ఎస్పీ గోపాలరావు
జిల్లాలో ఏర్పడిన పోలీసు స్టేషన్ హౌస్ అధికారుల ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె.వి.వి.గోపాలరావు చెప్పారు. ఇప్పటికే జిల్లాలో పోలీసు ఠాణాల ఖాళీల పరిస్థితులన్నీ విశాఖ రేంజ్ డి.ఐ.జి.కి నివేదించామని, దానిపై పోలీసు ఉన్నతాధికారులు అధ్యయనం చేస్తున్నట్లు ‘ఆంధ్రభూమి’కి చెప్పారు. మరికొద్ది రోజుల్లో ఎస్సై పోస్టులు భర్తీ అవుతాయని స్పష్టం చేసారు.
రూ. 60కోట్లతో
సమగ్ర నీటి పథకాలు
ఎల్ ఎన్ పేట, మే 13: పాతపట్నం నియోజక వర్గంలో 60కోట్ల రూపాయలతో సమగ్ర మంచినీటి పథకాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి శతృచర్ల విజయరామరాజు తెలిపారు. సోమవారం మండలంలోని సుమంతాపురం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే ఎబి రహదారి నుండి చింతలబడవంజి, డొంకల బడవంజి గ్రామాల మీదుగా కొత్తకోట గిరిజన గ్రామానికి నిర్మించనున్న బిటి రహదారికి శంకుస్థాపన చేశారు. అనంతరం సుమంతాపురం, చింతలబడవంజి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నియోజక వర్గంలోని గ్రామాలన్నింటికి మంచినీటి సౌకర్యం కల్పించేలక్ష్యంగా కృషిచేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో 60 కోట్ల రూపాయలతో మంచినీటి పథకాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీటిలో కొన్ని పథకాలు నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. మరికొన్ని పథకాలకు టెండర్లు పిలుస్తున్నట్లు తెలిపారు. మండలంలోని గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించేందుకు 13కోట్ల రూపాయలతో మెగా మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఎల్‌ఎన్ పేట కేంద్రంగా రక్షిత మంచినీటి పథకం ఏర్పాటు చేసి మండలంలోని గ్రామాలకు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. అలాగే 20 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని రహదారులను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అలాగే ఎబి రహదారి నుండి బసవరాజు పేట గ్రామం మీదుగా ఎల్‌ఎన్ పేట రోడ్డుకు 50లక్షల రూపాయలతో రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. దబ్బపాడు వద్ద వంతెన నిర్మాణానికి 50లక్షల నిధులు మంజూరయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మారుమూల గ్రామాలకు సైతం అభివృద్ధి జరుగుతుందన్నారు. పేదలకు నిత్యావసర సరకులు అందించేందుకు అమృత హస్తం వంటి పథకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే పలు సంక్షేమ పథకాల అమలుతో పేదలను ఆదుకుంటుందన్నారు. ఆయనతో పాటు మాజీ జెడ్‌పిటిసి శివ్వాల తేజేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు పి.ప్రసాదరావు, అనె్నపు లోహిత, అటకేశ్వరరావు, సాంబశివరావు, ఈగల చిన్నారావు, చిరంజీవులు, ఎంపిడిఒ ఎం.రవీంద్రబాబు, ఇఒ పిఆర్‌డి అప్పారావు పలుశాఖల అధికారులు, కాంగ్రెస్ అభిమానులు పాల్గొన్నారు.
అంబేద్కర్ వర్సిటీ వీసీగా లజపతిరాయ్
ఎచ్చెర్ల, మే 13: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్శిటీ ఉపకులపతిగా హనుమంతు లజపతిరాయ్‌ను నియమిస్తూ గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు సోమవారం జారీ చేశారు. వీసీ నియామకంలో జాప్యం నెలకొనడంతో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ఉపకులపతి నియామకానికి సంబంధించి ఏప్రిల్ 26వ తేదీన సెర్చ్‌కమిటీ సమావేశమై తుదిజాబితాను రాజ్‌భవన్‌కు అందించిన విషయం తెలిసిందే. షార్ట్‌లిస్ట్‌లో బిసి, ఒసి, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఆచార్యుల పేర్లు ఉన్నట్టు ఆశక్తికరమైన చర్చ సాగింది. అయితే ఇదే జిల్లాకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(అనంతపురం)లో పనిచేస్తున్న కామర్స్‌ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్‌ను నియమించడంతో ఇన్‌చార్జి పాలనకు తెరపడినట్లు అయింది. 2011, జూలై 27 నుంచి రెగ్యులర్ వీసీ లేక ఇన్‌చార్జి పాలనే సాగింది. నూతనంగా వీసీగా నియమించబడ్డ లజపతిరాయ్‌ది టెక్కలిమండలం తలగాం గ్రామం. గత 30 ఏళ్ళుగా అధ్యాపకులుగా అనుభవం ఉన్న లజపతిరాయ్ విద్యాభ్యాసం టెక్కలిలోనే సాగింది. తండ్రి కృష్ణారావు జిల్లా జడ్జిగా సేవలందించి పదవీ విరమణ పొందారు. తల్లి సుశీలమ్మ. జిల్లాకు చెందిన లజపతిరాయ్‌కు ఉపకులపతి కుర్చీ అప్పగించడం పట్ల హర్షాతిరేఖాలు వ్యక్తమవుతున్నాయి.
అక్షయతృతీయతో కిటకిటలాడిన
బంగారం దుకాణాలు
పాతశ్రీకాకుళం, మే 13: వైశాఖ మాసం అక్షయతృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఐశ్వర్యసిద్ధికి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ఆనవాయితీగా వస్తున్న హైందవ సాంప్రదాయం. ఈ సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలో వెండి, బంగారం దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ఇలాంటి రోజుల్లో పిసరంతె్తైనా బంగారం కొనుగోలు చేయడం ద్వారా ఇంటిలో బంగారు నిల్వలు, ధనధాన్యాలు పెరుగుతాయన్న నమ్మకం బలంగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అయితే ప్రకటనల ద్వారా ప్రజల్లో ఈ ఆచారం అమల్లోకి రావడమే తప్ప ఏ పురాణాల్లో లేదన్నది జ్యోతిష్య, పండితుల వాదన. మరోవైపు బంగారం ప్రియులను ఆకర్షించడానికి దుకాణదారులు విద్యుత్‌కాంతులతో ప్రత్యేక అలంకరణ చేశారు. 50 బంగారు, వెండి దుకాణాలున్న పట్టణంలో వ్యాపారులతో ఆంధ్రభూమి తాజా పరిస్థితులపై ప్రశ్నించగా గత కొద్దికాలంగా ధర తగ్గినప్పటికీ ఆశించినంతగా వ్యాపారాలు సాగలేదని, అక్షయ తృతీయ కారణంగా సోమవారం గణనీయంగా వ్యాపార లావాదేవీలు సాగాయని స్పష్టంచేశారు. స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం ధర 28,100 రూపాయలు కాగా, ఆభరణాలతో కూడిన బంగారం ధర 26 వేల రూపాయలు(పది గ్రాములు)గా విక్రయించారు.
‘టిడిపి హయాంలోనే అవినీతి రహిత పాలన’
శ్రీకాకుళం , మే 13: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అవినీతి రహిత పాలన అందించడం ద్వారానే తాము సుధీర్ఘకాలం శాసనసభ్యులుగా, లోక్‌సభ సభ్యులుగా పనిచేశామని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం ఆయన పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 1983-84లో కేవలం రెండువేల కోట్ల రూపాయలు బడ్జెట్ కాగా అప్పట్లో పేదప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించామన్నారు. అదేపద్దతిలో చంద్రబాబునాయుడు హయాంలో కూడా కేవలం 26వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపగా నేడు కాంగ్రెస్ పార్టీ లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌తో బ్రిటీష్ పాలనను తలపిస్తున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములు పరిరక్షించగా, గత తొమ్మిది సంవత్సరాల కాలంలో సెంటు భూమిని మిగల్చకుండా అవినీతి పాలనను కాంగ్రెస్ అందించిందని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వాధినేతలు మద్యం అమ్మకంద్వారానే తమ ప్రభుత్వ హయాంలో ఉన్న బడ్జెట్‌కు సమానమైన ఆదాయాన్ని కూడగట్టుకుంటున్నారని ఆరోపించారు. తమ పోరాటంతో బెల్టుషాపులు ఎత్తేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పేర్కొనడం వట్టి భూటకమని కొట్టిపారేశారు. గతంలో మద్యం సిండికేట్‌లపై ఎసిబితో వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనమన్నారు. సమావేశంలో చిట్టి నాగభూషణం, గొర్లె కృష్ణారావు, కోరాడ బాబు, ఐ.తిరుమల రావు తదితరులు పాల్గొన్నారు.
‘రహదారుల నిర్మాణంలో నాణ్యత లోపిస్తే చర్యలు’
శ్రీకాకుళం, మే 13: పట్టణంలో నిర్మిస్తున్న సిమెంటు రహదారులు నాణ్యంగా ఉండాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు అధికారులను ఆదేశించారు. పట్టణంలో రహదారుల విస్తీర్ణం, కాలువల నిర్మాణం సుందరీకరణపై సంబంధిత అధికారులతో సోమవారం సాయంత్రం మంత్రి క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. కొన్ని ప్రాంతాల్లో సిసి రహదారుల్లో నాణ్యత లోపిస్తున్నట్లు కనిపిస్తున్నాయని, అటువంటి వాటిని గుర్తించి కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారు. నాణ్యతలోపం వలన ప్రభుత్వానికి, అధికారులకు చెడ్డపేరు వస్తుందని చెప్పారు. ఇటువంటి నిర్మాణాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు చేపడతామన్నారు. పట్టణంలో నిర్మించాల్సిన 310 మీటర్ల కాలువలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిని త్వరితగతిన నిర్మించాలని ఆదేశించారు. జి.టి.రోడ్డు, ఇతర రహదారుల నిర్మాణానికి ఆటంకంగా ట్రాన్స్‌కో ఎడిఇ విష్ణుమూర్తి తెలిపారు. తారు రహదారి చేయాల్సిన పేచ్‌లను వర్షాకాలానికి ముందుగానే పూర్తిచేయాలని ఆదేశించారు. డివైడర్లుగా ప్లెక్సిబుల్ దిమ్మలను వేయాలన్నారు. పాతబ్రిడ్జి స్థానే కొత్త బ్రిడ్జి నిర్మాణానికి పనులు ఎప్పటినుండి మొదలు పెట్టేది త్వరితగతిన నిర్ణయించాలని ఆదేశించారు. చినబజారు రహదారి విస్తరణలో ఇళ్లకు నష్టం జరుగకుండా సరైన యంత్రసామాగ్రి ఏర్పాటు చేసి సక్రమంగా చేపట్టాలన్నారు. పట్టణంలో రెండువేల కుళాయిలను వచ్చే రెండు నెలల్లో లబ్ధిదారులకు అందించాలని మంత్రి పురపాలక కమిషనర్‌ను ఆదేశించారు. పేదలకు ఉచితంగా కనెక్షన్ ఇచ్చుటకు ఆదేశాలు జారీ చేసిందని, అందులో భాగంగా వాటిని పేదల ఇళ్లకు వేయాలన్నారు. నెలవారీ రుసుమును వారు చెల్లించాలన్నారు. పెద్దపాడుకు 24 గంటల విద్యుత్ సరఫరాను అందించుటకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నాగావళి నదిలో ప్రమాదకరంగా ఉన్న ఊబిని కప్పివేయుటకు అవకాశాలు పరిశీలించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 28 వరకు చనిపోయినట్లు దృష్టికి వచ్చిందన్నారు.
ఈ సమావేశంలో రహదారులు, భవనాల శాఖ పర్యవేక్షక ఇంజనీరు సి.హెచ్.వి.సోమశేఖర్, ట్రాన్స్‌కో డి.ఇ జనార్ధనరావు, వుడా కార్యనిర్వాహక ఇంజనీరు విశ్వనాధవర్మ, బిఎస్‌ఎన్‌ఎల్ ఎస్‌డిఇ ఎస్.లక్ష్మణరావు, వెంకట్రావు, పురపాలక సంఘ కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, పురపాలక ఇంజనీర్ రామ్మోహన్‌రావు, ఆరోగ్య అధికారి తదితరులు పాల్గొన్నారు.
తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి
నరసన్నపేట, మే 13: మండలంలో రెవెన్యూగ్రామాల్లో విఆర్వోలు, గ్రామ సహాయకులు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ ఎం.వి.రమణ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ నిర్వహించిన సెట్‌కాన్ఫరెన్సులో మహాసేన్ తుఫాన్ ప్రభావంపై అధికారులు అప్రమత్తం అవ్వాలని సూచించారని చెప్పారు. ఆయా పంచాయతీ అధికారులు గ్రా మాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎంపిడిఒ అలివేలుమంగమ్మ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు తమ విధులు నిర్వహించేందుకు ఆయా గ్రామాల్లో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. పూరిళ్లు, మట్టిగోడలతో ఉన్న నివాసాలపై దృష్టిసారించి ఆయా కుటుంబాల వారిని అప్రమత్తం చేయాలని సూచించారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో జరిగిన సెట్‌కాన్ఫరెన్సులో వీరితోపాటు ఆర్.ఐ శ్రీ్ధర్, ఎ.పి.ఒ సత్యమూర్తి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎ.ఇ నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు.
సహకార సంఘాల ద్వారా రాయితీపై విత్తనాలు
శ్రీకాకుళం(రూరల్), మే 13: జిల్లాలో అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రాయితీపై విత్తనాలను సరఫరా చేయనున్నట్లు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముఖ్యకార్యనిర్వహణాధికారి జనార్ధనరావు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. పచ్చిరొట్ట, వరివిత్తనాలను జిల్లాలో 49 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు సరఫరా చేయబడునన్నారు. రైతుసోదరులు, సంఘ సభ్యులు సంబంధిత మండల వ్యవసాయాధికారి నుండి పర్మిట్ పొంది పిఎసిఎస్‌ల ద్వారా ప్రభుత్వం కల్పించిన విత్తనాలను పొందాల్సిందిగా డిసిసిబి బ్యాంకు అధ్యక్షుడు జగన్ తెలిపారు.
వైభవంగా చందనోత్సవం
సారవకోట, మే 13: మండలంలో సారవకోట, గొర్రెబంద గ్రామాల మధ్య ఉన్న వెంకటపాతృనికోనేరు గట్టుపై వేంచేసియున్న లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం చందనోత్సవం ఘనంగా నిర్వహించారు. సింహాచలం దేవస్థానం ఆలయంలో కొనసాగిస్తున్న సాంప్రదాయం ప్రకారం తొలుత చందనాన్ని తొలగించి అనంతరం భక్తుల దర్శనార్ధం కొంత సమయం కేటాయించారు. ఆ తదుపరి కొత్తగా సిద్ధం చేసిన చందనాన్ని విగ్రహానికి అలంకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు దంపతులు ప్రత్యేకంగా చందనంతో పూజలు చేసారు. ఈ దృశ్యం చూసేందుకు సారవకోట, గొర్రెబంద గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
పురుగుమందు తాగి వృద్ధుడు మృతి
పొందూరు, మే 13: మండలంలో బురిడికంచరాం గ్రామానికి చెందిన టి.బోడయ్య(60) పురుగుమందు తాగి శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం వేకువఝామున మృతిచెందాడు. స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతుడు ఆదివారం సాయంత్రం పురుగుమందు తాగాడని, వెంటనే 108 వాహనం ద్వారా రిమ్స్‌లో చేర్చినట్లు హెచ్.సి. బైరాగి తెలిపారు.
పెరిగిన జనాభా 3,458
సారవకోట, మే 13: మండలంలో పదేళ్లలో 3,458 మంది జనాభా పెరుగుదల నమోదైంది. 2001 జనాభా లెక్కల ప్రకారం 48,793 మంది ఉండగా ప్రస్తుతం 2011 జనాభా లెక్కలప్రకారం 52,243 మంది ఉన్నారు. పురుషులు 25,871 కాగా, మహిళలు 26,372 మంది ఉన్నారు. అలాగే షెడ్యూల్ కులాలకు చెందిన వారు 5,872 మంది, గిరిజనులు 6,757 మంది ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు.
మామిడిరైతుల గగ్గోలు
రణస్థలం, మే 13: అడపాదడపా కాసిన మామిడికాయలు పెనుగాలులకు నేలపాలు కావడంతో రైతులు గగ్గోలుపెడుతున్నారు. సోమవారం మీసాల రమేష్, తవిటినాయుడు, రామారావులు విలేఖరులతో మాట్లాడుతూ ఈ ఏడాది ఏ విధమైన మామిడి, జీడిపూత లేక మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిందన్నారు. అయితే అక్కడక్కడున్న కాయలు ఆదివారం సాయంత్రం వీచిన గాలులకు మట్టిపాలయ్యాయన్నారు.
అప్పుచేసి అష్టకష్టాల పడి సాగుచేసిన పంట రాలిపోవడంతో తాము నష్టాలఊబిలో కూరుకుపోయామని, తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే అరటితోటలు కూడా పెనుగాలులకు ధ్వంసమయ్యాయని ఆందోళన చెందుతున్నారు.
ఉపాధి పనులు నిలుపుదల చేసిన స్థానికులు
శ్రీకాకుళం, మే 13: మండలలో పెద్దపాడు పంచాయతీలో నందివాడ చెరువులో ఉపాధి పనులను చేపడుతున్నారు. సుమారు ఏడు గ్రూపులకు చెందిన సభ్యులకు పని కల్పించాలని, లేదంటే పూర్తిగా పనులు నిలుపుదల చేయాలంటూ సోమవారం ఉపాధి పనులను అడ్డుకున్నారు. గ్రామ మాజీ సర్పంచు కలగ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పనులను అడ్డుకున్నారు. నందివాడ చెరువులో చేపడుతున్న పనుల్లో తమకు కూడా అవకాశం కల్పించాలంటూ అధికారులకు విన్నవించారు. గ్రామంలో ఉన్న కూలీలందరికీ పని కల్పించాలని, లేకుంటే పని నిలుపుదల చేయాలని సూచించారు. అనంతరం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావును కలసి సమస్యను వివరించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ అందరికీ పని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
శివునికి రుద్రాభిషేక పూజలు
శ్రీకాకుళం, మే 13: వైశాఖ మాసం మొదటి సోమవారం పర్వదినం పురస్కరించుకుని పట్టణంలో పలు శైవక్షేత్రాల్లో రుద్రాభిషేక పూజలు జరిగాయి. స్థానిక ఉమారుద్రనగర కోటేశ్వరాలయంలో ఆలయ ప్రధానార్చకులు ఆరవెల్లి శ్రీరామ్మూర్తిశర్మ ఆధ్వర్యంలో భక్తులు రుద్రాభిషేకాలు, అర్చనలు జరిపించారు. భక్తులపాలిట బోలాశంకరునిగా పూజలందుకున్న పరమశివున్ని సేవించడం ద్వారా సమస్యలు, ఇతిబాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా పట్టణంలో మండలేశ్వరస్వామి, జఠిలేశ్వరస్వామి, రామలింగేశ్వరస్వామి, భీమేశ్వరస్వామి తదితర ఆలయాల్లో భక్తులు బారులు తీరారు.