విశాఖపట్నం, మే 13: చంద్రనయాత్ర.. ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు. దేశం నలుమూలల వారికి ఈ యాత్రలో పాల్గొనాలనే తపన. సింహాచలేశుని నిజ రూపాన్ని కన్నులార దర్శించి తరించాలన్న కోరిక. వందలు కాదు.. వేలు కాదు.. లక్షల్లో తరలి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా, చూసే బాధ్యత సింహాచల దేవస్థానం, జిల్లా యంత్రాంగంపై ఉంది. కానీ గత ఏడాది వరకూ అధికారులు ఈ బాధ్యతలను విస్మరించారు. ప్రజా ప్రతినిధులకు, రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల కోసమే ఈ ఉత్సవం ఏర్పాటు చేశారా? అన్న అనుమానం కలిగే విధంగా వ్యవహరించేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే, చందన యాత్రను అత్యంత అరాచకంగా నిర్వహించేవారు. ఈ ఏడాది కూడా దాదాపూ ఇదే పరిస్థితి ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
జిల్లా మంత్రులు, కలెక్టర్ శేషాద్రి పదే పదే చందనయాత్ర ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహించారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగకుండా తీసుకోవలసిన జాగ్రత్తపై సుదీర్ఘంగా చర్చించారు. క్యూలైన్లలో తొక్కిసలాట లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. క్యూ లైన్ల వెడల్పును కుదించారు. భక్తులకు ఎండ తగలకుండా షామియానాలు వేశారు. మంచినీటిని ఎక్కడికక్కడ అందుబాటులో ఉంచారు. తెల్లవారుజాము 3.30 గంటలకు క్యూ లైన్లలో నిలబడిన భక్డులు ఆరున్నరకు దర్శనం చేసుకుని బయటకు వచ్చేశారు. అంతరాలయంలోకి ప్రవేశించిన తరువాత కూడా భక్తులను బయటకు తోసేయకుండా, నెమ్మదిగా నడిపించారు. అప్పన్న నిజ రూపాన్ని దర్శించుకోడానికి ఇబ్బంది పడే వృద్ధులను లైన్ల మధ్యకు తీసుకువచ్చి కాసేపు అక్కడే ఉంచి, వారు తనివితీరా స్వామిని దర్శించుకునేలా వ్యవహరించారు. అన్నింటికీ మించి ఈ సంవత్సరం ఉత్సవం గంట ముందు ఆరంభమైంది. తెల్లవారు జాము నాలుగు గంటలకే భక్తులకు అప్పన్న దర్శనం లభించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఎక్కడా అలజడి, అశాంతి లేకుండా భక్తులు క్యూ లైన్లలో నెమ్మదిగా, ప్రశాంతగా ముందుకు కదిలారు.
ప్రొటోకాల్‌కే పరిమితమైన ‘రెవెన్యూ’
ఈ సంవత్సరం ఉత్సవ నిర్వహణ బాధ్యత అంతా దేవాదాయ ధర్మాదాయశాఖకే అప్పగించారు. రెవెన్యూ అధికారులకు ప్రొటోకాల్ (అతిథి మర్యాదల) బాధ్యతలను మాత్రమే అప్పగించారు. పోలీసు సిబ్బందిని నామమాత్రంగానే గాలి గోపురం వద్ద ఉంచారు. జిల్లా ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చినా వారిని మర్యాదగా గాలి గోపురం నుంచి తీసుకువెళ్లి, దర్శనం చేయించి తీసుకువచ్చే బాధ్యత రెవెన్యూ అధికారులు చూసుకున్నారు. రెవెన్యూ అధికారుల కుటుంబాలను కూడా అనధికారికంగా దర్శనానికి అనుమితించలేదు. ఉదయం ఆరు గంటల వరకూ మాత్రమే గాలి గోపుర మార్గం నుంచి ప్రొటోకాల్ విఐపిలను అనుమతించారు. ఆ తరువాత గేట్లకు తాళాలు వేశారు. ఎంతమంది విఐపిలు వచ్చినా గేట్ల తాళాలు తెరవడానికి ఆలయ ఇఓ రామచంద్రమోహన్ అంగీకరించలేదు. ముఖ్యంగా ఈ మార్గం గుండా విఐపిలను గుంపులు గుంపులుగా అనుమతించకపోవడం వలన సాధారణ భక్తుల దర్శనానికి ఇబ్బంది కలుగలేదు. అయితే ఎప్పుడూ తమ ఆధిపత్యం కొనసాగి, ఈసంవత్సరం ఉత్సవ మూర్తులుగానే ఉండిపోయిన రెవెన్యూ సిబ్బంది మనసు కాస్త గాయపడిన మాట వాస్తవం.
పరిమిత సంఖ్యలో పోలీసులు
ఇక పోలీస్ సిబ్బంది కూడా విధులను సక్రమంగా నిర్వహించారు. గతంలో మాదిరి వారి కుటుంబాలను, బంధువులను దర్శనానికి పంపించాలన్న ఆలోచనను ఈ ఏడాడి విరమించుకున్నారు. చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే పోలీసులు గాలిగోపురం, అంతరాలయం వద్ద ఉన్నారు. నగర పోలీస్ కమిషనర్ కూడా ఈ విషయంలో పోలీస్ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం వలనే వారు కాస్త వెనక్కు తగ్గారు.
తగ్గిన భక్తులు
ఏటా చందనోత్సవానికి రెండు లక్షలకు పైగా భక్తులు వచ్చేవారు. కానీ ఈ ఏడాది సుమారు లక్ష మంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకున్నారు. ప్రొటోకాల్ విఐపి, విఐపి క్యూ లైన్లలో భక్తులు త్వరితగతిన దర్శనం చేసుకోవాలంటే 200, 500 రూపాయల టిక్కెట్‌లు కొనుగోలు చేసుకోవాలి. వీటిని కూడా పరిమితంగానే ఉంచారు. టిక్కెట్‌లు కొనుగోలు చేయలేని వారు ఉచిత క్యూ లైన్లలో వెళ్లారు. టిక్కెట్ అనగానే చాలా మంది వెనక్కు తగ్గారు. ఎండలకు భయపడి కొందరు, ఏర్పాట్లు ఎలా ఉంటాయోనని సంసయించిన వారు మరికొందరు ఉత్సవానికి రాలేదు. ఈరోజు పెళ్లిళ్ళు కూడా పెద్ద సంఖ్యలో ఉండడం వలన భక్తులు చందనయాత్రకు పెద్దగా హాజరు కాలేకపోయారు.
ప్రతి ఏటా ఇలాగే జరగాలి
సింహాచలం, మే 13: చందనోత్సం ప్రతి ఏటా ఇదే మాదిరిగా జరగాలని భక్తులు ఆకాంక్షించారు. దేవస్థానం చేసిన ఏర్పాట్ల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది అంత ప్రశాంతంగా ఎప్పుడూ స్వామివారి నిజ రూపాన్ని దర్శించుకోలేదని భక్తులు అన్నారు. విఐపిలకు పెద్ద పీట వేయకుండా, సాధారణ భక్తులకు ప్రత్యేకత కల్పించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
బస్టాండ్ వరకూ క్యూ లైన్లు
ఇదిలా ఉండగా 500 రూపాయల క్యూ ఉదయం ఎనిమిది గంటల సమయానికి సింహాచలం కొండపై ఉన్న బస్టాండ్ వరకూ పెరిగింది. ఉదయం 10 గంటల సమయంలో ఎండ తీవ్రత పెరగడంతో భక్తులు కాస్తంత ఇబ్బంది పడ్డారు. అయితే 108 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచడంతోపాటు, వైద్య సౌకర్యాన్ని కూడా అందుబాటులో ఉంచడంతో, సొమ్మసిల్లిన వారిని ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలకు తరలించారు.
గోపాలపట్నం వైపు నుంచి సింహాచలంకు వాహనాలపై వచ్చే వారిని గోశాల వద్దనే నిలిపివేశారు. అక్కడి నుంచి వారు నడిచి బస్టాండ్‌కు వస్తే, ఉచిత బస్సుల్లో వారిని కొండపైకి తీసుకువెళ్లారు. అలాగే కొండపై దర్శనాలు చేసి వచ్చిన వారికి వివిధ సేవా సంస్థలు ఉచితంగా పలహారాన్ని అందించాయి. తెల్లవారు జామున పానకాన్ని కూడా అందచేశాయి.
మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు చాలా చక్కని ప్రణాళికలు తీసుకోవడం వలనే ఉత్సవం ఇంత ప్రశాంతంగా జరిగింది. తీసుకున్న ప్రణాళికను అమలు చేయడంలో ఈఓ కఠినంగా వ్యవహరించడం కూడా ముదావహం. మొత్తంమీద దేవాదాయ శాఖ ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఒంటిగంట వరకూ సాగిన నిజ రూప దర్శనం
* పవిత్రంగా సాగిన సహస్ర ఘటాభిషేకం
సింహాచలం, మే 13: సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం సోమవారం అర్ధరాత్రి ఒంటిగంటకు ముగిసింది. తెల్లవారుజాము నాలుగు గంటలకు ప్రారంభమైన ఈ దర్శనం సుమారు 21 గంటల పాటు కొనసాగింది. సుమారు లక్ష మంది భక్తులు నిజ రూప దర్శనం చేసుకున్నారు. సోమవారం రాత్రి 9.309 గంటలకు సహస్ర ఘటాభిషేకం ఆరంభమైంది. ఈ కార్యక్రమం రాత్రి 11 గంటల వరకూ కొనసాగింది. ఆ తరువాత మూల విరాట్‌పై చందన పూత ప్రారంభమైంది. సోమవారం అర్థరాత్రి దాటే వరకూ సుమారు మూడు మణుగుల (125 కిలోల) చందనాన్ని పూశారు.
చంద్రబాబుతో అయ్యన్న సమావేశం రేపు
* అనకాపల్లి వ్యవహారంపై చర్చ జరిగే అవకాశం
* అర్బన్, రూరల్ జిల్లాలు ఏకమయ్యే ఛాన్స్
విశాఖపట్నం, మే 13: టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు బుదవారం చంద్రబాబు నాయుడిని కలవనున్నారు. మంగళవారం ఆయన ఇక్కడి నుంచి బయల్దేరి వెళుతున్నారు. అనకాపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన దాడి వీరభద్రరావు పార్టీ ఫిరాయించడంతో ఆ నియోజకవర్గంలో ఏర్పాడిన పరిస్థితులను చంద్రబాబుతో చర్చించనున్నారు. వెంటనే ఆ నియోజకవర్గ బాధ్యతలను ఎవరికైనా అప్పగించాల్సిన అవసరం ఉంది. అలాగే జిల్లా పార్టీలో చోటు చేసుకున్న విభేదాలపై కూడా అయ్యన్నతో ముందుగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. కాగా, జిల్లాలో అర్బన్, రూరల్ జిల్లా పార్టీలు ఉండడం మంచిది కాదన్నది అయ్యన్న వాదన. వీటిని ఏకం చేసి, ఒక్కరికే బాధ్యతలు అప్పగించాలని ఆయన చాలా కాలంగా కోరుతున్నారు. ఏక నాయకత్వం కింద పార్టీ నడవడం మంచిదని ఆయన భావిస్తున్నారు. దీనిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.
ఉపాధ్యాయ బదిలీ కౌనె్సలింగ్‌లో గందరగోళం
* ఖాళీలు ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాల పట్టు
* కౌనె్సలింగ్‌లో ప్రతిష్టంభన
* తిరిగి సాయంత్రం మొదలు
విశాఖపట్నం, మే 13: విలీన ప్రాంతాల్లో దీర్ఘకాలంగా తిష్టవేసిన ఉపాధ్యాయులు ట్రిబ్యునల్ ఉత్తర్వుల సాకుచూపి బదిలీలు తప్పించుకుంటున్నారని, అర్హులైన వారికి అన్యాయం జరుగుతోందంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగడంతో సోమవారం నాటి బదిలీల కౌనె్సలింగ్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఉపాధ్యాయుల ఆందోళనల నేపధ్యంలో కౌనె్సలింగ్ ప్రక్రియ ముందుకు సాగలేదు. దీంతో కౌనె్సలింగ్‌ను వాయిదావేశారు. గాజువాక మున్సిపాలిటీ సహా మరో 36 పంచాయతీలను విలీనం చేసి గ్రేటర్ విశాఖగా ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ ఉన్న పాఠశాలలు అటు జివిఎంసిలో విలీనం కాక, ఇటు జిల్లా విద్యాశాఖలో కౌనె్సలింగ్‌లో ప్రాధాన్యత దక్కకపోవడంతో ఉపాధ్యాయులు ఈ అంశాన్ని లేవనెత్తి ఆందోళనకు దిగారు. 2005 నుంచి ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు ట్రిబ్యునల్ ఉత్తర్వుల పేరిట కౌనె్సలింగ్‌కు చిక్కకుండా అక్కడే పనిచేస్తున్నారని, ఈపోస్టులకు కూడా కౌనె్సలింగ్ జరపాలని ఉపాధ్యాయులు పట్టుపట్టారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు ఎటూ పాలుపోని పరిస్థితిలో పడ్డారు. విలీన ప్రాంత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు 2009 నుంచి ట్రిబ్యునల్ ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని అదే స్థానంలో పనిచేస్తున్నారని, ఎన్నిసార్లు కౌనె్సలింగ్ జరిగినా వీరు మాత్రం ఉన్నచోటు నుంచి కదలట్లేదని ఆరోపించారు. తాజాగా విలీన ప్రాంతాల్లో పనిచేస్తున్న 57 మంది ఉపాధ్యాయులు ట్రిబ్యునల్ ఉత్తర్వులతో కౌనె్సలింగ్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీనికి జిల్లావిద్యాశాఖలో కొన్ని వర్గాలు వంతపాడాయి. అయితే ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం చెప్పడంతో వీరి పోస్టులను కూడా ఖాళీల్లో చూపుతూ కౌనె్సలింగ్ చేసేందుకు విద్యాశాఖ అంగీకారం తెలిపింది. దీంతో ఉపాధ్యాయ సంఘాలు తమ ఆందోళన విరమించారు. ఎట్టకేలకు సాయంత్రం 5.30 గంటల తర్వాత బదిలీల కౌనె్సలింగ్ ప్రక్రియను జిల్లా విద్యాశాఖ చేపట్టింది. ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న వారి స్థానాలను జాబితాల్లో చూపడంతో ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయుల్లో హర్షాతిరేకం వ్యక్తమైంది. అలాగే 610 ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గత కొంతకాలంగా బదిలీలకు నోచుకోని ఉపాధ్యాయులు సైతం తాజా కౌనె్సలింగ్‌లో బదిలీకి పరిగణలోకి వచ్చారు. ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న వారికి సైతం 80/20 నిష్పత్తిలో బదిలీలు చేశారు. జిల్లాలో సుమారు 70 మంది వరకూ 610 జిఓ పరిధిలోకి వచ్చే ఉపాధ్యాయులు ఉండగా, వీరిలో అత్యధికులు తాజా కౌనె్సలింగ్‌తో స్థాన చలనానికి గురయ్యారు.
ఆలస్యంగా కౌనె్సలింగ్ .. 500 మందికి మాత్రమే అవకాశం
ఉపాధ్యాయ వర్గాల ఆందోళనలతో కౌనె్సలింగ్ ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది. తొలిరోజు ఉదయం 500 మంది, మధ్యాహ్నం మరో 500 మందికి కౌనె్సలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఉపాధ్యాయ సంఘాల ఆందోళన నేపధ్యంలో ఉదయం కౌనె్సలింగ్ మొత్తం రద్దయింది. ఎట్టకేలకు సాయంత్రం కౌనె్సలింగ్ చేపట్టారు. ఈరోజు 500 మంది వరకూ మాత్రమే కౌనె్సలింగ్ జరుగుతుందని జిల్లావిద్యాశాఖ అధికారి కృష్ణవేణి వెల్లడించారు.
లబ్దిదార్లకు జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఇళ్లు
విశాఖపట్నం, మే 13: మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద నిర్మించిన ఇళ్లను అర్హులైన లబ్దిదార్లకు మంజూరు చేయనున్నట్టు కమిషనర్ ఎంవి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. జోన్ 1 పరదేశిపాలెంలో నిర్మించిన రెండు ఫేజ్‌లతో పాటు జోన్ 5లోని మదీనాబాగ్, మంత్రిపాలెంలో నిర్మించిన గృహసముదాయాల్లో వౌలిక వసతుల కల్పన పూర్తయిందని, వీటిని ఇప్పటికే ఎంపిక చేసిన లబ్దిదార్లకు కేటాయించనున్నట్టు ఆయన తెలిపారు. గృహాలు మంజూరైన లబ్దిదార్లు మంజూరు పత్రాలు, గుర్తింపుకార్డులతో సంబంధిత జోనల్ కమిషనర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. కేటాయించిన గృహాల్లో లబ్దిదార్లు ఈనెల 31లో దిగాలని, లేనిపక్షంలో ఇళ్లను స్వాధీనం చేసుకుని అర్హులైన వారికి కేటాయించనున్నట్టు ఆయన తెలిపారు.
నోటీసులకు స్పందించని డెవలపర్లపై చర్యలు
* వుడా విసి యువరాజ్
విశాఖపట్నం, మే 13: విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) నుంచి అనుమతులు పొంది నిబంధనల ప్రకారం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయని, వుడాకు తనఖాపెట్టి ప్లాట్లను విడిపించుకోని డెవలపర్లకు జారీ చేసిన నోటీసులకు స్పందించని వారిపై చర్యలు తప్పవని విసి ఎన్ యువరాజ్ హెచ్చరించారు. ఈమేరకు ప్రైవేటు లేఅవుట్ డెవరపర్లు, ఎపి రియల్ ఎస్టేట్ డెవలపర్ల అసోసియేషన్ ప్రతినిధులతో వుడా కార్యాలయంలో సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా లేఅవుట్‌లను అభివృద్ధి చేయకుండా, ఇటు అభివృద్ధికి విఘాతం కల్గించడంతో పాటు అటు కొనుగోలు దార్లకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ఇకమీదట నిర్ణీత గడువులోగా లేఅవుట్‌ను అభివృద్ది పరచకున్నా, తనఖా విడిపించుకోకపోయినా వారి ప్లాట్లను స్వాధీనం చేసుకుని వేలం వేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. నాలా పన్ను చెల్లింపు విషయంలో డెవలపర్లు కోర్టుల నుంచి షరతులతో కూడిన మినహాయింపులు తెచ్చుకుంటున్నారని, న్యాయస్థానం తుదితీర్పు వెలువరించనందున నాలా పన్ను మొత్తానికి బ్యాంకు గ్యారంటీలు చూపాలని విసి పేర్కొన్నారు. ఎంతమొత్తాన్నికి బ్యాంకు గ్యారంటీలు చూపాలన్నది త్వరలో తెలియజేయనున్నట్టు ఆయన తెలిపారు. అలాగే లేఅవుట్ నిబంధనల మేరకు ఖాళీ స్థలాలు, పార్కులు, రహదారులు వంటి ఉమ్మడి సౌకర్యాలను స్థానిక సంస్థలకు అప్పగించాల్సి ఉందని ఈ ప్రక్రియను డెవలపర్లు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. లేఅవుట్‌లకు అనుతులు మంజూరు చేసే విషయంలో ఇక మీదట ఖచ్చితమైన సేవలు సకాలంలో అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. క్షేత్ర తనిఖీలను కూడా క్రమబద్దం చేస్తూ నెలలో ఒక నిర్ణీత తేదీని ఖరారు చేస్తామన్నారు. క్షేత్రస్థాయి తనిఖీలకు వుడాతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులను కూడా ఏకకాలంలో రప్పించి తనిఖీలు పూర్తేయ్యేందకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంవో వుడా చీఫ్ అర్బన్ ప్లానర్ ఆర్‌జె విద్యుల్లత, ప్లానింగ్ అధికారులు కెడి బ్రైనార్డ్, ఎల్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
కైలాసగిరిపై పచ్చదనం పెంచేందుకు ప్రణాళికలు
* వుడా విసి యువరాజ్
విశాఖపట్నం, మే 13: పర్యాటకంగా విస్తృత ఖ్యాతినార్జించిన కైలాసగిరిపై పచ్చదనం పెంపొందించేందుకు కార్యాచరణ ప్రణాళికలు చేపట్టనున్నట్టు వుడా విసి ఎన్ ఎన్ యువరాజ్ తెలిపారు. సాగరతీరంలోని ఆహ్లాదకరమైన పరిసరాలతో పాటు విశ్వవ్యాప్తంగా సందర్శకులను ఆకర్షిస్తున్న కైలాసగిరిని హరితమయం చేస్తామని ఆయన పేర్కొన్నారు.
సీకేడెట్ కోర్స్ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కైలాసగిరిపై సోమవారం ఆయన మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ విశాఖ ప్రాజెక్టు లక్ష్యసాధన, అమల్లో వుడా నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోందని అన్నారు. తమ పరిధిలోని పర్యాటక కేంద్రాలు, లేఅవుట్‌లు, పార్కుల్లో విస్తృతంగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న దృష్ట్యా మొక్కలకు నీటి ఎద్దడి తలెత్తదని ఆయన అభిప్రాయపడ్డారు. ఐఎన్‌ఎస్ కళింగ కమాండింగ్ అధికారి కమెడోర్ డికె పాండా మాట్లాడుతూ పచ్చదనం పెంపులో నౌకాదళం, సీకేడెట్లు బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని, వుడా సహకారంతో కైలాసగిరిపై హరితవనాన్ని పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఘాట్‌రోడ్డు నుంచి సర్క్యులర్ రైల్‌ట్రాక్ వెంబడి తెలుగు సాంస్కృతిక నికేతనమ్ కోసం కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్రత్యామ్నాయ రోడ్డు వెంబడి సీకేడట్ కోర్సు 200 మొక్కలను నాటారు. కార్యక్రమంలో సీకేడెట్ కోర్సు విశాఖ యూనిట్ శిక్షణ అధికారి లెఫ్టినెంట్ కమాండర్ డి శ్రీనివాసరెడ్డి, వుడా కార్యదర్శి జిసి కషొర్‌కుమార్, చీఫ్ ఇంజనీర్ ఐ విశ్వనాధరావు, ఇన్‌ఛార్జ్ డిఎఫ్‌ఓ భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు.
టోల్‌గేట్ వద్ద నాలుగు మార్గాలు
కైలాసగిరికి వచ్చేపోయే వాహనాలను నియంత్రించేందుకు టోల్‌గేటు వద్ద రహదారిని నాలుగు మార్గాలుగా విస్తరించాలని విసి యువరాజ్ అధికారులను ఆదేశించారు. కొండపైకి వెళ్లేందుకు మూడు, కిందికి వచ్చే వాహనాల కోసం ఒక రహదారిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా టికెట్లను ఇచ్చేందుకు వీలవుతుందని, ట్రాఫిక్ నియంత్రణ కూడా సాధ్యమవుతుందన్నారు. వాహనాల నుంచి వసూలు చేస్తున్న రుసుం వివరాలను ఆయన అడిగితెలుసుకున్నారు. కైలాసగిరితో పాటు సబ్‌మెరైన్ మ్యూజియం, వుడా పార్కు, కైలాసగిరి హెల్త్ ఎరీనా వద్ద ప్రవేశ రుసుం వసూలు బాధ్యతలను వుడా సిబ్బంది కాకుండా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు కౌంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. దీనిపై బ్యాంకు వుడా శాఖ మేనేజర్ కృష్ణమూర్తితో చర్చింది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు.
జివిఎంసి గ్రీవెన్స్‌కు 102 ఫిర్యాదులు
విశాఖపట్నం, మే 13: గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ గ్రీవెన్స్ విభాగంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం నాటి గ్రీవెన్స్‌సెల్‌కు 102 ఫిర్యాదులు అందాయి. ప్రధానకార్యాలయంలో గ్రీవెన్స్‌కు 41 ఫిర్యాదులు అందగా వీటిలో టౌన్‌ప్లానింగ్ విభాగానికి సంబంధిచి ఏడు, ప్రజారోగ్య విభాగానికి సంబంధించి ఒకటి, యుసిడి విభాగానికి అయిదు, హార్టీకల్చర్ విభాగానికి రెండు, అదనపు కమిషనర్ ఫైనాన్స్‌కు ఒకటి, అదనపు కమిషనర్ (జనరల్)కు 18, ఇతర శాఖలకు సంబంధించి 7 ఫిర్యాదులు అందాయి. అలాగే జోన్ 1 నుంచి అయిదు, జోన్ 3 నుంచి నాలుగు, జోన్ 4 నుంచి నాలుగు, జోన్ 5 నుంచి 38, జోన్ 6 నుంచి 10 ఫిర్యాదులు అందాయి.
మంత్రి దృష్టికి న్యాయవాదుల సమస్యలు
విశాఖపట్నం, మే 13: న్యాయవాదుల సమ్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర జ్యుడీషియల్ లా గ్రాడ్యుయేట్ ఎంప్లారుూస్ అసోసియేషన్ విశాఖ జిల్లా విభాగం ప్రతినిధులు న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డిని ప్రభుత్వ అతిధిగృహంలో సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. అర్హులైన న్యాయ శాఖలో పనిచేస్తున్న అర్హులైన పట్ట్భద్రులను గ్రామన్యాయాధికారి పోస్టుల్లో నియమించాలని కోరారు. అలాగే 48 సంవత్సరాల వయోపరిమితిని రద్దు చేయాలని, జూరియర్ విభాగం సివిల్ జడ్జిల నియామకంలో ఒకటి ఒకటి నిష్పత్తిని పాటించాలని, న్యాయశాఖలో అయిదేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న సెకెండ్ క్లాస్ మెజిస్ట్రేట్ పోస్టుల నుంచి ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ పోస్టుల్లో నియమించాలని కోరారు. సమస్యలను విన్న మంత్రి ప్రతాపరెడ్డి సానుకూలంగా స్పందించినట్టు వారు తెలిపారు. మంత్రిని కలిసిన ప్రతినిధుల్లో బి వనజకుమారి, ఎన్ విజయకుమార్, విజయలక్ష్మి, సుగుణ కుమారి, రమణమ్మ, యు సురేష్ తదితరులు ఉన్నారు.
రోడ్డెక్కిన ఆందోళనకారులు
విశాఖపట్నం, మే 13: సమస్యలు తీరడంలేదు. ఏళ్ళు గడుస్తున్నా ఎక్కడవి అక్కడే ఉంటున్నాయి. వీటి గురించి పట్టించుకునే వారే కరవయ్యారు. పనిచేస్తున్న సంస్థల యాజమాన్యాల ఎలాగూ పట్టించుకోవడంలేదు. కనీసం కలెక్టరేట్ వద్దనైనా న్యాయం జరుగుతుందనే ఆశతో తరలివస్తున్నారు. అయినా ఇక్కడ కూడా ధర్నాలు, నిరసనల శిబిరాలు నిర్వహించడమే తప్ప ఫలితం ఉండటం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. తీవ్రతరమైన సమస్యలు పరిష్కారం కోరుతూ సోమవారం కలెక్టరేట్ వద్ద వేర్వేరుగా ధర్నా శిబిరాలు వెలిసాయి.
*బ్రాండిక్స్‌లో ఉద్యోగాలివ్వాలి
పూడిమడక మత్స్యకారులకు బ్రాండిక్స్‌లో ఉద్యోగాల ఇవ్వాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద సోమవారం మత్స్యకారులు ధర్నా చేపట్టారు. గత 18 రోజులుగా అచ్యుతాపురం బ్రాండిక్స్ వద్ద ఉపాధి కోసం మత్స్యకారులు చేస్తున్న ఆందోళనను పరిష్కారానికి, జివో నెంబర్ 68 అమలు కోసం ఆందోళ చేపట్టినా ఫలితం లేకపోయిందని మత్స్యకారులు ఆవేదన చెందారు. యాజమాన్య వైఖరిని నిరసిస్తూ మత్స్యకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సంఘం జిల్లా కార్యదర్శి కొవిరి అప్పలరాజు మాట్లాడుతూ అచ్యుతాపురం మండలం స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎస్‌ఇజెడ్)లో బ్రాండిక్స్ కంపెనీ 2005 జూలైలో రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఎంఓయు ప్రకారం అయిదేళ్ళలో 60 వేల మందికి ఉపాధి కల్పిస్తామని ఒప్పందం చేసిందన్నారు. అందుకు ప్రభుత్వం నుండి బ్రాండిక్స్ యాజమాన్యం అనేక రాయితీలు, సదుపాయాలను ప్రభుత్వం నుండి పొందిందన్నారు. సిపిఎం జిల్లా కమిటీ కార్యదర్శి సిహెచ్.నరసింగరావు మాట్లాడుతూ కేవలం ఎకరాకి ఏడాదికి ఒక రూపాయి లీజుకు వెయ్యి ఎకరాలను పొందిందని తెలిపారు. పూడిమడక గ్రామం ద్వారా సముద్రంలోకి వేసిన పైపులు కారణంగా మత్స్యసంపద, ఉపాధి కలిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు బ్రాండిక్స్ యాజమాన్యం 2009 జూలైలో పూడిమడక మత్స్యకారులకు మూడు వేల మందికి ఉపాధి కల్పిస్తానని యాజమాన్యం ప్రభుత్వ సమక్షంలో ఒప్పందం చేసిందన్నారు. పూడిమడక మత్స్యకారులకు బ్రాండిక్స్‌లో వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని, జివో 68 ప్రకారం నష్టపరిహారం, ఉపాధి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.రమేష్ మాట్లాడుతూ రెండేళ్ళల్లో మూడు వేల మందికి ఉపాధి కల్పించడానికి బదులు కేవలం 600 మందికి మాత్రమే ఉద్యోగాలిచ్చి శిక్షణ ఇచ్చారని, జీతాలు ఆరు వేలకు పెంచుతామని చెప్పి గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రాండిక్స్ కంపెనీ నుండి కార్మికులను 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న దువ్వాడ విఇపిజెడ్‌కు బస్సులో పంపారన్నారు. మొత్తం మూడు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని పూడిమడక గ్రామ ప్రజలంతా ఆందోళన చేస్తే తీసుకున్న 600 మందిని కూడా యాజమాన్యం ఉద్యోగాలు నిలిపివేసిందన్నారు. సంఘ ప్రతినిధులు చోడిపిల్లి అప్పారావు, చేపల తాతయ్య, కొవిరి మసేను తదితరులు మాట్లాడుతూ నిర్వాసితులకు, మత్స్యకారులకు ఉద్యోగాలు ఇవ్వకూడదనే వైఖరితో బ్రాండిక్స్ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ చేసిన ఒప్పందాలను, చట్టాలను దిక్కరించిందన్నారు. మత్స్యకారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ శేషాద్రికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు.
ఎండలతో ప్రజల బెంబేలు!
అనకాపల్లి , మే 13: గత వారం రోజులుగా భానుడు విజృంభించడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ట్యాం కుల్లో, కుండీల్లో ఉండే నీళ్లు సైతం సలసలకాగే వేడినీళ్లుగా మారిపోతున్నాయంటే ఎండల తీవ్రత ఎంతగా ఉందో అర్ధమవుతుంది. ఉదయం ఎనిమిది గం టల నుండే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఎండలకుతోడు వేడిగాడ్పులు వీస్తుండటంతో బయటకు వచ్చేవారు గొడుగులు, నెత్తిన టోపీలు దరించి వస్తున్నారు. ద్విచక్రవాహన చోదకులు ముఖానికి, చెవులకు రుమాళ్లు కట్టుకుని ప్రయాణిస్తున్నారు. కూలి పనులు చేసుకునే వారు ఎండ వేడిమి తాళలేక చెట్లనీడను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు చల్లని ప్రదేశాలు అనగానే ఏసి థియేటర్లను, రెస్టారెంట్ల ను ఆశ్రయిస్తున్నారు. కరెంట్ కోతలు అధికంగా ఉండటంతో ప్రజల బాధలు వర్ణనాతీతం.
వ్యాపారస్తులు ఎండలకు తాళలేక తొందరగా షాపులు మూసి ఇళ్లకు చేరి సేదతీరుతున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో శీతల పానీయాలు, జ్యూస్ షాప్‌లు వినియోగదారులతో రద్దీగా మారిపోతున్నాయి. చల్లని జ్యూస్‌లు, చెరకురసం, కూల్‌డ్రింక్‌లు సేవించేందుకు ప్రజలు ఆసక్తి చూ పుతున్నారు. ఎండ నుండి ఉపశమనం పొందేందుకు పుచ్చకాయలను తింటున్నారు. ముఖ్యంగా కోళ్లఫారంలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. కోళ్ళ వ్యాపారస్తులు ఎక్కువగా నష్టాల కు గురవుతున్నారు. ఎండలను భరించలేక రిక్షా కార్మికులు ఉదయం పూట పను లు చేసుకుని మధ్యాహ్నం వేళల్లో చెట్లనీడన సేద తీరుతున్నారు. మరోపక్క ఎండలకు చెరువులు, భూగర్భ జ లాలు అడుగంటిపోతున్నాయి. ప్రజలు నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొంటున్నారు. మునగపాక, అనకాపల్లిలో వడదెబ్బలకు ఇద్దరు వృద్ధులు చనిపోయారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇళ్లలో ఉంటే ఉక్కపోత, బయటకు వస్తే ఎండల వేడిగాడ్పులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో గంజాయి పట్టివేత
* 150 కేజీలు స్వాధీనం
నర్సీపట్నం, మే 13: విశాఖ మన్యం నుండి గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతుంది. నిత్యం ఏదొక ప్రాంతం నుండి గంజాయి తరలించడం, కొన్నిచోట్ల పోలీసులకు పట్టుబడడం జరుగుతోంది. భారీ స్థాయిలో అక్రమ రవాణా సాగుతున్నా పోలీసులు నామమాత్రంగా దాడులు చేసి చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు లారీలు, వ్యాన్లు, కార్లు, ఆటోల్లో గంజాయిని తరలిస్తున్న స్మగ్లర్లు తాజాగా ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా ఇతర ప్రాంతాలకు గంజాయి తరలిస్తున్నారు. సోమవారం నర్సీపట్నం మండలం బైపురెడ్డిపాలెం వంతెన వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు ఆరు లక్షల రూపాయల విలువ చేసే 150 కిలోల వరకు గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుండి నర్సీపట్నం, తుని మీదుగా ప్రైవేట్ ట్రావెల్స్ హైదరాబాద్‌కు వెళ్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ట్రావెల్స్‌పై ఎవరూ దృష్టి సారించడం లేదు. దీనిని ఆసరా చేసుకుని ట్రావెల్స్ ద్వారా గంజాయిని తరలించి వ్యాపారం సాగిస్తున్నారు. సోమవారం విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళే సింధూ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సును బైపురెడ్డిపాలెం వద్ద మాటువేసిన నర్సీపట్నం ఎక్సైజ్ ఎస్సై ఫణింద్ర తనిఖీ చేశారు. బస్సులో సుమారు 150 కిలోల గంజాయి ప్యాకెట్లను ఎక్సైజు పోలీసులు గుర్తించారు. గంజాయిని గుర్తించడంతో స్మగ్లర్లు పరారైనట్లు చెబుతున్నారు. బస్సులోని గంజాయి ప్యాకెట్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ట్రావెల్స్ బస్సును పూచీకత్తుపై పోలీసులు విడిచిపెట్టారు.
ఇదిలా ఉండగా ఆంధ్రా - ఒడిషా సరిహద్దు అటవీ ప్రాంతంలో విస్తారంగా పండిస్తున్న గంజాయిని కొంతమంది గిరిజనుల సహకారంతో ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న స్మగ్లర్లు గంజాయి వ్యాపారం సాగిస్తున్నారు. కొంతమంది లారీల్లో తరలిస్తుండగా, మరికొంతమంది వ్యాన్లు, కార్లలో తరలిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులకు పట్టుబడిన సందర్భంలో హడావుడి చేయడం, అనంతరం పట్టించుకోకుండా వదిలివేయడంతో స్మగ్లర్లు గంజాయి రవాణాను కొనసాగిస్తున్నారు.
నల్లరేగులపాలెంలో చిరుత సంచారం నిజమే..
సబ్బవరం, మే 13: మండలం నల్లరేగులపాలెం, ద్వారకానగర్‌ల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు సోమవారం ధ్రువీకరించారు. ఇంతవరకు మండలంలోని పెదయాతపాలెం, బంగారమ్మపాలెం,ఎ.సిరసపల్లి, తెలికలపాలెం, టెక్కలిపాలెం, నాయనమ్మపాలెం గ్రామాల్లో సుమారు 36పశువులను చిరుత పులి కబళించిన సంగతి తెలిసినప్పటికీ అది చిరుత దాడి కాదంటూ వచ్చిన అటవీశాఖ అధికారులు శనివారంరాత్రి నల్లరేగులపాలెం, ద్వారకానగర్‌ల్లో మూడు గొర్రెల కంఠం కొరికి చంపి, ఒక ఆవుపెయ్యిని చంపిన చోట సోమవారం జరిపిన పరిశీలనలో ఆ క్రూరమృగం కచ్చితంగా చిరుతపులి దేనని నిర్ధారణకు వచ్చారు. గ్రామంలో సంఘటనా స్ధలాన్ని పరిశీలించేందుకు వచ్చిన పెందుర్తి అటవీశాఖ రేంజ్ అధికారి దుర్గాప్రసాద్ ఆంధ్రభూమితో మాట్లాడుతూ పైవిధంగా చెప్పారు. ఇక్కడ గెడ్డవాగు ఇసుకలో చిరుత పులి పంజా గుర్తులు కనుగొన్నామని, వాటిని ప్లేట్ వెస్సల్ పరీక్షలో గుర్తించాల్సి ఉందన్నారు. పలు గ్రామాల్లో రైతుల విలువైన పశువులను కబళించిన చిరుతపులి విషయంలో ఎందుకు నిర్ధారణ చేయలేకపోయారని ప్రశ్నించగా గ్రామాల్లో ఆవులు చనిపోవడానికి కారణం చిరుత కాదంటూ, నల్లరేగులపాలెంలో దాడి చేసింది కచ్చితంగా చిరుతపులి అని నిర్ధారణకు వస్తున్నామన్నారు. గ్రామ పరిసరాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించామన్నారు.తమ శాఖ ఉన్నతాధికారుల సహకారం తీసుకుంటామన్నారు. చిరుతను గుర్తించటంలో తీవ్ర జాప్యం చేసిన అటవీశాఖ అధికారుల తీరును విలువైన పశువులను కోల్పోయిన రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈవిషయం తెలుసుకున్న ఎంపిడివో ఎస్.త్రినాధరావు చిరుతపులి సంచారంపై ప్రజలను అప్రమత్తం చేయడానికి కార్యదర్శులు దండోరాలు వేయించాలని ఆదేశించారు.
గిరిజన యువతులపై అత్యాచార యత్నం
* తప్పించుకునే ప్రయత్నంలో తీవ్ర గాయాలు
పాడేరు, మే 13: స్వగ్రామానికి ఆటోలో వెళుతున్న ఇద్దరు గిరిజన యువతులపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా తప్పించుకునే ప్రయత్నంలో తీవ్రగాయాల పాలైన సంఘటన య్యారు. స్ధానిక సిహెచ్.సిలో చికిత్స పొందుతున్న యువతులు అందించిన సమాచారం ప్రకారం శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలను తిలకించేందుకు జి.మాడుగుల మండలం వంజరి పంచాయతీ ములకాలపుట్టు గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజన యువతులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తమ గ్రామానికి తిరిగి వెళ్లేందుకు ఆటో మాట్లాడుకున్నట్టు తెలిపారు. తెల్లవారుజాము నాలుగు గంటల సమయంలో ఆటోడ్రైవర్ తమను గ్రామానికి చేర్చే ప్రయత్నం చేయకపోగా చింతల వీధి గ్రామం వైపు అతివేగంగా తీసుకువెళ్ళడంతో తమను కిడ్నాప్ చేసే ప్రయత్నంగా అనుమానించి ఆటోడ్రైవర్‌ను ఆపాలని కోరినప్పటికీ ఆపలేదని వారు తెలిపారు. ఆటోలోనే తమపై అత్యాచారానికి ప్రయత్నించడంతో గత్యంతరం లేని పరిస్ధితుల్లో ఆటో నుండి దూకేయాల్సి వచ్చినట్టు వారు తెలిపారు. తమపై ఆటోలో ఉన్న వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించడంతో వేగంగా వెళుతున్న ఆటోలోంచి దూకేయడంతో తీవ్రగాయాల పాలైనట్టు బాధితులు పేర్కొంటున్నారు. ఆటోలోంచి దూకిన ఒకరికి తీవ్రగాయాలై పరిస్ధితి విషమంగా ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు. అయితే సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఎఒబిలో రెడ్ అలెర్ట్
సీలేరు, మే 13: ఎ.ఒ.బి.లో పోలీసులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. మావోయిస్టు అగ్రనేత జగదీష్‌ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేయడంతో మావోయిస్టులు ఏక్షణంలోనైనా ప్రతిదాడులకు పూనుకోవచ్చునని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆంధ్ర-ఒడిస్సా సరిహద్దుల్లో పోలీస్ భద్రతా దళాలను పెంచి భద్రతను పటిష్ట పరిచారు. ఒడిస్సా, మల్కన్‌గిరి జిల్లాల్లో ఇటీవల స్కూల్ భవనాన్ని మావోయిస్టులు కూల్చివేయగా, పోలీస్ ఇన్‌ఫార్మర్ పేరిట అదుపులోకి కొందర్ని తీసుకుని హతమార్చిన సంగతి కూడా తెలిసిందే. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పోలీసులు సరిహద్దు ప్రాంతమంతా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు వారి ఉనికిని చాటుకునేందుకు మంత్రి బాలరాజు ఆవిష్కరించిన శిలాఫలకాలను పెదవలస ప్రాంతంలో ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. మావోయిస్టులు శనివారం రాత్రే పెదవలసలో ఎ.పి.ఎఫ్.డి.సి. గొడౌన్‌ను పేల్చివేసి విధ్వంసం సృష్టించారు. మావోయిస్టులకు కంచుకోటైన రాళ్ళగెడ్డ గ్రామంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస్, ఎఎస్.డి. దామోదర్ సద్భావన సదస్సులను శనివారం నిర్వహించిన విషయం విదితమే. అదేరోజు రాత్రి మావోయిస్టులు గొడౌన్లు పేల్చివేసి విధ్వంసం సృష్టించడంతో పోలీసులను కలవరపాటుకు గురిచేసింది. దీంతో సరిహద్దు ప్రాంతంలో పాటు విశాఖ ఏజెన్సీలో బి.ఎస్.ఎఫ్, స్పెషల్ పార్టీ పోలీసులను భారీయెత్తున మోహరించి కూంబింగ్‌ను నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు పోలీసులను దెబ్బతీసేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే మావోల దాడులను తిప్పికొట్టేందుకు పోలీసు బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. దీంతో ఎఒబిలో మళ్ళీ పోలీసులు, మావోల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో ఎ.ఒబిలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు.