విజయనగరం (కలెక్టరేట్), ఫిబ్రవరి 18: ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఔత్సాహిక క్రికెటర్లకు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్టు ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ) ప్రతినిధి, భారత జట్టు మాజీ వికెట్ కీపర్ ఎం.ఎస్.కె ప్రసాద్ వెల్లడించారు. స్థానిక ఎంవిజిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆద్రిత-2012 పేరుతో నిర్వహిస్తున్న క్రీడల్లోభాగంగా శనివారం బౌలింగ్ చేసి క్రికెట్‌ను ప్రారంభించారు. కళాశాల సమీపంలో ఎసిఎ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న క్రికెట్ స్టేడియాన్ని పరిశీలించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతు ఉత్తరాంధ్రలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని, శిక్షణకు ఏడాదికి 50లక్షల రూపాయల వరకూ ఖర్చు అవుతుందని వివరించారు. యువకులు ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.వి.ఎల్.రాజు మాట్లాడుతూ కళాశాల విద్యార్థుల సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలు ఈనెల 29 వరకు నిర్వహిస్తున్నామని, ప్లాస్టిక్ వాడకం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్‌కు ఒక మొక్కను జ్ఞాపికగా అందజేశారు. ఎసిఎ సభ్యులు అప్పలరాజు, సన్యాసిరాజుతోపాటు కళాశాల వైస్ ప్రిన్సిపల్, ఆద్రిత-2012 కన్వీనర్ పి.రంగరాజు తదితరులు పాల్గొన్నారు.
సంచార ప్రయోగశాలతో విజ్ఞానం పెంపు
గజపతినగరం, ఫిబ్రవరి 18: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సైన్సుపై అవగాహన కల్పించే ఉద్దేశంతో మండలంలోని అన్ని హైస్కూళ్ళలో విజ్ఞానశాస్త్ర సంచార ప్రయోగశాల ద్వారా అవగాహన కల్పించే మొబైల్ వ్యాన్ శనివారం గంగచోళ్ళపెంట హైస్కూలుకు చేరుకుంది. సర్వశిక్ష అభియాన్ నిధులతో జిల్లాలోని ఒక్కొక్క డివిజన్‌కు ఒక్కొక్క సంచార సైన్సు ల్యాబ్ వ్యాన్‌ను కేటాయించారు. ఈ సందర్భంగా 6నుంచి 10వ తరగతి వరకు చదువుతన్న విద్యార్థులకు సైన్సు పరికరాలు విశిష్టత, ఆవశ్యకతను వివరించారు. గణితంపై ఉన్న పరికరాల గురించి ఉపాధ్యాయులు తెలుసుకుని విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ సంచార ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కోఆర్డినేటర్ విజయరామారావు తెలిపారు. మండలంలో రెండురోజులపాటు ఈ వాహనం అన్ని హైసూళ్ళకు వస్తుందని తెలిపారు. విద్యార్థులకు సైన్సుపట్ల ఆసక్తి పెంచేందుకు, సందేహాలు తీర్చిందేందుకు ఈ సంచార సైన్సు ప్రయోగశాల ఎంతో ఉపయోగపడుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
‘ఎమ్మార్పీకే మద్యం విక్రయించాలి’
విజయనగరం (కలెక్టరేట్), ఫిబ్రవరి 18: మద్యం అక్రమాలపై ప్రభుత్వం కళ్లు తెరవాలని, మద్యం సిండికేట్లను రద్దు చేసి ఎమ్మార్పీలకు మద్యం విక్రయాలను ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేస్తు తెలుగుదేశంపార్టీ నాయకులు శనివారం కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా తెలుగుదేశం పట్టణ నాయకులు సైలాడ త్రినాధ మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా మద్యం దుకాణాలపై దాడులు జరుగుతుంటే జిల్లాలో మాత్రం అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జిల్లాలో ఇప్పటికైనా ఎసిబి దాడులుకు ఆదేశించాలని, మద్యం అక్రమదారులపై చర్యలు తీసుకోవాలిని డిమాండ్ చేశారు. కొంతసేపు ధర్నా చేసిన అనంతరం వినతిపత్రాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ పిఎ శోభకు అందజేశారు. మద్యం విక్రయాలపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఆధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఐవిపి రాజు, ప్రసాదుల రామకృష్ణ, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
జిల్లాకు
1. 45 లక్షల దోమ తెరలు
గుమ్మలక్ష్మీపురం, ఫిబ్రవరి 18: జిల్లాకు సంబంధించి లక్షా 45వేల దోమతెరలు సరఫరా అయినట్లు జిల్లా మలేరియా నివారణాధికారి ఇ విజయ్‌కిశోర్ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం లోవ ముఠా ప్రాంతమైన గోరడ గ్రామం వచ్చిన సందర్భంగా స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ సరఫరా అయిన దోమతెరలను జిల్లాలో 1148 గ్రామాల ప్రజలకు ఈ పది రోజులలో పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ దోమతెరలను ఇతర దేశాల నుంచి రప్పించినట్లు తెలిపారు. రాబోవు సీజన్‌లో మలేరియా తగ్గించడమే ధ్యేయంగా తగిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 2010 కంటే 2011లో జిల్లాలో మలేరియా తగ్గుముఖం పట్టిందని, ఈ ఏడాది కూడా మలేరియా లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా దోమతెరలు పంపిణీ చేయాలనే ఆలోచనలో ఉన్నామని తెలిపారు.
దోమతెరలు వాడకంపై కళాజాత బృందం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.