బొబ్బిలి (రూరల్), ఫిబ్రవరి 18: గ్రామాల్లో ప్రజలు చైతన్యవంతం అయితేనే అభివృద్ధి జరుగుతుందని ఎన్‌ఎస్‌ఎస్ పిఒ సిహెచ్ రవి అన్నారు. మండలం మెట్టవలస గ్రామంలో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థులంతా ఐక్యతగా ఉండి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అపారిశుద్ధ్య నిర్మూలనకు ప్రతి ఒక్కరూ చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులు చక్కని విద్యను పొందాలని కోరారు. ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు చేస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నిరక్షరాస్యత నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయవల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం జెసి రాజు మాట్లాడుతూ ఆదివారం జరిగే పల్స్‌పోలియోను విజయవంతం చేయాలన్నారు. చిన్నపిల్లలకు పోలియో చుక్కలను వేయించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
పోలియో నిర్మూలనకు కృషి చేయవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ డి వసంతకుమారితోపాటు మాజీ సర్పంచ్ కెల్ల తవుడు, మాజీ ఎంపిటిసి సభ్యులు పువ్వల మాధవరావు, ఎన్‌ఎస్‌ఎస్ పిఒ ఎ లక్ష్మణరావుతోపాటు ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు.
‘పెంచిన జీతాలు సత్వరం ఇవ్వాలి’
బొబ్బిలి, ఫిబ్రవరి 18: అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లుకు పెంచిన జీతాలను తక్షణమే అమలు చేయాలని సిటు జిల్లా నాయకులు పి.శంకరరావు డిమాండ్ చేశారు. స్థానిక అర్బన్ అంగన్‌వాడీ కార్యాలయ ఆవరణలో శనివారం విలేఖర్లతో మాట్లాడుతూ వర్కర్లు, హెల్పర్లుకు ఏప్రిల్ నుంచి జీతాలు పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా ఇంతవరకు అమలు చేయకపోవడంతో పలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పనిభారం ఎక్కువై ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో జీతాలను అందించడంలో కూడా ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికే నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయిన లేదని ఆరోపించారు. దీనిపై ఈనెల 28న దేశవ్యాప్తంగా సమ్మెలో తామూ పాల్గొంటామని ప్రకటించారు. అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి వి ఇందిర మాట్లాడుతూ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఖాళీలున్న పోస్టులను తక్షణమే భర్తీచేయాలన్నారు. అనంతరం అర్భన్ ఐసిడి ఎస్‌పిఒ విజయకుమారికి సమ్మె నోటీసును అందించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్ల యూనియన్ నాయకులు కృష్ణవేణి, కామేశ్వరి, రోజా, లక్ష్మితోపాటు తదితరులు పాల్గొన్నారు.
టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యాలు
కురుపాం, ఫిబ్రవరి 18: 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నామని కురుపాం జడ్పీ పాఠశాల హెచ్‌ఎం డి విజయకుమార్ తెలిపారు. శనివారం పాఠశాలలో విద్యార్థులకు పరీక్షలపై కెరీర్‌గైడెన్స్ నిర్వహించారు. పరీక్షల ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా చదవాలని కోరారు. ఒత్తిడిని అధిగమించేందుకు విద్యార్థులు స్టడీ అవర్స్‌లో పాలు, బిస్కెట్లు సరఫరా చేస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థిపైన ప్రత్యేక దృష్టి కలిగి ఉపాధ్యాయులు చదివించాలన్నారు. 126 మంది హాజరవుతున్నారని వీరంతా 3ఏ2గ్రేడ్‌లో ఉత్తీర్ణత సాధించాలన్నారు. పరీక్షలపై భయం అవసరం లేదని, ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి మార్కులు లభిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ పరీక్షలపై దృష్టిసారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సిసి అధికారి కె శ్రీరామ్మూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.