జమ్మికుంట, మే 14: జాతీయ సంపదను ఎక్కడికైన తరలించవచ్చని ప్రగల్భాలు పలుకుతున్న సీమాంధ్రుల కుట్రలను తిప్పికొడతామని కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు. మంగళవారం జమ్మికుంటలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బయ్యారంలోని ఉక్కు ఖనిజంపై పార్లమెంటు సమావేశాలను స్థంభింపజేశామని హెచ్చరించారు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలపై ప్రధానికి కూడా వివరించామన్నారు. బయ్యారం లోని ఉక్కు ఖనిజంలో నాణ్యత లేనప్పటికి ఆ ప్రాంతంలోనే కర్మాగారాన్ని నెలకొల్పాలని అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఓ విధానం అంటూ ఉండదని, పాడిందే పాటగా వారికి అలవాటైపోయిందని, తెలంగాణలోని అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు అందరం ఒకే మాటకు కట్టుబడి ఉన్నందునే బయ్యారం గనుల కేంద్రానికి తెలిపామన్నారు.
అంతర్ జిల్లా దొంగల అరెస్ట్
* రూ. 2.5లక్షల సొత్తు స్వాధీనం
కరీంనగర్ టౌన్, మే 14: కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పలు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను మంగళవారం నగర పోలీసులు పట్టుకున్నారు. మెదక్ జిల్లా సిద్దిపేట పట్టణంలోని గణేష్‌నగర్‌కు చెందిన దొంతుల సుధాకర్ (25), మెదక్ జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన దొంత హరిప్రసాద్ (26) అనే ఇద్దరు దొంగలను పట్టుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం స్థానిక టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కరీంనగర్ డిఎస్పీ రవీందర్ దొంగల వివరాలను వెల్లడించారు. మెదక్ జిల్లాకు చెందిన సుధాకర్, హరిప్రసాద్‌లు కలిసి కరీంనగర్‌తోపాటు ఆరు జిల్లాల్లో వివిధ రకాల పదిహేడు దొంగతనాలకు పాల్పడ్డారు. వీరిద్దరు స్థానిక ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో చిక్కారు. వీరి నుంచి ఒక కంట్రీమెట్ పిస్టల్‌తోపాటు ఏడు 7.65ఎంఎం తూటాలు, రెండున్నర లక్షల రూపాయల విలువచేసే 28గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు ఆటోలు, ఒక డిజిటల్ కెమెరా, రెండు డివిడి ప్లేయర్స్, డాక్యుమెంట్స్, ఒక ఎల్‌సిడి, రెండు హోమ్ థియేటర్ స్పీకర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు డిఎస్పీ రవీందర్ తెలిపారు. ఈ సమావేశంలో సిసిఎస్, టూ టౌన్ ఇన్‌స్పెక్టర్లు వెంకటరమణ, శ్రీను నాయక్, విజయ్‌కుమార్, ఎస్‌ఐ ఎం.బి.పి.నాయుడు పాల్గొన్నారు.
బయ్యారంలోనే
ఉక్కు కర్మాగారం నిర్మించాలి
* కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్
వీణవంక, మే 14: బయ్యారంలోని ఉక్కు ఖనిజాన్ని ఆ ప్రాంతం ఎల్లలు దాటనివ్వమని, తెలంగాణ ప్రాంత ప్రయోజనాన్ని గుర్తించి ఉక్కు కర్మాగారాన్ని అక్కడే నిర్మించాలని కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు. మంగళవారం వీణవంక మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పొన్నం మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కైనప్పుడు బయ్యారం ఉక్కు ముమ్మాటికి తెలంగాణ హక్కే అన్నారు. తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగులకు కనీస ఉపాధి కలుగుతుందని, జాతీయ సంపద పేరుతో ఉక్కు ఖనిజాన్ని ఒక పెల్లకూడా తరలించే ప్రసక్తే లేదన్నారు. బయ్యారంపై ప్రతిపక్షాలు ఎన్ని గగ్గోలు పెట్టినా అధికార పార్టీ ఎంపిలము ముందుండి అడ్డుకుంటున్నామని, ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయవలసిన అవసరం లేదన్నారు. ఉక్కు ఖనిజంతో నాణ్యత లేదని అడ్డగోలుగా మాట్లాడే ఆంధ్ర ప్రతినిధులు వారి మాటలు అదుపులో పెట్టుకోవాలని, బయ్యారం ఖనిజం నాణ్యమైందో కాదో? మా ప్రాంత నిపుణులకు తెలుసన్నారు. తెలంగాణలోని అధికార పార్టీ ఎంపిలు, మంత్రులు, ఒకే మాటపై ఉన్నామని ఇందులో ఎలాంటి సందేహాలు లేవన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి, కొండాల్ రెడ్డి, సమ్మయ్య పాల్గొన్నారు.
లక్ష ఇచ్చుకో..
మద్యం అమ్ముకో..!
ముస్తాబాద్, మే 14: బెల్టుషాపుల్ని నియంత్రించాల్సిన అధికారగణం, అడిగినంత మామూళ్లు ఇచ్చుకో.. మస్తుగా అమ్ముకోమంటూ బేరసారాలు సాగిస్తూ బెల్టుషాపులకు ఊతమివ్వడం చర్చనీయాంశంగా మారింది. మండల కేంద్రంలో గత మార్చి 11న సుమారు పది లక్షల విలువైన కల్తీ మద్యం పట్టివేత కేసులో రెండు మద్యం దుకాణాలు సీజ్ కాగా, వాటి స్థానంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయలేదు. దాంతో హోటళ్లు, డాబాలు బెల్టుషాపులుగా మారాయి. అప్పట్నుంచి అధికారులు మామూళ్లతో సరిపెట్టుకుంటూ మద్యం అక్రమ విక్రయాలకు ఊతమిస్తున్నారు. కాగా కొద్దిరోజులుగా అధికారగణం, మామూళ్ల టార్గెట్‌ను అమాంతం పెంచారు. నెలకు ఒక లక్ష రూపాయలు చెల్లించాలంటూ బెట్టు చేస్తూ, బెల్టుషాపులపై దాడులు చేసి మద్యం ప్రియులపై లాఠీ ఘుళిపించింది. మండలకేంద్రంలో ఉన్న బెల్టుషాపులు అన్నికలిసి, అక్షరాల లక్ష చెల్లించి లక్షణంగా ఇష్టారాజ్యంగా మద్యం అమ్ముకోండని అధికారగణం, మద్యం విక్రేతలకు షరతు విధించడంపై సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. హోటళ్లు, డాబాల్లో మద్యం విక్రయాల్ని నియంత్రించాల్సిన అధికారులే మామూళ్ల కోసం బెట్టు చేయడం విశేషం మరీ.
విద్యార్థులపై ఆర్టీసీ చార్జ్
ఆదాయ పెంపుపై దృష్టిసారించిన ఆర్టీసీ
బస్‌పాస్ రాయతీల్లో కోత..
15 ఏళ్ల తరువాత పెరిగిన ధరలు..
జూన్ నుంచి అమలు
జగిత్యాల, మే 14: వేసవి సెలవుల్లో విద్యార్థులపై ఆర్టీసీ బస్‌పాస్‌ల భారాన్ని మోపింది. ఆర్టీసీ నష్టాలోల ఉందని, సంస్థ ఆదాయ పెంపు కోసం విద్యార్థులకు ఇచ్చే బస్ పాసుల రాయితీల్లో కోత విధించింది. బస్‌పాస్‌ల ధరలను పెంచుతూ వచ్చే జూన్ నెల నుంచే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో బస్ పాసుల రాయితీల్లో సగటున 23శాతం తగ్గించడంతో ఒక్కో విద్యార్థులపై ప్రతి ఏటా అదనంగా రూ. 600ల వరకు భారం పడనుంది. గత పదిహేనేళ్లుగా ఆర్టీసీ విద్యార్థుల బస్‌పాస్‌లపై ధరలు పెంచలేదని, పెరిగిన నిత్యావసర, ఇతరత్రా ధరల దృష్ట్యా స్టూడెంట్ బస్‌పాసుల రాయితీల్లో కోతవిధించక తప్పలేదని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇదిలావుండగా విద్యార్థులకు వాత పెట్టాలనే ప్రభుత్వం నిర్ణయం ఉప సంహరించుకోవాలని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల బస్ పాసుల్లో ప్రభుత్వం 90శాతం రాయితీ భరిస్తుండగా, మిగిలిన 10శాతం మాత్రమే విద్యార్థులు చెల్లించే వారని ప్రస్తుతం విద్యార్థులకు 23.7శాతం మాత్రమే రాయతీ కల్పిస్తున్నారని విద్యాపోషకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పేద విద్యార్థులు ఆర్థిక భారంతో చదువులు మానేస్తుంటే ప్రస్తుతం పెరిగే బస్‌పాస్‌ల ధరలతో మరెంత మంది చదువులు మానుకోవాల్సి వస్తుందోనని విద్యాపోషకులు వాపోతున్నారు. పెరిగిన బస్‌పాస్‌ల ధరలు జూన్ ఒకటి నుండి అమల్లోకి వచ్చే ఈ ధరలను ఉపసంహరించుకోవాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయ.