మహబూబ్‌నగర్, మే 14: జిల్లాలో అన్ని పార్టీల మాదిరిగానే వైకాపాలో కూడా గందరగోళం నెలకొంది. పలు నియోజకవర్గాలలో ఇప్పటికి ఇన్‌చార్జిలను నియమించుకోలేని పరిస్థితి నెలకొంది. కొన్ని నియోజకవర్గాలలో ఇన్‌చార్జిలను ప్రకటించినా ఆయా నియోజకవర్గాలలో ఇద్దరు, ముగ్గురు పేర్లు వెల్లడించడంతో నేతల అంతా డైలమాలో పడ్డారు. భవిష్యత్తులో పార్టీ కోసం పని చేసినా జేబు నుండి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే టికెట్ వస్తుందోలేదోననే అనుమానం నేతలు బహిరంగంగానే చర్చించుకోవడం గమనార్హం. ఎవరికీ టికెట్ వచ్చినా నేతలు మాత్రం సహకరించుకునే పరిస్థితులు జిల్లాలో కనబడటం లేదు. ముఖ్యంగా పలు నియోజకవర్గాలలో ఇలాంటి పరిస్థితి నెలకొనడంతో నేతల మధ్య సమన్వయం రోజురోజుకు తగ్గిపోతుంది. ఒక నాయకుడు కార్యక్రమం చేపడితే మరొక నాయకుడు ఆ కార్యక్రమానికి డుమ్మా కొడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు నారాయణపేట నియోజకవర్గానికి ఇద్దరు ఇన్‌చార్జిలను నియమించారు. అందులో రవీందర్‌రెడ్డి, శివకుమార్‌రెడ్డిలు ఉండగా, వీరిరువురు వేర్వేరుగా నియోజకవర్గంలో కార్యక్రమాలను నిర్వహిస్తూ పోతున్నారు. దీంతో నియోజకవర్గంలోని కార్యకర్తల్లో అయోమయానికి గురిచేస్తుంది. పార్టీ ఏర్పాటు నుండి తాను పని చేస్తున్నానని రవీందర్‌రెడ్డి ప్రచారం చేస్తుండగా, ప్రజల అభిమానం ఎవరికి ఉంటే వారికే అధిష్టానం టికెట్ ఇస్తుందని, తనకు ప్రజాభిమానం ఉందని, దానిని దృష్టిలో పెట్టుకుని ఇటీవల నియోజకవర్గంలో శివకుమార్‌రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తూ హల్‌చల్ సృష్టిస్తున్నారు. రోజురోజుకు వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ముదురుతున్నాయి. అదేవిధంగా దేవరకద్ర నియోజకవర్గంలో కూడా మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ జెడ్పీటిసి బాలమణెమ్మలు నువ్వానేనా అన్నట్లుగా నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. అయితే నియోజకవర్గ ఇన్‌చార్జిగా మాత్రం రావుల రవీంద్రనాథ్‌రెడ్డికే పార్టీ నేతలు కట్టబెట్టారు. దాంతో రవీంద్రనాథ్‌రెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా బాలమణెమ్మ కూడా తాను సీనియర్ నాయకురాలినంటూ వైఎస్ కుటుంబానికి అభిమానినంటూ, తనకు కాకుండా ఇతరులకు నియోజకవర్గ ఇన్‌చార్జి ఇవ్వడంతో ఆమె కొంత అలక భూనినట్లు కూడా తెలిసింది. నియోజకవర్గంలోని ఓ వర్గానికి చెందిన నాయకులు బాలమణెమ్మకు అండగా నిలుస్తుండగా, మరికొందరు మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్‌రెడ్డికి జై కొడుతున్నారు. షాద్‌నగర్‌లో విచిత్రమైన పరిస్థితిని నేతలు ఎదుర్కొంటున్నారు. ఈ నియోజకవర్గంలో ఇన్‌చార్జిలు ఇవ్వడంతో కార్యకర్తలంతా గందరగోళానికి గురవుతున్నారు. బొబ్బిలి సుధాకర్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డిలకు నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా జిల్లా నేతలు కట్టబెట్టారు. అయితే మరో నాయకుడు కోన దేవయ్య తనకు ఇన్‌చార్జి ఇవ్వకుండా ఇతరులకు ఇవ్వడం పట్ల కొంత నిరుత్సాహానికి గురైనట్లు తెలుస్తుంది. కొల్లాపూర్‌లో కూడా జగదీశ్వర్‌రావు, హర్షవర్దన్‌రెడ్డిలను ఇన్‌చార్జిలుగా నియమించారు. జడ్చర్లలో ఏకంగా ముగ్గురికి నియోజకవర్గ ఇన్‌చార్జి పదవులను కట్టబెట్టారు. రవీందర్‌రెడ్డి, విజయ్‌కుమార్, అనిరోత్‌రెడ్డిలను నియమించడంతో ఈ నియోజకవర్గంలో కూడా గందరగోళం నెలకొంది. కల్వకుర్తిలో మాత్రం జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి మాత్రమే ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. గద్వాలలో కృష్ణమోహన్‌రెడ్డికి ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చారు. మక్తల్‌లో మాజీ ఎమ్మెల్యే స్వర్ణసుధాకర్‌రెడ్డి, శ్రీరాంభూపాల్‌రెడ్డిలను ఇన్‌చార్జిలుగా నియమించారు. జిల్లాలో మరో ఆరు నియోజకవర్గాలలో ఇన్‌చార్జిలను ప్రకటించకపోవడం గమనార్హం. వనపర్తి, అలంపూర్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, కొడంగల్ నియోజకవర్గాలలో ఇన్‌చార్జిలను నియమించలేదు. అలంపూర్ మాత్రం మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి ఎవరి పేరు సూచిస్తే వారికే టికెట్‌తో పాటు ఇన్‌చార్జి పదవి కూడా రానుంది. జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌లో ప్రస్తుతం సురేందర్‌రెడ్డి నియోజకవర్గంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తుండగా, మరో ఇద్దరు నేతలు కూడా ఇన్‌చార్జి పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వైకాపా యూత్ జిల్లా అధ్యక్షుడు రవిప్రకాష్, మైనారిటీ సెల్ నాయకుడు సిరాజోద్దీన్‌లు ఇన్‌చార్జి పదవి తమకు ఇవ్వాలంటూ ప్రయత్నాలను మొదలు పెట్టారు. ఏదిఏమైనా ఒక ఇన్‌చార్జి ఉన్న దగ్గర పార్టీ కార్యక్రమాలు సజావుగా కొనసాగుతుండగా, ఇద్దరు, ముగ్గురు ఉన్న చోట మాత్రం గ్రూపు కుంపట్లు నెలకొనడం నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా నాయకుల వ్యవహారం కనబడుతుంది.
బయ్యారం ఉక్కు కోసం తెరాస ర్యాలీ, రాస్తారోకో
దేవరకద్ర, మే 14: బయ్యారం ఉక్కుపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కెసిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం దేవరకద్ర పట్టణంలో టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంతర్‌రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అంతేకాకుండా మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్న చేపట్టారు. ఈ సందర్భంగా దేవరకద్ర సింగిల్‌విండో ఉపాధ్యక్షుడు జెట్టి నర్సింహరెడ్డి మాట్లాడుతూ బయ్యారం ఉక్కు తెలంగాణ ప్రజలకు హక్కు అని అన్నారు. ప్రభుత్వం బయ్యారం ఉక్కును ఆంధ్రకు తరలించే ప్రయత్నాలు చేస్తే తెలంగాణ ప్రాంత ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. బయ్యారంలోనే కర్మాగారాన్ని చేపట్టి తెలంగాణ ప్రాంత యువతకు ఉద్యోవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ జిల్లాల్లో ఉన్న ఖనిజ వనరులను ఆంధ్రకు తరలించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. బయ్యారం ఉక్కు తరలింపుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డిప్యూటీ తహశీల్దార్ సిరాజోద్దీన్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు నరేందర్‌రెడ్డి, శ్రీకాంత్‌యాదవ్, చెల్మారెడ్డి, జకీ, కె.రవి, విష్ణు, రాము, వెంకటేష్, రవి, శ్రీనివాసులు, వెంకట్, యుగంధర్, నవీన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
బిజెపి శాసనసభాపక్ష ఉప నేతగా యెన్నం
మహబూబ్‌నగర్, మే 14: భారతీయ జనతా పార్టీ తరపున శాసనసభలో ఉప పక్ష నేతగా వ్యవహరించేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేరును ప్రకటించడంతో జిల్లా బిజెపి నాయకులు హైదరాబాద్‌కు వెళ్లి యెన్నం శ్రీనివాస్‌రెడ్డిని సన్మానించారు. అదేవిధంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండురెడ్డి, నాయకులు శ్రీవర్ధన్, శాంతకుమార్, పద్మజారెడ్డి, రాములుతో పాటు పలువురు నేతలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డిని సన్మానించారు.
గుడిసె దగ్ధం: మహిళ సజీవదహనం
వనపర్తిటౌన్, మే 14: వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామంలో మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధమై శివమ్మ(28) మహిళ కాలిబూడిదైంది. తహశీల్దార్, రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గొర్రెల కాపరి అయిన చెన్నయ్య, శివమ్మ దంపతులు కడుకుంట్ల గ్రామంలో గుడిసెలో నివాసముంటున్నారు. యధావిధిగా ఉద యం వంట పనులు చేస్తుండగా ఒక్కసారిగా నిప్పంటుకుని శివమ్మ మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలి మసైపోయింది. గుడిసెలోని సామాన్లు సైతం అగ్నికి ఆహుతయ్యాయి. పంచనామా నిర్వహించిన తహశీల్దార్ రాంరెడ్డి ప్రభుత్వ పరంగా నష్టపరిహారాన్ని అందించనున్నట్లు తెలిపారు. మృతురాలికి సింధు, వౌనిక అనే ఇద్దరు బాలికలు ఉన్నారు. కుటుంబసభ్యులను ఆదుకోవాలని స్థానిక టిడిపి నాయకులు బాలకృష్ణ, తిరుపతయ్య, కాంగ్రెస్ నాయకులు కృష్ణకుమార్‌రెడ్డి, రవికిరణ్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శివమ్మ అగ్నికి ఆహుతికావడం వెనుక ఇంటిలో వంటకోసం ఉపయోగించే ప్రైవేటు చిన్న సిలిండర్ గ్యాస్ లీక్‌కావడం, వంట చేసేందుకు అగ్గి ముట్టించిన శివమ్మ ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని ఉండి కాలిబూడిదై ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శివమ్మ చీరెకు నిప్పంటుకుని మృతిచెందితే పగటివేళలో తలుపుగుండా బయటికి వచ్చేందుకు ప్రయత్నించేదని, మృతురాలు బూడిదైపోవడం వల్ల అంతకుముందు సిలిండర్‌లోని గ్యాస్ లీకై గుడిసెలో నిండుకుని ఉండి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో తాటాకుల గుడిసె కావడంతో పావుగంట సమయంలోనే బూడిదైంది. అగ్ని మాపక సిబ్బంది ప్రమాద స్థలానికి ఆలస్యంగా రావడంపట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణానికి సమీపంలోఉండి బీటి రోడ్డు మంచిగా ఉన్న గ్రామాలకే సకాలంలో చేరుకోకపోతే ఎలాంటి సౌకర్యాలు లేని గ్రామాల్లో ప్రమాదాలు సంభవిస్తే ఏం కాపాడుతారని గ్రామస్థులు ఫైర్ సిబ్బందిని నిలదీశారు.
ఉద్ధృతమవుతున్న కార్మికుల ఆందోళన
మహబూబ్‌నగర్, మే 14: మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల కార్మికుల ఆందోళన రోజురోజుకు ఉద్ధృతమవుతోంది. విలీనమైన గ్రామాల కార్మికుల వేతనాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత 11 రోజులుగా జరుగుతున్న ఆందోళన మంగళవారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో సిపిఎం జిల్లా నాయకుడు రాంరెడ్డి మాట్లాడుతూ కార్మికులు పోరాటాల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని, అనిచివేతలకు భయపడకూడదని అన్నారు. హక్కులు, జీతాలు సాధించే వరకు ఈ పోరాటాన్ని నిరంతరంగా కొనసాగిస్తామని తెలిపారు. దేశంలో అనేక పోరాటాలు చేసిన చరిత్ర సిఐటియు కార్మిక సంఘానికి ఉందని అన్నారు. కలెక్టరేట్‌ను ముట్టడించడం కూడా జరిగిందని, ఇక భవిష్యత్తు ప్రణాళిక చావోరేవో తేల్చుకుంటామని ఆయన హెచ్చరించారు. తక్షణమే ప్రతి కార్మికుడు కుటుంబం పోషించకోవడానికి తక్షణమే రూ. 10వేలు ఇవ్వాలని రాంరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి ఖమర్ అలీ మాట్లాడుతూ కార్మికుల పట్ల కమిషనర్ మొండి వైఖరి అవలంభిస్తున్నారని, నియంతలా వ్యవహరిస్తూ కార్మికుల పొట్టకొడుతున్నారని ఆరోపించారు. కమీషనర్ వైఖరి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని సిఐటియు పట్టణ నాయకుడు చంద్రకాంత్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, శివరాజ్, వెంకటయ్య, చంద్రశేఖర్, బురానోద్దీన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
హైందవ సమైక్యతతోనే రామమందిర నిర్మాణం
* దత్త పీఠాధిపతి విఠలానంద సరస్వతి మహరాజ్
మక్తల్, మే 14: హైందవ సమైక్యతతోనే రామమందిర నిర్మాణం సాధ్యమవుతుందని, ప్రతి హైందవుడు రామమందిర నిర్మాణానికి వారధి కావాలని దత్త పీఠాధిపతి విఠలానంద సరస్వతి మహరాజ్ అన్నారు. మంగళవారం మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి దేవాలయంలో విహెచ్‌పి, శ్రీరామనామజపయజ్ఞ సమితి ఆధ్వర్యంలో శ్రీరామనామజప పూర్ణాహుతి యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విఠలానంద సరస్వతీ మహరాజ్, ముఖ్య వక్తగా విహెచ్‌పి ప్రాంత సమన్వయ ప్రముఖ్ పట్లోళ్ల లక్ష్మారెడ్డి ప్రసంగించారు. రామనామజపం, హైందవ సంఘటితం ద్వారానే అయోధ్యలో రామమందిర నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. శ్రీరాముడు జన్మించిన స్థలంలో రామమందిర నిర్మాణానికి ప్రతి హిందువు కంకణ బద్ధుడు కావాలని సూచించారు. విదేశీ దురాక్రమణదారుడైన బాబరు ధ్వంసం చేసిన 1528వ సంవత్సరం నుండి నేటివరకు అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం మూడున్నర లక్షల మంది సాధుసంతువులు పోరాడి మరణించారని అన్నారు. దేశంలో శ్రీరాముడు జన్మించిన స్థలంలోనే రామమందిర నిర్మాణం చేయకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరేనని అన్నారు. అన్ని రాజకీయ క్షేత్రాలలోని ప్రజాప్రతినిధులు అయోధ్యలోని మందిర నిర్మాణానికి పార్లమెంట్‌లో చట్టం తెచ్చి తీర్మానించి మందిర నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు. సాధుసంతువులు ఇచ్చిన పిలుపుమేరకు ఉగాది నుండి అక్షయ తృతీయ వరకు 33 రోజులు శ్రీరామజయరామ జయజయరామ అనే మంత్రాన్ని భక్తులు జపించారని చెప్పారు. దేశవ్యాప్తంగా చేపడుతున్న ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో యజ్ఞ దంపతులు స్వాతి, రఘుప్రసన్న భట్, నారాయణమ్మ, వట్టం మాణిక్‌ప్రభు, వేదపండితులు భీమాచారి, ప్రాణేశాచారి, శేషగిరి, వెంకటేష్, విహెచ్‌పి నాయకులు భీంరెడ్డి, సత్యనారాయణగౌడ్, పి.జనార్దన్, బాలాజి, విష్ణుమూర్తి, లక్ష్మీనారాయణ, ఆశప్ప, శివరాములు, కె.వెంకటేష్, సి.చంద్రశేఖర్, జనార్ధన్, వివిధ భజన మండలి భక్తులు పాల్గొన్నారు.
యువతకు క్రీడలు ఎంతో అవసరం
* మున్సిపల్ కమిషనర్ యాదగిరిరావు
మహబూబ్‌నగర్, మే 14: విద్యార్థులు, యువతకు క్రీడలు ఎంతో అవసరమని మహబూబ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ యాదగిరిరావు అన్నారు. మంగళవారం పాలిటెక్నిక్ మైదానంలో పాలమూరు క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గెలుపొందిన జట్లకు షీల్డ్‌లు, నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమాన్‌పుర యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పాలమూరు క్రికెట్ టోర్నమెంట్‌లో 40 జట్లు పాల్గొనడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈనెల 1వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరిగిన క్రికెట్ టోర్నమెంట్ ప్రశాంతంగా జరిగిందని, ఇందులో 400 మందికి పైగా విద్యార్థులు, యువకులు క్రికెట్ ఆడారని తెలిపారు. ప్రతి ఏటా ఇలాంటి క్రీడలు నిర్వహించి యువతలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికితీయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుయువత నాయకుడు ఆనంద్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి కోసం మహిళల రాస్తారోకో
కోయిలకొండ, మే 14: మండల కేంద్రమైన కోయిలకొండలో తాగునీటి కోసం మహిళలు మరోమారు జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారిపై మండల పరిషత్ కార్యాలయం ముందు మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. గ్రామానికి చెందిన బిసి, ఎస్సీ కాలనీల మహిళలు రోడ్డుపైకి చేరుకుని ప్రత్యేక అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి సరఫరా చేసేందుకు రెండు ట్యాంకర్లను ఏర్పాటు చేసినా ట్యాంకర్లు నీటిని మాత్రం సరఫరా చేయడం లేదని మండిపడ్డారు. ప్రతినిత్యం ఒక్కో ట్యాంకర్ నాలుగు ట్రిప్‌ల చొప్పున నీటిని సరఫరా చేయాల్సి ఉండగా ప్రస్తుతం రెండు ట్రిప్‌లు కూడా సరఫరా చేయడం లేదని అన్నారు. గ్రామానికి చెందిన బిజెపి, టిడిపి, నాయకులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం జరుగుతుందని, ఇద్దరి మధ్య పోటీతో నీటిని ప్రజలకు అందించడం లేదని ఆరోపించారు. గ్రామ ప్రత్యేక అధికారి, తహశీల్దార్ చంద్రశేఖర్‌కు అనేకసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని అన్నారు. తాగునీటి ఎద్దడి నివారించకుంటే మండల కార్యాలయాలకు తాళాలు వేసి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మహిళలు హెచ్చరించారు. కాగా రెండు గంటల పాటు మహిళలు రాస్తారోకో చేపట్టినా ఏ ఒక్క అధికారి స్పందించకపోవడంతో మహిళలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల చొరవతో మహిళలు రాస్తారోకోను విరమించారు.
విద్యార్థి ఆత్మహత్య నృత్యంపై మమకారమే...
నవాబుపేట, మే 14: నృత్యంపై ఉన్న మమకారం ఓ విద్యార్థి నిండు ప్రాణాన్ని బలిగొంది. నృత్యం నేర్చుకోవాలన్న విద్యార్థి అభిరుచికి తల్లిదండ్రులు, బంధువులు ఎవరు కూడా సహకరించకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకుని ఇంటర్మీడియట్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మండల పరిధిలోని దర్పల్లి గ్రామానికి చెందిన పెద్దళ్ల వెంకటేష్(17)కు డ్యాన్స్ అంటే పంచప్రాణాలు. ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం జరిగినా అక్కడ డ్యాన్స్ చేసి చూపరులను అలరించే వాడు. తనలోని ప్రతిభను మరింత మెరుగు పరుచుకునేందుకు గాను డ్యాన్స్ అకాడమిలో చేరాలనుకున్న వెంకటేష్ తాను డ్యాన్స్ నేర్చుకునేందుకు అవసరమైన డబ్బును ఇవ్వాలని తల్లిదండ్రులను, తన మేనమామ పోమాల్ గ్రామానికి చెందిన ఆంజనేయులులను కోరాడు. తాను చదువుకోవడానికి, డ్యాన్స్ నేర్చుకోవడానికి తల్లిదండ్రులు పెద్దోళ్ల కృష్ణయ్య, పార్వతమ్మలు సహకరించకపోవడంతో తన మేనమామ ఆంజనేయులు వద్దే ఉంటూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివాడు. వేసవి కాలం కావడంతో ఇప్పుడైనా తనను డ్యాన్స్ అకాడమికి పంపాలని వెంకటేష్ కోరాడు. అందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో డ్యాన్స్ నేర్చుకోవడానికి డబ్బులు ఇవ్వనందుకే తాను చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసి వెంకటేష్ తన మేనమామ ఆంజనేయులు పొలం వద్ద గల చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్తితం జిల్లా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు.
చట్టాలను సద్వినియోగం చేసుకోవాలి
నవాబుపేట, మే 14: ప్రజలకు న్యాయం చేయడం కోసం న్యాయశాఖ రూపొందించిన చట్టాలను ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శేషగిరిరావు కోరారు. మంగళవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన శేషగిరిరావు మాట్లాడుతూ సమాజంలోని ప్రతిఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండి చట్టపరంగా నడుచుకోవాలని తెలిపారు. చట్టపరంగా ప్రతిఒక్కరు ముందుకుసాగితే సమాజంలో శాంతి భద్రతలు ఫరిడవిల్లుతాయని అన్నారు. గ్రామీణ ప్రజలు అక్షరాస్యులై చట్టాల గురించి తెలుసుకోవాలని ఆయన తెలిపారు.