భీమవరం, ఫిబ్రవరి 18: జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం ఆదినుంచీ మాటలయుద్ధంతో ప్రారంభమైంది. ఒకరిపైమరొకరు వాగ్వివాదం, తోపులాటడతో వాడివేడిగా సాగింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) చీఫ్ బొత్స సత్యనారాయణ ఫిబ్రవరి 25వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో పర్యటించనున్నారు. అనంతరం మార్చి 4వ తేదీన నరసాపురం నియోజకవర్గంలో ఆయన పర్యటన సాగనుంది. ఈ నేపథ్యంలో జిల్లా పార్టీ నాయకత్వాన్ని పటిష్టపరిచి ఏకతాటిపైకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని శనివారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గోకరాజు రామరాజు అధ్యక్షతన భీమవరంలో ఏర్పాటుచేశారు. సమావేశానికి కాంగ్రెస్‌పార్టీ ఎంపిలు కావూరి సాంబశివరావు, కనుమూరి బాపిరాజు, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, ఈలినాని, బంగారు ఉషారాణి, కారుమూరి నాగేశ్వరరావు, మద్దాల రాజేష్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, కోటగిరి విద్యాధరరావు, వానపల్లి బాబూరావు, కోళ్ళ నాగేశ్వరరావు, మహిళాపార్టీ అధ్యక్షురాలు పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, మెంటే పద్మనాభం తదితర ముఖ్యనాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ముందు కార్యకర్తల స్పందన కోసం నాయకత్వం ఎదురుచూసింది. దీంతో జిల్లాలోని నరసాపురం, పాలకొల్లు నుంచి చింతలపూడి, గోపాలపురం, పోలవరం, ఏలూరు ఇలా అన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలు వేదిక పైకి వెళ్ళి తమదైన శైలిలో ప్రసంగాలు చేస్తూ పార్టీపైనా, నాయకులపైనా ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. నాయకత్వంలో లోపం ఉందని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్నో తప్పులు చోటుచేసుకున్నాయని, అవి పునరావృతం కాకుంఢా చూడాలని డిమాండ్ చేశారు. పార్టీకి కార్యకర్తలు వెన్నుముక లాంటివారని, ప్రకటనలు తప్ప పదవులకు తాము పనికిరామా అంటూ దుయ్యబట్టారు. కొందరు సీనియర్ నాయకులు విలువైన కేడర్‌ను కాపాడుకోవాలని జిల్లా పార్టీ నాయకత్వానికి సూచన చేశారు. పిఆర్‌పి, కాంగ్రెస్ రెండుపార్టీలు కలిస్తే ఒక శక్తివంతమైన పార్టీగా తయారైందన్నారు. కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని వారు సూచించారు. ముఖ్యంగా నరసాపురం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో సమావేశాలు ఏర్పాటుచేయడంపై ఆ నియోజకవర్గ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీని ఎంతోమంది వీడుతున్నారని, వీడినవారు తిరిగి వస్తున్నారని, అయితే పార్టీకోసం పనిచేసిన వారికి ప్రాధాన్యతనివ్వాలని కోరారు. నామినెటెడ్ పదవులను కార్యకర్తలకు ఇవ్వాలని మరికొందరు డిమాండ్‌చేశారు. భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులుపై మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఒకరు ఘాటుగా విమర్శలు చేశారు. కార్యకర్తలు డబ్బులకు అమ్ముడుపోరని, నియోజకవర్గంలో జరుగుతున్న అంశాన్ని పిసిసి ఛీఫ్ బొత్స దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ప్రతీనాయుకుడూ, కార్యకర్తా పార్టీ నిబందనలను అనుసరించి వ్యవహరిస్తే బాగుంటుందని మరికొందరు సీనియర్ నేతలు సూచించడం జరిగింది. పాకర్లబెన్నీపాల్, పాలపర్తిజోనా, పాలపర్తి ప్రియదర్శిని, గంటా సుందరకుమార్, పండురాజు, ఆరేటిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
దళారుల్ని నమ్మొద్దు
* పారదర్శకంగా వీఆర్వో,వీఆర్‌ఎ పరీక్షలు* ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు* కలెక్టరు వాణీమోహన్
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, ఫిబ్రవరి 18: వీఆర్వో, వీఆర్‌ఎ పరీక్షలు పారదర్శకంగా జరుగుతాయని, అభ్యర్ధులు దళారుల్ని నమ్మి మోసపోవద్దని జిల్లా కలెక్టరు డాక్టరు జి వాణిమోహన్ మరోసారి స్పష్టం చేశారు. ప్రతిభావంతులకే పోస్టులు దక్కుతాయని, సిఫార్సులు, దళారుల కారణంగా ఎటువంటి ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. అభ్యర్ధులు స్వశక్తిని నమ్ముకుని పరీక్షల్లో ప్రతిభ చూపితే మెరిట్ ఆధారంగా పోస్టులు పొందవచ్చునన్నారు. ఆదివారం జరిగే వీఆర్వో, విఆర్‌ఎ రాతపరీక్షలకు సంబంధించిన వివరాలను ఆమె శనివారం 3ఆంధ్రభూమి2కి వివరించారు. ఈ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించరని చెప్పారు. ఈ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. ఆదివారం జరిగే ఈ పరీక్షలకు జిల్లాలో మొత్తం 62712 మంది అభ్యర్ధులు హాజరవుతున్నారని, వీరిలో గ్రామ రెవిన్యూ అధికారులు(వీఆర్వో) పోస్టులకు 52015 మంది, గ్రామ రెవిన్యూ సహాయకులు(వీఆర్‌ఎ) పోస్టులకు 10697 మంది హాజరవుతున్నారన్నారు. వీఆర్వో పరీక్షల నిర్వహణకు 153 పరీక్షా కేంద్రాలు, వీఆర్‌ఎ పరీక్షల నిర్వహణకు 30 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. వీఆర్వో అభ్యర్ధులకు ఆదివారం ఉదయం 10గంటల నుండి 12గంటల వరకు, వీఆర్‌ఎ అభ్యర్ధులకు మధ్యాహ్నం 3నుంచి 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 153 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 153మంది పరిశీలకులను, 40మంది క్లస్టర్ సూపర్‌వైజర్లను, 2128మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. ఉదయం జరిగే వీఆర్వో పరీక్షలకు 31మంది రూట్ ఆఫీసర్లను, 16 ప్లయింగ్ స్క్వాడ్‌లను, మధ్యాహ్నం జరిగే వీఆర్‌ఎ పరీక్షలకు అయిదుగురు రూట్ ఆఫీసర్లు, మూడు ప్లయింగ్ స్క్వాడ్‌లను నియమించామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్షా కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని ఆదేశించినట్లు తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటుచేశామన్నారు. డిఎంహెచ్‌ఓ ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాల వద్ద ప్రాధమిక చికిత్సా కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు కలెక్టరు తెలిపారు. హాల్‌టిక్కెట్లలో ఫోటో లేనివారు, బాగా కన్పించనివారు రెండు ఫోటోలపై గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించి ఫోటోలతో పరీక్షా కేంద్రానికి రావాల్సి ఉంటుందన్నారు. వీటిలో ఒకదాన్ని హాల్‌టిక్కెట్‌పైన, మరొకదాన్ని ఇన్విజిలేటర్‌కు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అభ్యర్ధులు ఒక గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి హాజరుకావాలని, హాల్‌టిక్కెట్లను సరిచూసుకోవటం వంటి కార్యక్రమాలు చేసుకునేందుకు ఈ సమయం అవసరమవుతుందన్నారు. పరీక్ష కేంద్రంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినా, ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసినా కేసు నమోదు చేస్తారని, భవిష్యత్‌లో జరిగే పోటీ పరీక్షలకు వారిని అనర్హులుగా ప్రకటించటం జరుగుతుందన్నారు.