కొవ్వూరు, ఫిబ్రవరి 18: లక్ష్మీదేవి బొమ్మతో తయారు చేసిన బంగారు నాణెములను తక్కువ ధరకే ఇస్తామని నమ్మించి వారి వద్ద నుండి సొమ్ము తీసుకుని నకిలీ బంగారు నాణెములిచ్చి మోసానికి పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులు కలిగిన ముఠాను అనంతపల్లి పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కొవ్వూరు డిఎస్పీ కంచి శ్రీనివాసరావు శనివారం స్థానిక విలేఖరులకు తెలిపారు. తక్కువ ధరకు బంగారు నాణెములు విక్రయిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని నకిలీ బంగారు నాణెములు ఇచ్చిన ముఠాను అనంతపల్లి పోలీసులు పట్టుకున్నట్టు తెలిపారు. ఈముఠా చేతిలో మోసపోయిన షేక్ బాబ్జి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు చురుగ్గా దర్యాప్తు చేసి ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారని తెలిపారు. వారి వద్ద నుండి రెండు కార్లు, ఒక మోటార్‌బైక్‌ను స్వాధీనం చేసుకున్నారని ఆయన చెప్పారు. ఈముఠా సభ్యులు షేక్ బాబ్జికి తక్కువ ధరకు బంగారు నాణెములు విక్రయిస్తామని, బంగారం కేజీ ధర ఎనిమిది లక్షలని, పావు కేజీ బంగారు నాణెములను అతి తక్కువ ధర 2లక్షలకే ఇస్తామని చెప్పి అతని వద్ద నుండి 25వేల రూపాయలు అడ్వాన్స్‌గా తీసుకున్నారని డిఎస్పీ వివరించారు. అయితే బాబ్జికి ఎటువంటి నాణెములు ఇవ్వకుండా మోసం చేశారని, వారిని పట్టుకోగా 120 నకిలీ బంగారు నాణెములు దొరికినట్టు ఆయన తెలిపారు. ద్వారకా తిరుమల మండలం లక్ష్మీపురానికి చెందిన సుంకర ఆంజనేయులు, జి కొత్తపల్లికి చెందిన బిరుదుగడ్డ బజారయ్య, అశ్వారావుపేటకు చెందిన పోకళ్ళ కోటేశ్వరరావు, ఖమ్మం జిల్లా దమ్మిపేటకు చెందిన నక్కలపు సత్యనారాయణ, ఆది మండలం తూర్లలక్ష్మీపురానికి చెందిన సుంకర ఫణిలను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వీరిలో సుంకర ఆంజనేయులుపై భీమవరం, చింతలపూడి, జీలుగుమిల్లి, సత్తుపల్లి, లక్కవరం (హత్య కేసు) పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఆరు కేసులున్నాయని, పోకళ్ళ కోటేశ్వరరావుపై అనంతపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక కేసు ఉందని, నిక్కలపు సత్యనారాయణపై సత్తుపల్లి, జీలుగుమిల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో రెండు కేసులున్నట్టు డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వీరిని దుంబచెర్ల సెంటర్‌లో అరెస్ట్ చేసినట్టు ఆయన చెప్పారు. ఈకేసును దర్యాప్తు చేసిన నిడదవోలు సిఐ సిహెచ్ రాంబాబు, అనంతపల్లి ఎస్‌ఐ సిహెచ్ శ్రీనివాసరావులతోపాటు కానిస్టేబుళ్లు శంకర్, మాణిక్యం, మోహనప్రసాద్, హోంగార్డులు వెంకట్, మణికంఠంలను డిఎస్పీ అభినందిచారు. వీరికి రివార్డులు అందజేయనున్నట్టు ఆయన తెలిపారు.
3 నుండి భీమవరంలో
సిఫి ఐటిఎఫ్ మెన్స్ ప్యూచర్స్ టోర్నమెంటు
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఫిబ్రవరి 18: జాతీయస్థాయి క్రీడలకు వేదికగా మారిన భీమవరం పట్టణం ఇప్పుడు అంతర్జాతీయ క్రీడలకు కూడా వేదిక కానుంది. స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్ ఆవరణలో మార్చి 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సిఫి ఐటిఎఫ్ మెన్స్ ప్యూచర్స్ టోర్నమెంట్-2012ను నిర్వహించనున్నారు. ఈ అంతర్జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల నుంచి టెన్నిస్ క్రీడాకారులు పాల్గొటారని క్లబ్ అధ్యక్షులు కృష్ణప్రసాద్, యుఆర్‌పిఆర్.వర్మ, టోర్నమెంట్ డైరెక్టర్ టి.కృష్ణబాబు శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. జర్మనీ నుంచి టొరిబ్కో, పీటర్, ఫ్రాన్స్ నుంచి మైఖన్, యాక్సిన్, చైనా నుంచి లింగ్, జి, స్వీడన్ నుంచి ప్యాట్రిక్, రోస్ హోలొన్, ఫ్రాన్స్ నుంచి సిమెంట్‌రియాక్స్, భారత్ నుంచి విజయంత్, మాలిక్, కరణ్, రాస్తోగి, గజ్జర్, రోహన్, జపాన్ నుంచి వనోజవా, అరాటా, టకూచి, కెంటో, భారత్ నుంచి ఇరాలీ, మురుగేశన్, రంజిత్, నేదురుంచి జియాన్, జీవన్, మైనేని, సాకిత్, ప్రశాంత్, విజయసుందర్, బాలాజి, ఎన్.శ్రీరామ్, ఐర్లాండ్ నుంచి బర్రి, ఉబ్జెకిస్థాన్ నుంచి ఇక్రమో, సర్వర్, స్విట్జర్లాండ్ నుంచి ఇరాత్, సాంద్రో తదితర క్రీడాకారులు పాల్గొంటారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీలకు ర్యాంకింగ్ ఆధారంగా పోటీలలో పాల్గొనే అర్హత పొందడం జరుగుతుందన్నారు. న్యూఢిల్లీకి చెందిన పునీత్‌గుప్త చీఫ్ రిఫరీగా వ్యవహరిస్తారన్నారు. ఆయనతో పాటు మరో ఆరుగురు ఛైర్ అంపైర్లుగా వ్యవహరిస్తారన్నారు. శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ 1986లో తొలిసారిగా జరిగిన టెన్నిస్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచారని, అప్పటి నుంచి ఉద్దరాజు ధర్మరాజు జ్ఞాపకార్థంగా ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నడిపిస్తున్నామన్నారు. ఇప్పుడు జరిగే అంతర్జాతీయస్థాయి టెన్నిస్ పోటీలను ప్రస్తుత శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రారంభిస్తారన్నారు. జిల్లామంత్రులు వట్టి వసంతకుమార్, పీతాని సత్యనారాయణ, మున్సిపల్ మంత్రి ఎం.మహీధర్‌రెడ్డి పాల్గొంటారన్నారు. ముగింపు వేడుకలకు పోలీస్‌శాఖ రాష్ట్ర డిజిపి దినేష్‌రెడ్డి హాజరవుతారన్నారు. సిటీ టెక్నాలజిస్ అధినేత వేగేశ్న అనంత కోటిరాజు సహాయ సహకారార్థం ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
మావుళ్లమ్మను దర్శించుకున్న అడిషనల్ డిజిపి
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఫిబ్రవరి 18: భీమవరం ఇలవేల్పు మావుళ్ళమ్మ అమ్మవారిని పోలీస్ శాఖ అడిషనల్ డిజిపి రమణమూర్తి శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రధాన అర్చకులు మద్దిరాల రామలింగేశ్వర శర్మ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అడిషనల్ డిజిపి రమణమూర్తిని ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధరరావు ఘనంగా సత్కరించారు.