ఏలూరు, ఫిబ్రవరి 18 : ఆదివారం నిర్వహించే వి ఆర్‌వో, వి ఆర్ ఎ పరీక్షల నిర్వహణలో ఎటువంటి నిర్లిప్తత, నిర్లక్ష్యానికి తావివ్వకూడదని జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు పరీక్షల పర్యవేక్షణాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం వి ఆర్‌వో, వి ఆర్ ఎ పరీక్షల నిర్వహణపై పర్యవేక్షణాధికారులకు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబూరావునాయుడు మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో ఎటువంటి తప్పొప్పులకు తావులేకుండా అత్యంత సజావుగా, ప్రశాంతంగా తమకు నిర్ధేశించిన విధులను నిర్వర్తించాలన్నారు. చీఫ్ సూపరింటెండెంట్, పర్యవేక్షకులు, ఇన్విజిలేటర్ల మధ్య సమన్వయం అవసరమన్నారు. పరీక్షల నిర్వహణపై నిర్ధేశించిన మార్గదర్శకాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని పరీక్షల నిర్వహణలో జిల్లాకు మంచిపేరు తీసుకురావాలన్నారు. అందరూ విద్యావంతులు, అనుభవం కలవారైనా ఈ పరీక్షల నిర్వహణపై ఒకసారి నియమ నిబంధనలను అవగాహన చేసుకుని సమర్ధవంతంగా పరీక్షలు నిర్వహించాలన్నారు. పరీక్షల్లో మాల్‌ప్రాక్టీకు పాల్పడే వారిపై కేసు నమోదు చేయడంతోపాటు పరీక్షా సమయం ముగిసిన అనంతరమే అభ్యర్ధులను బయటకు పంపవలసి వుంటుందన్నారు. పరీక్షా సమయానికి ఒక నిమిషం ఆలస్యమైనా అభ్యర్ధులను అనుమతించకూడదన్నారు. పరీక్ష అనంతరం అభ్యర్ధులను ఒక్కసారిగా పంపకుండా అందరి ఓ ఎం ఆర్ షీట్లు అందినవి, లేనివి, అవి సక్రమంగా ఉన్నవి, లేనివి పరిశీలించిన పిమ్మట పంపాలన్నారు. జిల్లా రెవిన్యూ అధికారి ఎం మోహనరాజు మాట్లాడుతూ పరీక్షా కేంద్రంలోనికి హాల్ టిక్కెట్, నల్ల బాల్‌పాయింట్ పెన్ను తప్ప సెల్ ఫోన్లు, ఫేజర్స్, కాలిక్యూలేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించకూడదన్నారు. అభ్యర్ధులు ఫోటోతో కూడిన హాల్ టిక్కెట్లు తెచ్చినది, లేనిది పరిశీలించాలన్నారు. ఒక వేళ అభ్యర్ధుల హాల్ టిక్కెట్లలో ఫోటో లేని యెడల, స్పష్టంగా లేకపోయినా అట్టి అభ్యర్ధులు గజిటెడ్ అధికారిచే ధృవీకరించబడిన రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు తెచ్చుకున్న పిమ్మటే పరీక్ష రాయడానికి అనుమతించాలన్నారు.
ఈ ఫోటోలను ఒకటి హాల్ టిక్కెట్‌పై మరొకటి నామినల్ రోల్‌పై అతికించాలని, ఎట్టి పరిస్థితిల్లో ఓ ఎం ఆర్ షీటుపై అంటించరాదన్నారు. అంధ విద్యార్ధులకు అర్హత గల వికలాంగ అభ్యర్ధులకు పరీక్ష రాసేందుకు పదవ తరగతి లోపు చదివిన సహాయకుడ్ని అనుమతించడం జరిగిందని, ఇతరులకు అసౌకర్యం లేకుండా వీరికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. జె ఎన్‌టియుకు చెందిన స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్, పరీక్షల నిర్వహణ పరిశీలకులు డాక్టర్ ఎ రామచంద్ర ఆర్యశ్రీ, వి ఆర్‌వో, వి ఆర్ ఎ పరీక్షల నిర్వహణ తీరుపై పవరుపాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అభ్యర్ధులకు ఉదయం పరీక్షకు ఉదయం 9.45 గంటలకు, మధ్యాహ్నం పరీక్షకు 2.45 గంటలకు ఓ ఎం ఆర్ షీట్లు అందజేయాలని, ఉదయం 9.55 గంటలకు, మధ్యాహ్నం 2.55 గంటలకు ప్రశ్నాపత్రాలను అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. సమావేశంలో పరీక్షల నిర్వహణ రీజనల్ కో ఆర్డినేటర్, సి ఆర్ ఆర్ ఇంజనీరింగు కళాశాల ప్రిన్సిపాల్ ఎ ఆనందకుమార్, కలెక్టరేట్ పరిపాలనాధికారి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పట్టిసీమ, తాడువాయి, శ్రీశైలంలకు ప్రత్యేక బస్సులు
జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 18: మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 19, 20, 21 తేదీలలో పట్టిసీమకు డిపో నుండి 41 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్టు స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్ జి.ఎల్.పి.వి.సుబ్బారావు తెలిపారు. మహాశివరాత్రి ఉత్సవాలకు నడిపే ప్రత్యేక బస్సు సర్వీసులపై డిపోలోని ట్రాఫిక్, గ్యారేజి విభాగం అధికార్లతో శనివారం డి.ఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పట్టిసీమకు జిల్లాలో 120 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. జంగారెడ్డిగూడెం డిపో నుండి 41, తాడేపల్లిగూడెం డిపో నుండి 40, తణుకు డిపో నుండి 30 బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. పట్టిసీమ వద్ద తనతో పాటు తాడేపల్లిగూడెం డిపో మేనేజర్ వెంకటేశ్వరరావు ఇన్‌ఛార్జిలుగా వ్యవహరిస్తూ బస్సుల రాకపోకలు క్రమబద్దీకరించనున్నట్టు తెలిపారు. పట్టిసీమకు జంగారెడ్డిగూడెం నుండి కొయ్యలగూడెం మీదుగా 30 బస్సులు, బుట్టాయగూడెం మీదుగా ఐదు బస్సులు, యాదవోలు మీదుగా ఒక బస్సు, గోపాలపురం మీదుగా ఒక బస్సు నడుపుతున్నట్టు తెలిపారు. పోలవరం ఎగువ గ్రామాల ప్రజల కోసం ఈ ఏడాది పోలవరం - పట్టిసీమ మధ్య షటిల్ సర్వీసుగా నాలుగు బస్సులు నడుపుతామని తెలిపారు. పట్టిసీమ ఆర్డినరీ బస్సుకు 42 రూపాయలు, ఎక్స్‌ప్రెస్ బస్సుకు 52 రూపాయల టిక్కెట్ ఉంటుందని తెలిపారు. పట్టిసీమ నడిచే బస్సులకు ఎటువంటి అంతరాయాలు లేకుండా చూసేందుకు కొయ్యలగూడెంలో ఇద్దరు మెకానిక్‌లు, ఇద్దరు హెల్పర్లు, ఇద్దరు వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, శ్రీశైలం పుణ్యక్షేత్రానికి 19వ తేదీ రాత్రి 7 గంటలకు, 9 గంటలకు రెండు ఎక్స్‌ప్రెస్ బస్ సర్వీసులు నడుపుతామని, టిక్కెట్ ధర 364 రూపాయలని, ఈ సర్వీసులు ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పంచ శివ క్షేత్రాలకు 20వ తేదీ తెల్లవారు ఝాము 3 గంటలకు ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక బస్సు నడుపుతున్నట్టు తెలిపారు. ఈ బస్ టిక్కెట్ ధర 225 రూపాయలని, ఆన్‌లైన్ రిజర్వేషన్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పట్టిసీమ, వీరంపాలెం, నత్తారామేశ్వరం, పాలకొల్లు, భీమవరం క్షేత్రాలకు ఈ బస్సు నడుపుతున్నట్టు తెలిపారు. 20వ తేదీన జంగారెడ్డిగూడెం నుండి వీరంపాలెంకు రెండు ప్రత్యేక బస్సులు నడుపుతామని తెలిపారు.
అంతేగాకుండా ఈ ఏడాది తాడువాయికి కూడా మూడు ప్రత్యేక బస్సులు నడుపుతామని, తాడువాయి సర్వీసులకు డిపో క్లర్క్ కె.ఆశీర్వాదం ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారని తెలిపారు. డిపోకు కొత్తగా ఒక చిన్న బస్సు వచ్చిందని, ఈ బస్సును టేకూరు నైట్‌హాల్ట్‌గా నడుపుతామని తెలిపారు. డిపోకు మరో సూపర్‌లగ్జరీ బస్సు వచ్చిందని, ఈ బస్సును విశాఖపట్నం రాత్రి సర్వీసుగా నడిపేందుకు నిర్ణయించామని డి.ఎం సుబ్బారావు వెల్లడించారు. ఈ సమావేశంలో సీనియర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కె.కె.సత్యవతి, గ్యారేజ్ ఇన్‌ఛార్జి వి.విల్సన్, డిప్యుటి సూపరింటెండెంట్ ఆర్.ఎస్.నారాయణ, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జి.వెంకటేశ్వరరావు, ఆఫీస్ సూపరింటెండెంట్ వి.వి.ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఆదివారం నిర్వహించే వి ఆర్‌వో, వి ఆర్ ఎ పరీక్షల నిర్వహణలో
english title:
j
Date:
Sunday, February 19, 2012