అరవయ్యేళ్ల ఇండియా ఐటి
---------------------
జనమంతా 60 ఏళ్లు ఎప్పుడు నిండుతుందా? అని ఆతృతగా చూస్తుండటం పరిపాటి. ఒక్కో మనిషికి ఒక్కో రకమైన ఆలోచన. ఆఫీసుల్లో పైవారి బాధ భరించలేని వారు విముక్తి కోసం అలా ఆలోచిస్తే, మరి కొందరు 60 ఏళ్లు ఎపుడు నిండేనా, ఎప్పుడు స్వతంత్రంగా ఏదో పని చేసుకుందామా అని ఆత్రంగా చూస్తూంటారు. అలాకాక 60 ఏళ్లొస్తే, రిటైరైపోతే మాకు జరుగుబాటెట్లా? అని వాపోయేవారూ లేకపోలేదు. అవన్నీ పక్కనబెడితే, సమాచార సాంకేతికత అందుబాటులోకి వచ్చి అపుడే అరవై యేళ్లయిందంటే మాత్రం ఔరా? అని ఆశ్చర్యం కలుగక మానదు. 2014కల్లా భారతీయ ఐటి ఎగుమతులు 87 బిలియన్ల అమెరికన్ డాలర్లను అధిగమిస్తుందని ఒక అంచనా. చెప్పాలంటే, భారతీయ జిడిపిలో ఐటి 7 శాతం వాటా కలిగి ఉంది. నేడు 2.4 మిలియన్ల భారతీయులు ఐటి నిపుణులుగా పలు ఉద్యోగాల్లో రాణిస్తున్నారు.
మనకు ఇండియాలో ఐటి ఆనవాళ్లు 1955 నించి కనిపిస్తాయి. కోల్‌కతాలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఐ)లో తొలిసారిగా హెచ్‌ఇసి-2 ఎం అనే ఒక డిజిటల్ కంప్యూటర్‌ను నెలకొల్పారు. ఇది యుకెలో రూపొందింది. దీని వెనుక నాటి డా.మోహీ ముఖర్జీ, అమేష్ రాయ్‌ల కృషి ఎంతో ఉంది. ఆ కంప్యూటర్ మెమరీ చాలా తక్కువ. ఆ కంప్యూటర్నెలా వాడాలో వివరించే మాన్యువల్స్ కూడా లేవు. అలాటి సమయంలో ముఖర్జీ, రాయ్ ద్వయం ప్రతి ఒక్కరికీ సాయం చేశారు. దాన్ని కనీసం ఒక డజను మంది వాడేవారు.
అప్పటికి భారతీయత సంతరించుకున్న కంప్యూటర్ల దాఖలాల్లేవు. ఐతే, దానికి ప్రొఫెసర్ నరసింహన్ ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి (టిఐఎఫ్‌ఆర్) సంస్థలో ఒక పైలట్ ప్రాజెక్ట్ ద్వారా శ్రీకారం చుట్టాడు. ఇదే ఆ తరవాత టిఐఎఫ్‌ఆర్ ఐటోమేటిక్ కాలిక్యులేటర్ లేదా టిఐఎఫ్‌ఆర్‌ఎసి రూపకల్పనకు కారణమైంది. దీన్ని నాటి ప్రధాని నెహ్రూ ఆవిష్కరించారు. అదే మొదటి తరం భారతీయ కంప్యూటర్ అనుకోవాలి.
ఆ తరువాత కోల్‌కతా ఐఎస్‌ఐ, జాదవ్‌పూర్ యూనివర్సిటీతో కలిసి రెండో తరం భారతీయ కంప్యూటర్ ఐఎస్‌ఐజెయు రూపొందించింది. ఇది ట్రాన్సిస్టర్ ఆధారిత కంప్యూటర్. ఐతే, ’60 దశకంలో రెండు ముఖ్యమైన, చారిత్రాత్మకమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిలో ఐఐటి సంస్థల ఏర్పాటు మొదటిది. ఐఐటి కాన్పూర్‌లో విదేశీ సంస్థల ప్రోత్సాహంతో ఐబిఎం కంప్యూటర్ ఐబిఎం 1620ని ఫోర్ర్టాన్ 2 కంపైలర్‌తో నెలకొల్పడం రెండోది. ఫోర్ర్టాన్ 2 అనేది హెచ్చుస్థాయి ప్రోగ్రామింగ్ భాష. దాన్ని నేర్చుకోవడం, వాడటం సులభంగానే ఉండటంతో నెమ్మదిగా, అనేక విద్యా సంస్థలు ఇండియాలో ఐబిఎం, సైబర్ వంటి సంస్థల కంప్యూటర్లను వాడటానికి అలవాటు పడ్డాయి. దీని తర్వాతే ఇండియాలో ప్రిన్సిపుల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అనే పుస్తకాన్ని డా.రాజారామన్ రాశారు. ఆ సమయంలో అదొక బెస్ట్ సెల్లర్. ’70 దశకం ఇండియా ఐటి రంగంలో పెను మార్పులను చూసింది. ఇసిఐఎల్ సంస్థ ట్రాంబే డిజిటల్ కంప్యూటర్ (టిడిసి-12) అనే కంప్యూటర్‌ను రూపొందించింది. ప్రైవేట్ సెక్టార్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 1975లో ఆరంభమైంది. ప్రభుత్వరంగ సంస్థ అయిన కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్ (సిఎంసి) కూడా ఆరంభమైంది. ఆ తర్వాత నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అనేది డా.ఎన్.శేషగిరి నేతృత్వంలో ఆరంభమైంది. నిక్‌నెట్ ద్వారా దేశంలోని అన్ని జిల్లాలనూ, రాష్ట్రాలనూ కంప్యూటర్ కమ్యూనికేషన్స్ నెట్‌వర్క్ మీదకు తెచ్చిన ఘనతతోపాటు ఇ-మెయిల్, ఇంటర్నెట్, వీడియో కాన్ఫరెన్స్‌లను ప్రభుత్వ సంస్థలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత ఈ సంస్థదే.
’80 దశకంకల్లా అటు సిఎంసి, ఇటు టిసిఎస్ లాంటి సంస్థలు విదేశీ ప్రాజెక్టులు చేపట్టి లాభాల బాట పట్టాయి. 1985 నాటికి భారతీయ ఐటి సంస్థల సాఫ్ట్‌వేర్ ఎగుమతులు 30 మిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి. పలు విద్యా సంస్థల్లో ఇఆర్ నెట్ ద్వారా నెట్‌వర్క్ కనెక్టివిటీ మెరుగైంది. ఇంతలో నెమ్మదిగా ప్రైవేట్ సెక్టార్ శకం ఆరంభమైంది. బెంగుళూరు ఐఐఎస్‌సిలో సిలో నేషనల్ సూపర్ కంప్యూటర్ సెంటర్ ఆరంభమైంది. ఇసిఐఎల్, బిఇఎల్ సంస్థల కృషితో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వాడుకలోకి వచ్చింది. అమెరికా ఆంక్షల వల్ల భారతీయ పరమ్ సూపర్ కంప్యూటర్ రూపుదిద్దుకుంది. సిడాట్ ద్వారా శామ్‌పిత్రోడా, ఎన్నైసీ ద్వారా శేషగిరి ఇండియాకు ఇతోధిక గుర్తింపును తెచ్చారు. 1991 నాటి సరళీకరణ విధానాల వల్ల విప్రో, సత్యం, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చుకున్నాయి. వైటూకె (2000 సం.) సమస్యతో భారత ఐటి సంస్థలు బాగా సొమ్ము చేసుకోగలిగాయి. 2010 నాటికి ఐటి ధర్మమా అని ఇండియాలో 2.5 మిలియన్ భారతీయ నిపుణులకు ఉద్యోగాలు దొరికి, 50 బిలియన్ల అమెరికన్ డాలర్ల రాబడిని తెచ్చిపెట్టింది.
ఈ భారతీయ ఐటి పురోగతి వెనుక ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. రానున్న కాలంలో భారతదేశం మరింత బలపడాలని ఆశిద్దాం.
=========
పద పారిజాతం
Workstation -వర్క్ స్టేషన్ అనేది ఇంజనీరింగ్ పనులకై ఉపయోగించే పీసీ. ఇది మామూలు పీసీల కన్నా ఎన్నో రెట్లు శక్తివంతమైనవిగా ఉంటుంది. ఎక్కువ స్థాయిలో పనులు జరుపుకునే వీలు ఉంటుంది. ఇందులో ప్రాసెసర్, డిస్క్ అన్నీ మిగిలిన సాధారణ పీసీలలో కన్నా ఎంతో శక్తివంతంగా ఉండి ఎక్కువ డేటాని వేగంగా ప్రాసెస్ చేయడానికి వీలుని కలిగిస్తాయి.
Worm - వర్మ్ అనేది కూడా ఒక రకమైన వైరస్ ప్రోగ్రాం.
========
షార్ట్ కట్స్ (్ఫటోషాప్ 7.0 టూల్స్)
A పాత్ కాంపొనెంట్ సెలెక్షన్ టూల్
B పెయింట్ బ్రష్ టూల్
C క్రాప్ టూల్
D డిఫాల్ట్ కలర్స్
=========
నెట్ న్యూస్
అమెరికా వీసాలూ, జీతాలూ
అమెరికాలో ఏప్రిల్ మాసానికి 1,65,000 ఉద్యోగాలు జోడించారట. గత రెండు నెలల్లో అమెరికాలో ఉద్యోగాలు జోరందుకున్నాయి. గత నవంబర్ నించి ఏప్రిల్ దాకా చూస్తే, ఒక్క మార్చిలోనే 1,38,000 ఉద్యోగాలు జోడించార్ట. దీంతో అమెరికా నిరుద్యోగ శాతం ఆల్‌టైమ్‌లో అంటున్నారంతా. ఐతే తాజా సర్వే ప్రకారం మరో సంగతి కూడా తెలిసింది. అదేమిటంటే, కేవలం భారతీయుల రాకతోనే అక్కడ జీతాలు పెరిగాయట. అంచేత హెచ్1బి వీసాలతో భారతీయులు తమ ఉద్యోగాలకు గండి కొట్టేస్తున్నారోచ్ అని అమెరికాలో అరవడం తప్పని తేలిపోయింది. పైగా హెచ్1బి వీసాలతో భారతీయులు అక్కడి అమెరికన్లకన్నా ఎక్కువేమీ సంపాదించడం లేదట. అంతేకాదు, భారతీయుల ఐటి నైపుణ్యం ధర్మమా అని అమెరికన్లు వ్యాపారం మీదే ఎక్కువ దృష్టిని పెట్టగలుగుతున్నారనీ, అందువల్ల ఎక్కువ లాభాలు కొట్టేస్తున్నారనీ ఒక సర్వేలో తేలిందట. అంతేకాదు, నిరుద్యోగ భృతి కోసం అభ్యర్థనలూ తగ్గాయట. గత ఐదున్నర సంవత్సరాల్లో ఇది చాలా తక్కువట కూడానూ. ఇదంతా ఇలా ఉంటే, ఇండియాలో టిసిఎస్, ఇన్ఫోసిస్ లాటి ఐటి సంస్థలు మాత్రం మేం ఆట్టే జీతాలు పెంచలేం, మా లాభాలు సోసో అంటున్నాయి.
========
తెలుసుకోవాల్సిన సంగతి..
డిస్క్‌లతో జాగ్రత్తలు
* కంప్యూటర్‌లో ఉండే అన్ని అనవసరపు ఫైల్స్‌ను డిలీట్ చేసేయండి.
* డిస్క్‌లో వైరస్‌లను గుర్తించడానికి యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌ను వాడండి.
* రీరైటబుల్ డిస్క్‌లను రైట్ ప్రొటెక్ట్ చేశాక దానిలో సమాచారాన్ని తుడిచేయడానికి లేదా కొత్తగా రాయడానికి ప్రయత్నించకండి.
*
===========
సామెత: లాండ్ ఫోన్‌కు లొంగనోడు ఇ-మెయిల్‌కు లొంగుతాడా...