సింగపూర్, జూన్ 1: వచ్చే ఏడాది హవాయి దీవిలో ఆగ్నేయాసియా దేశాల రక్షణ మంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అమెరికా ప్రతిపాదించింది. ఆగ్నేయాసియా ప్రాంతంపై పెరిగిపోతున్న చైనా ప్రాబల్యాన్ని ఎదుర్కొనేందుకు ఆగ్నేయాసియా దేశాలు చేస్తున్న కృషికి మద్దతుగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అమెరికా ముందుకు వచ్చింది. అంతకన్నా ముందు ఈ ఏడాది తాను బ్రూనేలో జరిగే ప్రాంతీయ సమావేశంలో ఆగ్నేయాసియా దేశాల రక్షణ మంత్రులను కలుస్తానని అమెరికా రక్షణ మంత్రి చక్ హగెల్ సింగపూర్‌లో జరిగిన ఓ భద్రతా సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. ‘వచ్చే ఏడాది హవాయిలో ఏసియాన్ రక్షణ మంత్రులు కలుసుకోవడానికి ఈ వారం ఇక్కడ నేను ఆహ్వానం పలుకుతున్నాను’ అని హగెల్ చెప్పినట్లు పెంటగాన్ తెలిపింది. అమెరికా తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశం ఈ ప్రాంతానికి పటిష్ఠమైన, శాంతియుతమైన, సుభద్రమైన భవిష్యత్తును అందించడం కోసం తాము తమ అభిప్రాయాలను పంచుకోవడానికి, చర్చించడానికి మరో అవకాశాన్ని అందిస్తుందని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. 10 దేశాలకు సభ్యత్వం ఉన్న ఏసియాన్‌లోని సభ్య దేశాలు బ్రూనే, మలేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాంలతో పాటుగా తైవాన్‌లకు దక్షణ చైనా సముద్రానికి సంబంధించి చైనాతో అంతర్జాతీయ వివాదాలున్నాయి. లావోస్, కంబోడియా లాంటి ఏసియాన్‌లోని చిన్న సభ్య దేశాలు చైనా అందిస్తున్న విదేశీ సహాయం కారణంగా ఆర్థిక, రాజకీయ ప్రభావానికి లోనవుతున్నాయి. దక్షిణ చైనా సముద్ర జలాలతో పాటుగా దాని తీరప్రాంతంలోని భూభాగాలన్నిటిపైనా హక్కు తమదేనని చైనా చెప్పుకుంటూ ఉండడం ఈ వివాదాలకు ప్రధాన కారణం. గత ఏడాది కంబోడియాలో జరిగిన ఏసియాన్ దేశాల మహాసభలో సైతం చైనా ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపించింది.
* అమెరికా ప్రతిపాదన
english title:
america
Date:
Sunday, June 2, 2013