కర్నూలు, జూలై 1: రాష్ట్ర విభజనలో రాయలసీమను పావుగా చేసి ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని, రాయలసీమకు ఏ అన్యాయం జరిగినా అందుకు చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి, జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్) వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. కర్నూలులో సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్ఠానం రాయలసీమను రెండుగా చీల్చడం లేదా రాయలసీమ మొత్తాన్ని తెలంగాణ, కోస్తాంధ్రల్లో ఏదో ఒకదానిలో కలిపేయాలనే ఆలోచన చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చిన సోనియాగాంధీ రాయలసీమను ఏం చేయాలన్న విషయమై నిర్ణయం తీసుకున్న వెంటనే రాష్ట్ర విభజన ప్రకటన వస్తుందన్నారు. విభజన అంటూ జరిగితే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రాయలసీమ నుంచి రాజకీయ నాయకులుగా ఎదిగి, ప్రజాప్రతినిధులై రాష్ట్రాన్ని ఏలిన చంద్రబాబు, ప్రస్తుతం సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి, జగన్ రాయలసీమ విషయంలో నోరు మెదపకపోవడం వల్లే సోనియా తన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుని రాయలసీమకు ఉరి వేయాలని కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. ఆమె ఆదేశాల మేరకే హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేతలు సభ నిర్వహించారన్నారు. తెలంగాణ ఇస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే రాయలసీమను చీల్చాలనో, కోస్తాంధ్ర, తెలంగాణలో కలిపేయాలన్న ఆలోచన చేస్తే మాత్రం సహించే ప్రశే్న లేదని తేల్చి చెప్పారు. హైదరాబాద్‌లో 4వ తేదీ నుంచి 52 గంటల పాటు దీక్ష చేపట్టనున్నామన్నారు. రాయలసీమ నుంచి విద్యార్థి, యువజన సంఘాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాయలసీమ మేథావులు ఈ దీక్షకు మద్దతు తెలుపుతారన్నారు.
బైరెడ్డి డిమాండ్
english title:
rayalaseema
Date:
Tuesday, July 2, 2013