పెద్దారవీడు, జూలై 1: గుర్తుతెలియని వ్యక్తులు బాలుడిని కిడ్నాప్ చేసి 7 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన సంఘటన ప్రకాశంజిల్లా పెద్దారవీడు మండలం బోడిరెడ్డిపల్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. బోడిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చిట్టె వెంకటేశ్వరరెడ్డి కుమారుడు మూడేళ్ల హర్షత్‌రెడ్డిని సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. వెంకటేశ్వరరెడ్డి ఇంటిముందు వెంకటేశ్వరరెడ్డి తల్లి పక్కలో హర్షత్‌రెడ్డి పడుకున్నాడు. వెంకేశ్వరరెడ్డి భార్య పక్కన రెండో కుమారుడు పడుకుని నిద్రిస్తున్నారు. నానమ్మ వెంకటలక్ష్మమ్మ దగ్గర పడుకొన్న హర్షత్‌రెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం ఉదయం కిడ్నాప్ చేసి సెల్‌నెంబర్‌ను చీటిపై రాసి పిన్నీస్‌తో బాలుడి తల్లి కోటేశ్వరమ్మ చీర కొంగుకు తగిలించి వెళ్లారు. నానమ్మ వెంకటలక్ష్మమ్మ, బాలుడి తల్లి కోటేశ్వరమ్మ విలేఖరులతో మాట్లాడుతూ తెల్లవారుజామున లేచి చూడగా హర్షత్‌రెడ్డి కనిపించలేదని, దీనితో బాలుడి తల్లిదండ్రులను నిద్రలేపగా చీరకు చీటి ఉన్నవిషయాన్ని గమనించి ఫోన్ చేయగా మేము మీ బాలుడిని కిడ్నాప్ చేశామని, 7 లక్షల రూపాయలు ఇస్తే వదిలేస్తామని, పోలీసులకు సమాచారం అందిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలిపారు. తన భర్త వెంకటేశ్వరరెడ్డి ఆటో తోలుకొని జీవిస్తున్నామని, 7 లక్షలు కట్టే స్తోమత తమకు లేదని, ఎందుకు మా అబ్బాయిని కిడ్నాప్ చేశారోనని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎవరికీ ఎలాంటి హాని చేయలేదని, తమ పిల్లవాడిని అప్పగించాలని వారు కోరుతున్నారు.
నకిలీ ఆధార్ గుట్టు రట్టు
పెద్దపంజాణి, జూలై 1: నకిలీ ఆధార్‌కార్డులు తయారుచేస్తున్న ముఠా గుట్టును సోమవారం పెద్దపంజాణి పోలీసులు బట్టబయలు చేశారు. ఎస్‌ఐ నాగరాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలోని కోగిలేరు పంచాయతీ పొత్తగానిపల్లెలో ఆదివారం రాత్రి గంగవరం మండలం పమ్మిరెడ్డిపల్లెకు చెందిన రాజేంద్ర (23), కోగిలేరుకు చెందిన శివశంకర్‌రెడ్డి, గిరిబాబు ముగ్గురు గ్రామస్థులకు మాయమాటలు చెప్పి ఆధార్‌కార్డులు ఇప్పిస్తామని ఒక్కొక్కరి వద్ద 100 రూపాయల వంతున వసూలు చేసి నకిలీకార్డులు పంపిణీ చేశారు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు నిమిషాల వ్యవధిలో ఆధార్‌కార్డులు ఇవ్వడం నమ్మశక్యం కాక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ నాగరాజు పొత్తగానిపల్లెకు చేరుకుని నకిలీ ఆధార్‌కార్డులు పంపిణీ చేసే ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్, వెబ్ కెమేరాలను స్వాధీనం చేసుకుని నిందితులను విచారణ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు.
* రూ. 7లక్షలు డిమాండ్ * డాగ్‌స్వ్కాడ్ తనిఖీలు
english title:
kidnap
Date:
Tuesday, July 2, 2013