కడప, జూలై 1: కడప వైఎస్సార్ జిల్లాలో మళ్లీ ఏనుగుల విధ్వంసం మొదలయింది. నెల రోజుల క్రితం జిల్లాను అతలాకుతలం చేసిన ఏనుగుల మంద పక్క జిల్లాకు తరలిపోయింది. దాదాపు రెండు నెలల పాటు తిష్టవేసి వేల ఎకరాల్లో పంట నాశనం చేశాయి. మామిడి తోటలు ధ్వంసమయ్యాయి. కొబ్బరి చెట్లు కూలిపోయాయి. బోరుషెడ్లు పడిపోయాయి. దీనితో వందల కోట్ల రూపాయల్లో నష్టం జరిగింది. ఆ నష్టం నుంచి రైతులు కోలుకోకుండానే నాలుగు రోజుల క్రితం ఏనుగుల మంద మళ్లీ జిల్లాలో ప్రవేశించింది. గతంలో రాయచోటి మండలంలో స్వైరవిహారం చేసిన ఏనుగులు ఈసారి సుండుపల్లె మండలంలో విజృంభించాయి. చిత్తూరు జిల్లా కెవి పల్లె అటవీ ప్రాంతాల మీదుగా సుండుపల్లెలో ప్రవేశించిన ఏనుగులు నాలుగు రోజులుగా విధ్వంసం సృష్టిస్తున్నాయి. మామిడి చెట్లు, కూరగాయల పంటలు, వరి పైర్లను ధ్వంసం చేశాయి. ఆరోగ్యపురం, శివరాంపురం, కటారుమూడు ప్రాంతాల్లో స్వైరవిహారం చేశాయి. పంట పొలాల వద్ద రాత్రి సమయాల్లో కాపలాకు వెళ్లిన ఆ ప్రాంతంలోని రైతులు, కూలీలు ఏనుగుల మంద ఘీంకారాలకు భయపడి పరుగులు తీసి ఇళ్లకు చేరారు. అయితే విషయం తెలియని రాజానాయక్ అనే రైతు విద్యుత్ సరఫరా వస్తే బోరు వదలడానికి బోరు షెడ్ వద్దనే ఉండిపోయాడు. అంతా ఇళ్లకు చేరి ఆ రైతు మాత్రమే ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు బంధువులు స్థానికులతో కలిసి మళ్లీ పొలానికి వెళ్లారు. రైతును బలవంతంగా తీసుకువచ్చారు. వారంతా అక్కడ నుండి కదిలిన నిముషాల్లోనే ఏనుగులు ప్రాంతానికి వచ్చాయి. ఓ పక్క పంట పొలాలను ధ్వంసం చేస్తూనే రాజానాయక్ బోరు షెడ్‌లోకి ప్రవేశించాయి. షెడ్‌ను ధ్వంసం చేసి బోరు మోటారును పెకిలించేశాయి. బంధువులు, గ్రామస్తుల చొరవతో రాజానాయక్ ప్రాణాలతో బయట పడ్డాడు. అక్కడికి వచ్చిన వారందరికీ చావుతప్పినట్లయింది. ఈ సంఘటనతో ఆ ప్రాంత ప్రజల ప్రాణాలు అరచేతిలోకి వచ్చేశాయి. ఆదివారం కూడా మండలంలోని మాచిరెడ్డిగారిపల్లె పరిసరాల్లో పంట పొలాలను ధ్వంసం చేశాయి. మామిడి చెట్లను వేళ్లతో సహా పెకిలించేశాయి.అధికారులు స్పందించి తమ ప్రాణాలకు, పంటలకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు.
* తోటల ధ్వంసం, బోరు మోటార్లను పెకిలించిన గజరాజులు
english title:
jumbos
Date:
Tuesday, July 2, 2013