న్యూఢిల్లీ, జూలై 2: రాష్ట్ర విభజనను ప్రతిపాదిస్తూ విధానసభలో ప్రవేశపెట్టే తీర్మానం నూటికి నూరుశాతం వీగిపోతుందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదించే తీర్మానాన్ని ఓడించి సమైక్య రాష్ట్రం యధాతథంగా కొనసాగే బాధ్యత తమపై ఉందన్న నిజాన్ని ప్రతి ఒక్క శాసనసభ్యుడు గుర్తించాలని ఆయన విలేఖరుల సమావేశంలో హితవు చెప్పారు. విధానసభలో వీగిపోయిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం చట్టవిరుద్ధం అవుతుందని అంటూ బిల్లును ప్రతిపాదించే ప్రయత్నం చేస్తే సభ నడవదని ఆయన కరాఖండిగా చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన దిగ్విజయ్ సింగ్ తెలంగాణపై వ్యక్తం చేసిన అభిప్రాయాలపై లగడపాటి తీవ్రంగా స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికల తరువాత విధానసభలో తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన తీర్మానాన్ని ప్రతిపాదించే అవకాశాలున్నట్లు తనకు రూఢీగా తెలిసిందని ఆయన చెప్పారు. అయితే తీర్మానం ఎలా ఉంటుంది? రాయల తెలంగాణ ఏర్పడుతుందా? లేక రాయల ఆంధ్ర ఆవిర్భవిస్తుందా? చూడాలని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని అత్యధిక ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. తీర్మానం ఎలా ఉంటుంది? తీర్మానాన్ని ప్రతిపాదించినప్పుడు తమ సభ్యులేమి చేయాలన్న విషయమై పార్టీనుంచి ఎలాంటి సంకేతాలు అందలేదని ఆయన చెప్పారు. తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయవలసిందిగా పార్టీ జారీచేసే విప్‌ను ఉల్లంఘిస్తారా? అని ప్రశ్నించగా వేచి చూడండని ఆయన జవాబిచ్చారు. తీర్మానాన్ని ఓడించవలసిన అవసరంపై ప్రజాప్రతినిధులలో అవగాహన పెంచటానికి తగిన చర్యలు తీసుకుంటామని లగడపాటి చెప్పారు. విధానసభ తీర్మానంతో నిమిత్తం లేకుండా కేంద్రం నేరుగా తెలంగాణ బిల్లును ప్రతిపాదించే ఆస్కారం లేదని ఆయన వాదించారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించటానికి విధానసభలో తీర్మానాన్ని ప్రతిపాదించటం జరుగుతుందని డిసెంబర్ 9న చిదంబరం ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ యువతను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న నాయకులను అరెస్టుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు అనుకూలంగా తెలుగుదేశం కూడా లేఖను ఇవ్వటంతో అత్యధిక పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయన్న అభిప్రాయం బలపడిందని ఆయన చెప్పారు.
అయితే ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పరిణామాలు పరిస్థితిలో మార్పు తెచ్చాయని ఆయన అభిప్రాయ పడ్డారు. సమైక్యాంధ్రకే అంకితమైన తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అడుగుజాడలలో నడవలసిందిగా ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. తెలుగుతల్లి మెడపై వేలాడుతున్న విభజన కత్తి తమ మెడపై కూడా వేలాడుతోందన్న పచ్చి నిజాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి తీర్మానం వీగిపోయేట్లు చూడాలని ఆయన సూచించారు. తీర్మానాన్ని ఓడించి రాష్ట్ర విభజనను అడ్డుకు తీరుతామని ఆయన శపథం చేశారు. రాష్ట్రం విడిపోతే తాను రాజకీయాలనుంచి శాశ్వతంగా నిష్క్రమిస్తానని ఆయన ప్రకటించారు. జౌళి శాఖ మంత్రి కె ఎస్ రావు వైఖరిలో మార్పులేదని ఆయన చెప్పారు.
రాష్ట్రం విడిపోతే రాజకీయాలనుంచి తప్పుకుంటా సమైక్య రాష్ట్రం ప్రతి ఎమ్మెల్యే బాధ్యత విజయవాడ ఎంపి లగడపాటి
english title:
t
Date:
Wednesday, July 3, 2013