విశాఖపట్నం, జూలై 3: కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలంటే భయమని అందుకే రెండేళ్లుగా స్థానిక ఎన్నికలు జరపకుండా కాలయాపన చేసిందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిన కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికల్లో ఏదో విధంగా గెలుపొందాలని కుయుక్తులు పన్నుతోందని బుధవారం ఆరోపించారు. పంచాయతీలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెత్తనాన్ని సాగనీయబోమని బాబు హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల పార్టీ ప్రతినిధులు ప్రాంతీయ సదస్సు ఇక్కడ జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని, వ్యవస్థలను భ్రష్ఠు పట్టించిందని విమర్శించారు. స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని టిడిపి అధినేత విరుచుకుపడ్డారు. కోట్లాది రూపాయల ‘స్థానిక’ నిధులను దారి మళ్లించి, తద్వారా కాంగ్రెస్ నాయకులు తమ జేబులు నింపుకొన్నారని ఆరోపించారు. టిడిపి హయాంలో స్థానిక సంస్థలకు పద్ధతి ప్రకారం జరిగాయని ఇప్పుడలాంటి పరిస్థితి లేదని అన్నారు. అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు వెళ్ళేందుకు భయపడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. గ్రామ పాలనా వ్యవస్థను అస్తవ్యస్తం చేసి స్పెషలాఫీసర్ల కనుసన్నలలో పంచాయతీ నిధులను కాంగ్రెస్ వారు స్వాహా చేశారని తీవ్రంగా ఆరోపించారు. సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చి కాంగ్రెస్ నేతలు సిఫార్సు చేసినవారికే పథకాల లబ్ధి చేకూర్చారని టిడిపి అధినేత ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికలు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు నాంది అవుతాయని ఆయన స్పష్టం చేశారు.
బుధవారం విశాఖపట్నంలో జరిగిన టిడిపి ప్రాంతీయ సదస్సులో పంచాయతీ ఎన్నికల ఢంకా బజాయస్తున్న చంద్రబాబు
..................
యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్
బోగీ నుంచి పొగలు
చాగల్లు, జూలై 3: యశ్వంత్‌పూర్-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్యాంట్రీ కార్ బోగీ కింది భాగంలో దట్టమైన పొగలు వెలువడటంతో బుధవారం మధ్యాహ్నం పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు స్టేషన్‌లో మూడు గంటల పాటు నిలిపివేశారు. సిబ్బంది సకాలంలో స్పందించి, అదుపుచేయడంతో పెనుప్రమాదం తప్పింది. అనంతరం ఆ బోగీని రైలు నుండి వేరుచేసి, ముందుకు పంపించారు. యశ్వంత్‌పూర్-హౌరా సూపర్‌ఫాస్ట్ (నెం.12864) ఎక్స్‌ప్రెస్ బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు నిడదవోలు స్టేషన్‌ను దాటుతుండగా ప్యాంట్రీకార్ కింద నుంచి పొగలు వస్తున్నట్టు స్టేషన్ సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆ సమాచారాన్ని రైలు గార్డుకు, ప్యాంట్రీ కార్ మేనేజర్‌కు అందజేశారు. వెంటనే రైలును బ్రాహ్మణగూడెం-గరప్పాడు గ్రామాల మధ్య నిలిపివేశారు. వెంటనే వారి వద్దనున్న అగ్నిమాపక పరికరాలతో పొగలను అదుపుచేశారు.
తరువాత రైలును దగ్గర్లోని చాగల్లు స్టేషన్‌కు తీసుకువచ్చారు. చక్రాల పక్కన ఉండే హాట్ యాక్సిల్ హెడ్‌లో అధిక ఉష్ణం వల్ల పొగలు వచ్చినట్టు రైల్వే సాంకేతిక సిబ్బంది గుర్తించారు
ఉత్తరాఖండ్‌కు
రిటైర్డ్ ఉద్యోగుల విరాళం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 3: ఉత్తరాఖండ్‌లో ఇటీవల సంభవించిన వరదల నేపథ్యంలో జరిగిన భారీ నష్టంపై రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు స్పందించారు. తమకు వచ్చే మూల వేతనంలో ఒక రోజు వేతనాన్ని ఉత్తరాఖండ్‌కు ఇవ్వాలని నిర్ణయించి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ మేరకు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గోపాలకృష్ణ, కార్యదర్శి అబ్రహాం, ఇతర సంఘం నేతలు బుధవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కలిసి అంగీకార పత్రాన్ని అందించారు. ఈ మొత్తం దాదాపు పాతిక కోట్ల రూపాయలు ఉంటుంది. సహృదయంతో ముందుకు వచ్చిన సంఘం నేతలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు.
నరసింహరాజుకు నివాళి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 3: కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే యువతకు టిడిపి దివంగత నేత పివి నరసింహరాజు జీవితం ఆదర్శమని టిడిపి ఉపాధ్యక్షులు ఇ పెద్దిరెడ్డి అన్నారు. బుధవారం ఎన్టీఆర్ భవన్‌లో పివి నరసింహరాజుకు టిడిపి నేతలు, కార్యకర్తలు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమవరం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికైన నరసింహరాజు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారని గుర్తుచేశారు. 1983లో ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజు రాజకీయాల్లోకి వచ్చారన్న ఆయన రైతాంగ సమస్యలపై నరసింహరాజు అలుపెరుగని పోరాటం చేశారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విశాఖ ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు
english title:
c
Date:
Thursday, July 4, 2013