న్యూఢిల్లీ, జూలై 3: జార్ఖండ్‌లో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు అంశంతో పాటు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం)తో పొత్తు విషయమై చర్చలు తుది దశకు చేరుకోవడంతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరిపారు. తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులకు సంబంధించిన కాంగ్రెస్ ఉపకమిటీకి సారథ్యం వహిస్తున్న రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ, జార్ఖండ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి బి.కె.హరిప్రసాద్, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్, జార్ఖండ్ పిసిసి అధ్యక్షుడు సుఖ్‌దేవ్ భగత్, కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు రాజేంద్ర సింగ్ ప్రభృతులు బుధవారం ఉదయం సోనియా గాంధీని కలుసుకుని జెఎంఎంతో ఇప్పటివరకూ జరిపిన చర్చల పురోగతిని వివరించారు. అంతకుముందు సుఖ్‌దేవ్ భగత్, రాజేంద్ర సింగ్, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సర్‌ఫ్రాజ్ అహ్మద్ ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్ యాదవ్‌ను కలుసుకున్నారు. జార్ఖండ్‌లో నూతన ప్రభుత్వానికి ఆర్‌జెడి మద్దతు ఇస్తుందని తాను పూర్తి విశ్వాసంతో ఉన్నట్టు ఈ భేటీ అనంతరం రాజేంద్ర సింగ్ తెలిపారు. జార్ఖండ్‌లో ముఖ్యమంత్రి పదవిని జెఎంఎంకు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించగా, అందుకు ప్రతిగా రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాల్లో సింహభాగాన్ని (14 సీట్లను) కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు జెఎంఎం అంగీకరించిందని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. జార్ఖండ్‌లో తదుపరి ముఖ్యమంత్రిగా చెప్పబడుతున్న హేమంత్ సోరెన్ (జెఎంఎం అధినేత శిబూ సోరెన్ కుమారుడు) మంగళవారం రాత్రి లాలూప్రసాద్ యాదవ్‌తో సమావేశమై రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు తెలపాల్సిందిగా కోరారు. ఈ సమావేశానికి కొద్ది గంటల ముందు ఆంటోనీతో పాటు సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌తో సోరెన్ సుదీర్ఘ మంతనాలు జరిపారు. జార్ఖండ్‌లో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలపై వీరు ప్రధానంగా చర్చించినట్టు సమాచారం.
కాంగ్రెస్ సీనియర్లతో సోనియా చర్చలు ముఖ్యమంత్రి పదవి జెఎంఎంకు?
english title:
j
Date:
Thursday, July 4, 2013