న్యూఢిల్లీ, జూలై 6: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య శనివారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌తో విడివిడిగా సమావేశమయ్యారు. కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన రామచంద్రయ్యపై గుర్రుగా ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలన్న పట్టుదలతో ఉన్నారు. కరెంటు చార్జీల పెంపు పార్టీ ప్రయోజనాలకు మంచిది కాదని వాదించటంతోపాటు తన నాయకుడైన చిరంజీవికి ముఖ్యమంత్రి కావటానికి అవసరమైన అన్ని అర్హతలూ ఉన్నాయని రామచంద్రయ్య చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలను ముఖ్యమంత్రి తీవ్రంగా తీసుకున్న విషయం తెలిసిందే. కడపకు చెందిన డిఎల్ రవీంద్రారెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసినప్పుడు కూడా రామచంద్రయ్యకు ఉద్వాసన చెప్పటానికి ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నాలకు చిరంజీవి బ్రేకు వేశారు. ముఖ్యమంత్రికి, తనకు మధ్య తీవ్రస్థాయిలో పోరాటం జరిగినప్పుడు రామచంద్రయ్య అధినాయకత్వాన్ని కలిసే ప్రయత్నం చేయలేదు. అయితే శనివారం ఆయన హఠాత్తుగా ఢిల్లీ వచ్చి పార్టీ అధినేత్రిని కలవడం ప్రత్యేకతను సంతరించుకుంది. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను సోనియాకు వివరించటంతోపాటు ప్రజా రాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైనప్పుడు ఇచ్చిన హామీల అమలుపై చర్చించినట్లు తెలిసింది. తెలంగాణను ఏర్పాటు చేసిన పక్షంలో రాయలసీమలో తలెత్తే పరిణామాపై ఆయన వాస్తవమైన నివేదికను అందచేశారని తెలిసింది. సాయంత్రం ఆయన దిగ్విజయ్‌తో సమావేశమయ్యారు.
సాయిప్రతాప్ డిమాండ్
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసినపక్షంలో రాయలసీమను కూడాప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి సాయి ప్రతాప్ డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియ జరిగితే మూడు రాష్ట్రాలు ఏర్పడి తీరాలని ఆయన స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర విభజన జరిగే అవకాశాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య శనివారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ
english title:
ramachandraiah
Date:
Sunday, July 7, 2013