![](http://www.andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/7byreddi.jpg)
హైదరాబాద్, జూలై 6: కేంద్ర ప్రభుత్వానికి, సోనియా గాంధీకి రాయలసీమ ప్రజల ఆత్మగౌరవం పట్టదా అని వారిని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. సీమ ప్రజలకు అన్నం కన్నా ఆత్మగౌరవమే ముందని, ఆ ఆత్మగౌరవంతోనే ఎన్ని కరవు కాటకాలు ఎదురైనా ఆత్మస్థైర్యంతోనే బతుకుతున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక రాయలసీమ సాధనకు ఆయన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన 52 గంటల నిరాహార దీక్ష శనివారం సాయంత్రం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ సింహ గర్జన పేరుతో చేపట్టిన ఈ దీక్షతో సీమ నేతల వెన్నులో వణుకు పుట్టిందని ఇది తమ దీక్ష విజయన్నారు. అలాగే ఈ దీక్షకు తెలంగాణ ప్రాంత నేతలు సైతం సంఘీభావం ప్రకటించడం తమ తొలి విజయంగా ఆయన అభివర్ణించారు. రాయలసీమ నేతల వల్లే సీమలోని ఫ్యాక్టరీలు మూతపడి ప్రజలు వలసలు దౌర్భాగ్యం దాపరించిందని మండిపడ్డారు. సమైక్యాంధ్రలో అర్ధాకలితో బతికామని ఇకా మాకా దుస్థితి వద్దని మా రాష్ట్రం మాకు ప్రకటించండని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచీ సీమ వెనక్కి తప్ప ముందుకు సాగలేదన్నారు. ఆత్మగౌరవమే సీమ ప్రజల ఆస్తి అని రాయల తెలంగాణ పేరుతో దాన్ని విభజించాలని చూస్తే సీమ ప్రజలు రాజకీయ భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. సీమ ప్రజలు మేల్కొనాలని లేకపోతే కేంద్రం రాయలసీమను రాష్ట్ర పటంతలో లేకుండా చేస్తుందన్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు బైరెడ్డి, రాయలసీమ జెఎసి కార్యనిర్వాహక సభ్యుడు వేణుగోపాల్ రెడ్డిల దీక్షను రాయలసీమ నుంచి పట్టణానికి వలస వచ్చిన ఒక వలస కూలీ చేత నిమ్మరసం తాగించి విరమింపజేశారు. అంతకు ముందు దీక్ష శిబిరాన్ని సినీ నటుడు నరేష్, గద్దర్, తదితరులు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ.. రాయలసీమను విభజించే హక్కు కేంద్రానికి లేదని, తెలంగాణపై కాంగ్రెస్ రోడ్డు మ్యాప్ సాధారణ, పంచాయతీ ఎన్నికల రోడ్డు మ్యాప్ అని విమర్శించారు. ప్రత్యేక రాయలసీమ డిమాండ్‌కు తెలంగాణ ప్రజలు మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని ఆయన ప్రకటించారు. సినీ నటుడు నరేష్ మాట్లాడుతూ.. స్వార్థ రాజకీయల కోసం మూడు ప్రాంతాల ప్రజలతో కేంద్రం ఆడుకుంటోందని, రాష్ట్రాన్ని విభజించడానికి మీరెవరని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. దీక్ష శిబిరం వద్ద తన ఆటాపాటలతో అలరించారు. (చిత్రం) రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి చేపట్టిన 52 గంటల దీక్షను విరమింపజేస్తున్న రాయలసీమ వలస కూలీ