సబ్‌కలెక్టరేట్, జూలై 9: ఎన్నికల కోడ్ ఉల్లఘించి సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గ కన్వీనర్ గౌతంరెడ్డిని సత్యనారాయణపురం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 64వ జయంతి సందర్భంగా సోమవారం ఉదయం గౌతంరెడ్డి సత్యనారాయణపురం భగత్‌సింగ్‌రోడ్డులో కేక్ కట్ చేసి విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేసిన తర్వాత బైక్‌ర్యాలీ నిర్వహిస్తూ నియోజకవర్గంలో పలుచోట్ల వైఎస్‌ఆర్ జయంతి నిర్వహించారు. ఇది ఎన్నికల కోడ్‌కి విరుద్ధమని సత్యనారాయణపురం స్టేషన్ సిఐ సత్యనారాయణ మంగళవారం ఉదయం గౌతంరెడ్డి ఇంటికి వచ్చారు. అరెస్ట్ విషయం తెలుసుకున్న గౌతంరెడ్డి అనుచరులు, పార్టీ నాయకులు అక్కడకు చేరుకోవడంతో కార్యకర్తల నినాదాల మధ్యనే గౌతంరెడ్డిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. గౌతంరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి అక్రమ అరెస్ట్‌లకు ఏమాత్రం లొంగమని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రాంతీయ సదస్సుల పేరుతో సభలు నిర్వహిస్తున్నాడని చెప్పారు. మంత్రి పితాని సత్యనారాయణ పలుచోట్ల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నాడని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా పలు ప్రాంతాల్లో ప్రారంభాలు చేస్తున్నారని తెలియజేశారు. వీరిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేయకుండా దివంగత ముఖ్యమంత్రికి నివాళులు అర్పించటాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకూడా కోడ్ ఉల్లంఘించారని గౌతంరెడ్డి ఆరోపించారు. పోలీసులు కావాలనే ఈ విధంగా కక్ష్య సాధింపులకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. గౌతమ్‌రెడ్డితో పాటు పార్టీ నాయకులు యాదల శ్రీనివాసరావు, కె.రత్నకుమార్, ఎం.రాజా, వి.చైతన్య, రుహుల్లాపై కేసు నమోదు చేసి సత్యనారాయణపురం స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. వెంటనే ఇదే కేసుపై పాయకపురం పోలీసులు నాయకులను మళ్ళి అరెస్ట్ చేసి బెయిల్‌పై విడుదల చేశారు. సత్యనారాయణపురం స్టేషన్‌లో 147, 148, 296 సెక్షన్లలపై మొత్తం 12 మందిపై కేసు నమోదు చేశారు.
సవరించిన చట్టాల ప్రకారం పన్ను వసూలు
అజిత్‌సింగ్‌నగర్, జూలై 9: నగర పాలక సంస్థకు దీర్ఘకాలంగా ఉన్న ఆస్తిపన్ను బకాయిలను చెల్లించకుండా కోర్టుకు వెళ్ళిన పన్నుదారులపై కూడా సవరించిన చట్టాల ప్రకారం వెంటనే పన్ను వసూలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నగరపాలకసంస్థ కమిషనర్ జిఎస్ పండాదాస్ ఆదేశించారు. అలాగే పన్ను వసూళ్ళలో సిబ్బంది, అధికారులు ఎటువంటి అలక్ష్యం చేయకుండా సక్రమంగా విధులను నిర్వహించాలని, అలసత్వం వహించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. నగర పరిధిలోని మూడవ సర్కిల్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కమిషనర్ పండాదాస్ మాట్లాడుతూ 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉన్న పన్ను బకాయిలను తక్షణమే వసూలు చేయాలన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ సర్కిల్ పరిధిలోని సిఎంఏ కేసుల వివరాలు, వాటి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కేసులకు సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని తెలిపారు. పన్ను చెల్లింపులో ఉత్పన్నమైన వివాదాలపై కోర్టుకు వెళ్ళిన కమర్షియల్ కాంప్లెక్స్‌ల అద్దెదారులకు ఆక్యుపెన్సీ నోటీసు ఇచ్చి పన్ను చెల్లించకపోతే సదరుషాపులను సీజ్ చేయుటకు గల అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. అదేవిధంగా కోర్టు కేసులో ఉన్న పన్నుదారులు తమ పాత పన్నుబకాయిలకు సంబంధించి డిడిలు, చెక్కుల ద్వారా చెల్లించిన యజమానులు తప్పని సరిగా ఆయా వార్డు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం అందజేయాలని సూచించారు. అంతేకాకుండా దీర్ఘకాలంగా పన్ను చెల్లించకుండా ఉన్న బకాయిదారుల గృహాలకు చెందిన వౌళిక వసతులను కల్పించకుండా నిలిపివేయాలని అధికార్లను ఆదేశించారు. నగర పాలక సంస్థకు అనుకూలంగా వచ్చిన సిఎంఎ కేసులపై వెంటనే అవసరమైన చర్యలు చేపట్టి ఆస్తిపన్ను బకాయిలను తక్షణమే చల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పన్ను దారులు ఇచ్చిన చెక్కులు ఏవైనా బౌన్స్ అయిన వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి సంబంధిత యజమానులపై సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సర్కిల్ వారిగా ఆక్యుపెన్సీ సర్ట్ఫికేట్‌లో చూపిన కొలతలు ప్రకారం డివేషన్ లేకుండా ఉన్న వాటికి నెల లోపు అసెస్‌మెంట్ వేయాలన్నారు. ఆక్యుపెన్సీ సర్ట్ఫికేట్‌లో ఏవైనా డివియేషన్ ఉంటే వెంటనే రిపోర్టు రీ సర్వే చేసిన అసెస్‌మెంట్ వివరాలను వార్డు వారిగా ప్రోపర్టీ టాక్స్ వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఎవరైనా వారి స్థలానికి కాని ఆస్తికి గానీ పన్ను వేయాలని అర్జీలు ధాఖలు చేసినప్పుడు సదరు ఆస్తికి సంబంధించిన అన్ని పత్రాలను నిశితంగా పరిశీలించి పన్ను వేయాలని తెలిపారు. కార్పొరేషన్‌కు చెందిన స్థలాలకు చుట్టూ ఫెన్సింగ్ వేసి కార్పొరేషన్ బోర్డులను ఏర్పాటుచేయాలన్నారు. ఈ సమావేశంలో సిఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం సత్యనారాయణరాజు, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) వెంకటలక్ష్మి, అసిస్టెంట్ కమిషనర్ బి సాంబశివరావు పాల్గొన్నారు.