Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

రాపూరులో ఎన్నికల కోలాహలం

$
0
0

రాపూరు, జూలై 13: జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న నామినేషన్ల దాఖలు ప్రక్రియ శనివారం పూర్తయింది. గత మూడు రోజులుగా మండలంలోని 21 గ్రామపంచాయతీలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల దరఖాస్తులు శనివారం సాయంత్రం పూర్తయింది. ఇందులో జోరేపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్‌గా వెంకటరావమ్మ నామినేషన్ ఒక్కటే దాఖలు కావటంతో దాదాపుగా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికానుంది. అలాగే రాపూరు గ్రామపంచాయతీకి టిడిపి, కాంగ్రెస్, వైకాపాలు బలపర్చే అభ్యర్థులతోపాటు మరికొందరు నామినేషన్లు దాఖలు చేసారు. ఇందులో తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థి బత్తిన శ్రీప్రియకు మద్దతుగా వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ పెద్ద ఎత్తున అనుచరులు, అభిమానులతో ఊరేగింపుగా నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి నలవడ్డ సునందన మద్దతుగా పిసిసి సభ్యులు, రాపూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు చెన్ను బాలకృష్ణారెడ్డి అనుచరులతో పెద్దఎత్తున ఊరేగింపుగా హాజరై నామినేషన్ దాఖలు చేయించారు. పిట్టబోయిన సుదర్శనమ్మ, తుమ్మలపల్లి శ్రీదేవి, బత్తిన లక్ష్మి, వెలుగోటి ప్రమీల, పి లక్ష్మిలు సర్పంచ్ స్థానానికి నామినేషన్లు దాఖలు చేసారు. మండలంలోని మొత్తం గ్రామపంచాయతీలకు 107 మంది సర్పంచ్ అభ్యర్థులుగా, 550 మంది వార్డు సభ్యులుగా నామినేషన్లు దాఖలు చేసినట్టు మండల ఎన్నికల అధికారి, రాపూరు ఎంపిడిఓ గోపి తెలిపారు. కాగా చివరి రోజైన శనివారం వివిధ రాజకీయ పార్టీలు ర్యాలీలు, నినాదాలతో రాపూరు పట్టణం కోలాహలంగా మారింది.

ఎర్రచందన దొంగలు అరెస్ట్
సూళ్లూరుపేట,జూలై 13: సూళ్లూరుపేట మండలం కోటపోలూరు వద్ద ఇటీవల ఎర్రచందన వాహనాన్ని వదిలి పరారైన ఇద్దరు దొంగలను శనివారం సూళ్లూరుపేట పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ అంకమరావు సమాచారం మేరకు చిత్తూరు జిల్లా తిరుచానూరు ప్రాంతానికి చెందిన దొంతి మణి, చంద్రవౌళిరెడ్డి, చేవూరి మధు అనే ముగ్గరు ఈ నెల 1న స్కార్పియో వాహనంలో చిత్తూరు జిల్లా నుండి 21 ఎర్ర చందన దుంగలను వేసుకొని కోటపోలూరుకు చేరుకొని, అక్కడ ఆలయ సమీపంలో వాహనాన్ని పొదలచాటు దాచిపెట్టి వెళ్లారు. పోలీసులకు సమాచారం అందడంతో ఎస్‌ఐ తన సిబ్బందితో అక్కడకెళ్లి వాహనాన్ని పరిశీలించగా అందులో ఎర్రచందన దుంగలున్నట్లు కనుగొన్నారు. దీంతో వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. స్మగ్లర్లకోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి శనివారం నిందితులను అదుపులోకి తీసుకొన్నారు. ఈ మేరకు వీరిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు ఎస్‌ఐ తెలిపారు.

జగన్నాథ రథయాత్ర ప్రారంభం
గూడూరు, జూలై 13: గూడూరు పట్టణంలో కనీవినీ ఎరుగని రీతిలో శనివారం నెల్లూరు ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో దాతల ఔదార్యంతో గూడూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభం కాగా భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సొసైటీలోని దువ్వూరు నారాయణరెడ్డి పురమందిరం నుండి ఈ రథయాత్ర ప్రారంభించారు. ప్రారంభోపన్యాసంలో వక్తలు మాట్లాడుతూ జగన్నాథ రథయాత్రలో జగన్నాథుని దివ్య స్వరూపాన్ని దర్శించుకొని సేవించుకునే అవకాశం లభిస్తుందన్నారు. జగన్నాథ రథయాత్ర లక్షల సంవత్సరాల వైదిక సంప్రదాయంలో జరుగుతున్న దివ్య ఉత్సవమని పేర్కొన్నారు. ప్రస్తుత సమయంలో దీని ప్రాముఖ్యాన్ని గుర్తించి అన్ని పట్టణ ప్రాంతాల్లో జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గూడూరులో మొట్టమొదటిసారిగా భక్తుల సహాయ సహకారాలతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రథం హైడ్రాలిక్ సిస్టంతో తయారుచేయడం వలన చిన్న చిన్న వీధుల్లో సైతం సునాయాసంగా నిర్వహించారు. ఈ యాత్ర డిఎన్‌ఆర్ టౌను హాలు నుండి ప్రారంభమై మార్కెట్ సెంటర్ మీదుగా సంగం థియేటర్, గాంధీబొమ్మ, బనిగీసాహెబ్ పేట, సుందరమహల్, టవర్ క్లాక్, రాజావీధి, కుమ్మర వీధి మీదుగా తిరిగి రాత్రికి టౌన్ హాలుకు చేరుకుంది. ఈ సందర్భంగా రథం ముందుగా వివిధ రకాల వాయిద్యాలు, కోలాటాలు, భజనలు, హరేరామ, హరేకృష్ణ నామ సంకీర్తన, భజంత్రీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తంజావూరు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా 108 వంటకాలు తయారుచేసి స్వామివార్లకు నైవేద్యంగా సమర్పించారు. రాత్రి చ్చప్పన్ భోగ్, హారతి, ముఖ్య దాతలు, సేవకులకు సన్మానం, దీప హారతులు, భక్తులకు తీర్థప్రసాద వినియోగం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 5వేల మందికి పైగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని జగన్నాథుని రథాన్ని లాగారు.

కాంగ్రెస్ కార్యకర్తల వీరంగం
పెళ్లకూరు, జూలై 13: మండల పరిధిలోని చిల్లకూరు నామినేషన్ కేంద్రం వద్ద శనివారం కాంగ్రెస్ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. వైకాపా మద్దతుదారులు నామినేషన్ వేసేందుకు వీలు లేదంటూ నామినేషన్ పత్రాలను దౌర్జన్యంగా లాక్కెళ్లి చించేశారు. దీంతో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. చిల్లకూరు గ్రామానికి చెందిన వైకాపా నాయకులు పాపాడి రాజగోపాలరెడ్డి తన సతీమణి కౌసల్యమ్మ చేత సర్పంచ్ స్థానానికి అభ్యర్థినిగా నామినేషన్ వేసేందుకు వెళ్లారు. ఎన్నికల అధికారికి తన నామినేషన్‌ను కౌసల్యమ్మ ఇవ్వబోతుండగా వెనుకే ఉన్న కాంగ్రెస్ మద్దతుదారులు కొందరు నామినేషన్ పత్రాలను బలంవంతంగా లాక్కొని బయటకు వెళ్లి చించేశారు.
కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడికి వ్యతిరేకంగా ఎవ్వరూ నామినేషన్ దాఖలు చేయడానికి కుదరదంటూ వీరంగం సృష్టించారు. దీంతో మనస్థాపం చెందిన రాజగోపాలరెడ్డి, కౌసల్యమ్మ కన్నీళ్ల పర్యంతమయ్యారు. అక్కడ నుండి కొంచెం సేపు తరువాత నామినేషన్ దాఖలు చేయకనే వెళ్లిపోయారు. అనంతరం పాలుచూరు గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్తలు అదే కేంద్రం వద్దకు రాగా వారిపైన కూడా చిల్లకూరు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గందరగోళం సృష్టించారు. ద్విచక్ర వాహనాలపై వైకాపా జెండాలను తొలగించాలని దౌర్జన్యం చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరగ్గా నాయుడుపేట సిఐ రామారావు ఆధ్వర్యంలో పోలీసులు జోక్యం చేసుకొని వివాదం సద్దుమణిగిలే చేశారు. విషయం తెలుసుకొన్న గూడూరు డిఎస్పీ చౌడేశ్వరి చిల్లకూరు ఎన్నికల కేంద్రం వద్దకు చేరుకొని సంఘటన వివరాలను సిఐని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ నామినేషన్లు దాఖలు చేసే సమయంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.
ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిర్భయంగా ఎన్నికల్లో పోటీచేసేందుకు నామినేషన్లు దాఖలుచేసుకోవచ్చన్నారు. ఇందుకోసం తాము స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తామన్నారు. ఎన్నికలను నిస్పక్షపాతంగా నిర్వహిస్తామని, ప్రజలు సమన్వయం పాటించి వివాదాలు జరగకుండా చూడాలన్నారు. అనంతరం డిఎస్పీ నెలబల్లి కేంద్రాన్ని సందర్శించి సమస్యాత్మక గ్రామాల పరిస్థితులపై వాకాబు చేశారు.

ఏకగ్రీవం చేయలేదని మనస్థాపం చెంది ఆత్మహత్యా యత్నం
తడ, జూలై 13: తడ మండలం అండగుండాల గ్రామ సర్పంచ్ స్థానాన్ని ఈసారి ఓసి మహిళకు కేటాయించారు. అక్కడ చిన్న పంచాయతీ కాబట్టి గ్రామ పెద్దలు కూర్చుని అభ్యర్థిని ఎంపిక చేశారు. తన భార్యను ఏకగ్రీవంగా ఎంపిక చేయడానికి ప్రయత్నించిన కారికాటి సుబ్రహ్మణ్యం, అలియాస్ శివయ్య ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్టు తెలిసింది. ఒక దశలో తన భార్యను నామినేషన్ వేయమని కోరినా ఆమె గ్రామ పెద్దల మాటలు మన్నించడంతో సుబ్రహ్మణ్యం మనస్థాపం చెంది శుక్రవారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు అతన్ని చెన్నైకి తరలించారు.

జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి
english title: 
r

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>