మార్కాపురం, జూలై 13: నల్లమల అటవీప్రాంతంలో కూంబింగ్‌ను ముమ్మరం చేశామని మార్కాపురం ఓఎస్‌డి సమయ్‌జాన్‌రావు శనివారం భూమికి తెలిపారు. ప్రస్తుతం యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల పరిధిలోని అటవీప్రాంతంలో మూడుస్పెషల్ పార్టీలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయని, మరో రెండు మూడురోజుల్లో పెద్దదోర్నాల, అర్ధవీడు, గిద్దలూరు ప్రాంతాల్లో మరో మూడుపార్టీలను పంపి కూంబింగ్ నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. 68ప్రాంతాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. అలాగే గతంలో దళాల్లో పనిచేసి లొంగిపోయిన వారి దినచర్యలపై దృష్టి సారించామని తెలిపారు. అలాగే గతంలో అరెస్టు అయిన వారిపై కూడా ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని తెలిపారు. నల్లమల అటవీప్రాంతంలో ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం లేదని, అయినప్పటికీ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుచర్యగా నిత్యం నల్లమల అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తూనే ఉంటామని తెలిపారు. ఎవరైనా విఐపిలు నల్లమల అటవీప్రాంతంలో ఎన్నికల సందర్భంగా పర్యటిస్తుంటే వారికి ప్రత్యేక భద్రత ఇవ్వడం జరుగుతుందని, ముందస్తు సమాచారం లేకుండా నేతలు ఎవరూ అటవీప్రాంతంలో పర్యటించరాదని, ఇప్పటికే సమాచారం ఇవ్వడం జరిగిందని సమయ్‌జాన్‌రావు తెలిపారు. ఎమ్మెల్యే స్థాయిలో పర్యటన జరుపుతుంటే స్థానిక సిఐతోపాటు స్పెషల్‌పార్టీ ఆధ్వర్యంలో రక్షణ కల్పించడం జరుగుతుందని, మంత్రిస్థాయిలో పర్యటన ఉంటే డివైఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీల ఆధ్వర్యంలో రక్షణ కల్పించడం జరుగుతుందని తెలిపారు. ముందుగా బాంబ్‌డిస్పోజబుల్‌స్వ్కాడ్, డాగ్‌స్వ్కాడ్‌లతో మంత్రులు పర్యటించే రహదారులను క్షుణ్ణంగా పరిశీలిస్తామని తెలిపారు. ఏదిఏమైనా నల్లమల అటవీప్రాంతంలో ప్రస్తుతం మావోయిస్టుల ఉనికి లేదని, ఉన్నప్పటికీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని సమయ్‌జాన్‌రావు తెలిపారు.
ముందస్తు ఎన్నికలు తథ్యం:వెంకయ్య
కందుకూరు, జూలై 13: లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు రానున్నాయని, ఆ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమిపాలు కావడం తథ్యం అని బిజెపి జాతీయ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం స్థానిక ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో విలేఖరులతో వెంకయ్యనాయుడు మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వ పాలన వలన దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిందని అన్నారు. ఆర్థిక వ్యవస్థ పతనం వలన రూపాయి విలువ రోజురోజుకి దిగజారి పతన స్థితికి చేరుకుందని ఆయన అన్నారు. ఫలితంగా ధరలు విపరీతంగా పెరిగి మధ్యతరగతి, సామాన్య ప్రజానీకంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పడరానిపాట్లు పడుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల వలన సమస్యలు ఎదుర్కొన్న ప్రజానీకం అవకాశం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా అన్ని రాజకీయపార్టీలతో చర్చలు జరిపినా ఇంకా సమయం కావాలని అనడం విడ్డూరం అని ఆయన అన్నారు. సమావేశంలో కళాశాల కరస్పాండెంట్ కంచర్ల రామయ్య పాల్గొన్నారు.
కిట్స్‌లో మొబైల్ కంప్యూటర్ సెంటర్ ప్రారంభం
పెద్దారవీడు, జూలై 13: కృష్ణచైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో మొబైల్ కంప్యూటర్ కేంద్రాన్ని శనివారం జెఎన్‌టియు కాకినాడ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ తులసీరాందాసు ప్రారంభించారు. ఈసందర్భంగా వైస్‌చాన్స్‌లర్ మాట్లాడుతూ ఈ టెక్నాలజీ ప్రపంచ అత్యున్నత మూడు టెక్నాలజీల్లో ఒకటని, మొట్టమొదటిసారిగా విద్యార్థులచే అభివృద్ధి చేయిస్తామన్నారు. 2015నాటికి ఈ పరిజ్ఞానంపై 1.1కోట్ల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేశారన్నారు. ఇటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ గ్రామీణప్రాంతంలో ఏర్పాటు చేసిన కిట్స్ కళాశాలలో ఏర్పాటు చేయడం ఆనందదాయకమని అన్నారు. నూతన టెక్నాలజీతో విద్యార్థులు మేథాశక్తిని వ్యక్తిగత, వృత్తివిద్యను అందించడంలో ముందుండాలని తెలిపారు. కళాశాల చైర్మన్, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ విద్యార్థులకు నైపుణ్యత పెంచడం కోసం ప్రపంచంలోనే గొప్పసవాల్‌ను ఎదుర్కోవడం కోసం ఈ మొబైల్ టెక్నాలజీని కళాశాలలో ఏర్పాటు చేశామన్నారు. పలు సంస్థలు తమ విద్యాసంస్థలోని విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశాయని కళాశాల కార్యదర్శి అన్నా కృష్ణచైతన్య తెలిపారు. ఈకార్యక్రమంలో ఎఓ ప్రభాకర్, వైస్‌ప్రిన్సిపాల్ డాక్టర్ వి కృష్ణారెడ్డి, అన్నా రంగనాయకులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన జెఎన్‌టియు విసి
కిట్స్ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన గ్లోబరీనా ఎంప్లాయి బిలిటీ టెస్టు (గేట్)ను టెక్నాలజీ లిమిటెడ్ హైదరాబాద్ వారు 3,4 సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాన్ని జెఎన్‌టియు కాకినాడ వైస్‌చాన్స్‌లర్ జి తులసీరాందాసు సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.