సూళ్లూరుపేట,పిబ్రవరి 29: ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు పెట్టిన పెట్టుబడి చేతికిరాక, గిట్టుబాటు ధరలేక ఇప్పటికే కుదేలైన రెతులను అరకొరగా చేతికొచ్చిన ధాన్యాన్ని దాచుకొని ధర వచ్చినప్పుడు అమ్ముకుందామనుకుంటే సరిపడా గోదాములు లేక పోవటం మరింతగా బాధిస్తోంది. రైతుల బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. సూళ్లూరుపేట సబ్‌డివిజన్ పరిధిలో మొత్తం 14,578 హెక్టార్లలో రైతులు వరి పంట సాగుచేశారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవకపోవడంతో వరినాట్లు డిసెంబర్ చివరి వరకు వేశారు. వరినాట్లు వేసినప్పటి నుంచి సరిగా సాగునీరు లేకపోవడం, చీడపీడలు అధికంగా వ్యాపించాయ. అంతేకాకుండా ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా ఎరువుల ధరలు కూడా పెరగడంతో ఒకపక్క పెట్టుబడులు పెరిగి, మరోపక్క ఆశించిన మేరకు దిగుబడులు రాకపోవడంతో రైతులు కుదేలైనారు. చేతికొచ్చిన పంటకు గిట్టుబాటు ధరలేక పోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా వారిగోడు పట్టించుకొనే వారే కరువైయ్యారు. ధాన్యాన్ని దాచుకుని ధరవచ్చిన తరువాత అమ్ముకొందామనుకున్నా గోదాములు చాలినన్ని లేకపోవడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితి. రైతుల ఆశలు అడియాశలు చేస్తూ ఉన్న గోదాములను పౌరసరఫరాల శాఖకు, ధాన్యంకొనుగోలు కేంద్రాలకు కేటాయించడంతో ధాన్యం దాచుకునే చోటులేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సూళ్లూరుపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మొత్తం నాలుగు గోదాములున్నాయి. వీటిలో రెండు గోదాములు పోగా ఉన్న రెండు గోదాములు మూడు మండలాల రైతులకు చాలడం లేదు. ఉన్న రెండు గోదాముల్లో రెండువేల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని నిల్వచేసుకోవచ్చు. గతేడాది దాచుకున్న రైతులకు ఇంకా కాలపరిమితి ఉండటంతో గోదాముల్లో ధాన్యం బస్తాలు అలాగే ఉన్నాయి. ఈ మార్కెటింగ్ గోదాముల్లో ధాన్యం దాచుకున్న రైతులు రైతుబంధు పథకం ద్వారా 75శాతం బుణం ముందుగా పొంది ధర వచ్చినప్పుడు ధాన్యాన్ని అమ్ముకోవచ్చు. కాని మూడు మండలాల రైతులకు ప్రభుత్వం నుండి తక్కువ బడ్జెట్ కేటాయించడంతో ఆశించిన మేరకు రైతులకు రుణం అందడం లేదు. గత ఏడాది ధాన్యం దాచుకొన్న 92మంది రైతులకు రైతుబంధు ద్వారా ఒక్కొక్కరికి రూ 28వేలు మాత్రమే పొందారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆశించిన ధరలు లేక పోవడంతో ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు మొగ్గుచూపడం లేదు. గోదాములు లేకపోవడంతో పలువురు రైతులు ఇంటి వద్దనే బస్తాలు కుట్టి అరుబయటనే నిల్వలు చేసుకోవాల్సిన పరిస్థితి. దీంతో ఏ నిమషం ఏమి జరుగుతుందోనని రైతులు భయాందోళన చెందుతున్నారు. గత ఏడాది బస్తా 1200 నుండి 1500వరకు ధర పలికింది. ప్రస్తుతం అదీ కన్పించడం లేదు. ఈ ఏడాది పెట్టుబడులు కూడా ఎక్కువవడంతో రైతుల అప్పుల ఊబిలో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. ఈ ప్రాంతం తమిళనాడుకు దగ్గర కావడంతో అందరూ తమిళనాడు ధరలపైనే ఆధారపడతారు. ప్రభుత్వం దీనిని గుర్తించి ఈ ప్రాంత రైతులకు తమిళనాడు ధరలకే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది.
గోదాముల్లేక విలవిల్లాడుతున్న రైతులు
english title:
storage shortage
Date:
Thursday, March 1, 2012