నెల్లూరు, ఫిబ్రవరి 29: బడుగు, బలహీన వర్గాల అభివృద్దికి పాటుపడేది ఒక్క తెలుగుదేశం పార్టీయేనని మాజీ ఎంపి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రంనాయుడు స్పష్టం చేశారు. కోవూరును మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. 2014వ సంవత్సరంలో కూడా కోవూరు అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డినే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. బుధవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోవూరు ఉప ఎన్నికల పోరులో టిడిపి అభ్యర్థి సోమిరెడ్డిని గెలిపించాలన్నారు. జగన్ హత్యా రాజకీయాలకు, దోపిడీకి అవకాశం ఇవ్వరాదని సూచించారు. 1993లో జరిగిన కోవూరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రజలు టిడిపి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించారని గుర్తుచేశారు. అదేవిధంగా జనరల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించారన్నారు. అదే పరిస్థితులు ప్రస్తుతం కోవూరులో కనిపిస్తున్నాయని చెప్పారు. కోవూలో టిడిపి అభ్యర్థి గెలుపు రాబోయే 2014 అసెంబ్లీ ఎన్నికలకు పునాది అన్నారు. 2014లో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు టిడిపిని అత్యధిక మెజారిటీతో గెలిపించి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కోవూరు ఉప ఎన్నిక నీతి నిజాయితీకి మద్య జరుగుతున్న పోరాటమని, అక్కడ పోటీలో ఉన్న కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు రెండూ అవినీతి పార్టీలని విమర్శించారు. గత 2004 ఎన్నికల ముందు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆర్థిక ఇబ్బందుల వల్ల హైదరాబాద్‌లో ఉన్న తన ఇంటి స్థలాన్ని అమ్మచూపారని, అలాంటి వ్యక్తికి, కుమారుడికి 2010 నాటికి అన్ని భవంతులు, పరిశ్రమలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అనేక మంది టిడిపి సానుభూతిపరులు, నాయకుల మృతికి కారణమయ్యాడని దుయ్యబట్టారు. అలాగే రాష్ట్రంలో, దేశంలో ప్రతిపక్ష నాయకులు, పత్రికలు, టివిలు ఎంతగా గోలపెట్టినప్పటికీ వైఎస్ వాటినేమి పట్టించుకోకుండా రాష్ట్రాన్ని దోచుకుతిన్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి తనపై వస్తున్న అవినీతి, ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని, కానీ ఆయన వాటి గురించి నోరుమెదపడం లేదన్నారు. చట్ట ప్రకారం వౌనం అర్ధంగీకారమని భావించాల్సి వస్తోందన్నారు. జగన్ ఎప్పుడో సగం నేరస్తుడిగా రుజువయ్యారని, అలాంటి వ్యక్తి స్థాపించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ పార్టీయే కాదన్నారు. జగన్ రాజకీయాలకు అనర్హుడని విమర్శించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి అయిన ప్రసన్నకుమార్‌రెడ్డిని గ్రామాల్లోని ప్రజలు అసహించుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అవినీతిలో వైఎస్‌ఆర్‌ను మించిపోతున్నారన్నారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందన్నారు. నెల్లూరు ప్రజలు చాలా మేధావులని, వారు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారన్నారు. అవినీతి పార్టీల తరపున పోటీ చేసిన అభ్యర్థులకు ఓట్లు వేయరని తెలిపారు. ప్రజా సంక్షేమానికి ఎప్పుడూ పాటుపడే తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయకత్వంలో టిడిపి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఓట్లు వేయాలని ఎర్రంనాయుడు కోరారు.
2014లో కోవూరు అభ్యర్థి సోమిరెడ్డే
కోవూరు నియోజకవర్గం నుండి 2014 ఎన్నికల్లో కూడా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డే టిడిపి అభ్యర్థి అని ఎర్రంనాయుడు వెల్లడించారు. ఇందులో ఎలాంటి అపోహలకు తావు లేదని స్పష్టం చేశారు. 2014లో జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగులు, దళితులకు ఎన్నో కొత్త పథకాలు ప్రవేశపెడతారని, ఆ పథకాలన్నిటిని కోవూరు నుండే ప్రారంభిస్తామన్నారు. అలాగే కోవూరును రాష్ట్రానికే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు బీద రవిచంద్ర, మాజీమంత్రి తాళ్లపాక రమేష్‌రెడ్డి, నగర అధ్యక్షులు కిలారి వెంకటస్వామినాయుడు, నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోవూరుని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం 2014లో కూడా టిడిపి అభ్యర్థి సోమిరెడ్డే జగన్ దోపిడీకి అవకాశం ఇవ్వకండి టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రంనాయుడు పిలుపు
english title:
model constituency
Date:
Thursday, March 1, 2012