నెల్లూరు , ఫిబ్రవరి 29: కాంగ్రెస్ ఎంపిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మేకపాటి రాజమోహనరెడ్డి లోక్‌సభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను లోక్‌సభ స్పీకర్ ఆమోదించడంతో నెల్లూరు జిల్లా రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. సిమిఐ ఎఫ్‌ఐఆర్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ పేరు చేర్చినందుకు నిరసనగా ఆయన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయగా ఇప్పుడు ఆమోదించారు. మొత్తమీద మేకపాటి రాజమోహనరెడ్డికి రాజకీయంగా కలిసొచ్చిన కాంగ్రెస్‌పార్టీకి దూరమయ్యారు. ఈయన 1983లో తొలి పర్యాయం జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చెందారు. అప్పట్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన ఆ పార్టీ ఇప్పటి జాతీయ నేత ముప్పవరపువెంకయ్యనాయుడి చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తరువాత 1985లో వచ్చిన శాసనసభ మధ్యంతర ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. తెలుగుదేశం తరపున పోటీ చేసిన కంభం విజయరామిరెడ్డిపై గెలుపొందారు. 1989 ఎన్నికల్లో ఒంగోలు ఎంపిగా బరిలో నిలిచి 97వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఆ తరువాత జిల్లా కాంగ్రెస్ పెద్దాయనగా పేరొందిన నేదురుమల్లి జనార్ధనరెడ్డితో రాజకీయ వైరం ఏర్పడింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1991లో లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు వచ్చి పడ్డాయి. ఈ సందర్భంలో మేకపాటికి కాంగ్రెస్ టిక్కెట్ రాకుండా నేదురుమల్లి గండికొట్టారు. దీంతో రాజమోహనరెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అనంతరం 1994 అసెంబ్లీ ఎన్నికల్లో తన సోదరుడు చంద్రశేఖరరెడ్డికి ఉదయగిరి కాంగ్రెస్ టిక్కెట్ కోసం ప్రయత్నించారు. అలా జరగకపోవడంతో ఆ తరువాతకాలంలో కాంగ్రెస్ వీడి తెలుగుదేశంలో చేరారు. 1996లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ ఒంగోలు స్థానానికి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి మాగుంట పార్వతమ్మ చేతిలో, ఆ తరువాత 1998లో మళ్లీ వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులురెడ్డితో ఢీకొని ఓటమి పాలయ్యారు. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం రాజమోహనరెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ సభ్యుడు వంటి హోదాలు కట్టబెట్టినా ఆ పార్టీ తమకు అచ్చిరాలేదని భావించి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. 1999లో తన సోదరుడు చంద్రశేఖరరెడ్డికి ఉదయగిరి నియోజకవర్గ కాంగ్రెస్ టిక్కెట్ వచ్చేలా చూసుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో సోదరుడు పరాజయం పాలైనా ఆ పార్టీలోనే కొనసాగారు. 2004 ఎన్నికలకల్లా మేకపాటి సోదరులిద్దరికీ రాజకీయ ప్రాభవం వచ్చింది. ఈ ఎన్నికల్లో రాజమోహనరెడ్డి నరసరావుపేట ఎంపిగా పోటీ చేసి 85వేల ఓట్లతో ఘన విజయం సాధించారు. అలాగే ఉదయగిరి ఎమ్మెల్యేగా చంద్రశేఖరరెడ్డి పాతిక వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. 2009 ఎన్నికలనాటికల్లా పునర్విభజనతో జనరల్ స్థానంగా మారిన తన సొంత ప్రాంతమైన నెల్లూరు నుంచి ఎంపిగా రాజమోహనరెడ్డి గెలుపొందారు. ప్రస్తుతం ఆయన రాజీనామాను లోక్‌సభ స్పీకర్ ఆమోదించటంతో మరో ఆరు నెలల్లోగా ఎప్పుడైనా జరిగే ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సి అభ్యర్థిగా బరిలో నిలవనున్న మేకపాటి రాజమోహనరెడ్డి తన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు లభించిన అన్ని మెజారిటీలను అధిగమిస్తాననే గట్టి నమ్మకంతో ఉండటం విశేషం. ఇప్పటికే కోవూరు నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కడం తెలిసిందే. ఇక నెల్లూరు ఎంపి స్థానానికి కూడా ఉప ఎన్నిక ఖాయమని తేలటంతో ప్రధాన పార్టీల్లో అభ్యర్థుల వెదుకులాట ప్రారంభయంది.
ఎంపి పదవికి మేకపాటి రాజీనామా ఆమోదం మారుతున్న జిల్లా రాజకీయ చిత్రం
english title:
mekapati
Date:
Thursday, March 1, 2012