ఒంగోలు, ఫిబ్రవరి 29: రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించండి, ప్రభుత్వపరంగా రాయితీలు కల్పిస్తామంటూ ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలుకుతోంది. మరోవైపు ఉన్న పరిశ్రమలకు మాత్రం విద్యుత్ సరఫరా చేయలేని దుస్థితిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మార్చి ఒకటవ తేదీ నుండి పెద్ద పరిశ్రమలకు నెలకు పది రోజులపాటు విద్యుత్ కోతలు విధించనుంది. దీంతో ఆయా పరిశ్రమలకు చెందిన యజమానులు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో పరిశ్రమల యజమానులు మరింత గడ్డుకాలం ఎదుర్కొనే పరిస్థితులు నెలకొంటున్నాయి. జిల్లాలో నాలుగు పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి. గతంలో నెలకు ఐదు రోజులపాటు మాత్రమే పవర్ హాలిడే ఉండేది. 70 శాతం మాత్రమే విద్యుత్‌ను వాడుకునే విధంగా నిబంధన ఉంది. ప్రస్తుతం పది రోజులపాటు పవర్ హాలిడేను ప్రకటించి మిగిలిన రోజుల్లో వంద శాతం విద్యుత్‌ను వినియోగించుకోవచ్చు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా చిన్నతరహా ఫ్యాక్టరీలు పెద్దసంఖ్యలో ఉండగా వాటికి గతంలో నెలకు ఎనిమిది రోజుల చొప్పున విద్యుత్ కోతలు విధిస్తూనే ఉన్నారు. అధికారికంగా నెలకు ఎనిమిది రోజులైనప్పటికి అనధికారికంగా మరో రెండు రోజులపాటు కోతలను ట్రాన్స్‌కో అధికారులు విధిస్తూనే ఉన్నారు. జిల్లావ్యాప్తంగా గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు 517, స్టోన్‌క్రషర్స్ 101, పలకల యూనిట్లు 98 ఉన్నాయి. ఈ యూనిట్లు అన్ని ఒంగోలులోని ఇండ్రస్టియల్ ఎస్టేట్, బూదవాడ, గుళ్ళాపల్లి, మార్టూరు, కందుకూరు, సంతమాగులూరు, మార్కాపురం తదితర ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా రైస్ మిల్లులకు కూడా సాయంత్రం ఆరు నుండి రాత్రి పది గంటల వరకు కోతలను విధిస్తున్నారు. వీటికితోడు అనధికార కోతలను అధికారులు విధిస్తూనే ఉన్నారు. ప్రధానంగా గ్రానైట్ రంగం కుదేలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిత్యం విద్యుత్‌కోతలతో గ్రానైట్ దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. గ్యాంగ్‌సా రాళ్ళను క్వారీల నుండి తీయాలంటే వైర్‌సా మిషన్లకు విద్యుత్ సరఫరా తప్పనిసరి. ప్రస్తుతం విద్యుత్‌కోతలను విధిస్తుండటంతో గ్రానైట్ రాళ్ళను తీసేందుకు కూడా యజమానులు వెనకంజ వేస్తున్నారు. అదేవిధంగా గ్రానైట్‌రాళ్ళను పాలిషింగ్ చేయాలంటే నిరంతరం విద్యుత్ సరఫరా అవసరం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పాలిషింగ్ రాళ్ళ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవటంతో ఎగుమతులు నిలిచిపోతున్నాయి. దీంతో పాలిషింగ్ యూనిట్ల యజమానులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. గ్రానైట్ క్వారీలు, పాలిషింగ్ యూనిట్లు, పెద్దపెద్ద పరిశ్రమల్లో వందలాది మంది కార్మికులు పని చేస్తుంటారు. కొంతమంది పర్మినెంట్ సిబ్బంది కాగా, మరికొంతమంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. నెలలో పది రోజులపాటు పర్మినెంట్ సిబ్బందికి పని లేకుండానే యజమానులు జీతాలు చెల్లించే పరిస్థితి నెలకొంది. అదేవిధంగా నిత్యం కూలిపైనే ఆధారపడి జీవితం గడిపే వారి పరిస్థితి దుర్భరంగా మారనుంది. విద్యుత్ కోతలతో కాంట్రాక్టు కార్మికులకు పనులు కల్పించలేని పరిస్థితిలో యజమానులు ఉన్నారు. ఇదిలాఉండగా వ్యవసాయ రంగం పరిస్థితి మరింత దుర్భరంగా తయారైంది. రైతులకు ఏడు గంటలపాటు ఉచిత విద్యుత్ ఒక విడత సరఫరా చేయాల్సి ఉండగా మూడు నుండి, నాలుగు విడతలుగా సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలోని పండ్లతోటల రైతులు ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. జిల్లాలో వేలాది ఎకరాల్లో ఉన్న ఉప్పు రైతుల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. విద్యుత్ కోసం రైతులు రాత్రింబవళ్ళు ఉప్పు భూముల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోని పరిశ్రమల యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లబోదిబోమంటున్న యజమానులు
english title:
labo dibo
Date:
Thursday, March 1, 2012