ఒంగోలు, ఫిబ్రవరి 29: ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించకపోతే రాజకీయ శక్తిగా ఎదిగి అవసరమైతే తాము సొంత పార్టీ పెట్టేందుకు నిర్ణయం తీసుకోనున్నట్లు ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదిగ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ వద్ద ఎంఆర్‌పిఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కోరుతూ 5వ రోజు జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. పాలక వర్గాలు వర్గీకరణ విషయాన్ని స్పష్టంగా చెప్పటంలేదని ఆరోపించారు. తెగులుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా వౌనంగా ఉంటూ వర్గీకరణ విషయంలో మాదిగలకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఇద్దరు ఎమ్మెల్యే సభ్యులతో ఉన్న బిజెపి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వర్గీకరణ బిల్లుకు అనుకూలంగా తీర్మానం ప్రవేశపెడితే అలాంటిది ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో వర్గీకరణకు అనుకూలంగా వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టకపోవటాన్ని అయన తప్పు పట్టారు. యుపిఎ చైర్మన్ సోనియాగాంధీ ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వటమే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారని, అయితే ఆ హామీని సోనియాగాంధీ నిలబెట్టుకోవటం లేదని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకొచ్చి వర్గీకరణ బిల్లుకు చట్టబద్దత కల్పించే విధంగా చూడాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని కోరుతూ ఏప్రిల్ 25వ తేదిన ముఖ్యమంత్రి నియోజకవర్గమైన పీలేరు నుండి తిరుగుబాటు యాత్ర కార్యక్రమాన్ని ఎంఆర్‌పిఎస్ ఆధ్వర్యంలో చేపట్టనున్నట్లు తెలిపారు. జూన్ 5వ తేదిన హైదరాబాద్‌ను నిర్బంధిస్తామని ప్రకటించారు. మార్చి 26న తహశీల్దార్ కార్యాలయాల దిగ్బంధనం, మార్చి 28న రహదారుల దిగ్బంధనం, మార్చి 30వ తేదిన కలెక్టరేట్ దిగ్బంధన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, జిల్లా నాయకులు బాబు మాదిగ తదితరులు పాల్గొనగా దీక్ష కార్యక్రమంలో ఒంగోలులోని మామిడిపాలెంకు చెందిన ఐదుపోగు కన్న, ఐదుపోగు అజయ్‌బాబు, ఐదుపోగు అనీల్, గుంటూరి ప్రభుదాస్, పోనూరి రామారావు, ఐదుపోగు శేఖర్, ఎం కిషోర్, ఐ పెదంకరాజు, ఇండ్ల రాంబాబు, జడా సుధ, పోనూరి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
సంఘ కార్యాలయం ప్రారంభం
ఒంగోలులోని అంబేద్కర్ భవనం సమీపంలోగల ఒక అద్దె భవనంలో మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యాలయాన్ని ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదిగ బుధవారం ప్రారంభించారు. ఈకార్యక్రమంలో మాదిగ ఉద్యోగ సంఘ నాయకులు, ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉసురపాటి బ్రహ్మయ్య మాదిగ, ఎంఆర్‌పియస్ నాయకులు తేళ్ళ భాస్కర్‌రావు, ప్రాంక్లిన్, బి భానుమూర్తి, దాసు, టి ఆనంద్, రవి, శేఖర్ తదితరులు ఉన్నారు.
ఎంఆర్‌పిఎస్ నేత మందా కృష్ణమాదిగ స్పష్టం
english title:
own party
Date:
Thursday, March 1, 2012