Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మామా అల్లుళ్ల ఎత్తులు పై ఎత్తులు

$
0
0

శ్రీకాకుళం, జూలై 13: దశాబ్ధాల చరిత్ర కలిగిన రాజకీయ నేపథ్యం ఉన్న తమ్మినేని కుటుంబం ఇంటిపోరు రచ్చకెక్కింది.!. అల్లుడు, మామలు అంతర్యుద్ధం బంధుత్వాలను బలాదూర్ చేసి పంచాయతీ రాజకీయాల సాక్షిగా మరోమారు రచ్చకెక్కడంతో చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి తమ్మినేని స్వగ్రామమైన తొగరాంలో సర్పంచ్ పదవి కోసం తోటి కోడలు బరిలో దిగడం వెనుక తమ్మినేని, కూన ప్రత్యన్నయుద్ధం సుస్పష్టమైంది. అలాగే కూన రవికుమార్ ఇలాకా అయిన పెనుబర్తిపై పట్టు సాధించాలన్న లక్ష్యంతో మాజీ మంత్రి తమ్మినేని, రవికుమార్ మద్దతుదారున్ని ఓడించాలన్న సంకల్పంతో వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇలా ఒకరిపై ఒకరు ఉప్పు- నిప్పులా ప్రత్యర్థులు గెలుపే లక్ష్యంగా పనిచేయడం రాజకీయ విజ్ఞులు తప్పుబడుతున్నారు.
రాష్ట్రంలోనే అత్యంత వివాదస్పద రాజకీయ ఆధిపత్య నియోజకవర్గంగా నిలిచిన ఆమదాలవలసలో తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అంతర్గత పోరాటం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికే మింగుడుపడడం లేదు. టిడిపిలో ఒకే కుటుంబీకులైన మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, ఆయన మేనల్లుడు, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి కూన రవికుమార్‌ల మధ్య వర్గపోరాటం తారాస్థాయికి చేరింది. దివంగత కేంద్ర మాజీమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు ఆకస్మిక మరణం తరువాత పార్టీని ఏకతాటిపై నడిపించేందుకు మామ, అల్లుళ్ల మధ్య విభేదాలను దూరం చేసి సయోధ్యతో ముందుకు సాగుతారన్న నియోజకవర్గ పార్టీ కేడర్ ఆశలు వీరు అనుసరిస్తున్న వైఖరితో అడియాసలయ్యాయి. వారి ఆధిపత్యానికి గ్రామ పంచాయతీ ఎన్నికలే వేదికలుగా మారాయి. ప్రత్యర్ధి అభ్యర్థులను ఈ పంచాయతీ ఎన్నికల్లో గెలిపించడమే లక్ష్యంగా ఇరువురు పెట్టుకున్నారు. మండలంలో రవికుమార్ సొంత పంచాయతీ అయిన పెనుబర్తిలో ఆయన బలపరిచిన అభ్యర్థిని ఓడించేందుకు తమ్మినేని రంగం సిద్ధం చేస్తున్నారు. రవికుమార్ బలపరిచిన ఆయన సోదరుడు కూన సత్యనారాయణ సతీమణి సుధపై పోటీగా నిలిచిన కూన గోపికి మద్దతుగా తమ్మినేని సీతారాం తడాఖా చూపాలని పావులు కదుపుతున్నారు. మాజీ మంత్రి తమ్మినేని ఇలాకా అయిన తొగరాం పంచాయతీలో ఆయన బలపరిచిన సోదరుడు దివంగత విజయవర్థనరావు భార్య శారదపై దివంగత దేశం నేత తమ్మినేని శ్యామలరావు భార్య భారతమ్మను నిలిపి గెలిపించి రవికుమార్, సీతారాంకు ఝలక్ ఇవ్వాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అయితే ఆదివారం నుండి పంచాయతీ ఎన్నికల పోలింగ్ వరకు మాజీ మంత్రి సీతారాం పెనుబర్తిలో మకాం వేయగా ఆయనకు ధీటుగా తొగరాంలో రవికుమార్ తిష్టవేసి తన పట్టుదలను నిజం చేసేందుకు ఇప్పటికే నిర్ణయించుకోవడం పార్టీ కేడర్‌కు మింగుడు పడడం లేదు. జరుగనున్న ఎన్నికల్లో ఎవరి అభ్యర్థులు గెలుస్తారో వేచి చూడాల్సిందే.

ముగిసిన నామినేషన్ల పర్వం
ఇక యుద్ధం ఆరంభం

శ్రీకాకుళం, జూలై 13: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు శనివారం ఐదు గంటలతో ముగియడంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడ పది మంది కలిసినా పంచాయతీ ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. ఎత్తులు...పై ఎత్తులు, పొత్తులు..బుజ్జగింపుల్లో బిజిగా నాయకులు ఉన్నారు. స్థానికంలో పట్టుసాధించేందుకు ప్రధాన పార్టీలన్నీ తహతహలాడుతున్నాయి. గతంలో వచ్చిన స్థానాలకంటే అధికంగా గెలుచుకోవడానికి వ్యూహంతో ప్రధాన రాజకీయ పక్షాలు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే అనేక మంది తెరవెనుక ఒప్పందాలతో ఏకగ్రీవం బాటలో పయనించగా మరికొంతమంది మనం..మనం బరంపురం అన్న సామెత మాదిరిగా సామాజిక అస్త్రాలతో చీకటి ఒప్పందాలకు తెరలేపుతున్నారు. బంధుత్వాలు, బంధాలను పక్కనపెట్టి రక్తసంబంధాలను బలాదూర్ చేసే మాదిరిగా అన్నదమ్ములు, తోటికోడళ్లు, అల్లుడు-మామలు బరిలో దిగిన సందర్భాలు జిల్లాలో అనేక చోట్ల కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్వగ్రామమైన మబగాం ఏకగ్రీవం బాటలో కొనసాగడం ధర్మాన కుటుంబీకులు ఐక్యతారాగం ఆలపించినట్లయింది. శ్రీకాకుళం నియోజకవర్గం పరిధిలో రూరల్ మండలంలో పది గ్రామ పంచాయతీలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కరువవ్వడం మాజీ మంత్రి గుండ ఉనికిని ప్రశ్నించినట్లయింది. మాజీ మంత్రి తమ్మినేని సీతారాం ఇలాకా అయిన తొగరాంలో తోటికోడలు యుద్ధం కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. కొత్తూరు మండలంలో పొన్నుటూరు పంచాయతీని ఎస్టీ మహిళకు కేటాయించినప్పటికీ ఆ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు గ్రామంలో లేకపోవడం వల్ల ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడం విశేషం. థర్మల్‌యుద్ధ భూమిగా మారిన బీల పరిసర పంచాయతీల్లో పర్యావరణ ప్రేమికులే సర్పంచ్ కిరీటాలను అందిపుచ్చుకుని ప్రధాన పార్టీల ఉనికినే ప్రశ్నార్ధకంగా మార్చడం గమనార్హం. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పోటాపోటీగా నామినేషన్ ఘట్టంలో కదం తొక్కినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వెనుకబడి ఉందనే చెప్పాలి. ఈ మూడు పార్టీలను రెబల్స్ బెడద కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఉపసంహరణలు నాటికి తిరుగుబాటు అభ్యర్థులు ఎటువైపు బావుటా ఎగురవేసి పార్టీ నాయకత్వాలను సంక్లిష్ట పరిస్థితుల్లో నెట్టేసే ప్రమాదం లేకపోలేదు. జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో నామినేషన్ ఘట్టం శనివారంతో ముగిసింది. ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి 13వ తేదీవరకు పోలైన నామినేషన్లు 29,293గా సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ నెల 23వ తేదీన ఎన్నికలు జరుగనున్న శ్రీకాకుళం డివిజన్‌కు సంబంధించి 349 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు గాను 1962 మంది అభ్యర్థులు, 3,428 వార్డులకు గాను 8,869 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరుగనున్న పాలకొండ డివిజన్‌కు సంబంధించి 378 పంచాయతీల్లో 1,774 మంది సర్పంచ్లు నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా 3,522 వార్డుమెంబర్ స్థానాలకు 8,149 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ నెల 31న ఎన్నికలు జరుగనున్న టెక్కలి డివిజన్‌కు సంబంధించి 364 పంచాయతీలకు 1,994 మంది నామినేషన్లను దాఖలు చేయగా 3,500 వార్డులకు 6,548 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 17వ తేదీన నామినేషన్ల పరిశీలన, తుది పరిశీలన ఉంటుందని, జిల్లా పంచాయతీ శాఖాధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఈ దఫా కూడా సుమారు 250 పైబడి ఏకగ్రీవాలు జరిగినట్లు అధికారులు చెబుతుండగా పూర్తిస్థాయి సమాచారం ఇంకా అందాల్సి ఉంది.

* పెనుబర్తిలో తమ్మినేని * తొగరాంలో కూన * టిడిపిలో గందరగోళం
english title: 
mm

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>