శ్రీకాకుళం, జూలై 13: జిల్లాలో ఈ నెల 23, 27, 31వ తేదీల్లో జరుగబోవు పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ స్పష్టం చేశారు. శనివారం జరుగబోవు పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ల ద్వారా రాష్ట్ర ఎన్నికల పరిశీలకులకు ఎన్.ఐ.సి. కేంద్రంలో వివరించారు. మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయని, అందులో 23న శ్రీకాకుళం డివిజన్‌లోను, 27న పాలకొండ డివిజన్‌లోను, 31 టెక్కలి డివిజన్‌లోను పంచాయతీ ఎన్నికలు జరుగుతాయన్నారు. శ్రీకాకుళం డివిజన్‌లో 553 పంచాయతీలుండగా 5,43,801 మంది ఓటర్లున్నట్లు తెలిపారు. పాలకొండ డివిజన్‌లో 378 పంచాయతీల్లో 4,73,098 మంది ఓటర్లున్నారని, టెక్కలి డివిజన్‌లో 364 పంచాయతీలకు గాను 5,37,843 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల పోలింగ్ అధికారులుగా 10,496 మందిని, సహాయ పోలింగ్ అధికారులుగా 12,008 మందిని నియమించామన్నారు. రిజర్వు సిబ్బందిగా 24,786 మందిని ఉంచామని తెలిపారు. శాంతిభద్రతలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని కలెక్టర్ వివరించారు. ఈ ప్రజంటేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు బి.బాలామాయాదేవి, జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌భాషాఖాసీం, డిపిఒ వెంకటేశ్వర్లు ఉన్నారు.
‘గిరిపుత్రులను మోసగించడం తగదు’
శ్రీకాకుళం, జూలై 13: రామగిరి క్షేత్రం, ఆధ్యాత్మికంగా వెలుగొందుతున్న కనె్నధార కొండ లీజ్ వ్యవహారంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గిరిపుత్రులను తప్పుతోవపట్టించి వారి కడుపుకొడుతున్నారని ఉత్తరాంధ్ర సాదుపరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానందస్వామి ఆరోపించారు. గిరిజనుల గ్రామదేవతలతోపాటు సీతా రామలక్ష్మణుల విగ్రహాలకు పూజలు చేస్తున్న గిరిజనులకు మభ్యమాటలతో కనె్నధార కొండను కొల్లగొట్టాలని చూస్తున్నారన్నారు. మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ మాట్లాడుతూ స్థానిక అధికారుల నివేదికను పక్కనపెట్టి, జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా నివేదికను సమర్పించడం ద్వారా న్యాయస్థానం ఇచ్చిన తీర్పు స్థానికులకు న్యాయం చేకూరుతుందని అభిలషించారు. భగవంతుని పట్ల నీతి తప్పిన నాయకులు ఎవరైనా శిక్ష అనుభవించకతప్పదని సిటిజన్‌ఫోరం అధ్యక్షులు బరాటం కామేశ్వరరావు అన్నారు. అఖిలపక్షాల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు శిమ్మ వెంకట్రావు, ధనుంజయ్‌రావు, దున్న దీన, గొలివి నర్సునాయుడు, దేశం పార్టీ, బిజెపి నాయకులు ఎస్.వి.రమణమాదిగ, ఎస్.ఉమామహేశ్వరి, సూరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
వరాహనృసింహస్వామిగా జగన్నాథుడు
శ్రీకాకుళం, జూలై 13: జగన్నాథుడు శనివారం భక్తులకు వరహానృసింహస్వామిగా దర్శనమిచ్చాడు. శ్రీమన్నారాయణుని దర్శనం రోజుకో విధంగా కలగడంతో భక్తులు పరవశించిపోతున్నారు. స్థానిక ఇలిసిపురం గుడించా మందిరంలో బలభద్ర, సుభద్ర సమేత స్వామివారిని దర్శించడానికి భక్తులు బారులు తీరారు. పూరీకి చెందిన పలహరి మహంతి రఘువీర్‌దాస్ బావాజీ నిర్వహణలో ఒడిశా విధానాలనుసరించి జరిగిన పూజల్లో బాలకృష్ణపాణిగ్రహి తదితరులు పాల్గొన్నారు. స్వామివారికి ప్రియమైన శనివారం సెలవు దినం కావడంతో కుటుంబాలతో స్వామి దర్శించుకోవడం కనిపించింది. భక్తుల రద్దీని నియంత్రించడానికి పోలీసులు అవస్థలు పడ్డారు. అదేవిధంగా అరసవల్లి సూర్యనారాయణస్వామి, మొండేటివీధి లక్ష్మీగణపతి ఆలయాలతోపాటు పట్టణంలో వివిధ రామమందిరాల్లో జగన్నాథస్వామి పేరున స్థానిక భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు.
ఫైళ్ల గల్లంతుపై చర్యలు హర్షణీయం
-- మాజీ మంత్రి గుండ --
శ్రీకాకుళం , జూలై 13: జిల్లాలో ముఖ్యమైన విభాగాలకు చెందిన ఫైళ్లు గల్లంతుపై జిల్లా కలెక్టర్ ప్రత్యక్ష చర్యలకు ఆదేశించడం ముదావహమని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అన్నారు. శనివారం స్థానిక తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడు తూ ఇదివరకే జిల్లాలో ఫైళ్లు, పత్రాలు గళ్లంతవుతున్నాయని తెలుగుదేశం పార్టీ తరపున అనేక పర్యాయాలు తెలియపర్చామన్నారు. దీనిపై అధికారులు పాలకులకు తొత్తులుగా వ్యవహరిస్తూ పట్టించుకోలేదని ఆరోపించారు. నేడు ఉద్యోగుల సమావేశంలో జిల్లా ఎన్జీవో సంఘం అధ్యక్షుడు హనుమంతు సాయిరాం కలెక్టర్ దృష్టికి బి.సి సంక్షేమ శాఖలో ఫైళ్ల గల్లంతుపై ప్రశ్నించగా కలెక్టర్ చర్యలకు ఆదేశించడం హర్షించదగ్గదిగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, చిట్టి నాగభూషణం, రోణంకి మల్లేశ్వరరావు, గొర్లె కృష్ణారావు, గుత్తు చిన్నారావుతదితరులు పాల్గొన్నారు.