విశాఖపట్నం, జూలై 13: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్లలో మూడు విడతలుగా జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈనెల 9 నుంచి నామినేషన్ల స్వీకరణను ప్రారంభించారు. జిల్లాలోని 39 మండలాల్లో శనివారం రాత్రి 10 గంటల సమయానికి అందిన వివరాల ప్రకారం సర్పంచ్ పదవులకు 4961 నామినేషన్లు దాఖలుకాగా, వార్డు సభ్యులుగా 21,605 మంది అభ్యర్థులు నామినేషన్ల వేశారు. జిల్లాలో జిల్లాలో 920 పంచాయతీలు, 9,214 వార్డు పదవులున్నాయి. విశాఖపట్నం డివిజన్‌కు సంబంధించి ఆరు మండలాల్లో పంచాయతీ సర్పంచ్ పదవులకు 1064 నామినేషన్లు, వార్డు సభ్యులుగా 2741 నామినేషన్లు దాఖలయ్యాయి. అనకాపల్లి డివిజన్‌కు సంబంధించి 12 మండలాల్లో సర్పంచ్ పదవులకు 1703, వార్డు సభ్యులుగా 8296 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే నర్సీపట్నం డివిజన్ పరిధిలో 10మండలాలకు సంబంధించి సర్పంచ్‌లుగా 1150, వార్డు సభ్యులుగా 6595 మంది నామినేషన్లు వేశారు. అలాగే పాడేరు మండలంలో 1488 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవులకు, 3973 మంది అభ్యర్థులు వార్డు మెంబర్లుగాను నామినేషన్లు దాఖలుచేశారు. ఆదివారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఉంటుంది. సక్రమంగా లేని నామినేషన్లను అదేరోజున తిరస్కరిస్తారు. అభ్యంతరాలను 16వతేదీన పరిష్కరించుకోవచ్చు. 17వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. పాడేరు డివిజన్‌లో నెల 23న, విశాఖపట్నం, నర్సీపట్నం డివిజన్లలో ఈనెల 27న, అనకాపల్లి డివిజన్‌లో ఈనెల 31న పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ జరిగిన రోజునే ఓట్ల లెక్కింపు పూర్తిచేసి ఫలితాలను ప్రకటిస్తారు.
పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టండి
* తెదేపా శ్రేణులకు యనమల ఆదేశం
విశాఖపట్నం, జూలై 13: పంచాయతీ ఎన్నికల విజయం సాధించడం తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకం. ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం ద్వారా భవిష్యత్‌లో తెలుగుదేశం పార్టీకి ఎదురుండదని నిరూపించాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు. పాతబస్తీలోని శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారిని శనివారం దర్శించుకున్న యనమల కొద్దిసేపు పార్టీ ప్రతినిధులతో ముచ్చటించారు. స్థానిక ఎన్నికల్లో ఫలితాలు రానున్న సాధారణ ఎన్నికలను ప్రభావితం చేస్తాయని, ఇప్పటి నుంచే పార్టీ విజయానికి కేడర్ పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించాలని, తద్వారా ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించవచ్చన్నారు. మెజార్టీ స్థానాలను సాధించడం ద్వారా ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల మంచిభావన ఉందనే సందేశాన్ని తీసుకురావాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని, దీనిపై తెలుగుదేశం కార్యకర్తలు దృష్టి సారించాలని సూచించారు. అధికార పార్టీ ఓటర్లను, కార్యకర్తలను ప్రలోభాలకు గురిచేస్తుందని, గెలిచేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని తెలుగుదేశం వర్గాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇదే సందర్భంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే గణబాబు పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయావకాశాలను వివరించారు. మెజార్టీ స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధిస్తారన్న ధీమాను వ్యక్తం చేశారు. అంతకు ముందు యనమల రామకృష్ణుడు కనకమహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ కార్పొరేటర్లు ఉమామహేశ్వరరావు, ఒమ్మి సన్యాసిరావు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ భరణికాన రామారావు, పార్టీ ప్రతినిధులు అల్సి అప్పలనారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
విలీనంపై రేపు ఉత్తర్వులు?
విశాఖపట్నం, జూలై 13: మహావిశాఖ నగరపాలక సంస్థలో భీమునిపట్నం, అనకాపల్లి మున్సిపాలిటీలతో పాటు 10 పంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జిఓ రెండు రోజుల్లో వెలువడనుంది. ఇప్పటికే విలీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాటు నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా, సాధ్యమైనంత త్వరలోనే మున్సిపాలిటీలకు సైతం ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. విలీనం ప్రక్రియ పూర్తయినప్పటికీ వార్డుల పునర్విభజన, ఎస్సీ,ఎస్టీ,బీసి,మహిళా ఓటర్ల గుర్తింపు అంశాలను పూర్తి చేయాల్సి ఉంది. శాస్ర్తియ పద్ధతిలో వార్డుల పునర్విభజన ప్రక్రియను చేపట్టేందుకు కొంతమేర సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ సాధ్యమైనం త్వరలోనే ఈతంతును పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల నాటికి ఈప్రక్రియ సాధ్యం కాదని అధికారులు భావిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆఘమేఘాల మీద విలీనం అంశాన్ని పూర్తి చేయాలనుకుంటోంది. దీనిలో భాగంగానే రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేసే దిశగా కసరత్తు జరుగుతోందని సమాచారం. దీనిపై జివిఎంసి వర్గాలు మాత్రం గుంభనంగానే ఉన్నాయి. విలీనం అంశం పూర్తయిందని, ఇక జిఓ విడుదల కావడం ఒక్కటే మిగిలి ఉందని పేర్కొంటున్నాయి.
కాలం చెల్లిన భవనాల తొలగింపు తూతూమంత్రమేనా
విశాఖపట్నం, జూలై 13: కాలం చెల్లిన భవనాల తొలగింపు విషయంలో జివిఎంసి ఆరంభ శూరత్వంపై అనుమానానపు మేఘాలు కమ్ముకుంటున్నాయి. హైదరాబాద్‌లో శిధిలభవనం కూలిన ఘటనలో 16 మంది మృత్యువాత పడటంతో ఆఘమేఘాలమీద కాలం చెల్లిన కట్టడాలపై జివిఎంసి స్పందించింది. నగరంలో దాదాపు 375 భవనాలు కాలం చెల్లి, శిధిలావస్థకు చేరుకున్నట్టు జివిఎంసి గుర్తించింది. తొలిరోజు మూడు భవనాలను జివిఎంసి అధికారులు కూల్చేశారు. జోన్ 3లో అత్యధికంగా 241 కాలం చెల్లిన భవనాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీటిలో తొలిరోజు ఒక భవనాన్ని కూల్చివేసినట్టు అధికారులు ప్రకటించారు. రెండో రోజు కూల్చివేత ప్రక్రియకు అధికారులు విరామం ఇచ్చారు. అయితే కాలం చెల్లిన భవనాలను గుర్తించి వారికి నోటీసులు జారీ చేశామని, యాజమాన్యాలు స్పందించని పక్షంలో మాత్రమే తాము రంగంలోకి దిగుతామని జివిఎంసి అధికారులు వివరణ ఇస్తున్నారు. ఈవిషయంలో కొన్ని అంశాలు తమకు ప్రతిబంధకంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. ముఖ్యంగా కాలం చెల్లినట్టు భావిస్తున్న భవనాలకు సంబంధించి జివిఎంసితో పాటు థర్డ్‌పార్టీ ధృవీకరించాల్సి ఉంది. ఈవిషయంలో భవనాల యజమానులు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశాలను కొట్టిపారేయలేమని అధికారులు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా నగర పరిధిలో జివిఎంసి గుర్తించిన కాలం చెల్లిన భవనాల్లో అత్యధికశాతం ప్రభుత్వ శాఖలకు చెందినవే ఉండటం గమనార్హం. ఎయు లేడీస్ హాస్టల్ కూలేందుకు సిద్ధంగా ఉందని నిర్థారించినప్పటికీ కొనే్నళ్లుగా అదే భవనంలో దాన్ని కొనసాగిస్తున్నారు. ఇక పంచాయతీరాజ్, జెడ్పీ, జివిఎంసి పరిధిలోని పలు భవనాల పరిస్థితి కూడా అంతే. నగరం నడిబొడ్డున జివిఎంసికి చెందిన టిఎస్సార్ కాంప్లెక్స్ శిధిలావస్థకు చేరుకుని కూలేందుకు సిద్ధంగా ఉంది. వీటిపై వస్తున్న అద్దెలతో పాటు అందులో ఉన్న వ్యాపారస్తుల అభ్యర్ధన మేరకు తొలగింపు విషయాన్ని జివిఎంసి పక్కనపెట్టింది. యుద్ధ ప్రాతిపదికపై చేపట్టాల్సిన కూల్చివేతపై నాన్చుడు ధోరణి అవలంభిస్తే భవిష్యత్‌లో జరిగే ప్రాణ, ఆస్తి నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారన్నది శేష ప్రశ్న.
శ్రీ కృష్ణకమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకోవాలి
విశాఖపట్నం, జూలై 13: శ్రీ కృష్ణ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా చూడాలని విద్యార్థి యువజన జెఏసి రాష్ట్ర అధ్యక్షుడు ఆడారి కిషోర్‌కుమార్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో శనివారం ఆర్‌జెడి నేత శరద్‌పవార్‌ను యువజన జెఏసి ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిషోర్‌కుమార్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు మద్దతు తెలియజేయాల్సిందిగా శరద్‌పవార్‌ను కోరారు. భారతదేశంలో ఉత్తరాంచల్, ఛత్తీస్‌గడ్, జార్ఘండ్ రాష్ట్రాల విభజనతోనే అభివృద్ధి కుంటుపడిందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం వలనే ప్రగతి సాధ్యపడుతుందని, సమస్యలు పరిష్కరించబడతాయని, విడిపోతే ఎటువంటి ప్రయోజనాలు ఉండవన్నారు.