Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

విజ్ఞానాన్ని పంచే సైన్స్ ఎక్స్‌ప్రెస్ రాక

$
0
0

విశాఖపట్నం, జూలై 13: ప్రపంచ విజ్ఞానాన్ని, శాస్త్ర,సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే ‘సైన్స్ ఎక్స్‌ప్రెస్’ ఈనెల 15వ తేదీన ఇక్కడకు వస్తుంది. దీనిని విశాఖ రైల్వేస్టేషన్ ఎనిమిదవ నెంబర్ ప్లాట్‌ఫారంపై ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిని డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రారంభిస్తారు. రాయగడ నుంచి బయలుదేరి ఆ రోజు ఉదయం 10 గంటలకు ఇక్కడకు చేరుకునే సైన్స్ ఎక్స్‌ప్రెస్‌లో కనీసం 8కోచ్‌లుంటాయి. ఒక్కో కోచ్‌లో ఒక్కో ప్రత్యేకతను తెలియజేసే అంశాలతో డిస్‌ప్లే ఉంటుంది. వరుసగా మూడు రోజులపాటు దీనిని సందర్శకులకు అందుబాటులో ఉంచుతారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సందర్శించవచ్చు. ప్రతి ఏడాది ఇదే సీజన్‌లో వచ్చే సైన్స్ ఎక్స్‌ప్రెస్ విశాఖ నుంచి నేరుగా బయలుదేరి కాకినాడకు వెళ్తుంది. అక్కడ నుంచి రాజమండ్రి, విజయవాడ మీదుగా పలు ప్రాంతాలకు వెళ్తుంది.

పాస్‌పోర్టు సేవాకేంద్రంపై సిబి‘ఐ’
విశాఖపట్నం, జూలై 13: విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్ళే అభ్యర్థులు, కుటుంబసభ్యుల వద్దకు వెళ్ళాల్సిన బందువులు, శస్తచ్రికిత్స కోసం వెళ్తున్న రోగులకు అవసరమైన పాస్‌పోర్టును సకాలంలో జారీ చేస్తూ విశేషంగా సేవలందిస్తున్న పాస్‌పోర్టు ప్రాంతీయ కార్యాలయం చుట్టూ ఇపుడు సమస్యలు అలుముకుంటున్నాయి. ఇటీవల సిబిఐ అధికారులు నిర్వహించిన దాడులే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. మరో నాలుగు రోజుల్లో మళ్ళీ ఈ అధికారులు బిర్లాజంక్షన్ వద్దనున్న పాస్‌పోర్టు సేవా కేంద్రంలో (పిఎస్‌సి) ఆకస్మీక దాడులు నిర్వహిస్తారని తెలిసింది. ఇక్కడ పనిచేసి బయటకు వెళ్ళిన తరువాత దుకాణం నిర్వహించుకునే ఒకరిద్దరు చేసిన తప్పిదాలకు నిత్యం దరఖాస్తుదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో పాస్‌పోర్టు సమస్యలు రోజురోజుకీ తీవ్రతరమవుతున్నాయి. అభ్యర్థులు ఇక్కడకు వచ్చిన నుంచి తిరిగి వెళ్ళినంత వరకు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి వస్తోంది. అనేక రకాలుగా సేవలందిస్తున్న పాస్‌పోర్టు ప్రాంతీయ కార్యాలయం, పాస్‌పోర్టు సేవాకేంద్రాల్లో అధికారులు, ఉద్యోగులు ఇపుడు బయపడుతున్నారు. ఏ క్షణంలో ఎటువైపు నుంచి అధికారులు వస్తారోనన్న ఆందోళన వీరి నుంచి వ్యక్తమవుతోంది. ఇందులో ఓ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ అభ్యర్థులకు అవసరమైన స్లాట్ బుకింగ్‌లను ఇబ్బడిముబ్బడిగా జారీ చేస్తున్నారనే ఆరోపణలపై ఇటీవల సిబిఐ దాడులు జరిపి ఏజేన్సీకి చెందిన కొందర్ని అదుపులోకి తీసుకుంది. ఆ తరువాత మళ్ళీ దాడులు జరిపి ఇందులో ఓ అధికారి జోక్యం ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుగుతోంది. ఈ విధంగా స్లాట్ బుకింగ్‌లు కాస్త వివాదస్పదంగా మారడంతో ఈమధ్య వీటిని ఏకంగా నిలిపివేయడం మరో తీవ్రతరమైన సమస్యగా మారింది. రోజు స్లాట్ బుకింగ్ ద్వారా కనీసం 400 మంది వరకు అభ్యర్థులు ఇక్కడకు వస్తుంటారు. ఎవరో చేసిన తప్పిదానికి రోజు వచ్చే అభ్యర్థులు ఇబ్బందుల పడుతున్నారు. అయితే వృద్ధులు, పిల్లలు, విదేశాలకు శస్తచ్రికిత్సలు చేయించుకునేందుకు మెడికల్ సర్ట్ఫికేట్ ఇస్తే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళే రోగులకు అభ్యంతరాలు ఉండవు. అలాగే ఎన్‌ఓసి తెచ్చుకునే వృద్ధులు, పిల్లలకు ఎటువంటి సమస్యలుండటంలేదు. ఈ తరహా వారందరికీ పాస్‌పోర్టు జారీ అవుతుంది. కాగా పూర్తిస్థాయిలో ప్రక్షాళన జరిగి సక్రమ పద్ధతిలో సేవలు అందుతున్న వరకు సిబిఐ పాస్‌పోర్టు సేవాకేంద్రం ప్రత్యేక దృష్టి ఉంచుతున్నట్టు తెలుస్తోంది.

మావోల అడ్డాలో పంచాయతీ సమరానికి బ్రేక్!
నర్సీపట్నం/గూడెం కొత్త వీధి, జూలై 13: పంచాయతీ ఎన్నికల్లో సి.పి.ఐ. మావోయిస్టుల వ్యూహం ఫలించింది. ఎన్నికలను బహిష్కరించండంటూ మావోయిస్టులిచ్చిన పిలుపునకు సానుకూల స్పందన లభించింది. విశాఖ మన్యంలో మావోయిస్టు ప్రభావిత మండలాలైన జి.కె.వీధి, చింతపల్లిల్లోని ఆరు పంచాయతీల్లో గిరిజనులు ఎన్నికలను బహిష్కరించారు.
జి.కె.వీధి మండలం జర్రెల, వంచుల, మొండిగెడ్డ, చింతపల్లి మండలం బలపం, కుడుమసారి, తమ్మింగుల పంచాయతీల్లో నామినేషన్లు ముగిసే సమయానికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కానట్టు సమాచారం. మావోయిస్టు ప్రభావిత పంచాయతీలైన పై గ్రామాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా మావోయిస్టులు విశాఖమన్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా తవ్వకాలకు వ్యతిరేకంగా పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని మావోయిస్టులు బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు పలు ప్రాంతాల్లో కరపత్రాలు, వాల్ పోస్టర్లు వెదజల్లారు. అలాగే చింతపల్లి మండలంలో అధికార కాంగ్రెస్ ఫార్టీకి చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ వంతల సుబ్బారావు, జి.కె.వీధి మండలం దేవరాపల్లి, మంగిలిపాలెంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మత్స్యల మత్స్యరాజు, గడుతూరి బాబూరావు ఇళ్ళపై దాడులు చేసి ఆస్తులను లూఠీ చేశారు. సుబ్బారావు త్రుటిలో నుండి తప్పించుకుని ప్రాణాలతో బయట పడ్డారు.
ఈ సంఘటనల నేపథ్యంలో ఏజన్సీలోని ప్రజాప్రతినిధులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెనుకంజ వేశారు. వంచుల, జర్రెల, మొండిగెడ్డ, బలపం, కుడుమసారె, తమ్మింగుల పంచాయతీల్లో ఎన్నికలను బహిష్కరించగా, మరికొన్ని పంచాయతీల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు కాకుండా వేరే వారిచే నామినేషన్లు కేంద్రానికి నామినేషన్లు పంపించి దాఖలు చేయించినట్టు విశ్వసనీయ సమాచారం. గతంలో జరిగిన పంచాయతీ, మండల పరిషత్‌ల ఎన్నికల్లో ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చినప్పటికీ రాజకీయ పార్టీల నాయకులు అంతగా పట్టించుకునేవారు కాదు. మావోయిస్టులు పిలుపునిచ్చినా స్థానిక నాయకులు మాత్రం నామినేషన్లు వేసి పోటీల్లో నిల్చునేవారు. ఈ దఫా మావోయిస్టులు సైతం బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఎన్నికల బహిష్కరణ పిలుపును సీరియస్‌గానే తీసుకున్నారు. ప్రధానంగా బాక్సైట్ తవ్వకాలు జరిపే బలపం, జర్రెల పంచాయతీల ఎన్నికలను స్థానిక గిరిజనులే వ్యతిరేకిస్తూ నామినేషన్లకు దూరంగా ఉన్నారు. విశాఖమన్యంలో అన్ని పంచాయతీల్లోనూ ఎన్నికలు జరిగేలా చర్యలు చేపడుతున్నామని పోలీసు ఉన్నతాధికారులు చేసిన ప్రకటనలు నామమాత్రమయ్యాయి.
ఉప సంహరణ నాటికి మరికొన్ని...
చింతపల్లి, జి.కె.వీధి, కొయ్యూరు మండలాల్లో పలు పంచాయతీల్లో ప్రధాన రాజకీయ పార్టీల మద్దతు దారులు నామినేషన్లు వేసినప్పటికీ వీరంతా ఉప సంహరించుకోవాలని మావోలు వత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. ప్రధానంగా కొయ్యూరు మండలంలోని మావోయిస్టు ప్రభావిత గ్రామాలైన బూదరాళ్ళ, మఠంభీమవరం, యు.చీడిపాలెం పంచాయతీలపై మావోయిస్టులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. గతంలో పై పంచాయతీల్లో ఎన్నికల సందర్భంగా మావోయిస్టులు పలు సంఘటనలకు పాల్పడిన దాఖలాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈమూడు పంచాయతీల్లో అధిక శాతం నామినేషన్లు దాఖలు కావడం గమనార్హం. మావోయిస్టులకు పట్టున్న ఈ పంచాయతీల్లో ఎన్నికలు జరగకుండా నామినేషన్లు ఉప సంహరించుకోవాలని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది. మావోయిస్టుల నుంచి వస్తున్న ఒత్తిడితో వారి ప్రాబల్యం అధికంగా ఉన్న మారుమూల ప్రాంత పంచాయతీలలో పోటీ చేసేందుకు గిరిజనులు వెనుకడుగు వేసి నామినేషన్లు దాఖలు చేసేందుకు ముందుకు రానట్టు భావిస్తున్నారు. దీంతో నామినేషన్లు దాఖలు కాని పంచాయతీలో ఈ నెల 23వ తేదీన పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఇటువంటి పంచాయతీలలో మరోసారి ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు పాడేరు డివిజనల్ పంచాయతీ అధికారి రాంప్రసాద్ శనివారం రాత్రి ఆంధ్రభూమితో చెప్పారు.
మన్యంలో ఉద్రిక్తత: పంచాయతీ ఎన్నికల వేళ మన్యంలో ఎదురు కాల్పులు, మావోయిస్టు దాడుల నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణంను తలపిస్తోంది. కొయ్యూరు మండలం కిండంగి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి చెందింది. ఒక రోజు ముందు గూడెంకొత్తవీధి మండలం మంగిలిపాలెం, దేవరాపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ నాయకుల ఇళ్ళపై దాడులకు మావోయిస్టులు పాల్పడ్డారు. ఇక్కడ పాల్గొని కొయ్యూరు వైపు తరలివెళ్తున్న మావోయిస్టులకు పోలీసులు తారసపడడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్నడూ లేని విధంగా మావోయిస్టులు వరుస దాడులకు పాల్పడుతుండడంతో ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు, ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. నామినేషన్లు వచ్చే అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వెనుతిరిగారు. కాంగ్రెస్ నాయకుల ఇళ్ళపై మావోయిస్టులు గురిపెడుతుండడంతో ఆపార్టీ నాయకుల్లో కలవరం మొదలవుతుంది. ఇటు పోలీసులు, అటు మావోయిస్టుల బూటు చప్పుళ్ళతో మన్యం అడవులు దద్దరిల్లుతున్నాయి. పదుల సంఖ్యలో మావోయిస్టులు తిరుగుతుండడంతో గ్రామాల్లో భయాందోళన నెలకొంటోంది.

అడవి దున్న హతం
* నలుగురు అరెస్ట్

నర్సీపట్నం,జూలై 13: అడవిదున్నను వేటగాళ్ళు హతం చేశారు. మొండెం, తలను వేర్వేరుగా చేశారు. మొండెంను సంఘటనా స్థలంలో వదిలివేసిన వేటగాళ్ళు తలను మాత్రం పట్టుకుపోయారు. అడవి దున్న తలకు లక్ష రూపాయలకు పైగా రేటు పలికే అవకాశం ఉండడంతో ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈసంఘటనకు సంబంధించి నలుగురు వేటగాళ్ళను అరెస్ట్ చేశారు. నర్సీపట్నం అటవీ రేంజర్ ఎస్.కె.మస్తాన్‌వల్లీ అందించిన వివరాలిలా ఉన్నాయి. జీడితోట నరికేందుకు కూలీకి వెళ్తుండగా రోలుగుంట మండలం చటర్జీపురం సమీపంలో అడవిదున్న దాడి చేయడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ అడవిదున్న సంగతి తెలుసుకున్న చటర్జీపురం గ్రామానికి చెందిన నీలాపురమణ, కేదారి చిన అప్పలనాయుడు, నీలాపులోవరాజు, కొల్లేటి శ్రీనులు నాటు తుపాకులతో దాడి చేసి అడవి దున్నను పట్టుకున్నారు. చటర్జీపురంలోని సమీపంలోని గెడ్డ వద్ద అడవిదున్నను నరికి మొండెం, తలను వేర్వేరు చేశారు. మొండెంను అక్కడే వదిలివేసి తలను మాత్రం కొంతదూరంలో గొయ్యితీసి దాచిపెట్టారు. మొండెం పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించగా రేంజర్ ఎస్.కె.మస్తాన్‌వల్లీ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. అడవి జంతువుల వేటకు వెళ్ళే వారే ఈపని చేసి ఉంటారని అనుమానించిన రేంజర్ చటర్జీపురంలోని వేటగాళ్ళను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా అడవిదున్న తలను స్వాధీనం చేసుకున్నారు. మొండెం, తలకు పంచనామా శనివారం పంచనామా నిర్వహించి పూడ్చిపెట్టారు. ఈసంఘటనలో పై నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు రేంజర్ మస్తాన్‌వల్లీ తెలిపారు.

సమర్థులను ఎన్నుకోండి: మంత్రి బాలరాజు
పాడేరు, జూలై 13: పంచాయతీ ఎన్నికలలో సమర్థులైన వారిని ఎన్నుకుని గిరిజన ప్రాంత ప్రగతికి సహకరించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు కోరారు. తన నివాసంలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. పంచాయతీలకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయని, ఇటువంటి వాటికి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వారు సమర్థులై ఉండాలని అన్నారు. తమ ప్రాంతాల అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయగల వారు పంచాయతీ సర్పంచ్‌లుగా ఎన్నికైతేనే అందరికీ ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని గిరిజన ప్రాంత ప్రజానీకం గమనించాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గిరిజన ప్రాంత అభివృద్ధికి బృహత్తర కార్యక్రమాలను అమలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. తాను మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాలుగేళ్ళ కాలంలో కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేయించి విశాఖ మన్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్టు ఆయన చెప్పారు. మన్యంలో రహదారుల నిర్మాణం, మంచినీటి సదుపాయాల కల్పన, విద్యాభివృద్ధి, మహిళా సంక్షేమం, నిరుద్యోగ గిరిజన యువతకు ఉపాధి కల్పన వంటి పలు కార్యక్రమాలను అమలు చేసినట్టు ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉందని, తమ ప్రగతికి పాటుపడుతున్న కాంగ్రెస్‌ను స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉందని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీలకు జరుగుతున్న ఎన్నికలలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం ద్వారా గ్రామాల అభివృద్ధికి బాటలు వేసుకోవాలని ఆయన సూచించారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారం కావాలన్న, తమ ప్రాంతంలో అభివృద్ధి జరగాలన్నా కాంగ్రెస్ అభ్యర్థులే సర్పంచ్‌లుగా ఎన్నిక కావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గిరిజన ప్రాంత ప్రజలు పంచాయతీ ఎన్నికలలో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రానున్న కాలంలో పంచాయతీలకు అధిక మొత్తంలో నిధులు విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు ఆయన చెప్పారు. పంచాయతీలకు కేటాయించే నిధులను సక్రమంగా వినియోగించి ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టగలిగే వారిని ఎన్నుకోవాలని ఆయన అన్నారు. ఏజెన్సీలోని 244 గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అధికంగా విజయం సాధించ గలరనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే స్థానిక ఎన్నికలలో తమ పార్టీ విజయానికి సోపానాలని బాలరాజు పేర్కొన్నారు.
పంచాయతీ పోరుపై నేతల హైరానా
పట్టనట్లు వ్యవహరిస్తున్న నియోజకవర్గ నేతలు
వైకాపాలో సమన్వయ లేమి
కాంగ్రెస్ నేతల్లో కానరాని ఉత్సాహం
అభ్యర్థుల కొరతతో టిడిపి
అనకాపల్లి, జూలై 13: గ్రామపంచాయతీల నామినేషన్ల ఘట్టం ముగిసింది. జిల్లాలో మూడు దశలుగా పంచాయతీ పోరుకు సన్నద్ధమయ్యారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే దిశగా పావులు కదుపుతున్నారు. మరో ఏడాదిలోగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీల నేతలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రధానంగా ప్రతిపక్ష వైఎస్‌ఆర్ సిపి అగ్రనేత జగన్‌మోహన రెడ్డి, దేశం అధినేత చంద్రబాబు ఈ ఎన్నికల ఫలితాలు తమ పార్టీ రాజకీయ భవిష్యత్‌కే పెద్ద సవాలుగా భావిస్తున్నారు. అయితే పంచాయతీ ఎన్నికలపై అగ్రనేతలకున్న ఆసక్తి జిల్లా, నియోజకవర్గ నేతల్లో కానరావడం లేదు. అటు దేశం, ఇటు వైఎస్‌ఆర్ సిపి నేతల్లో పంచాయతీ ఎన్నికల పట్ల కాస్తంత ఉత్సాహం ఉన్నప్పటికీ అధికార కాంగ్రెస్ నేతల్లో మాత్రం ఆ సందడి కానరావడం లేదు. పంచాయతీ ఎన్నికలకు నియోజకవర్గ ఇన్‌చార్జిలే పూర్తిబాధ్యత వహించాలని, సానుకూల ఫలితాలు రాకపోతే టిక్కెట్లు ఇచ్చే విషయంలో ఇన్‌చార్జిలను పక్కనపెట్టేందుకు సైతం వెనుకాడేది లేదని దేశం అధినేత చంద్రబాబు, వైసీపి నేత విజయమ్మ సైతం ఖరాఖండిగా స్పష్టం చేసారు. అయినప్పటికీ జిల్లాలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు పంచాయతీ ఎన్నికలను అంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న దాఖలాలు కానరావడం లేదు. అభ్యర్థుల ఎంపికలో జోక్యం చేసుకుంటే వారు విజయం సాధించేందుకు అవసరమైన ఆర్థిక తోడ్పాటును సైతం అందించాల్సివస్తుందేమోనని తప్పించుకు తిరుగుతున్నారు. జిల్లాలోని ఇద్దరు మంత్రులు సైతం పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసిన దాఖలాలు కానరావడం లేదు. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికార కాంగ్రెస్‌లో ఆ కాస్తంతైనా హడావుడి కనిపిస్తుంది. దేశం పార్టీలో మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి, మరో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు తమ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సర్పంచ్ అభ్యర్థులను బరిలోకి దింపడంపై దృష్టి కేంద్రీకరించారు. అభ్యర్థులు లేక పోటీకి దింపలేని పరిస్థితి యలమంచిలి నియోజకవర్గంలోని దాదాపు 30గ్రామాల్లో నెలకొన్న విషయం పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి వెళ్లింది. గెలుపోటములతో సంబంధం లేదు. ఎన్నికల బరిలో దేశం మద్ధతుదారులను విధిగా బరిలో దింపాల్సిందేనని చంద్రబాబు ఆల్టిమేట్టం ఇవ్వడంతో మాజీ ఎంపి పప్పల చలపతిరావు, యలమంచిలి దేశం ఇన్‌చార్జి పదవిని ఆశిస్తున్న సుందరపువిజయ్‌కుమార్ తదితరులు శనివారం హడావుడిగా మునగపాక, అచ్యుతాపురం, యలమంచిలి తదితర మండలాల్లో పర్యటించి ప్రతీ గ్రామంలోను విధిగా దేశం అభ్యర్థులు బరిలోకి దిగేలా చర్యలు తీసుకున్నారు. పలు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు అవసరమైన ఆర్థిక తోడ్పాటును అందిస్తామని నేతలు భరోసా ఇవ్వడంతో పోటీకి దిగేందుకు సుముఖత వ్యక్తం చేసారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో నియోజకవర్గ వైఎస్‌ఆర్ సిపి నేత పెదబాబు దాదాపు అన్ని గ్రామాల్లో కూడా వైసీపి అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సర్వశక్తులు ఒడ్డి కృషిచేస్తున్నారు. కాంగ్రెస్, వైసీపి పార్టీలకు ధీటుగా అన్ని పంచాయతీల్లో కూడా విధిగా దేశం అభ్యర్థులను బరిలోకి దింపేందుకు అనకాపల్లి అసెంబ్లీ దేశం సమన్వయకమిటీ సభ్యులు అష్టకష్టాలు పడ్డారు. మాజీమంత్రి కొణతాల రామకృష్ణ వౌనం వహించడం వలన వైసీపిలో కొంత స్తబ్ధత నెలకొన్నప్పటికీ యలమంచిలిలో వైసీపీ సమన్వయకర్తలు ప్రగడ నాగేశ్వరరావు, బొడ్డేడ ప్రసాద్‌లు తమ ప్రాంతాల్లో వైసీపి అభ్యర్థులను బరిలోకి దింపడంతోపాటు వారి గెలుపు బాధ్యతను సైతం వీరి భుజస్కందాలపై వేసుకున్నారు. తమ మద్ధతుదారులను మెజార్టీ స్థానాల్లో గెలిపించుకుంటే తప్ప యలమంచిలి అసెంబ్లీ వైసీపి టిక్కెట్‌ను అడిగే హక్కును పొందలేమనే భావంతో ఈ ఇరువురు నేతలు సర్పంచ్ ఎన్నికల్లో విజయంపై దృష్టి కేంద్రీకరించారు. జిల్లా దేశం అధ్యక్షులు గవిరెడ్డి తన సొంత మాడుగుల అసెంబ్లీకే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. చోడవరం, మాడుగుల, నర్సీపట్నం తదితర అసెంబ్లీల్లో వైఎస్‌ఆర్ సిపిలో రెండు వర్గాలుగా ఎవరికి వారే సర్పంచ్ పదవులకు తమ మద్దతుదారులను బరిలోకి దింపారు. నామినేషన్ల ఘట్టం ముగియడంతో వైసీపికి రెబల్స్ బెడద లేకుండా చూసేందుకు చర్చలు జరుపుతున్నట్లు ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎన్నికల వైసిపీ పరిశీలకులు దాడి వీరభద్రరావుతెలిపారు. డిసిసి అధ్యక్షులు కరణం ధర్మశ్రీ మాడుగుల, చోడవరం అసెంబ్లీల పరిధిలో సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై దృష్టి కేంద్రీకరించారు. అయితే పలుచోట్ల అధికార కాంగ్రెస్ పార్టీలో గంటా వర్గీయులు సర్పంచ్ పదవులకు నామినేషన్ దాఖలు చేయడంతో ఆ ప్రాంతంలో రెబల్స్ బెడద తప్పేటట్టు లేదు.

* రేపటి నుంచి మూడు రోజులు
english title: 
v

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>