గజపతినగరం, జూలై 13 : నామినేషన్లు దాఖలు చేయడానికి శనివారం చివరి రోజు కావడంతో ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం అభ్యర్థులతో సందడిగా కనిపించింది. అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. మేజర్ గ్రామపంచాయతీ గజపతినగరం సర్పంచ్ పదవికి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీకి తలపడుతున్న సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త నరవ వీరాస్వామి సతీమణి కొండమ్మ నామినేషన్ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాధవికి అందజేశారు. ఎమ్మెల్యే అప్పలనర్సయ్య నాయకత్వంలో ఆమె కేంద్రానికి చేరుకున్నారు. అభ్యర్ధి కొండమ్మకు మాజీ గ్రామ సర్పంచ్ కందుల వెంకట చిన్నయ్యస్వామి ప్రతిపాదించారు. కార్యక్రమంలో సీతారామస్వామి దేవస్థానం అధ్యక్షుడు కొల్లా వెంకట సాంబమూర్తి మాజీ జెడ్‌పిటిసి సభ్యుడు గార తవుడు, పార్టీ నాయకులు ఉత్తరావల్లి అప్పలనాయుడు, కర్రి రమేష్, రుంకాన భాస్కరరావు, పాల్గొన్నారు. వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు తమఅనుచరులతో ప్రదర్శనగా వచ్చి నామినేన్ పత్రాలు దాఖలు చేశారు. నగర ప్రసన్నకుమారి తమ మద్దతుదారులతో ప్రదర్శనగా వచ్చి సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. ప్రసన్న కుమారి అభ్యర్ధిత్వాన్ని దాసరి వెంకటరమణ ప్రతిపాదించారు. కృష్ణవేణి కూడా సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు.
బొండపల్లి: మండలం పరిధిలోని ముద్దూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి కల్యాణపు సుమతి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. బిళ్ళలవలస గ్రామంలో గల నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్దకు వందలాది మంది గ్రామస్తులతో చేరుకుని నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సుమతి అభ్యర్ధిత్వాన్ని బాలి రామ్మూర్తినాయుడు బలపర్చారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో వివిధ పార్టీలకు చెందిన ఆల్తి అప్పలనాయుడు, మాజీ సర్పంచ్ సుంకరి నర్సింహులు, బాలి రామ్మూర్తినాయుడు, బాలి పెంటంనాయుడు, బాలి తాతినాయుడు, కల్యాణపు సత్యం, తాతినాయుడు, తదితరులు పాల్గొన్నారు. బొండపల్లి పంచాయితీ సర్పంచ్ పదవికి లచ్చిరెడ్డి సుజాత నామినేషన్‌ను దాఖలు చేశారు. మాజీ ఎంపిపి బండారు బంగారం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిరిపురపు ఆదినారాయణ, పాల్గొన్నారు.
వియ్యంపేటకు నామినేషన్ నిల్
విజయనగరం, జూలై 13: జిల్లాలోని కొత్తవలస మండలం వియ్యంపేట పంచాయతీని ఎస్టీలకు కేటాయించడంతో అక్కడ ఏ ఒక్కరూ నామినేషన్ దాఖలు చేయడానికి వీలులేకుండా పోయింది. ఆ పంచాయతీలో ఒక ఎస్టీ మహిళ నివసిస్తున్నప్పటికీ ఆమెకు ముగ్గురు పిల్లలు ఉండటంతో సర్పంచ్ పదవికి పోటీ చేసే అర్హతను ఆమె కోల్పోయింది. దీంతో ఆ పంచాయతీకి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
చినమేరంగి సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం
జియ్యమ్మవలస, జూలై 13: మండలంలో చినమేరంగి గ్రామ సర్పంచ్‌గా శతృచర్ల పరిషత్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం నామినేషన్లు వేయడానికి చివరి రోజు కావడంతో సర్పంచ్‌గా పరిషత్‌రాజు ఒక్కరే నామినేషన్ వేశారు. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కురుపాం నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త శతృచర్ల చంద్రశేఖరరాజు తనయుడు శతృచర్లకు పార్టీలతో ప్రమేయం లేకుండా పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని గ్రామస్థులు కోరారు. కొంతమంది పెద్దలు పరిషత్‌రాజును ఇండిపెండెంట్‌గా పోటీలోకి దింపారు. చినమేరంగి శతృచర్ల కోట నుంచి ఊరేగింపుగా కురుపాం ఎమ్మెల్యే విటి జనార్దన థాట్రాజ్, నాగూరు మాజీ ఎమ్మెల్యే శతృచర్ల చంద్రశేఖరరాజు ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రానికి వెళ్లి పరిషత్ రాజు నామినేషన్ వేశారు.
టీడీపీ, కాంగ్రెస్‌ల మధ్య అవగాహన?
బొబ్బిలి, జూలై 13: బొబ్బిలి నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలలో గెలుపుసాధించేందుకు కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీలు ఒకవైపు, వైఎస్సార్‌సీపీ వేరొకవైపు ఎత్తులు- పై ఎత్తులతో పావులు కదుపుతున్నారు. పంచాయతీ పోరులో ప్రతాపం చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వైకాపా అభ్యర్థులను ఓడించేందుకు పలు పంచాయతీలలో దేశం, కాంగ్రెస్ నేతలు ఒకటి కావడం విశేషం. పంచాయతీ ఎన్నికలలో పార్టీలతో సంబంధం లేకపోయినప్పటికీ గ్రామ స్థాయిలో కీలకమైన ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీలు సర్పంచ్ పదవులపై దృష్టిసారించారు. ఈమేరకు బొబ్బిలి నియోజకవర్గం పరిధిలో ఉన్న నాలుగు మండలాల్లో ఉన్న పలు పంచాయతీలలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు అవగాహనకు వచ్చి వైకాపా అభ్యర్థులను ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బొబ్బిలి మండలంలో అలజంగి, పారాది, కోమటిపల్లి, కలువరాయి, చింతాడ తదితర పంచాయతీలలో కాంగ్రెస్, దేశం నేతలు ఒకరికొకరు సహకరించుకుంటూ వెకాపాను ఎదిరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అలాగే రామభద్రపురం మండలంలో కొత్తరేగ, దుప్పలపూడి, నర్సాపురం, కోటశిర్లాం, కొండరేజేరు, నాయుడువలస, తదితర పంచాయతీలలో ఇరుపార్టీల నాయకులు వైకాపా అభ్యర్థులపై పోరుకు సిద్ధమవుతున్నారు.
అలాగే బాడంగి మండలంలో గొల్లాది, కోడూరు, బొత్సవానివలస, వాడాడ, తదితర పంచాయతీలలో నాయకులు ఒక్కటైనట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో బొబ్బిలి రాజుల ప్రాబల్యాన్ని తగ్గించేందుకు దేశం, కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి ప్రణాళికలు ప్రకారం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. వీటిని ఎలాగైన చిత్తుచేస్తామని బొబ్బిలి రాజులు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. దీంతో నియోజకవర్గంలో పంచాయతీ పోరు రసవత్తరంగా మారిందనవచ్చు.
పారిశుద్ధ్యం, మంచినీరే ప్రధాన సమస్య
కురుపాం, జూలై 13: కురుపాం మేజర్ పంచాయతీలో పారిశుద్ధ్యం లోపం, మంచినీటి అవసరాలు ప్రధాన సమస్యలుగా కనిపిస్తాయి. పంచాయతీలోని అన్నివీధుల్లోని కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. పోలీస్ స్టేషన్ వద్ద కాలువ చెత్తతో నిండిపోవడంతో వర్షం పడితే రోడ్డుపైకే మురుగునీరు వస్తుంది. రావాడ రోడ్డు, జి.సి.సి. ప్రాంతాల్లో ఉన్న కల్వర్టుల వద్ద చెత్త నిలిచి పోవడంతో మురునీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. పలు ప్రాంతాల్లో చెత్త కుప్పలు కనబడుతున్నాయి. పారిశుద్ధ్యం నిర్వహణ కోసం నిధులు చాలడం లేదు. ఒక్క ట్రాక్టరే ఉండటంతో రెండు రోజులకొకసారి చెత్తను తీయిస్తుంటారు. గత రెండేళ్లుగా కాలువల్లో పూడిక తొలగించడం లేదు. పారిశుద్ధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా మెరుగుపరిస్తే సమస్యలు తీరినట్లే. వీధి దీపాల ఏర్పాటు కోసం నిధులున్నప్పటికీ నిర్వహించడం లేదు. ఈ మూడు సమస్యలే సర్పంచ్‌కు ప్రధానమైనవి.
నిన్న శతృవులు.. నేడు మిత్రులు!
సీతానగరం, జూలై 13: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు- శాశ్వత శతృవులు ఉండరు అనడానికి పెదబోగిలి పంచాయతీ నిదర్శనం. పంచాయతీ ఎన్నికలలో పోటీ చేస్తున్న టిడిపి మద్దతు అభ్యర్థి బుడితి కృష్ణవేణికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోంది. శనివారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ కేంద్రానికి ఎమ్మెల్యే జయమణి, కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చి టిడిపి అభ్యర్థికి మద్దతు తెలిపారు. అనంతరం పంచాయతీ పరిధిలోని పలు వీధులలో టిడిపి, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు, నాయకులతో ఎమ్మెల్యే ర్యాలీ నిర్వహించారు. రాజకీయాలలో నిన్నటి వరకు శతృవులుగా ఉన్న టిడిపి, కాంగ్రెస్ ఈ ఎన్నికలలో కలిసి పోటీ చేయడం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మేజర్ పంచాయతీలో టిడిపి, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధానంగా పోరు ఉండేది. వైకాపా రాకతో ఈ రెండు పార్టీలు కలిసి అభ్యర్థిని పోటీకి నిలవడం విశేషం.