విజయనగరం, జూలై 13: జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ మద్యం వ్యాపారం చేస్తున్నారని వైకాపా నేత షర్మిల పేర్కొనడాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ఖండించారు. శనివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మద్యం వ్యాపారంలో మంత్రి బొత్సకు ఒక్క రూపాయి పెట్టుబడి ఉందని బహిరంగంగా నిరూపించినా దేనికైనా సిద్ధమేనన్నారు. వైకాపా పార్టీ నిరూపించగలదా అని ప్రశ్నించారు. వెనుకబడిన జిల్లాను అన్ని రంగాల్లో మంత్రి బొత్స ముందుకు తీసుకెళ్లారని జిల్లా గ్రంథాలయసంస్థ మాజీ చైర్మన్ రొంగలి పోతన్న అన్నారు.
ముగిసిన నామినేషన్ల ఘట్టం
* సర్పంచ్ ఎన్నికకు 4726, వార్డు సభ్యులకు 23194 నామినేషన్లు
విజయనగరం, జూలై 13: జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం డివిజన్లకు సంబంధించి 921 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా వాటిలో సర్పంచ్ ఎన్నికకు మొత్తం 4726 మంది, వార్డు సభ్యులకు 23194 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సీతానగరం మండలం జోగంపేట, కొత్తవలస మండలం వియ్యంపేట ఎస్టీ పంచాయతీలకు కేటాయించగా వాటికి ఏ ఒక్కరూ నామినేషన్ దాఖలు చేయలేదు ఇక వార్డు సభ్యులకు సంబంధించి కురపాంలోని పెదపొత్తిలి పంచాయతీలో 3, 4, 7, 10 వార్డులకు, తిత్తిరిలోని 6, 10 వార్డులకు, పాచిపెంట మండలం పెద్దవలసలోని 5వ వార్డుకు ఏ ఒక్కరు నామినేషన్ దాఖలు చేయలేదు.
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు
విజయనగరం, జూలై 13: జిల్లాలో పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. శనివారం మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని, కోడ్ ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. మద్యం, డబ్బు అక్రమ రవాణా నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం జిల్లాలో ఏడు చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. అలాగే అంతర్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన సాలూరు, పార్వతీపురం మండలాల్లో రెండు ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇప్పటి వరకు విజయనగరం డివిజన్‌లో 101, పార్వతీపురం డివిజన్‌లో 40 అనధికార బెల్టుషాపులు మూసివేసినట్టు తెలిపారు. కాగా, ఎన్నికల నిర్వహించే తేదీ నాటికి 48 గంటల ముందుగా మద్యం షాపులు మూసివేయాలన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎంవి శేషగిరిబాబు మాట్లాడుతూ కదలికలపై అనుమానం వున్న వ్యక్తులపై బైండోవర్ కేసులు నమోదు చేయాలన్నారు.
సెల్‌ఫోన్లు నిషేధం
పోలింగ్ జరిగే ప్రాంతానికి వంద మీటర్ల దూరం నుంచి సెల్‌ఫోన్ల వినియోగాన్ని నిషేధించాలని ఎన్నికల పరిశీలకులు ఆదేశించారు. ఓటర్లు కూడా వంద మీటర్లలోపే సెల్‌ఫోన్లను వదిలిపెట్టాలన్నారు.
పోలింగ్ ఏజంట్ ఒక్కసారే మారాలి
పోలింగ్ కేంద్రంలో నియమించబడిన పోలింగ్ ఏజంట్ పదే పదే బయటకు విడిచిపెట్టరాదని, ఒక్కసారి పోలింగ్ కేంద్రంలోకి వచ్చాక ఒక్కసారి మాత్రమే బయటకు విడిచిపెట్టాలన్నారు. అయితే బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి రాకూడదని, ప్రత్యామ్నాయంగా వచ్చిన వ్యక్తే చివరి వరకు కొనసాగాలని ఎన్నికల పరిశీలకులు సూచించారు. ఏజంట్‌ను రెండోసారి లోపలికి అనుమతించరాదన్న నిర్ణయాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల పరిశీలకులు ఎంవి శేషగిరిబాబు, పి.లక్ష్మినరసింహం, లోహితాస్యులు, ఎస్పీ కార్తికేయ, జెసి శోభ, ఎజెసి నాగేశ్వరరావు, డిఆర్వో వెంకటరావు, జెడ్పీ సిఇఒ మోహనరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీదర్, ఆర్డీవోలు రాజకుమారి, జె.వెంకటరావు, డిఎస్పీలు కృష్ణప్రసన్న, ఒఎస్‌డి డివి శ్రీనివాసరావు , డిపిఒ సత్యసాయి శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వైకాపా నేతల మధ్య వర్గపోరు..
కార్యకర్తల్లో అందోళన
విజయనగరం, జూలై 13: జిల్లాలో వైఎస్సార్ సిపి నాయకురాలు షర్మిల పాదయాత్ర ఐదోరోజు కొనసాగుతొంది. ఆమె పాదయాత్ర విజయవంతమవుతున్నప్పటికీ ఆ పార్టీ నేతల్లో సమన్వయం లేదన్నదీ కొన్ని సందర్భాల్లో తేటతెల్లమవుతోంది. వైఎస్సార్‌సిపి రానున్న ఎన్నికల్లో అనూహ్యమైన విజయం సాధిస్తుందని నమ్ముకొని ఆ పార్టీలోకి వెళ్లిన కొందరి నేతల్లో ఆశలు సన్నగిల్లి తిరిగి వెనక్కి మరలే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ జిల్లా నాయకత్వం పెద్ద లోపంగా చెప్పుకొవచ్చు. మరికొద్ది రోజుల్లో సాధారణ ఎన్నికలు జరగనుండటం, ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం కొనసాగుతున్న గ్రామ స్థాయిలో ఆ పార్టీకి స్పందన లేని పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడం ఆ పార్టీ పరిస్థితిని తేటతెల్లం చేస్తుంది. జిల్లాలోని బొబ్బిలి నియోజకవర్గం మినహా మరెక్కడా పంచాయతీ ఎన్నికలకు అభ్యర్థులను పూర్తి స్ధాయిలో పెట్టే పరిస్థితి కన్పించడం లేదు. జిల్లా కేంద్రంలో వైకాపా సమన్వయకర్తలు అవనాపు విజయ్‌తోపాటు గురాన అయ్యలు విజయనగరం నియోజకవర్గంలో గ్రూపులుగా విడి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాగా, పూల్‌బాగ్‌లోని షర్మిలా బస చేసిన ప్రాంతంలోనే వీరు కొట్లాడుకున్నట్టు సమాచారం. ఎస్.కోట నియోజకవర్గంలో డాక్టర్ జి.తిరుపతి, వేచలపు చినరామునాయుడు, బోకం శ్రీనివాసరావు, జయప్రకాష్‌బాబు వంటి నేతలు ఎవరికి వారే తమ వర్గాలను తయారు చేసుకొని గ్రూపులు నడుపుకుంటున్నారు. గజపతినగరం నియోజకవర్గంలో కడుబండి శ్రీనివాసరావు, డాక్టర్ పెద్దినాయుడుతోపాటు మక్కువ శ్రీదర్‌లు ఇదే పరిస్థితిలో ఉన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో జిల్లా సమన్వయకర్త పి.సాంబశివరాజుతోపాటు అతని తనయుడు డాక్టర్ సూర్యనారాయణరాజుతోపాటు బోగాపురంనకు చెందిన కె.శ్రీనివాసరాజులు పార్టీ కార్యక్రమాలను ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో గద్దె బాబూరావుతోపాటు కోట్ల సూర్యనారాయణ గ్రూపుల మధ్య విభేదాలు ఏర్పడి గద్దె బాబూరావు సమన్వయకర్తకు రాజీనామా చేసే పరిస్థితికి వెళ్లింది. ఇలా జిల్లాలో ఆ పార్టీ నేతల మధ్య వర్గపోరు కొనసాగుతొంది. పార్టీ నుంచి శాసనసభ టిక్కెట్లకు ఆశించి పార్టీ నాయకులు పోటీపడుతున్నారే తప్ప జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి మాత్రం ఎవ్వరూ అంకితభావంతో పనిచేసిన దాఖలాలు లేవు. ఇటీవల జిల్లాకు వచ్చిన వైఎస్ విజయమ్మ కార్యక్రమం కూడా ప్రణాళిక లేకుండానే నిర్వహించడం ఆమె కార్యక్రమం విజయవంతం కాలేదన్న పరిస్థితిని ఆ పార్టీలో కార్యకర్తలకు అయోమయం కలిగించింది. షర్మిల నిర్వహిస్తున్న పాదయాత్రకు జనం వస్తున్నప్పటికీ పార్టీ నేతలు మాత్రం పార్టీని గ్రామ స్థాయిలో పటిష్టం చేయాలన్న తలంపు లేకపోవడం ఆ పార్టీకి రానున్న ఎన్నికల్లో విజయావకాశాలు ఉండవని కూడా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పంచాయతి ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయడానికి ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితిలో జిల్లాలో ఆ పార్టీ బలాన్ని చెప్పకనే చెబుతొంది. పి.సాంబశివరాజు, సుజయ్‌కృష్ణ రంగారావుల మధ్య సమన్వయం లేదన్న ప్రచార ఆ పార్టీలో ఉండటం ఆ పార్టీకి మరింత నష్టాన్ని కలిగిస్తుంది. వాస్తవానికి ప్రజలకు, ప్రభుత్వం పట్ల అధికార పార్టీ నేతల పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ దానిని అనుకూలంగా మార్చుకునే పరిస్థితి వైకాపా నేతల్లో కానరావడం లేదు. ఈ విషయం ఆ పార్టీ అధిష్టానానికి తెలిసినా దీనిపై చర్యలు కూడా లేవని ఆ పార్టీ నేతలు కొందరు అనుకోవడం కొసమెరుపు.
‘కాంగ్రెస్ ప్రజా విశ్వాసం కోల్పోయింది’
నెల్లిమర్ల, జూలై 13 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావిశ్వాసం కోల్పోయిందంని వైఎస్సార్ సిపి నాయకురాలు షర్మిల అన్నారు. శనివారం ప్రజా పాదయాత్రలో భాగంగా నియోజకవర్గ కేంద్రం స్థానిక మొయిద జంక్షన్లో బహిరంగ సభ జరిగింది. పాదయాత్రలో భాగంగా రామతీర్ధం జంక్షన్ నుంచి ర్యాలీగా వచ్చి మొయిద జంక్షన్లో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. రాజశేఖర్‌రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలను కాంగ్రెస్ అటకెక్కించిందన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించిందన్నారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో విద్యుత్ బకాయిలు, రుణ మాఫీ జరిగిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విద్యుత్ ఛార్జీలు, పన్నుల భారం పెంచిపేద ప్రజలపై మోయలేని భారం మోపిందన్నారు. అలాగే జిల్లాకు ప్రాతినిద్యం వహిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులను గెలిపించకుని లిక్కర్ డాన్‌గా ఎదిగి ప్రజాసమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. అలాగే ప్రజాలు తెలుగుదేశం అధికార నేత చంద్రబాబు అధికార పార్టీతో కుమ్మక్కయ్యి. ప్రభుత్వాన్ని కాపాడడం వల్లే ప్రజలపై భారాలు పడుతున్నాయన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి జగన్ మీద కేసులు బనాయించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సిపి నాయకులు సుజయకృష్ణ రంగారావు, వాసిరెడ్డి పద్మ, పి.సాంబశివరాజు, కాకర్ల పూడి శ్రీనివాసరాజు, తదితరులు పాల్గొన్నారు.
‘150 అనధికార మద్యం షాపులు మూసివేత’
గజపతినగరం, జూలై 13 : జిల్లాలో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న 150 దుకాణాలను మూసి వేసినట్లు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. శనివారం సాయంత్రం గజపతినగరంలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుల సహకారంతో జిల్లా వ్యాప్తంగా మద్యం మని నియంత్రం కోసం ఏడు నిరంతర నిఘా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. సరిహద్దు రాష్టల్ల్రో గల గ్రామ పంచాయతీలపై రెండు నిఘా ఎక్సైజ్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. గ్రామస్థాయిలో సర్పంచ్ అభ్యర్దులు ఎన్నికల ఖర్చుకు సంబంధించి పర్యవేక్షించేందుకు జిల్లా, మండల, పంచాయతీ స్థాయిలో ప్రత్యేక నిఘామోనటరింగ్ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీలను పి.లక్ష్మినర్సింహం, శేషగిరిబాబు, లోగిబాబు, పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. ఏకగ్రీవం వేలం పంచాయతీలపై తమ దృష్టికి తీసుకు వస్తే ఆఎన్నికను రద్దు చేయడమే కాకుండా చటపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో తహశీల్ధార్ కోరాడ శ్రీనివాసరావు, ఎంపిడిఓ ఎం.శ్రీరంగ, తదితరులు పాల్గొన్నారు.