Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ముగిసిన నామినేషన్ల పరిశీలన

$
0
0

చిత్తూరు, జూలై 14: జిల్లాలోని మొత్తం 1,356పంచాయతీలు, 13,088వార్డులకు నామినేషన్ల పర్వం శనివారంతో ముగిసింది. 9వ తేదీ నుండి నామినేషన్ల ప్రక్రియను జిల్లా అధికారులు ప్రారంభించారు. ఇందులో చివరిరోజైన శనివారంనాటికి పంచాయతీ స్థానాలకు 8,447 వార్డు మెంబర్లకు 24,445 అత్యధిక నామినేషన్లు వచ్చాయి. అయితే ఆదివారం సాయంత్రానికి నామినేషన్ల పరిశీలన అనంతరం పంచాయతీలకు సంబంధించి 379నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. బరిలో 8,068మంది అభ్యర్థులు ఉన్నట్లు జిల్లాపంచాయతీ ఎన్నికల అధికారి వి.ఆర్.చంద్రవౌళి తెలిపారు. వార్డు మెంబర్ల స్థానాలకు 346నామినేషన్లు తిరస్కరించగా 24,099మంది బరిలో ఉన్నట్లు ఆయన ప్రకటించారు. మండలాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి.
చిత్తూరు, డివిజన్‌లోని చిత్తూరు మండలం పంచాయతీ 99, వార్డు మెంబర్లకు 266, గుడిపాల 147-376, యాదమరి 123-332, జి.డి.నెల్లూరు 190-492, పూతలపట్టు 77-253, పెనుమూరు 128-400, బంగారుపాళ్యం 173-512, తవణంపల్లె 161-492, ఐరాల 139-331, ఎస్.ఆర్.పురం 140-250, వెదురుకుప్పం 144-375, ఆర్.సి.పురం 155-345, వడమాలపేట 117-278, పాలసముద్రం 57-189, పుత్తూరు 83-224, కార్వేటినగర్ 121-340, నారాయణవనం 76-276, నగరి 127-404, నిండ్ర 117-305, విజయపురం 121-343 చిత్తూరుడివిజన్‌లోని మొత్తం 20మండలాలకు వెరసి సర్పంచ్ పదవులకు 2,491, వార్డు మెంబర్లకు 6,895మంది బరిలో ఉన్నారు.
తిరుపతి డివిజన్‌లోని మండలాలు:- తిరుపతి సర్పంచ్‌లు 175, వార్డుమెంబర్లు 944, చంద్రగిరి 168-499, పాకాల 137-341, పులిచెర్ల 122-338, రేణిగుంట 115-477, శ్రీకాళహస్తి 220-566, ఏర్పేడు 207-574, తొట్టంబేడు 166-443, బి.ఎన్.కండ్రిగ 128-367, కె.వి.బి.పురం 163-431, సత్యవేడు 140-435, వరదయ్యపాళ్యం 124-374, నాగలాపురం 76-226, పిచ్చాటూరు 116-365 వెరసి 14మండలాలకు గాను సర్పంచ్ పదవులకు 2,057, వార్డు మెంబర్లకు 6,420నామినేషన్లు వచ్చాయి.
మదనపల్లె డివిజన్:- మదనపల్లె సర్పంచ్ 149, వార్డుమెంబర్లకు 641, నిమ్మనపల్లె 84-171, కురబలకోట 61-210, బి.కొత్తకోట 65-266, పెద్దమండ్యం 70-253, తంబళ్ళపల్లె 132-263, పి.టి.యం 131-298, మొలకలచెరువు 108-216, వాల్మీకిపురం 120-352, గుర్రంకొండ 110-377, కలకడ 97-392, కలికిరి 85-266, పీలేరు 125-500, ఎర్రావారిపాళ్యం 123-388, రొంపిచెర్ల 48-253, చిన్నగొట్టిగల్లు 131-225, కె.వి.పల్లె 106-387, పుంగనూరు 155-307, చౌడేపల్లి 135-287, రామసముద్రం 96-211, సదుం 90-332, సోమల 84-337, పెద్దపంజాణి 168-374, పలమనేరు 75-224, గంగవరం 110-354, బైరెడ్డిపల్లె 101-395, వి.కోట 136-564, రామకుప్పం 108-359, గుడుపల్లి 110-290, శాంతీపురం 176-450, కుప్పం 231-842 వెరసి 31 మండలాలకు గాను సర్పంచ్‌లకు 3,520, వార్డు మెంబర్లకు 10,784నామినేషన్లు వచ్చినట్లు జిల్లాపంచాయతీ అధికారి తెలిపారు. ఈనెల 17వ తేదీన తుదిజాబితా వెలువడనుంది.

దేశంలో ప్రజల నిష్పత్తి ప్రకారం కోర్టులు లేవు
హైకోర్టు చీఫ్ జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా వెల్లడి
పీలేరు, జూలై 14: దేశంలో ప్రజల నిష్పత్తి ప్రకారం కోర్టులు లేవని హైకోర్టు చీఫ్ జస్టీస్ కల్యాణ్‌జ్యోతిసేన్ గుప్తా అన్నారు. ఆదివారం పీలేరులో 11వ ఏడిజె కోర్టు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని అన్నికోర్టుల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం 9గంటలకు 11వ ఎడిజె కోర్టును ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ దేశంలో 10లక్షల మందికి ఒక కోర్టు వుండాలని నిబంధనలువున్నా కోటి మంది జనాభా వున్నా ఒక కోర్టు కూడ లేదని దీనితో ప్రజలకు సత్వర న్యాయం జరగడంలో ఆలస్యం అవుతుందన్నారు. ప్రతి కోర్టులోను ప్రజల సౌకర్యార్థం వౌలిక వసతులను కల్పించాల్సిన అవసరం వుందన్నారు. పీలేరులో 11వ ఏడిజె కోర్టు ప్రారంభించడంవలన ఈప్రాంతపు కక్షదారులు జిల్లాకోర్టుకు వెళ్లాల్సిన అవసరంలేదని తెలిపారు. న్యాయ వ్యవస్థ ప్రజలకు అందుబాటులోవుండి చేరువకావాలని జుడీషియల్ అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వర్తించాలని కోరారు. ప్రజల పక్షాన న్యాయవ్యవస్థ నుండి నమ్మకం కల్గించాలని కేసుల పరిష్కారానికి ప్రజలు సహకరించాలని ప్రజాస్వామ్య విలువలను పెంపొందించేందుకు న్యాయ వ్యవస్థపై పరిపూర్ణమైన అవగాహనతో మెలగాలనిసూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జీలు జివి రమణ, ఎల్ రమణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.

దేశంలో విభజన ఉద్యమాలకు చరమగీతం పాడండి
* సిడబ్ల్యుసిలో సమైక్యాంధ్రకు సానుకూల నిర్ణయం తీసుకోకుంటే కాంగ్రెస్ భూ స్థాపితమే
* శాప్స్ రాష్ట్ర కార్యదర్శి రాజారెడ్డి హెచ్చరిక
తిరుపతి, జూలై 14: విభజన ఉద్యమాలతో భారతదేశంలో అభివృద్ధి కుంటుపడటంతో పాటు దేశ సమగ్రత, సమైఖ్యత తీవ్రంగా దెబ్బతింటున్నదని, ఇటువంటి ఉద్యమాలకు ఇకనైనా చరమగీతం పాడాలని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ రాజారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి యాదవకాలనీలో మధురవాణి ఇంగ్లీషు మీడియం హైస్కూల్లో శాప్స్ మైనార్టీ విభాగం అధ్యక్షుడు డి మహమ్మద్ రఫీ అధ్యక్షతన శాప్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో 20కిపైగా విభజన ఉద్యమాలు నడుస్తున్నాయన్నారు. ఇటువంటి విభజన ఉద్యమాలకు కారణం ప్రాంతాల మధ్య అభివృద్ధిలో తేడా వుండటమేనన్నారు. తెలంగాణ వంటి విభజన ఉద్యమాల వెనుక టిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్, అతని కుటుంబ సభ్యుల స్వార్థం వుందన్నారు. తమ స్వార్థంను ప్రజలపై రుద్ది పదే పదే రెచ్చగొట్టిన కారణంగా వందలాది మంది అమాయకపుజనం, విద్యార్థులు బలి అవుతున్నారన్నారు. నిజంగా తెలంగాణకోసమే జీవితాలను త్యాగం చేస్తున్న కుటుంబం కేసిఆర్‌ది అయితే వారి ఇంటిలో ఎవ్వరు తెలంగాణకోసం ఆత్మహత్య చేసుకోలేదన్నారు. అంతేకాదు ఏరాజకీయ నాయకుడి ఇంటిలో కూడా ఎవ్వరు ఆత్మహత్యలు చేసుకోలేదన్నారు. కేవలం పదవులకోసం తెలంగాణ వాదాన్ని రెచ్చకొట్టి ఆ ప్రాంత ప్రజల జీవితాలతో నేతలు చెలగాటమాడుతున్నారన్నారు. తెలంగాణ వెనుకబాటు వుంటే ఆ ప్రాంతంలో ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన వ్యక్తులు ముఖ్యమంత్రులుగా వున్నారని, ప్రధాన మంత్రిగా సైతం వున్నారన్నారు. అటువంటి వారి నిర్లక్ష్యంపై తిరగబడ్డాలన్నారు. ఇప్పుడు చేస్తున్న ఏర్పాటువాద ఉద్యమాలు నేతల నిర్లక్ష్యంపై తిరుగుబాటు ఉద్యమంగా చెయ్యాలన్నారు. రాయలసీమలో వెనుకబాటు కూడా ఈ ప్రాంతం నుండి ముఖ్యమంత్రుగా అయిన వారి పాపమేనన్నారు. సమైక్యరాష్ట్రంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి చూపించిన నేతలు ఇతర ప్రాంతాల అభివృద్ధిని విస్మరించారన్నారు. అభివృద్ధిలో అసమానతలు లేకుండా చూడాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వంపై, ప్రజాప్రతినిధులపై వుందన్నారు. అనంతరం ఎస్వీయూ ప్రొఫెసర్ బావాజి మాట్లాడుతూ తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన సిడబ్ల్యుసిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దేశానికే ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం వుందన్నారు. డిసెంబర్ 9న సోనియాగాంధీ బర్త్‌డే సందర్భంగా తీసుకున్న తెలంగాణ ప్రకటన నిర్ణయం దేశ ప్రయోజనాలను, దేశ సమైఖ్యతను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. మరో 50 ఏళ్ల అభివృద్ధి వెనక్కు వెళ్లిందన్నారు. పదవులకోసం ప్రాకులాడే ఉద్యమకారులు విశాల దృక్పథంతో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశ వ్యాప్తంగా ఈ ఉద్యమ ప్రభావంతో ఎంత నష్టపోతున్నామో తెలియదా? అని ప్రశ్నించారు. ఇకనైనా అభివృద్ధి నిరోధకులుగా, దేశద్రోహులుగా వేర్పాటువాదులను అభివర్ణించాల్సిన అవసరం వుందన్నారు. కోర్టులు సైతం జోక్యం చేసుకుని దేశాభివృద్ధికి విఘాతం కల్గిస్తున్న విభజన ఉద్యమాలను నిరోధించేందుకు పటిష్టమైన చట్టం తీసుకురావాలని కోరారు. దేశంలో 16 రాష్ట్రాల్లో విభజన ఉద్యమాలున్నాయన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజిలు ప్రకటించాల్సిన అవసరం వుందన్నారు. సిడబ్ల్యుసి సమావేశంలో నిర్ణయంలో ఏమాత్రం పొరపాటు చేసినా దేశం తీవ్రంగా నష్టపోతున్నదన్నారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ తయారు చేసి ప్రతి కాలేజిలో విద్యార్థులతో చైతన్య సదస్సులను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో శాప్స్ నేతలు కెవి ప్రసాద్, టిఎస్‌ఎన్వీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీనివాస చౌదరి, సమైక్యాంధ్ర ప్రదేశ్ స్కూల్ అధినేత అధ్యక్షులు జె రాజేంద్ర ప్రసాద్, ఎస్వీ ప్రసాద్, శాప్స్ చంద్రశేఖర్, లక్ష్మిపతినాయుడు, విద్యార్థి జేఏసి నేతలు కె ధనంజయులునాయుడు, తేజ్‌ప్రకాష్, ఎస్‌కె నిజాముద్దీన్, భారతి, యశోద, కుమారి, సరోజమ్మ, మదు, సుధాకర్, శ్రీధర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
శాప్స్ అధికార ప్రతినిధిగా ఉప్పలపాటి
సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉప్పలపాటి శ్రీనివాస చౌదరి, కార్మిక విభాగం కన్వినర్‌గా లక్ష్మిపతినాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు శాప్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ రాజారెడ్డి తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో వీరు మొదటినుండి కృషి చేస్తున్న నేపధ్యంలో ఈ నియామకం చేసినట్లు తెలిపారు.

21 మండలాల్లో 54 పంచాయతీలు ఏకగ్రీవం
* ఐదు పంచాయతీలకు నామినేషన్లు నిల్
చిత్తూరు, జూలై 14: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని మొత్తం 1,356 పంచాయతీలు ఉండగా వివిధ కారణాలతో ఐదు పంచాయతీలకు నామినేషన్లు పడలేదు. మిగిలిన పంచాయతీల విషయంలో 21 మండలాల్లోని 54 పంచాయతీ సర్పంచ్ పదవులకు సింగిల్ నామినేషన్ వచ్చినట్లు జిల్లా పంచాయతీ అధికారి వి.ఆర్.చంద్రవౌళి తెలిపారు. సింగిల్‌నామినేషన్లు పడిన పంచాయతీల వివరాలు మండలాల వారీగా ఇలా ఉన్నాయి. గుడిపాల-క్రిష్ణజిమ్మాపురం పంచాయతీ, గంగాధర నెల్లూరు-అగరమంగళం, పూతలపట్టు-తలపులపల్లె, తలుపునేనివారిపల్లె, పోలవరం, గాండ్లపల్లె, పోటుకనుమ, చిటిపిరాళ్ళ పంచాయతీలు, పెనుమూరు మండలం -చింతపెంట, గానుగపల్లె పంచాయతీలు, బంగారుపాళ్యం మండలం-మహాసముద్రం, ఈచినేరిపల్లె, పాలేరు, నలగాంపల్లె, గుంతూరు పంచాయతీలు, తవణంపల్లె మండలం-అరగొండ గొల్లపల్లె, తొడతర, తవణంపల్లెపుత్తూరు పంచాయతీలు, ఎస్.ఆర్.పురంమండలం-పుల్తూరు, వేణుగోపాలపురంపంచాయతీలు, వెదుకురుకుప్పం మండలం -పెరుమాళ్ళపల్లెపంచాయతీ, వడమాలపేట మండలం-కల్లూరుపంచాయతీ, కార్వేటినగరం-సి.డి.కండ్రిగ, గాజంకి పంచాయతీలు, నారాయణవనంమండలం-నయనారుకండ్రిగ, నారాయణవణం, తిరువత్యం పంచాయతీలు, నిండ్రమండలం-నెట్టేరి, మెళంబాకం, ఓరూరుపేట, కైపాకంపంచాయతీలు, విజయపురం మండలం-మల్‌రెడ్డికండ్రిగ పంచాయతీ, తిరుపతిమండలం-కొత్తూరు, రామానుజపల్లె పంచాయతీలు, చంద్రగిరి మండలం-రెడ్డివారిపల్లె, పిచ్చినాయుడుపల్లి, యం.కొత్తపల్లె, ఎ.జి.పల్లె, మామండూరుపంచాయతీలు, శ్రీకాళహస్తి మండలం-అరవకొత్తూరు, ఎర్రగుడిపాడు, ఐనాగరాలు, సురావారిపల్లె పంచాయతీలు, కె.వి.బి.పురం మండలం-తిమ్మసముద్రం పంచాయతీ, సత్యవేడు మండలం-రెప్పలవాడ, పోతాంబరికుప్పం, పొల్లాదం పంచాయతీలు, నాగలాపురం మండలం-అచ్చమనాయుడు కండ్రిగ, క్రిష్ణపురం, సుబ్బానాయుడు కండ్రిగ పంచాయతీలు, పెద్దమాండ్యం-గుర్రంవాడ్లపల్లె, కొత్తకడపల్లె, నాతియోబంగారుపల్లె, కలిచెర్ల పంచాయతీలు, బైరెడ్డిపల్లె మండలం-వెంగంవారిపల్లె పంచాయతీ సర్పంచ్ పదవులకు సింగిల్ నామినేషన్లు వచ్చినట్లు జిల్లా పంచాయతీ అధికారి వి.ఆర్.చంద్రవౌళి తెలిపారు. ఇదిలా ఉండగా చిత్తూరు మండలంలోని పెద్దిశెట్టిపల్లె పంచాయతీ, బంగారుపాళ్యం మండలంలోని చీకూరిపల్లె పంచాయతీ, నారాయణవనం మండలంలోని సముదాయం పంచాయతీ, సత్యవేడు మండలంలోని ఎన్.ఆర్.అగ్రహారం, పుదుకుప్పం పంచాయతీలకు నామినేషన్లు దాఖలుకాలేదని డిపిఓ తెలిపారు.

ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలు
చిత్తూరు, జూలై 14: పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏకగ్రీవమైన పంచాయతీలకు కేంద్రప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తు జిల్లా పంచాయతీ అధికారికి ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లాలో ఏకగ్రీవమైన పంచాయతీలకు సంబందించి 15వేలకు పైబడి జనాభా ఉన్న పంచాయతీలో అభివృద్ధి పనులకు రూ.20లక్షలు, 15వేల కన్నా తక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు ఏడు లక్షల రూపాయలు కేంద్రప్రభుత్వం అందిస్తున్నట్లు ప్రకటించారు.

ఇక ‘టెలిగ్రామ్’ సేవలకు మంగళం
* ఏటా రూ. 150 కోట్ల నష్టం
* మంచు మనోజ్ టెలిగ్రామ్‌తో ముగిసిన శకం
తిరుపతి, జూలై 14: భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ టెలికం సర్వీసులో (తంతి తపాల) టెలిగ్రామ్ సర్వీసులకు మంగళం పాడారు. 1853వ సంవత్సరం కలకత్తా నగరంలో తొలిసారిగా ప్రారంభమై 160 ఏళ్లుగా సుదీర్ఘ సేవలు అందించిన టెలిగ్రామ్ (తంతి తపాల) సేవ శకం ఆదివారం నాటితో ముగిసింది. ఈ నేపధ్యంలో తిరుపతి బిఎస్‌ఎన్‌ఎల్ ప్రాంతీయ కార్యాలయంలో ఈ సేవకు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రముఖ సినీనటుడు మంచుమనోజ్ కుమార్ హైదరాబాద్‌లో ఉన్న తన తండ్రి మోహన్‌బాబు, సోదరి లక్ష్మిప్రసన్న, మంచు విష్ణువర్ధన్ తదితరులకు 8 టెలిగ్రామ్‌లు ఆదివారం చివరిగా పంపారు. దీంతో ఈ సేవను నిలిపివేస్తున్నట్లు టెలికం అదికారులు అధికారికంగా ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కల్గిన ఈ సేవ నేడు వచ్చిన టెలికం విప్లవంలో కనుమరుగైంది. దేశంలో ఏటా 150 కోట్ల రూపాయలు టెలికం సంస్ధకు ఈ సేవ ద్వారా నష్టం జరుగుతోంది. టెలికం కార్యాలయంలో పనిచేసే ఉద్యోగికి 30 నుండి 50 వేల రూపాయలు వేతనాలు వస్తుండటం ఈ టెలిగ్రామ్‌ల ద్వారా నెలకు 10 నుండి 20 వేల రూపాయలు మాత్రమే ఆధాయం లభిస్తుండటం గమనార్హం. తిరుపతి బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో నెలకు ఈ సేవ ద్వారా కేవలం 15 వేల రూపాయలు ఆదాయం లభిస్తుంది. అయితే ఈ సేవకు వినియోగించబడుతున్న ఉద్యోగుల జీతాలు లక్ష రూపాయలు దాటుతున్నది. ఇటువంటి పరిస్ధితుల నేపధ్యంలో దేశ వ్యాప్తంగా ఈసేవను తొలగిస్తున్నట్లు ఆ సంస్ధ యాజమాన్యం ప్రకటించింది. చివరి రోజు తిరుపతి బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ద్వారా 60 టెలిగ్రామ్ సేవలు అందాయి. టెలికం శకం ముగిసిన నేపధ్యంలో అనేక మంది ఉద్యోగులు, వినియోగదారులు మనోభారాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్‌ఎన్‌ఎల్ కమర్షియల్ ఎజిఎం వెంకోరావు, ఏఓ ఒవిఆర్ శర్మ, జిఎం పిఏ సుబ్రమణ్యం, మోహన్‌రావు, ప్రీతమ్ తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించండి
* పంచాయతీ ఎన్నికల్లో పకడ్బందీ భద్రత ఇవ్వండి
* బెల్టుషాపులుఏరివేయండి
* క్రైమ్ మీటింగ్‌లో అర్బన్ ఎస్‌పి ఆదేశం
తిరుపతి, జూలై 14: పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేయాలని సంబంధిత పోలీసు అధికారులను అర్బన్ ఎస్‌పి రాజశేఖర్‌బాబు ఆదేశించారు. ఆదివారం తిరుపతి అర్బన్ ఎస్‌పి కార్యాలయంలో వివిధ సబ్ డివిజన్ల పోలీసు అదికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో బైండోవర్ కేసులను పూర్తి చెయ్యాలని సూచించారు. మద్యం షాపులు ఎన్ని వున్నాయి, వాటికి గతంలో అందుతున్న మద్యం ఎంత, తాజాగా ఎంత మద్యం అందుతున్నదో లెక్కలు కట్టాలన్నారు. ఎక్సైజ్ అధికారుల సహకారంతో గ్రామాల్లో బెల్టుషాపులను పూర్తిగా ఏరివేయ్యాలని సూచించారు. రాత్రి వేళల్లో కాని, పగటి పూట కాని గుంపులుగా వుండటం, ఎన్నికల తాయితాలు పంచడం వంటి సంఘటనలకు అవకాశం లేకుండా, ఘర్షణలకు తావులేకుండా తగు చర్యలు తీసుకోవాలని వివిధ సబ్ డివిజన్ల పోలీసు అధికారులను ఎస్‌పి ఆదేశించారు. తిరుమలకు వెళ్లే వాహనాలు ఎన్ని, అధికారులు వాహనాలు ఎన్ని తదితర అంశాలను పరిశీలించేందుకు సిసి కెమెరాలను ఏర్పాటు చెయ్యాలని, టిటిడి సహకారంతో తిరుమలలో గదుల్లో చోరీలు జరుగకుండా సిసి కెమెరాలు ఏర్పాటు చెయ్యాలని సూచించారు. చిన్నపిల్లల మిస్సింగ్ కాకుండా, కిడ్నాప్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్‌పి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎఎస్‌పిలు ఉమామహేశ్వర్‌శర్మ, సుబ్బరామిరెడ్డి, డిఎస్‌పిలు విమలకుమారి, శంకర్, స్వామి, నరసింహారెడ్డి, ఎస్‌కెబాబు, శ్రీనివాసులు, అభిషేకం, వెంకటేశ్వరనాయక్ తదితరులు పాల్గొన్నారు.

సాధనతో అసాధ్యాలు సైతం సుసాధ్యం
* డిస్కం సిఎండి విద్యాసాగర్‌రెడ్డి వెల్లడి
* ఘనంగా ముగిసిన ఎపిఎస్‌పిడిసిఎల్ క్రీడా సాంస్కృతికోత్సవాలు
* ఓవరాల్ ఛాంపియన్ నెల్లూరు సర్కిల్
* రన్నర్‌గా గుంటూరు సర్కిల్
* క్రికెట్ విజేత తిరుపతి సర్కిల్
తిరుపతి, జూలై 14: సాధన చేయడం ద్వారా అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయవచ్చునని ఏకలవ్యుడి కఠోర శ్రమ ఫలితం ద్వారా మనకు అవగతం అవుతుందని ఎపిఎస్‌పిడిసిఎల్ సిఎండి కె విద్యాసాగర్‌రెడ్డి పేర్కొన్నారు. గత రెండురోజులుగా తిరుపతిలో జరుగుతున్న ఎపిఎస్‌పిడిసిఎల్ క్రీడా సాంస్కృతికోత్సవాలు ఆదివారం నాటితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్ధానిక ఎయిర్‌బైపాస్‌రోడ్డులోని పిఎల్‌ఆర్ కనె్వన్షన్‌హాల్లో బహుమతి ప్రదానోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎండి విద్యాసాగర్‌రెడ్డి మాట్లాడుతూ నిరంతర సాధన ద్వారా ఆటల్లో విజయం సాధించవచ్చునన్నారు. క్రీడల ద్వారా మానసిక, శారీరక దృఢత్వం ఏర్పడుతుందన్నారు. గెలుపు ఓటములను క్రీడా స్ఫూర్తిగా తీసుకోవాలని, తద్వారా ఉద్యోగంలో కూడా చిన్నచిన్నలోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా గెలుపొందిన విజేజతలకు సిఎండి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. స్ర్తిలు, పురుషుల విభాగం రెండింటిలోనూ నెల్లూరు సర్కిల్ ఓవర్‌లాల్ చాంపియన్‌గా నిలిచింది. షటిల్, టేబుల్, వాలీబాల్, క్యారమ్స్, హాకీ, లాస్ టెన్నిస్‌లలో గెలుపొందారు. గుంటూరు సర్కిల్ రెండవ స్థానంలో నిలిచింది. క్రికెట్ విజేతగా తిరుపతి సర్కిల్ నిలిచింది. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఎస్ విశ్వనాథం, సయ్యద్‌బిలాల్‌బాషా, చీఫ్ ఇంజనీర్ రామ్‌సింగ్, రాజబాపయ్య, చీఫ్ జనరల్ మేనేజర్లు డి ఏసుదాసు, టి హనుమత్ ప్రసాద్, కె పాల్, ఎ వేణుగోపాల్, సూపరింటెండెంట్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

బి.కొత్తకోటలో నాటు తుపాకులు కలకలం
* 7 నాటు తుపాకులు,
ఆరు జింక కొమ్ములు స్వాధీనం
బి.కొత్తకోట, జూలై 14: మండలంలోని గట్టుపంచాయతీ గట్లమీదపల్లిలో నాటుతుపాకులు రాజ్యమేలుతున్నాయి. ఆదివారం గట్లమీదపల్లిలో ఏడు నాటుతుపాకులు, ఆరు జింక కొమ్ములులను ఎస్సై సుకుమార్ తన సిబ్బందితో కలిసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. గట్లమీదపల్లి నుంచి రసహ్యసమాచారం రావడంతో అక్కడికి చేరుకున్న పోలీస్ సిబ్బంది స్థానికుల నుంచి అందిన సమాచారంమేరకు ముళ్లపొదల్లో దొరికాయని పోలీసులు చెబుతున్నారు. అసలే గ్రామాల్లో ఎన్నికలవేడితో రాజుకుంటున్న సమయంలో ఇలా నాటుతుపాకులు కలకలంరేపాయి. ఎస్సై కథనంమేరకు గట్లమీద నుంచి అందిన సమాచారంతో అక్కడికి చేరుకుని కూంబింగ్ నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ నాటుతుపాకులు, జింకకొమ్ములు ఎవరుపెట్టారో, ఎందుకు పెట్టారో అని వాటివివరాలు త్వరలో సేకరించి నిందితులను గుర్తిస్తామని ఆయన అన్నారు. నాటుతుపాకులతోపాటు నిందితులను పోలీసులు గుర్తించారని కానీ వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని రాజకీయ వత్తిడితో వారిని వదిలేసినట్లు ఆ గ్రామస్థులు అంటున్నారు.
ఐదు నాటు తుపాకులు స్వాధీనం
వి.కోట: మండల పరిధిలోని నాయకనేరి అటవీ చెక్‌పోస్టు సమీపంలో ఆదివారం ఐదు నాటుకుపాకులు స్వాదీనం చేసుకున్నట్లు ఎస్సై శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. వారి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్నికల దృష్ట్యా మండలంలో తనిఖీలు నిర్వహిస్తుండగా నాయకనేరి చెక్‌పోస్టు సమీపంలో అనుమానితులు ఐదు నాటుతుపాకులను పొదల్లో వేసి పరారైయ్యారు. వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదే విధంగా ప్రశాంతంగా మండలంలో ఎన్నికలు నిర్వహించేందుకు 38మందిపై బైండోవర్ కేసు నమోదుచేసినట్లు తెలిపారు. మండలంలో జిల్లా అధికారుల సూచన మేరకు ఆగస్టు 2వరకు 144సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ముందస్తు అనుమతులు లేకుండా ప్రదర్శనలు, సభలు నిర్వహించరాదన్నారు. బెల్టుషాపులను స్వచ్ఛందంగా తొలగించాలని ఆదేశించారు. ఎటువంటి సమాచారమైన అందించాలంటే 100కు ఫోన్‌ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు.

* సర్పంచ్ స్థానాలకు 8,068 * వార్డుమెంబర్లకు 24,099 మంది ఖరారు
english title: 
n

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>