Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

రసవత్తరంగా ‘పంచాయతీ’ రాజకీయాలు

$
0
0

గుంటూరు, జూలై 14: పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరుగుతున్నప్పటికీ జిల్లాలో ప్రధాన రాజకీయ పక్షాలు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించడంతో సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో బేరసారాలు ఊపందుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 23, 27, 31 తేదీల్లో వరుసగా తెనాలి, గుంటూరు, నరసరావుపేట డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లాలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి, పంచాయతీ ఎన్నికలు కొత్త కానప్పటికీ తొలిసారిగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ఎదుర్కోనుంది. రానున్న రోజుల్లో జరగబోయే మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు పునాది కావడంతో అన్ని ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పార్టీల గుర్తులు లేకుండా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ తాము బలపర్చిన అభ్యర్థులే సర్పంచ్‌లుగా ఎన్నికయ్యేలా ప్రధాన పార్టీల నేతలు చక్రం తిప్పుతున్నారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియడంతో ఉప సంహరణలోగా తమ ప్రత్యర్థులను సామ దాన బేధ దండోపాయాలు ఉనుపయోగించి ఎలాగైనా బరి నుండి వైదొలిగించేలా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం లక్షల రూపాయలు చేతులు మారనున్నాయి. జిల్లావ్యాప్తంగా 1010 పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా 5,949 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే 10,654 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇందుకు సంబంధించి 28 వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. నరసరావుపేట డివిజన్‌లో అత్యధికంగా 357 పంచాయతీలు ఉండగా, తెనాలి డివిజన్‌లో 348, గుంటూరు డివిజన్‌లో 307 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో 39 పంచాయతీల సర్పంచ్ పదవులకు ఒకే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడంతో ఆయా ప్రాంతాల్లో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. 11 నియోజకవర్గాల పరిధిలోని ఈ 39 పంచాయతీలలో ప్రధాన పార్టీలు బలపర్చిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా ఏకగ్రీవం కానున్నారు. అమరావతి మండలం ముత్తాయపాలెంలో సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు కాలేదు. దీంతో అక్కడ ఎన్నిక జరగడంపై సందిగ్ధ పరిస్థితి నెలకొంది. ఇలా ఉండగా తెనాలి డివిజన్‌లో 498 వార్డులకు, గుంటూరు డివిజన్‌లో 120 వార్డులకు ఒకే నామినేషన్ దాఖలు కావడంతో అక్కడ కూడా ఎన్నిక ఏకగ్రీవం కానుంది. తెనాలి డివిజన్‌లో రేపల్లె మండలం చెన్నుపల్లివారిపాలెంలో 7 వార్డులకు, కామరాజుగడ్డ ఉత్తరం పంచాయతీలో 4 వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఆయా వార్డులకు ఎన్నిక నిర్వహించడంపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొత్తం మీద పార్టీలకతీతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికలు రాజకీయ రంగు పులుముకున్నాయి.

వడ్డీ వ్యాపారి దారుణ హత్య
చేబ్రోలు, జూలై 14: చేబ్రోలుకి చెందిన వడ్డీ వ్యాపారి అనుమానాస్పద స్థితిలో దారుణ హత్యకు గురయ్యాడు. మునుపెన్నడూ లేని విధంగా చేబ్రోలులో అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపడంతో కలకలం రేగింది. చేబ్రోలు పోలీసుల కథనం ప్రకారం.... చేబ్రోలులోని ఉప్పరపాలెంకు చెందిన వేల్పూరి శివయ్య (46) ఆదివారం ఉదయం అప్పాపురం ఛానల్ సమీపంలో మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. శనివారం రాత్రే హత్యకు గురై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి తలపై సుమారు 11 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు చేబ్రోలు సిఐ జె పూర్ణచంద్రరావు, ఎస్‌ఐ వినోద్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మన్నవలో అలజడి
పొన్నూరు, జూలై 14: నామినేషన్ల పరిశీలన దరిమిలా మండల పరిధిలోని ఆలూరు, ఆరెమండ, దండముడి, జడవల్లి, మన్నవ గ్రామాలలో ఏడుగురు సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. ఆలూరు, ఆరెమండ, దండముడి, గాయంవారిపాలెం, జూపూడి, నండూరు, పిటిపర్రు, పెదపాలెం గ్రామాల్లో 20 మంది వార్డుమెంబర్ల దరఖాస్తులను కూడా చెల్లకుండా పోయాయి.
కాగా మన్నవ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా రంగంలో నిలిచిన ప్రధాన అభ్యర్థి బొనిగల నాగమల్లేశ్వరరావు నామినేషన్ తిరస్కరించడంతో కాంగ్రెస్ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటర్నింగ్ అధికారులు నామినేషన్ తిరస్కరించినట్లు ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ వర్గీయకులు పోలింగ్ కేంద్రాన్ని చుట్టుముట్టారు. సిఐ నిమ్మగడ్డ రామారావు నేతృత్వంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి గుంపును చెదరగొట్టడంతో హుటాహుటిన వారు పొన్నూరు ఎండిఒ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. మహిళలు కార్యాలయం ఎదుట బైఠాయించారు.
ఐకెపి ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
గుంటూరు (పట్నంబజారు), జూలై 14: ఐకెపి ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సిఐటియు జిల్లా కార్యదర్శి నేతాజీ పేర్కొన్నారు. స్థానిక బ్రాడీపేటలోని సిఐటియు కార్యాలయంలో ఐకెపి ఉద్యోగులకు రెండు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో నేతాజీ మాట్లాడుతూ ఐకెపి, విఎఒ(యానిమేటర్ల)కు, ఎన్‌పిఎం ఉద్యోగులకు సమ్మె అనంతరం వేతనాల పెంపుదలకు సెర్ఫ్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. గత జూన్ నుండి పెంపుదల అమలుకావాల్సి ఉండగా అందుకు సంబంధించిన బడ్జెట్‌ను మాత్రం అధికారులు విడుదల చేయలేదన్నారు. మండల సమాఖ్య అకౌంటెంట్లకు హౌస్‌రెంట్ పాలసీ కల్పించేందుకు సెర్ఫ్ అంగీకరిస్తూ అర్హులైన వారి జాబితాలను జూలై 15వ తేదీలోగా జిల్లా అధికారులు సెర్ఫ్‌కు పంపించాలని ఉత్తర్వులు అందాయన్నారు. వెంటనే మండల సమాఖ్య అకౌంటెంట్ల జాబితాను సెర్ఫ్‌కు పంపాలని డిమాండ్ చేశారు. సెర్ఫ్‌లోని దిగువస్థాయి ఉద్యోగులు ఎల్1, ఎల్ 2లకు, మండల సమాఖ్య సిసిలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని కోరారు. ఈ శిక్షణ తరగతులకు విఎఒల సంఘ అధ్యక్షురాలు ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు.
పంచాయతీ ఎన్నికల్లో నిబంధనలు పాటించకుంటే చర్యలు
మంగళగిరి, జూలై 14: ఈ నెల 27వ తేదీ జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ నిబంధనలను పోటీలో ఉన్న అభ్యర్థులు, వారిని బలపరిచే రాజకీయ పార్టీల ప్రతినిధులు తప్పనిరిగా పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నార్త్‌జోన్ డిఎస్పీ ఎం మధుసూధనరావు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం తన కార్యాలయంలో సిఐలు సురేష్‌బాబు, మురళీకృష్ణ, ఎస్సైలు రవిబాబు, నాగకుమారి, సత్యనారాయణ తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం నిషేధమని, అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదని, మైకులకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, డబ్బు పంపిణీ చేయరాదని, ఇతరత్రా ఎటువంటి ప్రలోభాలు చేసినా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

కాంగ్రెస్‌కి కార్యకర్తలే వెనె్నముక
* మంత్రి మాణిక్య వరప్రసాద్
గుంటూరు (పట్నంబజారు), జూలై 14: కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే వెనె్నముక అని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పష్టం చేశారు. జిల్లా మైనార్టీ వైస్ చైర్మన్‌గా నియమితులైన తలకాయల రవీంద్ర ఆదివారం స్థానిక లక్ష్మీపురంలోని మంత్రి మాణిక్య వరప్రసాద్ క్యాంపు కార్యాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీ పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు బడ్జెట్‌లో అధికంగా నిధులను కేటాయించిందన్నారు.

ఏ రంగంలోనైనా కష్టపడితేనే ఫలితం
గుంటూరు , జూలై 14: కష్టపడితే ఏ రంగంలోనైనా విజయం తథ్యమని ఉత్తరాఖాండ్ చంపావత్ జిల్లా కలెక్టర్ అద్దంకి శ్రీ్ధర్‌బాబు పేర్కొన్నారు. స్థానిక వెంకటాద్రిపేటలోని పోతురాజు రాజ్యలక్ష్మి వీధి బాలల అనాథ ఆశ్రమంలో రాష్ట్ర కాపునాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో చిన్నారులకు నోట్ పుస్తకాలు, యూనిఫారం, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ్ధర్‌బాబు మాట్లాడుతూ మనిషి మేథస్సును పెంచేది విజ్ఞానమేనన్నారు. విజ్ఞానాన్ని సముపార్జించాలంటే విద్య ఒక్కటే మార్గమన్నారు. విద్యార్థులు కష్టపడి కాక ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠ్యాంశాలను చక్కగా మననం చేసుకోవాలన్నారు. కొత్తపేట సిఐ ఆకుల అశోక్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. ఆశ్రమ నిర్వాహకురాలు పోతురాజు రాజ్యలక్ష్మి మాట్లాడుతూ తమ ఆశ్రమంలో 50 మంది వీధి బాలలు ఉన్నారన్నారు. అనంతరం శ్రీ్ధర్‌బాబు 50 మంది పిల్లలకు నోట్ పుస్తకాలు, యూనిఫారం, దుప్పట్లు పంపిణీ చేశారు.

టిడిపి, వైఎస్సార్ సీపీ నాయకుల ఘర్షణ
దుర్గి, జూలై 14: మండల కేంద్రమైన దుర్గి గ్రామ పంచాయతీ కార్యాలయంవద్ద ఆదివారం తెలుగుదేశంపార్టీ, వైఎస్సార్‌సీపీ వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. టిడిపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులుగా దుర్గి గ్రామానికి చెందిన వెలిబోయిన రమణమ్మను బి జానమ్మ ప్రతిపాదించింది. అయితే జానమ్మ కూడా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్‌ను దాఖలు చేశారు.
నామినేషన్ల అభ్యంతరాల స్వీకరణ సమయంలో వీరిద్దరి నామినేషన్లు అధికారుల పరిశీలనకు రావడంతో వైఎస్సార్‌సీపీకి చెందిన వెలిదండి ఉమాగోపాల్ ఇరువురి అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించాలని ఎన్నికల అధికారిణిని కోరారు. దీంతో రమణమ్మ నామినేషన్‌ను ఖరారుచేసి, జానమ్మ నామినేషన్‌ను తొలిగించాలని తెలుగుదేశంపార్టీ నాయకులు శెట్టిపల్లి యల్లమంద కోరారు.
ఇరువురు అభ్యర్థులైన రమణమ్మ, జానమ్మ నామినేషన్లను తొలిగించాల్సిందేనని వైఎస్సార్‌సీపీ నాయకులు ఉమాగోపాల్ ఎన్నికల అధికారిణి అనితాశ్రీని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో టిడిపి, వైఎస్సార్‌సీపీ నాయకుల మధ్య వాగ్వివాదం జరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరుపార్టీలకు చెందిన నాయకులు దాడులకు ప్రయత్నిస్తున్న సమయంలో సమాచారం అందుకున్న దుర్గి ఎస్‌ఐ పి కృష్ణయ్య సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాల నాయకులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఘర్షణకు పాల్పడిన ఇరువర్గాలకు చెందిన నాయకులతోపాటు, మరో 18మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మాచర్ల సిఐ ఎ శ్రీనివాసరావు సంఘటనాప్రదేశానికి చేరుకుని ఘర్షణ జరిగిన తీరును ఎస్‌ఐ కృష్ణయ్యను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం, వైఎస్సార్ సీపీలకు చెందిన నాయకులపై బైండోవర్ కేసులను నమోదు చేయనున్నట్లు తెలిపారు. సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లను దాఖలు చేసిన రమణమ్మ, జానమ్మల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి తగు నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల అధికారిణి అనితాశ్రీ తెలిపారు.

మంచికల్లులో పోలీసుల కవాతు
రెంటచింతల, జూలై 14: మండలంలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో గొడవలు, అల్లర్లకు పాల్పడే వ్యక్తులపై కఠినచర్యలు తీసుకుంటామని గురజాల డిఎస్పీ ఇంజారపు పూజ హెచ్చరించారు. ఆదివారం మండలంలోని సమస్యాత్మక గ్రామమైన మంచికల్లు గ్రామంలో డిఎస్పీ పూజ ఆధ్వర్యంలో 97మంది పోలీసులచే ప్రధాన వీధుల్లో పోలీసులు కవాతును నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ పూజ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు గ్రామస్థులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వరరెడ్డి, రూరల్ సిఐ మల్లెల రాజేష్, రెంటచింతల ఎస్‌ఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
విజయపురిసౌత్ మండలంలో...
ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని గురజాల డిఎస్పీ ఇంజారపు పూజ అన్నారు. ఆదివారం విజయపురిసౌత్ పరిధిలోని అత్యంత సమస్మాత్యక గ్రామమైన లచ్చంబావి తండాలో గ్రామసభ నిర్వహించారు. డిఎస్పీ పూజ మాట్లాడుతూ ఈనెల 31న పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామన్నారు. గ్రామస్థులు తమను ఓటువేయనివ్వకుండా కండ్లకుంట, అచ్చమ్మకుంట గ్రామస్థులు అడ్డుకుంటారని డిఎస్పీ పూజ దృష్టికి తీసుకురాగా, పోలింగ్ జరిగే రోజు ఏ గ్రామంలోని వారు ఆ గ్రామంలోనే ఉండాలని, వేరే గ్రామాలకు వెళితే రౌడీషీట్‌ను తెరిచి చర్యలు తీసుకుంటామని డిఎస్పీ హెచ్చరించారు. ఎన్నికల రోజున స్పెషల్ టీమ్‌చే భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామాల్లో అభ్యర్థులు సభలు, సమావేశాలు నిర్వహించినా, ప్రచారం చేసినా ఓటర్లకు నగదు, మద్యం వంటివాటికి ప్రలోభానికి గురిచేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారానికి వినియోగించే వాహనాలకు తప్పనిసరిగా అనుమతులు ఉండాలన్నారు.

రాష్ట్ర విభజన అభివృద్ధికి ఆటంకం
రేపల్లె, జూలై 14: రాష్ట్ర విభజనతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి దెబ్బతినటమే కాకుండా కృష్ణా డెల్టాకు సాగునీటి సమస్య మరింత జఠిలమయ్యే ప్రమాదం ఉందని రాష్ట్ర రైతు నాయకులు కేసన శంకరరావు అన్నారు. ఆదివారం స్థానిక విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కర్ణాటక నుండి రావాల్సిన నిఖర జలాలు కూడా సకాలంలో రావటంలేదని, ఈ తరుణంలో రాష్ట్ర విభజన వల్ల డెల్టా ప్రాంతం ఎడారిగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్ధకాలంగా ఐక్యంతో అన్యోన్యంగా ఉన్న రాష్ట్రంలో తెలంగాణ అనే విషవృక్షాన్ని నాటిన కేసిఆర్ వంటి ఉన్మాదిని అడ్డుకోకుండా జాప్యంచేస్తూ రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్న ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవన్నారు. ఇప్పటికే దేశంలో విడిపోయిన చిన్నరాష్ట్రాలు విచ్ఛిన్నకర శక్తులకు నిలయాలుగా మారి అభివృద్ధికి నోచుకోక ఆర్థిక ఇబ్బందులతో ప్రజల జీవన విధానాలే సమస్యాత్మకంగా మారినా పాలకుల్లో మార్పు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మేథావులు, ఆర్థిక నిపుణులు, ఢిల్లీ పెద్దలు రెండు ప్రాంతల వారిని సమన్వయపరిచి రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా అభివృద్ధి పథంలో నడిపించాలని ఇదే రాష్ట్ర ప్రజల మనోభీష్టమని శంకరరావు ప్రభుత్వాలకు సూచించారు. ఈ సమావేశంలో రైతు సమాఖ్య నాయకులు టి బుచ్చిరామకృష్ణ, కె శివప్రసాద్, పరుచూరి కుటుంబరావు, వెంకటరావు, సాంబయ్య, టి నరసింహారావు, వెంకట సుబ్బారావు, కుటుంబరావు, భూషయ్య తదితరులు పాల్గొన్నారు.
నామినేషన్ల పరిశీలనలో టిడిపి, వైకాపా ఘర్షణ
* పోలీసుల రంగప్రవేశంతో సద్దుమనిగిన వివాదం
మాచర్ల, జూలై 14: పంచాయతీ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీ ఆ దిశగానే ఎన్నికల ఘట్టానికి సమాయత్తమవుతున్నాయి. శనివారం నామినేషన్ల పర్వం ముగియటంతో ఆదివారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని ఎన్నికల అధికారులు ప్రారంభించారు. దుర్గి పంచాయతీ సర్పంచ్ పదవి బిసి మహిళకు రిజర్వేషన్ అయింది. మాచర్ల నియోజకవర్గంలో బీసీ సామాజికవర్గం బలంగా ఉన్న దుర్గిలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటినుండే వాతావరణం వేడిక్కింది. ఆదివారం నిర్వహించిన నామినేషన్ల పరిశీలనలో తెలుగుదేశంపార్టీ బలపరచిన అభ్యర్థి బొబ్బా జ్ఞానమ్మ తొలుత ఎల్లబోయిన రమణమ్మకు ప్రపోజల్‌గా ఉంది. తరువాత బొబ్బా జ్ఞానమ్మ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసింది. ఈ విషయాన్ని గమనించిన వైయస్సార్ సీపీ మండల కన్వీనర్ ఎలిదండి గోపాల్ అభ్యంతరం తెలిపారు. దీనికి తీవ్రంగా స్పందించిన తెలుగుదేశంపార్టీ నాయకులు శెట్టిపల్లి యలమంద వాగ్వాదానికి దిగారు. వీరిద్దరి మధ్య చెలరేగిన వాగ్వాదం చిలికిచిలికి ఒకరినొకరు చొక్కాలు పట్టుకునేంతవరకు వెళ్లింది. విషయాన్ని తెలుసుకున్న దుర్గి ఎస్‌ఐ కిష్టయ్య సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. తెలుగుదేశం, వైయస్సార్ సీపీకి చెందిని 20 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. సాయంత్రం ఐదు గంటలకు ఇరువర్గాలకు తమదైన శైలిలో కౌనె్సలింగ్ నిర్వహించి పంపారు. నామినేషన్‌కు సంబంధించిన వివాదం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకోనున్నట్లు ఎన్నికల అధికారి సుభాషిణి తెలిపారు.

ఘనంగా పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నరసరావుపేట, జూలై 14: స్థానిక ప్రకాష్‌నగర్‌లోని సెయింట్ ఆన్స్ హైస్కూల్‌కు చెందిన 1994-95బ్యాచ్ పదోతరగతి పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శనివారంరాత్రి ఘనంగా జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఆనాటి గురువులైన లిబిము, వర్థిని, నాగార్జున, సత్యం, శేషవల్లి, భారతి, రోజ్‌మేరీ, పద్మావతిలను పూర్వవిద్యార్థులు ఘనంగా సత్కరించారు. 18సంవత్సరాల అనంతరం పూర్వవిద్యార్థులు తమ మధుర జ్ఞాపకాలు, యోగక్షేమాలను తమగురువులతో కలిసి పంచుకున్నారు. ఈకార్యక్రమంలో డి రవి, ఎం మల్లిఖార్జునరావు, బివికె చౌదరి, రవీంద్రారెడ్డి, గోవర్థన్, కాశి, భాను, సాహిత్య, లావణ్య, సుష్మిత, కిరణ్మయి పాల్గొన్నారు.

టిడిపి విజయానికి కాపులు కృషిచేయాలి
నరసరావుపేట, జూలై 14: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కాపుసోదరులు బాగా కృషిచేయాలని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడెల శివప్రసాదరావు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక జమిందార్ పంక్షన్‌హాల్లో కాపు సంఘీయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా కోడెల మాట్లాడారు. సమావేశానికి మాజీ పట్టణ పార్టీ అధ్యక్షుడు కోవూరి నర్సింహారావు అధ్యక్షతవహించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేవారికి తెలుగుదేశంపార్టీ తప్పక అవకాశం ఇస్తుందన్నారు. తెలుగుదేశంపార్టీ కాపులను గౌరవిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో బలంగా ఉన్న కాపు వర్గీయులను ముందుంచుతుందన్నారు. పదేళ్ళ కాలంలో ఎంత నష్టపోయామో దానిని పూడ్చుకుని, ముందుకు సాగాలన్నారు. తాను రాజకీయ ప్రవేశం చేసిన రోజుల్లో కాపువర్గీయులు ఎంతో అండగా నిలిచారని, వారిని మరవకూడదన్నారు. తనకు ఆత్మీయమైన వ్యక్తులు కాపుసోదరులేనని తెలిపారు. ప్రస్తుతం కాపుల్లో యువకులు బాగా కనిపిస్తున్నారని, రాబోయే కాలం, పెత్తనం వారిదేనని డాక్టర్ కోడెల స్పష్టం చేశారు. 2004, 2009లో ఓడిపోయామని, తాను ప్రజల నిర్ణయానికి తలవంచానన్నారు. తొమ్మిదేళ్ళలో రాష్ట్రం ఎలాంటి పరిస్థితికి దిగజారిందో మీరందరికీ తెలుసన్నారు. ఇప్పటికైనా కాపు సంఘీయులు సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. అందరం కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. ఈ సమావేశంలో వనమా సుబ్బారావు, కోవూరి బాబు, బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, మోదుగుల మల్లీశ్వరి, రామతులసి, మేకల సత్యవతి, అల్లంశెట్టి మోహన్‌రావు, కల్యాణం రాంబాబు, రామిశెట్టి చలపతిరావు, కోసూరి లక్ష్మీనారాయణ, కొండలు, కొత్తూరి గోవిందరావు, యర్రంశెట్టి రాము, జల్లిపల్లి శేషమ్మ, తెల్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు కాపుసంఘీయులు, కాపుయువత గజమాలలతో ఘనంగా సన్మానించారు.

పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరుగుతున్నప్పటికీ
english title: 
guntur

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>