కర్నూలు, జూలై 14: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ కె.రఘురామిరెడ్డి ఆదేశించారు. ఎన్నికల్లో చిన్నపాటి సంఘటన జరిగినా ఎస్‌ఐ, సిఐలే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ముం దస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని కెఎస్ వ్యాస్ ఆడిటోరియంలో ఎస్పీ గ్రామ పంచాయతీ ఎన్నికలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల్లో మంచిగా పని చేసిన వారికి ప్రోత్సాహం, తప్పు చేస్తే చర్యలు తప్పవని సూచించారు. ట్రబుల్ మాంగర్స్‌ను గుర్తించి వారిపై నిఘా తీవ్రతరం చేయడంతో పాటు అలాంటి వారిని ఎన్నికలు పూర్తయ్యే వరకూ గ్రామ బహిష్కరణకు కూడా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 30 పోలీసు యాక్టు, సెక్షన్ 144 అమలులో ఉంద ని, ఎవరైనా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలంటే పోలీసుల అనుమతి తప్పని సరిగా తీసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తే అలాంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల విధి నిర్వహణలో ఉండే సిబ్బంది మర్యాద పూర్వకంగా మసలు కోవాలని, కొన్ని చిన్న చిన్న సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అయ్యేలా చేయాలన్నారు. పోలింగ్ రోజు ఓటింగ్‌కు అంతరాయం కలిగించే వారిపై నిఘా తీవ్రతం చేయాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలకతీతంగా ట్రబుల్ మాంగర్స్‌ను, ఓటింగ్ రోజు సమస్యలు సృప్టించే ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులను గుర్తించి వారిపై షాడో పార్టీలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఎవరైనా నాయకులకు సెక్యూరిటీ తగ్గించినట్లైతే అలాంటి వారికి ఏమైనా ప్రమాదం ఉందేమో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ మద్యం, డబ్బు, బాంబులు, మారుణాయుధాలు తదితర అసాంఘిక శక్తుల ఆటలు కట్టించేందుకు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను సమర్థవంతంగా పని చేసేవిధంగా సిబ్బందికి సిఐలు, ఎస్‌ఐలు సూచనలు చేయాలన్నారు. గ్రామాల్లో ఫ్యాక్షనిస్టులు, అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లను తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అవుకు మండలం రామాపురం గ్రామంలో జరిగిన సంఘటనలో కానిస్టేబుల్ గాయాల పాలవ్వడం, కొత్తపల్లి పోలీసు స్టేషన్‌పై ఎం.లింగాపురం గ్రామస్థుల దాడి వంటి సంఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సిబ్బంది కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎఎస్పీ వెంకటరత్నం మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకయ్యే బడ్జట్, ఎన్నికల నియమావళి గురించి వివరించారు. ఓఎస్డీ రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహించే సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల సందర్భంగా తీసుకునే చర్యల గురించి వివరించారు. సమావేశంలో డోన్, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, ఆదోని డీఎస్పీలు తిరుమలేశ్వరరెడ్డి, అమరనాథనాయుడు, రామంజినేయులురెడ్డి, బిఆర్ శ్రీనివాసులు, డీఎస్పీ శివరామిరెడ్డి, ఎఆర్ డీఎస్పీ రుషికేశ్వరరెడ్డి, జిల్లాలోని సిఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.
కొత్తపల్లి పోలీసుస్టేషన్‌పై దాడి
* కిటికీ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం..
* మద్యం విక్రేత అరెస్టే కారణం..
ఆత్మకూరురూరల్, జూలై 13: మం డల పరిధిలోని కొత్తపల్లె పోలీసు స్టేషన్‌పై ఎం.లింగాపురం గ్రామానికి చెంది న కొందరు వ్యక్తులు ఆదివారం రాత్రి దాడి చేయడంతో ఎన్నికల సంఘం, పోలీసు శాఖ ఉలిక్కిపడ్డాయి. ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం పోలీసుల సహాయ సహకారాలతో గ్రామా ల్లో బెల్టు షాపులు, సారా దుకాణాలపై ఉక్కుపాదం మోపింది. ఈ క్రమంలోనే కొత్తపల్లె మండల పరిధిలోని ఎం.లింగాపురం గ్రామానికి చెందిన రమేష్ మద్యం, నాటుసారా విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు ఆదివారం పోలీసులు దాడులు చేశారు. ఈ సమయంలో షాపు యజమానికి, పోలీసులకు కొద్దిపాటి ఘర్షణ చోటుచేసుకుంది. అయితే పోలీసులు రమేష్‌ను అదుపులోకి తీసుకుని కొత్తపల్లె పోలీసు స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న రమేష్ బంధువులు 50 మందిని వెంటబెట్టుకుని ఆటోల్లో వచ్చి పోలీసు స్టేషన్‌పై దాడి చేసి స్టేషన్‌లో ఉన్న ద్విచక్ర వాహనం, కిటికీలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ చంద్రబాబు పోలీసు క్వార్టర్స్‌లో ఉన్న ఇంటిలో నుంచి బయటకు వచ్చి సర్ది చెబుతుండగా ఆయనపై కూడా దాడి చేసినట్లు విశ్వసనీయ సమాచారం. చివరకు నిందితుడు రమేష్‌ను విడిపించుకుపోయారు. ఈ విషయం గ్రామంలో దావానలంలా వ్యాపించడంతో క్షణక్షణం ఏమి జరుగుతుందోనని ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. దాడి చేసిన వ్యక్తులు గ్రామాన్ని విడిచి వెళ్లినట్లు తెలిసింది. దాడి చేసిన వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.2
నల్లమల ఘాట్ రోడ్డులో
బస్సు, కారు ఢీ.. ఇద్దరి మృతి
* మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
శ్రీశైలం, జూలై 14 : సున్నిపెంటకు 2 కిలోమీటర్ల దూరంలో విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌కు చెందిన కారును ఢీ కొనడంతో నల్లమల ఘాట్ రోడ్డు నెత్తురోడింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న డ్రైవర్ జయరావు (45) అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు సునీల్ (29) చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం ఉదయం 9-50 నిముషాలకు డిఫెన్స్ కాలనీకి చెందిన హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీశైలం మల్లన్నను దర్శించుకొని కారులో తిరుగు ప్రయాణం అవుతుండగా సున్నిపెంట నుండి విజయవాడకు వెళ్తున్న బస్సు వేగంగా వచ్చి కారును ఢీ కొనడంతో కారు నుజ్జునుజ్జు అయింది. కారు నడుపుతున్న జయరావు అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన క్షతగాత్రును 108 సిబ్బంది సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ సునీల్ మృతి చెందాడు. మరో ఇద్దరు విజయలక్ష్మి, చైతన్యల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం శ్రీశైలం దేవస్థానం ఇఓ చంద్రశేఖర్‌ఆజాద్ చొరవతో దేవస్థానం అంబులెన్సులో హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. సిఐ వేణుగోపాల్‌రెడ్డి, నాగేశ్వరరావు, ఎస్ గిరిబాబు, సిబ్బంది, దేవస్థానం అధికారులు సంఘటనా స్థలానికి చేరి సహాయ చర్యలు చేపట్టారు. డాక్టర్లు అఖిలేష్, స్వప్నలు ప్రథమ చికిత్స నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇఓ చొరవ చూపి స్థానిక ప్రజలు సహకారంతో సహాయక చర్యలు వేగవంతం చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో
కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి
* న్యాయశాఖ మంత్రి ఏరాసు
మహానంది, జూలై 14: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని కార్యకర్తలందరు కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థుల విజయానికి దోహదపడాలని న్యాయశాఖమంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి కార్యకర్తలకు సూచించారు. ఆదివారం ఆయన మహానంది పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు సకాలంలో కురిసి శ్రీశైలం డ్యాంలో పుష్కలంగా నీరుచేరి రైతుల పంటలు బాగాపండి దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన కోరుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని మూడు ముక్కులు చేసేందుక యోచిస్తున్న అలోచన సరైంది కాదన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే సుభిక్షంగా ఉంటుందన్నారు. ఒకవేళ తెలంగాణ ఇవ్వాల్సివస్తే రాష్ట్రాన్ని మూడుముక్కలు చేయాల్సిందే అన్నారు. కేంద్రం తెలంగాణ, ఆంధ్ర ప్రాంత నాయకుల మాటలు వింటున్నారని రాయసీమ నాయకుల మాటలు వినడం లేదని అవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్ రాయలసీమ సాధించుకునేందుకు పూర్తిస్థాయిలో పోరాడుతాం అన్నారు.
మహానందిలో పూజలు: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో రాష్ట్ర న్యాయశాఖమంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఆదివారం పూజలు నిర్వహించారు. క్షేత్రానికి వచ్చిన వీరికి ఆలయ ఎఇఓ శివయ్య, ఇన్‌స్పెక్టర్ నీలకంఠం రాజులు స్వాగతం పలకగా అనంతరం వారు శ్రీకామేశ్వరీ సహిత మహానందీశ్వరస్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వంహించారు. అనంతరం వారిని వేదపండితులు అశీర్వదించగా అధికారులు శేషవస్త్రాలతో సత్కరించారు. అలాగే గుంటూరు రైల్వే ఎస్పీ పూజలు నిర్వహించారు. వీరి వెంట కాకనూరు శివనాగిరెడ్డి, మాజీ పిపి కృష్ణయ్య, మహానంది మాజీ సర్పంచ్ తిమ్మారెడ్డి, చిలకల వెంకటేశ్వర్‌రెడ్డి, జయసింహారెడ్డి, రాజారెడ్డి, బోయ ఉశేని తదితరులు పాల్గొన్నారు.
పీపుల్స్‌వార్ వారోత్సవాలతో
అప్రమత్తమైన పోలీసులు
* నల్లమల సమీప గ్రామాలపై నిఘా
నంద్యాల, జూలై 14: మావోయిస్టులు ఈనెల 15 నుంచి 21వ తేదీ వరకు అమరవీరుల సంస్మరణ దినాలను పురస్కరించుకొని వారోత్సవాలు ఈనెల 15 నుంచి 21వ తేదీ వరకు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈనెల 21వ తేదీ రాష్ట్ర బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు నంద్యాల, ఆత్మకూరు, ఆళ్లగడ్డ పోలీసుసబ్ డివిజనల్ పరిధిలోని నల్లమల అటవీ సమీప పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. కొత్తపల్లె, పాములపాడు, పగిడ్యాల, ఆత్మకూరు, వెలుగోడు, బండిఆత్మకూరు, మహానంది, శిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ, చాగలమర్రి తదితర అటవీ సమీప పోలీసు స్టేషన్లకు భద్రత పెంచారు. ప్రత్యేక పోలీసు బృందాలతో గస్తీ ముమ్మరం చేశారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న సమయంలో మావోయిస్టులు వారోత్సవాలు జరుపుకోవడంతో వారి సానుభూతిపరులు, మాజీ మిలిటెంట్లపై కూడా నిఘా ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి కొత్తపల్లె పోలీసు స్టేషన్‌పైనే ఎం.లింగాపురం గ్రామానికి చెందిన సుమారు 100 మంది దాడి చేసి పోలీసులను కొట్టి, ఎస్‌ఐ క్వాటర్స్‌పై కూడా దాడి చేసి రాళ్లు వేసి పలువులు కానిస్టేబుళ్లను గాయపరచి, పోలీసు స్టేషన్‌ను, పోలీసుల క్వాటర్స్‌లో ఫర్నీచర్ ద్వంసం చేసి, భయాందోళనలు సృష్టించి పోలీసుల అదుపులో ఉన్న బెల్టుషాపు నిర్వాహకుడిని విడిపించుకొనిపోయిన సంఘటన జిల్లా పోలీసు ఉన్నతాధికారులను నివ్వేరపోయేలా చేసింది. దీంతో ఆదివారం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కొత్తపల్లె ఎస్‌ఐ చంద్రబాబును జిల్లా కేంద్రానికి పిలిపించి జరిగిన సంఘటపై ఆరా తీస్తున్నారు. కొత్తపల్లె పోలీసు స్టేషన్‌పైనే దాడికి పాల్పడ్డ విద్రోహులను కట్టడి చేసేందుకు సుమారు 40మందిపై కేసులు కూడా నమోదు చేశారు. ఒక వైపు గ్రామాల్లో సర్పంచు ఎన్నికలు, మరో వైపు మావోయిస్టుల వారోత్సవాలతో నల్లమల అటవీ సమీప పోలీసు స్టేషన్లలో భద్రతపై పోలీసుల్లో టెక్షన్ మొదలైంది. అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో అప్రమత్తంగా ఉండాలని ఆదివారం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
దేవనకొండ, జూలై 14 : పగడ్బందీ గా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు విష్ణు తెలిపారు. ఆదివారం ఆయన మండల కేంద్రమైన దేవనకొండలోని ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించారు. పొలింగ్ అధికారులను నామినేషన్ల పరిశీలన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల గుర్తులను ఎలా కేటాయిస్తారని, సర్పంచ్, వార్డు సభ్యుల కౌటింగ్ వంటివి జాగ్రతగా చూడాలన్నారు. సమస్యాత్మకమైన గ్రామాలు ఎవైన ఉంటే వాటిపై నిఘా ఏర్పాటు చేయాలని స్థానిక పోలీసులకు సూ చించారు. ఎన్నికల ప్రశాతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని విష్ణు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదోని ఆర్డీఓ రాంసుందర్‌రెడ్డి, ఎంపిడిఓ మధుసుధన్‌రెడ్డి, తహశీల్దార్ జయప్రభా, తదితరులు పాల్గొన్నారు.
నాటుసారా, మద్యం పట్టివేత
కోవెలకుంట్ల, జూలై 14: కోవెలకుంట్ల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు సంఘటనల్లో 30 లీటర్ల నాటుసారా, మద్యం స్వాధీనం చేసుకున్నట్లు కోవెలకుంట్ల ఎక్సైజ్ సిఐ భార్గవరెడ్డి తెలిపారు. స్థానిక ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్‌లో ఆదివారం ఎక్సైజ్ సిఐ మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో ఎన్నికల దృష్ట్యా రూట్‌వాచ్‌లు నిర్వహస్తుండగా శనివారం రాత్రి కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయునిపేట జంక్షన్ వద్ద ప్యాషన్ ప్లస్ ద్విచక్ర వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి 30 లీటర్ల నాటుసారా తరలిస్తూ తమను గమనించి ద్విచక్ర వాహనం, నాటుసారా ప్యాకెట్లను వదిలి పారిపోయాడని, దీంతో ద్విచక్ర వాహనం, 30 లీటర్ల నాటుసారా సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే కోవెలకుంట్ల సర్కిల్ పరిధిలోని ఉయ్యాలవాడ మండలం అల్లూరు గ్రామంలోని ఒక ఇంట్లో బెల్టు షాపు నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో గ్రామ విఆర్వో, తలారీలతో కలిసి ఆ ఇంటి వద్దకు వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉండడంతో వారి సమక్షంలో తాళం పగులగొట్టి ఇంటిలో సోదా నిర్వహించగా 47 క్వార్టర్లు, 2 ఫుల్ బాటిళ్ల మద్యం లభించిందని, ఇంటి యజమాని చిన్న నాగన్న గ్రామంలో లేనట్లు తెలిసిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. తనిఖీల్లో ఎక్సైజ్ సిబ్బంది అశ్వర్థరెడ్డి, మద్దయ్య, కెవి రమణ, అన్సర్‌బాషా పాల్గొన్నారు.
పాలకులకు బుద్ధి చెప్పండి
* సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రామకృష్ణ
కల్లూరు, జూలై 14: ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసే పార్టీలకు, ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని సిపిఐ కార్యదర్శివర్గ సభ్యు డు రామకృష్ణ సూచించారు. స్థానిక బంగారుపేటలోని 45వ వార్డులో ఉన్న సిపిఐ కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రా న్ని రావణకాష్టంలా మార్చడానికి కాం గ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం పేరుతో తెలంగాణ ప్రజలతో చెలగాటం ఆడుతుందన్నా రు. ఇన్ని సంవత్సరాలు గడిచినా తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయడం లేదంటే ఆ పార్టీ ఎంతటి మోసకారిదో అర్థమవుతుందన్నారు. సంక్షేమ పథకాల పేర ప్రజలను మోసం చేసి, ప్రజాధనాన్ని దోచుకోవడం తప్ప ప్రజలకు మేలు చేసిందేమీ లేదన్నారు. జిల్లా కార్యదర్శి రామాంజినేయులు మాట్లాడుతూ సిపిఐ ప్రజా సమస్యలపై ప్రభుత్వాలతో నిత్యం పోరాడుతుందన్నారు. నగర కార్యదర్శి రసూల్ మా ట్లాడుతూ పేద ప్రజలకు అందాల్సిన వితుంతు, వికలాంగుల పింఛన్లను, అదేవిధంగా మురికివాడల్లో అపరిష్కృతంగా వున్న పట్టాల సమస్యలను అధికారులతో పోరాడి సాధించామన్నారు. ప్రజాప్రతినిధులకు కొమ్ముకాస్తున్న అధికారులు పేదలకు అన్యాయం చేస్తే సహించమన్నారు. కార్యక్రమంలో నాయకులు నాగరాజు, మనోహర్‌మాణిక్యం, మాజీ కార్పొరేటర్ గిడ్డమ్మ, మునెప్ప, మహేంద్ర పాల్గొన్నారు.
వెలుగోడు మండలంలో
2 నామినేషన్ల తిరస్కరణ
వెలుగోడు, జూలై 14: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలో దాఖలైన నామినేషన్లలో పరిశీలన అనంతరం 419 నామినేషన్లు పక్కాగా ఉన్నట్లు ఎంపిడిఓ సాల్మన్ తెలిపారు. మొత్తం 421 నామినేషన్లు దాఖలు కాగా ఆదివారం పరిశీలించి 2 నామినేషన్లను తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. వెలుగోడు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసిన కె.గోవిందు తహశీల్దార్ ఇవ్వాల్సిన కుల ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వలేదని తిరస్కరించారు. గుంతకందాల గ్రామంలో 10వ వార్డు ఎస్సీకి రిజర్వు కాగా ఎస్టీకి చెందిన వెంకటేశ్వర్లు నామినేషన్ దాఖలు చేయడంతో తిరస్కరించినట్లు తెలిపారు. మండల పరిధిలోని వేల్పనూరు గ్రామపంచాయతీ ఎస్సీకి రిజర్వు కాగా బట్టు ఏసయ్య ఒక్కడే నామినేషన్ వేశాడు దాంతో అతడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు. అలాగే గ్రామంలోని 14 వార్డులకు సైతం ఒక్కో అభ్యర్థి మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో వారందరి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినట్లు అధికారులు తెలిపారు. వెలుగోడు మేజర్ గ్రామపంచాయతీకి ఒక్క దానికే 20 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ వుంటుందని ఆయన తెలిపారు.
అప్పీల్‌కు వెళ్తాం..
వెలుగోడు మేజర్ గ్రామ పంచాయతీలో నామినేషన్ తిరస్కృతి అభ్యర్థి కె.గోవిందు అప్పీల్‌కు వెళ్తాం అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న తనను బరిలో నుంచి తొలగించేందుకు ప్రత్యర్థి పార్టీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. తాను 1996లో వార్డుమెంబర్‌గా బిసి రిజర్వేషన్ కేటగిరీలోనే గెలిచానని అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఏంటో అర్థం కావడం లేదన్నారు. నామినేషన్ పత్రంలో కుల ధ్రువీకరణ కాలంలో తాను గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి ఇచ్చానని, అయినా రిటర్నింగ్ అధికారి తన నామినేషన్‌ను తిరస్కరించారని, దీనిపై అప్పీల్‌కు వెళ్తానని, అప్పటికీ న్యాయం జరగకపోతే హైకోర్టుకు కూడా వెళ్తానని తెలిపారు.
ప్రకృతి సిద్ధమైన ఆయుర్వేద వైద్యం
* మాజీ ఎంపి భూమా నాగిరెడ్డి
నంద్యాల, జూలై 14: భారతీయ వైద్యం ప్రపంచ ఖ్యాతి గాంచిన ప్రకృ తి సహజ సిద్ధమైంది ఆయుర్వేద వైద్యమని నంద్యాల మాజీ ఎంపి, వైకాపానేత భూమా నాగిరెడ్డి అన్నారు. ఆదివా రం నంద్యాల పట్టణంలోని బాలాజీకాంప్లెక్స్ కేశవరెడ్డి పాఠశాల ఆవరణంలో 40 మంది ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో, వెంకప్ప ఆయుర్వేదిక్, నంద్యాల కేబుల్‌టివి సంయుక్త సౌజన్యంతో ఉచిత మెగా ఆయుర్వేద వైద్యశిబిరం నిర్వహించారు. ఆయుర్వేద ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభించిన భూమా నాగిరెడ్డి మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఆధునిక వైద్యం పేదలకు అందించిన వారే నిజమైన వైద్యులని, రోగికి వైద్యుడిపై, ఆయన వైద్యంపై నమ్మకం కలిగేలా వైద్యసేవలు ఉండాలని కోరారు. ఆయుర్వేదం అమృతం కన్నా శ్రేష్టమైందని, విదేశా ల్లో కూడా ఆయుర్వేద వైద్యం కోసం, మందుల కోసం విదేశీయులు క్యూల్లో నిలిచి కొనుగోలు చేస్తుండడం భారతీయ ఆయుర్వేద వైద్యానికి ఉన్న గొప్పతనాన్ని తెలియజేస్తుందని భూ మా వివరించారు. కొన్ని అపోహల కారణంగా, ప్రచార లోపం వల్ల ఆయుర్వేద వైద్యం అలోపతి, హోమియోపతి కన్నా వెనుకబడిందని, పురాతన, శాస్ర్తియమైన భారతీయ పూర్వీకుల వైద్యం ఆయుర్వేదం అన్నది మరువవద్దన్నారు. నంద్యాల పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో 40 మంది ఆయుర్వేద వైద్యులు తక్కువ ఖర్చుతో దీర్ఘకాలిక వ్యాధులు నయం చేయడం, పట్టణంలోని వెంక ప్ప ఆయుర్వేదిక్ సహకారంతో ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించి సేవలు అందిస్తున్న ఆయుర్వేద వైద్యులను మాజీ ఎంపి భూమానాగిరెడ్డి అభినందించారు. వెంకప్ప శిరిగిరి ఆయుర్వేదిక్ దుకాణం కర్నూలు జిల్లాతో పాటు కడప, అనంతపు రం, ప్రకాశం జిల్లాల ఆయుర్వేద వైద్యులకు అన్నిరకాల ఆయుర్వేద మందులు అందుబాటులో ఉంచడం వారి అంకితభావానికి నిదర్శనం అన్నా రు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌లేని సహజ సిద్ధమైన వనమూలికలతో తయారయ్యే దేశీయ వైద్యవిధానమైన ఆయుర్వేద వైద్యం అందరికి అందుబాటులోకి రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గెలివి సహాదేవుడు, కేబుల్‌టివి ఎండి జయచంద్రారెడ్డి, వెంకప్ప కుటుంబ సభ్యులు, నం ద్యాల ప్రాంత ఆయుర్వేద వైద్యులు పాల్గొన్నారు. ఉచిత ఆయుర్వేద మెగా వైద్యశిబిరానికి నంద్యాలతో పాటు సమీప ప్రాంతాల నుండి వందలాది మంది రోగులు తరలిరావడంతో 40 మంది వైద్యులు క్యూల్లో నిల్చున్న రోగులను పరీక్షించి అవసరమైన రూ. 3 లక్షల విలువ చేసే ఆయుర్వేద మందులను భూమా రోగులకు పంపిణీ చేశారు.