మచిలీపట్నం, జూలై 14: గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్నవారిని తప్పించేందుకు బుజ్జగింపుల పర్వం ముమ్మరమైంది. కొన్నిచోట్ల ఒకే పార్టీకి చెందిన అభ్యర్థులు ఇద్దరు, ముగ్గురు బరిలో ఉండటం ఆయా పార్టీల నాయకులకు తలనొప్పిగా మారింది. బహు అభ్యర్థిత్వం బెడద నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నెల 13వ తేదీతో నామినేషన్‌ల ఘట్టం ముగిసింది. నామినేషన్‌లు దాఖలు చేసిన వారిలో దీటైన అభ్యర్థిని రంగంలో ఉంచి మిగతావారిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. బహు అభ్యర్థిత్వం బెడద కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలను చుట్టుముట్టింది. రాజకీయంగా అంతంతమాత్రంగా ఉన్న పార్టీలకు గ్రామాల్లో ఎక్కువమంది పోటీకి దిగటంతో పరిస్థితిని చక్కబెట్టేందుకు ఆయా పార్టీల నాయకత్వం నడుం బిగించింది. ఈ క్రమంలో ఉపసంహరణల నాటికి ఒకే అభ్యర్థి బరిలో మిగిలేలా అవసరమైన చర్యలు చేపట్టారు. అలాగే నామినేషన్ల స్క్రూట్నీలోనే తప్పించాలన్న ప్రయత్నం లోపాయికారీగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ముగిసింది. జిల్లాలో ఎంతమంది అనర్హులయ్యారనేది వివరించడంలో అధికారులు విఫలమయ్యారు. సోమవారం సాయంత్రానికి స్క్రూట్నీలో ఎన్ని నామినేషన్‌లు తిరస్కరణకు గురయ్యాయనేది చెబుతామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు కాకుండా కొన్ని గ్రామాల్లో పెద్దలు ఏకగ్రీవం చేసేందుకు కృషి చేస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులను రాజకీయాలకు అతీతంగా గ్రామపెద్దలు సమావేశపర్చి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోటీలో ఉన్న అభ్యర్థులు విరమించుకునేందుకు ససేమిరా ఒప్పుకోవడం లేదని సమాచారం. రాజకీయ కక్షలు పెరగకుండా ప్రశాంత వాతావరణంలో ఏకగ్రీవం చేయాలన్న రాజకీయ పార్టీల నాయకులు, ఆయా గ్రామపెద్దల ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతమవుతాయో వేచిచూడాల్సిందే. నామినేషన్ల పరిశీలనలో తిరస్కరణకు గురైతే చిక్కుండదు. ఈ దశలోనే చక్రం తిప్పాలన్న వ్యూహరచనలో కొందరు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. నామినేషన్ సజావుగా ఉంటే ఉపసంహరణ గడువు నాటికి పోటీ నుండి తప్పించాలన్న వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో వేచిచూడాల్సిందే.
స్కీం పేరిట లక్షల్లో టోకరా!
ఉయ్యూరు, జూలై 14: స్థానిక సుందరమ్మపేటలో స్కీం పేరుతో లక్షలు వసూలు చేసి పరారైన వ్యక్తి ఉదంతం ఆదివారం వెలుగుచూసింది. బాధితుల కథనం ప్రకారం సుందరమ్మపేటలో సేవింగ్స్, ఫైనాన్స్ పేరుతో గత కొనే్నళ్ళుగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న భీమవరానికి చెందిన వ్యక్తి గత కొన్ని రోజులుగా పరారీలో ఉండటంతో బాధితులు మూకుమ్మడిగా ఆదివారం సంస్థ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయ తలుపులు పగలగొట్టి అందిన వస్తువును అందినట్లు దోచుకెళ్ళారు. నెలకు వంద చొప్పున చెల్లించి వాయిదాల పద్ధతిలో కావలసిన వస్తువును పొందే అవకాశం కల్పించడంతో వేలాది మంది ఈ స్కీంలో సభ్యులుగా చేరారు. ప్రతినెల డ్రాతీసి అందులో గెలుపొందిన వ్యక్తి చెల్లించిన రుసుముకు కావలసిన వస్తువును అందించడం ఈ స్కీం ఉద్దేశ్యం. డ్రాలో రాని ఖాతాదారులకు వారి నిర్ణీత సమయం పూర్తిచేసిన అనంతరం వారు చెల్లించిన సొమ్ముకు వడ్డీతో సహా చెల్లించడం, లేదా కావలసిన వస్తువును ఇవ్వడం చేస్తారు. అయితే కాలంచెల్లిన తరువాత కూడా సంస్థ వారి సొమ్మును తిరిగి ఇవ్వకపోవడం, నిర్వాహకుడు కన్పించకపోవడంతో ఖాతాదారులకు అనుమానాలు తలెత్తాయి. వారంతా మూకుమ్మడిగా ఆదివారం కార్యాలయానికి వచ్చి అందిన వస్తువును అందినట్లు పట్టుకుపోయారు. కాగా ఈ సంస్థ నిర్వాహ కుడు ఇదే తరహాలో జిల్లాలో పలు ప్రాంతాల్లో వ్యాపారాలు కొనసాగిస్తున్నట్లుగా తెలిసింది. ఈ స్కీం కింద సుమా రు రూ.50 లక్షల వరకు ప్రజలు మోసపోయినట్లుగా తెలుస్తోంది. పట్టణ పోలీసులు ఈవిషయమై ఆరా తీస్తున్నారు.
గూడపాడు సర్పంచ్ ఏకగ్రీవం
* సర్పంచ్ ఒకటి, 2 వార్డు పదవుల నామినేషన్ల తిరస్కరణ
కూచిపూడి, జూలై 14: నామినేషన్ల పరిశీలన అనంతరం మొవ్వ మండలం గూడపాడు సర్పంచ్ అభ్యర్థిగా బొప్పన స్వర్ణలతాదేవి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎండివో వై పిచ్చిరెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని ఏడు క్లష్టర్లలో 21 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులకు దాఖలైన 104 నామినేషన్‌లలో అవిరిపూడి సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన మేడిశెట్టి వన రామారావు కుమారుడైన రత్నమోహన్‌కు ముగ్గురు పిల్లల కారణంగా తిరస్కరించినట్లు తెలిపారు. అలాగే 214 వార్డులకు దాఖలైన 542 నామినేషన్‌లలో అయ్యంకి, భట్లపెనుమర్రు గ్రామాల్లో ఒక్కొక్క వార్డులకు దాఖలైన నామినేషన్‌లు ముగ్గురు సంతానం కారణంగా తిరస్కరించినట్లు పిచ్చిరెడ్డి తెలిపారు. కాగా మండలంలో 26 వార్డులలో ఒక్క నామినేషన్ చొప్పున దాఖలు కావటంతో ఆ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది.
బందరు మండలంలో నామినేషన్ల పరిశీలన ప్రశాంతం
మచిలీపట్నం టౌన్, జూలై 14: బందరు మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన దాఖలైన నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. 12 క్లష్టర్ కార్యాలయాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు దాఖలైన నామినేషన్లను స్టేజ్-1 అధికారులు పరిశీలించారు. సర్పంచ్ పదవులకు 210 నామినేషన్లు దాఖలు కాగా ఏడు నామినేషన్లను తిరస్కరించారు. అలాగే 324 వార్డు పదవులకు 753 నామినేషన్‌లు దాఖలుకాగా వీటిలో 37 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. పరిశీలన అనంతరం సర్పంచ్ పదవులకు మొత్తం 207, వార్డు పదవులకు 716 నామినేషన్లను స్టేజ్-1 అధికారులు ఆమోదించారు. 101 వార్డుల్లో ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావటంతో ఆ వార్డుల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇదిలావుండగా గరాలదిబ్బ గ్రామ పంచాయతీ 6వ వార్డుకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడం విశేషం. పోతిరెడ్డిపాలెం గ్రామ సర్పంచ్ అభ్యర్థులుగా వేముల ఏడుకొండలు, వేముల నాగభవాని దాఖలు చేసిన నామినేషన్‌లపై మరో అభ్యర్థి కొండేటి శివ అభ్యంతరం వ్యక్తం చేశారు. వారు దాఖలు చేసిన నామినేషన్ ఫారాల్లో సాక్షులు సంతకాలు పెట్టలేదని, కేవలం పేరు, చిరునామా రాసారన్నారు. ఇవికూడా సంబంధిత సాక్షులు కాకుండా వేరే వ్యక్తులు వారి పేరు, చిరునామా రాశారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ బందరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొల్లు రవీంద్ర పోతిరెడ్డిపాలెం స్టేజ్-1 అధికారిని కలిసి ఆ నామినేషన్లను తిరస్కరించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆర్డీవోని కలిసి అప్పీలు చేసుకోవాలని స్టేజ్-1 అధికారి సూచించారు.
సమస్యలు తీర్చకుంటే సమ్మె తప్పదు
* ఆర్టీసీ ఎంప్లాయిస్ హెచ్చరిక
అవనిగడ్డ, జూలై 14: ఆర్టీసీ యాజమాన్యం చట్ట విరుద్ధంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నందున తాము రీజియన్ స్థాయిలో సమ్మె నోటీసు ఇస్తామని ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ ఉపాధ్యక్షులు ప్రభాకరరావు, రీజినల్ కార్యదర్శి ప్రసాద్ హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా 12గంటలు కార్మికులతో పనులు చేయిస్తూ ఎలాంటి ప్రతిఫలం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్య నిర్ణయాలు ప్రయాణికులు, కార్మికులకు హానికరంగా ఉంటున్నాయన్నారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వానికి తాకట్టు పెట్టిందని విమర్శించారు. కార్మికులపై పనిభారం వేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రిలే దీక్షలో 9మంది కార్మికులు పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆటో
* ఒకరికి తీవ్ర గాయాలు
కూచిపూడి, జూలై 14: మద్యం తాగిన మైకంలో ఆటోడ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక ప్రయాణికుడు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం మొవ్వ మండలం అయ్యంకిలో జరిగింది. ఎఎస్‌ఐ సత్యనారాయణ సమాచారం ప్రకారం అవనిగడ్డ డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు విజయవాడకు ప్రయాణిస్తుండగా అయ్యంకి ఆర్ అండ్ బి రహదారిలో పామర్రుకు చెందిన ఆటోడ్రైవర్ మద్యం మత్తులో అడ్డదిడ్డంగా ఆటోను నడిపి బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటో దెబ్బతినటంతో పాటు అందులో ప్రయాణిస్తున్నవారు గాయాల పాలయ్యారు. వీరిలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కావటంతో 108 అంబులెన్స్‌లో మచిలీపట్నం తరలించారు.
సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయం కిటకిట
మోపిదేవి, జూలై 14: శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్‌లలో నిలబడ్డారు. కొందరు భక్తులు తమ చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. మరికొందరు పుట్టెంటుకలు తీయించి, చెవిపోగులు కుట్టించి మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు జూనియర్ సివిల్ జడ్జి ఆర్ కిషోర్‌బాబు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.
ఒక సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ
బంటుమిల్లి, జూలై 14: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన దాఖలైన నామినేషన్లను ఆదివారం పరిశీలించారు. 21 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు 117 మంది నామినేషన్లు దాఖలు చేయగా ములపర్రు సర్పంచ్ అభ్యర్థి యలవర్తి పాండురంగారావు నామినేషన్‌ను తిరస్కరించారు. సాతులూరు గ్రామ పంచాయతీలో 10 వార్డులకు గాను 7 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
కొర్లపాడులో 10 వార్డులకు గాను మూడు వార్డులు, రామవరపుమోడిలో మూడు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ముంజులూరులో మూడు వార్డులకు సంబంధించిన మూడు నామినేషన్‌లను తిరస్కరించారు. అర్తమూరులో కూడా మూడు మల్లంపూడిలో 5వ వార్డు నామినేషన్‌లను తిరస్కరించారు.
అవనిగడ్డలో...
అవనిగడ్డ : గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. అవనిగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి 14 మంది నామినేషన్లు దాఖలు చేయగా అందరినీ పోటీకి అర్హులుగా ప్రకటించారు. పులిగడ్డలో కూడా నలుగురు సర్పంచ్ అభ్యర్థులను అర్హులుగా ప్రకటించారు.
ముదినేపల్లిలో...
ముదినేపల్లి : మండలంలోని 32 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులకు 159, వార్డు పదవులకు 664 నామినేషన్లు దాఖలు కాగా ఆదివారం నిర్వహించిన పరిశీలనలో 11 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. సర్పంచ్ పదవులకు సంబంధించి 5, వార్డు పదవులకు సంబంధించి 6 నామినేషన్లను తిరస్కరించినట్లు ఎండివో విద్యాసాగర్ తెలిపారు.
ప్రజాసేవకు పదవులు ఆసరా
మచిలీపట్నం , జూలై 14: ప్రజలకు సేవచేసే అవకాశాలను పదవులు అందిస్తాయని జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జి చక్రధరరావు అన్నారు. పట్టణ రోటరీ క్లబ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆదివారం రోటరీ క్లబ్ హాలులో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా చక్రధరరావు మాట్లాడుతూ అవసరాలను గుర్తించి కష్టాలను సేవల ద్వారా తీర్చే సంస్థ రోటరీ అన్నారు. మంచి పనులు చేసే వ్యక్తులు ఉన్న సంస్థలు రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ అని ప్రశంసించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయ సహకారాలు అందించడం, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం, విద్యాభివృద్ధికి కృషి చేయడం, మంచినీటి సరఫరా మొదలైన కార్యక్రమాలను నిర్వహించడంలో రోటరీ అగ్రగామి అన్నారు. 3020 రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ సిహెచ్‌వి వెంకటేశ్వరరావు క్లబ్ అధ్యక్షురాలు జి రాజేశ్వరి, కార్యదర్శి ఎ జ్యోతి, డైరెక్టర్‌లు, కమిటీ చైర్మన్‌లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో తక్షణ మాజీ అధ్యక్ష, కార్యదర్శులు పి బాబు, యండివికె కిషోర్, డా. బి ధన్వంతరి ఆచార్య, పి మెహర్ కుమార్, ఎంవి సీతాపతిరావు, కొల్లు రవీంద్ర, గఫార్, కరెడ్ల సుశీల, తదితరులు పాల్గొన్నారు.
ధ్వంసమైన రోడ్లు.. నగరవాసుల అగచాట్లు!
విజయవాడ, జూలై 14: కేంద్ర ప్రభుత్వ పథకం జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం కింద కొనే్నళ్ళుగా నగరంలో వౌలిక సదుపాయాల కోసం దాదాపు అదీ నగర చరిత్రలో ముందెన్నడూ లేనివిధంగా రూ.1600 కోట్ల రూపాయల నిధులు తెచ్చి వెచ్చించామని అధికారపక్ష నేతలు పదేపదే చెబుతున్నారు. కొన్నివేలమంది నిర్భాగ్యుల కోసం నగర శివార్లలో 1+3లో నీడ కల్పించవచ్చు కానీ ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షానికే మారుమూల ప్రాంతాల్లో కాదు బందరు రోడ్డు, ఏలూరు రోడ్డులో సైతం నడకసాగని రీతిలో వర్షపు నీరు, మురుగు నీరు మమేకమై కొన్ని గంటలపాటు ప్రవహించింది. ఇక మొగల్రాజపురంలో పాలీక్లీనిక్ రోడ్డు నుంచి నిర్మలా కానె్వంట్ వరకు ఏడాది పొడవునా సైడ్ కాల్వల్లో మురుగు నీరు అణుమాత్రం కదలకుండా కన్పిస్తుంటుంది. ఏదిఏమైనా నగరం మొత్తంపై దాదాపు 85కి.మీ మేర అంతర్గత రహదారులు ధ్వంసమయ్యాయి. ఈ రహదారులలో ప్రయాణం నరకయాతన... పైగా లక్షలాది రూపాయల విలువైన వాహనాలు ధ్వంసమవుతున్నాయి. రెండేళ్ళ క్రితం సంభవించిన నీలం తుపాను సహాయాన్ని బాధితులకు అందించకుండా ఆర్ అండ్ బి శాఖ ద్వారా ఒన్‌టౌన్‌లో టనె్నల్ రోడ్డు, ఇతర ప్రాంతాల్లో రహదారులను వేయించారు. వందల కోట్లు ఖర్చు చేసి నగరంలో ప్రతి చోటా అంతర్గత భూగర్భ డ్రైన్‌ల నిర్మాణాలు వాటికి అనుసంధానంగా ఔట్‌ఫాల్ డ్రెయిన్‌లు నిర్మించారు బాగుంది. అయితే కొండప్రాంతం, అలాగే ఎగువ ప్రాంతాల నుంచి సాధారణంగా ప్రవహించే నీరు... వర్షాకాలం ప్రవహించే వర్షపు నీటి కోసం కొన్ని దశాబ్దాల క్రితం ప్రతివీధిలోనూ రెండు వైపుల అదీ ఎన్నో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించారు. అయితేనేమి వేసవికాలంలో వాటిల్లో పూడిక తీసే నాథుడే లేడు. ఇంకేముంది వర్షాకాలంలోఇలాంటి డ్రెయిన్లు పొంగి రహదారులపై ప్రవహిస్తున్నాయి. ఈ కారణం వల్ల కూడా ఎక్కడికక్కడ రహదారులు దారుణంగా ధ్వంసమవుతున్నాయి. గత కొనే్నళ్ళ క్రితం రోజూ కేవలం రెండు సెంమీ వర్షం కురవటంతోనే ఒన్ టౌన్‌లో వించిపేట, గణపతిరావు రోడ్డు, ఇస్లాంపేట, నైజాం గేట్, పాత చేపల మార్కెట్ ప్రాంతం దాదాపు 48గంటలపాటు నీట మునిగాయి. అదీ నగర భూగర్భ డ్రైనేజీ పనితీరు. ఇందుకు ఎన్ని వందలు... వేల కోట్లు ఖర్చు చేస్తేనేమి.. ఏ ఒక్కరిపైన అయినా చర్య ఉంటే కదా!
010 జీతాల కోసం నేడు మున్సిపల్ టీచర్ల మహాధర్నా
* నేటికి మూడు నెలల జీతం బకాయి
అజిత్‌సింగ్‌నగర్, జూలై 14: విజయవాడ నగర పాలకసంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 010 జీవోద్వారా నేరుగా ట్రెజరీ ద్వారా జీతాలను పంపిణీ చేయడంతోపాటు తక్షణమే వేతన బకాయిలతోపాటు ఎరియర్స్‌ను మంజూరు చేయాలన్న డిమాండ్‌తో కార్పొరేషన్ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు సోమవారం చేపట్టనున్న మహాధర్నాకు సర్వ సిద్దం చేసారు. గత కొంత కాలంగా అపరిష్కృతంగా ఉన్న 010 జీతాల కోసం ఉపాధ్యాయులు ఇప్పటికే ఆందోళన బాట పట్టిన విషయం విధితమే. కాగా గత సంవత్సరం మార్చి నెలలో ఈ జీతాల కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన వైనంతో నగరానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు టీచర్లతో ఆందోళనను విరమింపచేసేందుకు గాను ప్రకటించిన హామీలు నేటికీ కార్యరూపం దాల్చకపోవడం, అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఎటువంటి స్పందన లేకపోవడంతో పాలకులు హామీలకు విసిగి వేసారి ఇక ఉద్యమమే శరణ్యమని భావించిన ఉపాధాయులు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి సన్నాహాలు చేసారు. ఇందులో భాగంగా నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మహా ధర్నాకు శ్రీకారం చుట్టారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఏకధాటిగా నిరసన ధర్నా జరుపనున్నారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు కార్పొరేషన్ ఉపాధ్యాయులందరూ సోమవారం సెలవు కోసం తమ ప్రధానోపాధ్యాయులకు ధరఖాస్తు చేసుకున్నారు. కాగా వీరందరికీ సెలవు మంజూరు విషయమై కార్పొరేషన్ విద్యాధికారులు మీమాంసలో పడ్డారు. ఊకమ్మడి సెలవు మంజూరులో ఉన్న నియమ నిబంధనలను పరిశీలించి తదుపరి చర్యలపై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. కాగా జీతాల కోసం తాడోపేడో తేల్చుకునేందుకు ఉపాధ్యాయులందరూ ఐక్య పోరాటానికి సిద్దం కావడం విశేషం. ఉపాధ్యాయ సంఘాల నాయకులందరితో కలిసి 010 జెఎసి ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్ర మంతా ఉపాధ్యాయులకు 010 జీవో ద్వారా నేరుగా జీతాలు పొందుతుంటే తమకు కనీసం నెల నెలా జీతాలను ఇచ్చే నాధుడు లేకపోవడంపై ఉపాధ్యాయ లోకంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సక్రమంగా రాని జీతాల కారణంగా అనేక అర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, చేసేది ప్రభుత్వ ఉద్యోగమైనా కుటుంబ పోషణకు సైతం వెతుకులాట చేసుకోవాల్సి వస్తున్న వైనం పై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నారు. ఇదిలావుండగా 010 జీతాల మంజూరు కు బదులుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానల్ ఏర్పాటును సైతం ఉపాధ్యాయులు నిరాకరిస్తున్నారు. దీనితో తాము లబ్ధిపొందాల్సిన అనేక పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు లబ్దిపొందలేమని వారు పేర్కొంటున్న వైనం ఉద్యమం బలోపేతానికి శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మాటలు విని గత సంవత్సరం తీవ్రంగా నష్టపోయామని, వీరి హామీలను నమ్మి ఆందోళన విరమించకుండా ఉంటే ఈపాటికల్లా తమకు 010 జీతాలు మంజూరు అయ్యేవన్న ఆలోచనలలో ఉన్న ఉపాధ్యాయ సంఘాలు ప్రస్తుతం చేపట్టిన దశల వారీ ఆందోళనలను అంతిమ లక్ష్యం సాధించే వరకూ విరమించేది లేదని, మహాధర్నాతో ప్రారంభమైన తమ ఉద్యమానికి ప్రభుత్వం స్పందించకుంటే ఎటువంటి త్యాగాలకైనా సిద్దమేనని 010 జెఎసి నాయకులు ప్రకటిస్తున్నారు. ఇదిలావుండగా నగర పాలక సంస్థ లో వాటర్ సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రికల్ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు గత మూడు నెలలుగా జీతాలివ్వకపోవడం కార్మికు సంఘాలు గుర్రు మంటున్నాయి. వారు కూడా తమ జీతాల సాధన కోసం ఆందోళన బాట పట్టేందుకు సిద్దంగా ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నగర కమిటీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికుల జీతాల కోసం ఉద్యమించేందుకు రంగం సిద్దం చేస్తున్న వైనం గమనార్హం. ఒకపక్క ఉపాధ్యాయులు, మరోపక్క కాంట్రాక్టు ఉద్యోగులు కూడా ఆందోళన బాట పడితే కార్పొరేషన్ అందించే పౌర సేవలకు విఘాతం కలుగకమానదు.
కౌలురైతులకు10 వేల కోట్ల పంట రుణాలివ్వాలి
విజయవాడ, జూలై 14: రాష్ట్రంలో కౌలు రైతులందరికీ రూ.10వేల కోట్ల పంట రుణాలివ్వాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబోయిన రంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుందరయ్య భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌలు రైతులు ఏళ్ల తరబడి చేసిన అనేక పోరాటాల ఫలితంగా దిగొచ్చిన ప్రభుత్వం 2011లో లైసెన్స్ సాగుదారుల చట్టం తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టం ప్రతి కౌలుదారునికీ గుర్తింపు కార్డులు ఇవ్వాల్సి ఉందన్నారు. గుర్తింపుపొందిన ప్రతి కౌలుదారునికీ పంట రుణాలు, ప్రకృతి వైపరీత్యాల నష్టపరిహారం, బీమా సౌకర్యం కల్పించాల్సి ఉందన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ నిర్ణయించిన లక్ష్యాలను పూర్తి చేయకపోగా కౌలుదారుల చట్టాలను ప్రభుత్వం ఆమలు చేయటంలేదన్నారు. భూ యజమానులు, అధికారులతో కలిసి ప్రభుత్వం కౌలు రైతులకు అనేక అవరోధాలు సృష్టిస్తోందన్నారు. ఈ సమావేశంలో కిసాన్ సభ ఆలిండియా ఉపాధ్యక్షులు ఎస్ మల్లారెడ్డి పాల్గొన్నారు.
నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కె శ్రీనివాస్, ఎన్ రంగారావు
ముందుగా జరిగిన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కె శ్రీనివాస్, ఎన్ రంగారావులను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా వంగల సుబ్బారావు, పిన్నమనేని మురళీకృష్ణ, జుత్తిగ నరసింహమూర్తి, తాతా భాస్కరరావు, సహాయ కార్యదర్శులుగా పి జమలయ్య, గంగపట్నం రమణయ్య, కె అజయ్, టివి లక్ష్మణస్వామి, మరో 25 మంది సభ్యులతో నూతన కమిటీని ఎన్నుకున్నారు.
ఆల్మట్టి డ్యాం ఇంకా ఎత్తు పెంచుతారా!?
విజయవాడ, జూలై 14: ఆల్మట్టి డ్యాం ఎత్తు 519.06 నుండి 524.25 అడుగులకు పెంపుదల చేస్తున్నట్లు దీనికోసం నిధులు కేటాయించినట్లు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చాలా స్పష్టంగా అసెంబ్లీలో ప్రకటించటం ఆందోళన కల్గిస్తున్నదని తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 5 అడుగులు పెంచటం వలన కృష్ణాడెల్టా నారుమళ్ళు సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో వేయవల్సిన పరిస్థితి వస్తుందని, దీని వలన నాగార్జున సాగర్ క్రింద ఆయకట్టు 22 లక్షలు దెబ్బతినే అవకాశముందన్నారు. త్వరలో జడ్జిమెంట్ వస్తుందని అప్పటివరకు ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచకుండా ముఖ్యమంత్రి ఎంపిలతో కలిసి ప్రధాన మంత్రిపై ఒత్తిడి తేవాలని, చంద్రబాబు హయాంలో ఆల్మట్టి డ్యాం ఎత్తు 524 అడుగులు ఎత్తడానికి ప్రయత్నం చేస్తే న్యాయపోరాటం ద్వారా దీనిని ఆపివేయటం జరిగిందన్నారు. పంచాయతీ ఎన్నికల అనంతరం ఆగస్టు నెలలో రైతులతో కలిసి తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన కార్యక్రమం చేపడుతుందన్నారు. ఈ విలేఖర్ల సమావేశంలో సెంట్రల్ ఇన్‌చార్జి బొండా ఉమామహేశ్వరరావు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి బొడ్డు వేణుగోపాలరావు, నూజివీడు మండల పార్టీ అధ్యక్షులు కాపా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలోనే ఆత్మతృప్తి
అజిత్‌సింగ్‌నగర్, జూలై 14: ఆపదలో ఉన్న వారిని ఆదుకుని వారికి అవసరమైన సేవ చేయడంలో ఉన్న ఆత్మతృప్తి మరిదేనిలో కలగదని ప్రముఖ పారిశ్రామిక వేత్త, సంఘ సేవకులు గోకరాజు గంగరాజు పేర్కొన్నారు. గోకరాజు గంగరాజు 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక వివేకానంద సెంటినరీ హైస్కూల్ విద్యార్థులకు అనంత లక్ష్మీదేవి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ సమాజంలో నిరుపేదలు ఎంతో మంది ఉన్నారని, ముఖ్యంగా విద్యార్థులు ఎంతో మంది తమ విద్యాభ్యాస అవసరాల కోసం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వైనం గమనార్హమన్నారు. సామాజిక అభ్యున్నతి కావాలంటే నిరుపేదలు విద్యాభున్నతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. నిరుపేదలైన విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు, ఇతర అవసరాలను తీర్చగలిగితే వారి అభ్యున్నతికి దోహదపడినవారిమవుతామన్నారు. గత యాభై సంవత్సరాలుగా పేద వర్గాలకు విద్యాబోధన చేస్తున్న వివేకానంద సెంటినరీ హైస్కూల్‌లో నిర్మించనున్న సిల్వర్ జూబ్లీ తరగతి గదుల భవన నిర్మాణానికి గాను నిర్మాణ వ్యయంలో యాభై శాతమైన సుమారు 25 లక్షల రూపాయలను విరాళంగా అందజేస్తున్నట్లు విద్యార్థుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అనంతలక్ష్మీదేవి సేవా సంఘం అధ్యక్షుడు పెనె్మత్స అప్పలరాజు మాట్లాడుతూ నగరంలో పేద వర్గాలకు చెందిన విద్యార్థులు నోటు పుస్తకాల కోసం ఇబ్బందులు పడరాదన్న ఉద్దేశ్యంతో వేలాది పుస్తకాలను పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే పాఠశాల తరగతి గదుల నిర్మాణం కోసం సుమారు పాతిక లక్షల రూపాయలను విరాళంగా అందజేయడం అభినందనీయమన్నారు. ఈకార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ దుర్గాప్రసాద్, ప్రధానోపాధ్యాయులు ఎ రామ్‌ప్రసాద్, ఉపాధాయులు నాగరాజు, నగర ప్రముఖులు యువి నరసరాజు, దాట్ల సత్యనారాయణరాజు, హనుమంతరావు, మహిళా పారిశ్రామిక వేత్త రాధారాణి, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా గోకరాజు గంగరాజు పాఠశాల ఉపాధాయులు, విద్యార్థులు ఘనంగా సత్కరించారు. తొలుత పాఠశాల ఆవరణలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
మానసిక ఆరోగ్యానికి కావలసింది శారీరక ఆరోగ్యం
విజయవాడ, జూలై 14: మానసికారోగ్యానికి ముఖ్యంగా కావల్సింది శారీరక ఆరోగ్యం, భావోద్రేక సమతౌల్యత, ఆత్మవిశ్వాసం, ఆశావాదం అని డాక్టర్ సి.రవికుమార్ అన్నారు. పోషకాహార విలువల వారోత్సవాలు ప్రారంభం సందర్భంగా నలంద విద్యానికేతన్‌లో ‘కౌమారదశలో కలిగే మార్పులు’ అంశంపై ఆదివారం జరిగిన అవగాహన శిబిరంలో ఆయన ప్రసంగించారు. 13నుంచి 17ఏళ్ళ మధ్యకాలంలో శరీర భాగాలతోపాటు వ్యక్తి నడకలో మార్పు వస్తుందని ఇతర వ్యక్తులు చేసే ప్రతి పనిని విమర్శిస్తుంటారని తల్లితండ్రులపై తీవ్ర నిరసన భావంతో ఉంటారని, పగటికలలు కంటూ ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తారని తెలిపారు. శరీరంలో వచ్చే మార్పుల వల్ల బాహ్య పరిస్థితుల పట్ల తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారని అన్నారు. అందుకే తల్లిదండ్రులు ఈ దిశలో తమ పిల్లలు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారో గమనిస్తుండాలన్నారు. ఉపాధ్యాయులు పెరిగే వాతావరణం ఈ మూడు అంశాలు విద్యార్థులను ప్రభావితం చేస్తుంటాయి. విద్యార్థులకు అన్ని విషయాల్లోనూ కౌనె్సలింగ్ ఎంతో అవసరమని డాక్టర్ రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులను ఉదాహరణగా తీసుకుని వారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎలా ఎదిగారు అనే విషయంపై చర్చించారు. డాక్టర్ పి.కిషోర్ ప్రసంగిస్తూ పిల్లల్లో ఉత్తర కౌమారదశ 17 నుంచి ప్రారంభమై 21వ సంవత్సరం వరకు ఉంటుందన్నారు. ఈ దశలో సాంఘిక పరివర్తనలో ఎక్కువ మార్పులు జరుగుతుంటాయని, విందులు, వినోదాల పట్ల ఆసక్తి, భిన్నలింగ వ్యక్తులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుంటారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుశాంత్ దాస్ తదితరులు ప్రసంగించారు.
నగ్నమునికి తనికెళ్ళ భరణి సాహితీ పురస్కార ప్రదానం
విజయవాడ , జూలై 14: దిగంబర కవిత ప్రారంభకులు, విరసం వ్యవస్థాపక సభ్యులలో ఒకరు, ప్రజాస్వామ్య కవిత ప్రారంభకులు నగ్నమునికి తనికెళ్ళ భరణి సాహితీ పురస్కారం -2013ను అందించారు. ఆదివారం సాయంత్రం తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సాహితీ వేత్తలు, కవులు, పండితులు, రచయితల కరతాళ ధ్వనుల మధ్య ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వేదికపై అధికార భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్, సినీ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి, గోళ్ళ నారాయణరావు, శ్రీశ్రీ విశే్వశ్వరరావు, కె.పట్టానిరామ్, డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మీదేవి, కె.వెంకటేశ్వరరావు, కొప్పర్తి వెంకట రమణమూర్తి తదితరులు పాల్గొని మానవ జీవన వాస్తవికతలను తన కలాన్ని కత్తిగా చేసి రచనలు చేసిన నగ్నమునికి ఈ పురస్కారాన్ని అందించటం ఎంతో ముదావహమన్నారు. ప్రారంభంలో బులుసు అపర్ణచే మహిళా అష్టావధానం జరిగింది. పృచ్ఛకులుగా మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి, డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, పింగళి వెంకట కృష్ణారావు, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, మంజులూరి కృష్ణకుమారి, మల్లాప్రగడ శ్రీవల్లి, పుల్లాభట్ల నాగశాంతి స్వరూప, ఎంఎస్ సూర్యనారాయణలు పాల్గొని చేసిన అవధాన కార్యక్రమం భాషా వైభవాన్ని చాటింది.
భక్తి, భాషల సమాహారం.. నాట్య సంకీర్తనోత్సవం
విజయవాడ , జూలై 14: శ్రీధర్మ పరిషత్ మహా సంస్థానం వారి సౌజన్యంతో అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు అయోధ్యనగరంలోని శ్రీ శివగాయత్రి ప్రాంగణంలో జరుగుతున్న అన్నమయ్య 605వ జయంతి నాట్య సంకీర్తనోత్సవం భక్తితత్వాన్ని, భాషా వైభవాన్ని చాటుతూ సాగింది. 3వ రోజైన ఆదివారం సాయంత్రం నాటి నాట్య ప్రదర్శనలు నయన మనోహరంగా ప్రదర్శనలనిచ్చిన నాట్యాభ్యాసకుల కృషిని, నాట్యంపైవారికి గల శ్రద్ధను గోచరింపచేశాయి. ప్రత్యేక ప్రదర్శనగా చిన్నారి సాయి మంజూష చేసిన నాట్య ప్రదర్శన రాజీవ నేత్రాల రఘువాయనమః అంశాలతో రమణీయంగా సాగి ఆహూతుల హర్షధ్వానాలందుకుంది. వరుసగా బలిజేపల్లి శివానంద్, జెఎస్‌ఆర్ మూర్తి, నిర్మలా రమేశ్, జోశ్యుల పద్మశ్రీ, పాత్రుని శిరీష, నాగమణి బుద్ధదేవ్, శ్రీకాంత్, భాగవతుల శ్రీనివాస శర్మ, మహంకాళి సూర్యనారాయణ శర్మ, శైలశ్రీ, అద్దేపల్లి అశ్వనీకుమార్, హేమసుందర్, లోకేష్ కృష్ణవేణి నాట్యాచార్యుల శిష్య బృందాలు అంతయు నీవే హరి పుండరీకాక్ష, ఒక పరి నొకపరి, జగడపు చనవుల, ఫాలనేత్రాన, పిలవరే కృష్ణుని, పిడికిట తలంబ్రాలు, తందనానా ఆహి, వేడుకుందామా, గోవిందాశ్రీత, భావములోన బాహ్యము తదితర సంకీర్తనలకు నాట్యాభినయం అందరి కరతాళ ధ్వనులందుకున్నాయి. మూడు రోజులు రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి దాదాపు 40మంది నాట్యాచార్యుల శిష్య బృందాలు 700మంది చిన్నారులు ప్రదర్శనలో వారి వారి నాట్య కళాప్రతిభను చాటుకున్నారు. అందరికి ఎహెచ్‌ఎస్ వరప్రసాద్ (రాజా) రాజగోపాల జ్ఞాపికలు అందించి ఆశీర్వదించారు. నిర్వహణ డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి చేయగా, ప్రదర్శనకు పర్యవేక్షణ పసుమర్తి కేశవప్రసాద్ చేశారు.
వాన భయం పోయింది... దోమకాటు వెంటాడు
పాతబస్తీ, జూలై 14: విజయవాడ నగరవాసుల వెన్నులో వణుకు పుట్టించిన వాన భయం నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. కానీ దోమకాటు భయం మాత్రం నిరంతరం వెంటాడుతోంది. ముఖ్యంగా పాతబస్తీ మూడేళ్లనాడు తవ్విన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ గోతులు ఇప్పటికీ అలానే ఉన్నాయి. నాటి గోతులు పూడ్చడానికి పశ్చిమ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి నిధుల నుండి సుమారు రూ.18కోట్లు మంజూరు చేయించుకున్నారు. పనులను వెలంపల్లి శ్రీనివాసరావు నిత్యం పర్యవేక్షిస్తునే ఉన్నారు. అయినాగాని రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం కావడంలేదు. దాంతో కొండప్రాంతవాసులు తమ నివాసాలకు చేరుకోడానికి నరకయాతనకు గురవుతుండగా కొండ దిగువ ప్రాంతవాసులు మురుగు ముంపునకుగురై కలుషిత వాతావరణంలో మగ్గాల్సి వస్తుంది. పైగా కొండప్రాంతవాసులు చాలామంది మరుగుదొడ్లు ట్యాంకులు నిర్మించకుండా మరుగుదొడ్ల వాడకాన్ని మురుగుకాలువలకు వదిలేస్తున్నారు. దానివల్ల వాడిన నీటితోపాటు మరుగుదొడ్లు నీరుకూడా దిగువ ప్రాంతాలకు కొట్టుకొస్తుంది. అలాంటి మురుగు దోమలార్వా అభివృద్ధి కర్మాగారంలా మారుతుంది. కొండ దిగువ ప్రాంతాల్లో మురుగుకాలువలు నిత్యం పూడికకు గురవుతున్నాయి. అనధికార అంచనా ప్రకారం పశ్చిమ నియోజకవర్గంలోని ప్రధాన డ్రెయిన్‌లో నిత్యం 50 టన్నుల సిల్ట్ పేరుకుపోతుంది. జనాభా లెక్కల ప్రకారం ఉండాల్సిన పారిశుద్ధ్య సిబ్బంది కరవయ్యారు. మురుగు కాలువల్లో సిల్ట్ ఎంత తొలగించినా మరికొంత పేరుకుపోతూనే ఉంది. దాంతో చెత్తాచెదారంతో మురుగు కాలువలు నిండిపోతున్నాయి. ప్రధాన మురుగు రోడ్లు మీద ఏరులై పారుతుంది. ఇలాంటి దశలో మూడేళ్లనాడు తవ్విన గోతులు మురుగుతో నిండిపోతున్నాయి. పూర్తిగా మురుగునీరు పారుతున్న దారులు మురుగు కంపు కొడుతున్నాయి. నిత్యం తడారకుండా నీరు నిలువ ఉండడంతో దోమలార్వా వృద్ధి చెందుతోంది. దాంతో వాన భయం వదిలినా పాతబస్తీవాసుల్లో దోమకాటు భయం పట్టుకుంది. లార్వా నియంత్రణకు మున్సిపల్ ప్రజాఆరోగ్యశాఖ కసరత్తు చేస్తున్నాగాని పూర్తిస్థాయిలో నివారణ కావడంలేదు.