ఒంగోలు , జూలై 14: పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపర్చిన సర్పంచ్, వార్డు సభ్యులను భారీ మెజార్టీతో అత్యధిక స్థానాల్లో గెలుపొందే విధంగా పార్టీశ్రేణులు కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు యానం చినయోగయ్య యాదవ్ అధ్యక్షతన ఆదివారం నగరంలోని 5వ డివిజన్, 26వ డివిజన్‌లలో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 5వ డివిజన్‌కు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. డివిజన్ అధ్యక్షుడిగా గాలి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా కొణికి రోశయ్యలను ఎంపిక చేశారు. అదేవిధంగా 26వ డివిజన్ అధ్యక్షుడిగా పొత్తూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి పులివర్తి అజయ్‌బాబులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో దామచర్ల మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలను పార్టీశ్రేణులు ఛాలెంజ్‌గా తీసుకొని టిడిపి బలపర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థలు, శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలకు కార్యకర్తలు ఇప్పటినుండే సన్నద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంగోలు మేయర్ పదవిని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని దామచర్ల ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలకు ఏలాంటి ఇబ్బంది వచ్చినా ఆదుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ బిసిలకు రానున్న ఎన్నికల్లో వంద అసెంబ్లీ సీట్లు కేటాయిస్తామని వాగ్దానం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బిసిలు ముందుండి పార్టీని నడిపించాలని కోరారు. కేంద్ర, రాష్ట్రాల్లో అసమర్థ ప్రభుత్వాలు పాలిస్తున్నాయని దీనివల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు తాజా తీర్పుతో వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి లాంటి ఆర్థిక నేరగాళ్ళకు కళ్ళెం వేసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేదని, చట్ట సభలకు అలాంటి వారు అనర్హులని తీర్పు చెప్పడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా నగర పార్టీ అధ్యక్షుడు యానం చిన యోగయ్య యాదవ్ మాట్లాడుతూ దేశంలో రోజు రోజుకు ఆకాశానంటుతున్న నిత్యావసర వస్తువుల ధరల కారణంగా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఏ వస్తువు కొనాలన్నా, తినాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అసమర్థ ప్రభుత్వాల పరిపాలన వలన ప్రజలు విసుగు చెందారని, ఇలాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ ప్రధానకార్యదర్శి కపిల్ బాషా, రాష్ట్ర, జిల్లా, నగర నాయకులు యక్కల తులసీరావు, బొల్లినేని వాసుకృష్ణ, టివి శ్రీరామ్మూర్తి, కమ్మ వెంకటేశ్వర్లు, కొమ్మూరి రవిచంద్ర, బొల్లినేని మురళీకృష్ణ, టి అనంతమ్మ, కుట్టు బోయిన వెంకట్రావు, కె సురేష్, జి శ్రీనివాసరావు, పొనుబాటి వెంకటేశ్వర్లు , బొల్లినేని బుజ్జి, మద్దినేని సుబ్బారావు, నూనె వెంకటేశ్వర్లు, పులివర్తి సాయిబాబు, షేక్ అన్వర్ బాషా, మద్దసాని రాము, ఎంపి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతిష్ఠాత్మకంగా పంచాయతీ రాజకీయం!
తాయిలాలు ప్రకటిస్తున్న నేతలు
ఒంగోలు, జూలై 14: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయండి.. అనంతరం లక్షలాది రూపాయల విలువైన వర్క్‌లను తీసుకెళ్లండని అధికార పార్టీకి చెందిన కొంతమంది శాసనసభ్యులు హుకుం జారీ చేస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. సర్పంచ్ అభ్యర్థులుగా పోటీచేసే కొంతమంది అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు కూడా అధికారపార్టీకి చెందిన నేతలు ముందుకువస్తున్నారు. కాని కొన్ని నియోజకవర్గాల్లో అలాంటి తాయిలాలు ప్రకటిస్తున్నప్పటికీ పోటీ చేసేందుకు గ్రామాల్లోని నేతలు ముందుకురాని పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని ఒక ప్రజాప్రతినిధి సర్పంచ్‌గా పోటీచేసే అభ్యర్థికి 20 లక్షల రూపాయలకు పైగానే వర్క్‌లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన నేతలకే ఈ ఎన్నికలు పెద్దతలనొప్పిగా మారిందనే చెప్పవచ్చు. ఎన్నికల్లో ఫలితాలు తారుమారు అయితే హైకమాండ్ వద్ద తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుందన్న భావనలో అధికారపార్టీ నేతలు ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. జిల్లాలోని కొన్ని గ్రామాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్, మరికొన్ని గ్రామాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన నేతలు పొత్తులు పెట్టుకుని ఎన్నికల బరిలో ఉన్నారు. గ్రామాల్లో నెలకొన్న రాజకీయ వాతావరణం దృష్ట్యా అక్కడి నేతలు పొత్తులు పెట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. కాగా జిల్లాలోని ఒసి జనరల్ కేటగిరి కింద ఉన్న పంచాయతీల్లో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఒక్కొక్క పంచాయతీలో 20 లక్షల నుండి కోటి రూపాయల వరకు ఖర్చు చేసేందుకు అభ్యర్థులు వెనుకాడడం లేదని తెలుస్తోంది. కొంతమంది అభ్యర్థులు ఈపాటికే తమ భూములను అమ్ముకుని ఆ నగదును ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చారు. ఇదిలాఉండగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తిలు కూడా పంచాయతీ ఎన్నికలపై దృష్టిసారించారు. ఇటీవల జరిగిన డిసిసిబి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి మెరుగైన ఫలితాలే వచ్చాయి. దీంతో నూతనోత్సాహంతో నేతలు గ్రామాల్లో అభ్యర్థులను రంగంలోకి దించారు. కొంతమంది అభ్యర్థులకు ఆర్థికబలం తగ్గినప్పటికి నేతలు ఆ లోటు పూడ్చేందుకు ముందుకు వస్తున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రధానంగా ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జులకు పెద్ద తలనొప్పిగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో తమసత్తా చాటకపోతే అధినేత చంద్రబాబు వద్ద మార్కులు తగ్గుతాయన్న మీమాంసలో నేతలు ఉన్నారు. కాగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరు జిల్లాలో జరిగిన సభలో పార్టీనేతలకు హితోపదేశం చేశారు. ఎట్టి పరిస్ధితుల్లోను పంచాయతీ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకుని పార్టీకి వైభవం తీసుకురావాలని సూచించారు. కాగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో బలం ఉన్నప్పటికి నేతల మధ్య మాత్రం అంతర్గత కుమ్ములాటలు జోరందుకుంటున్నాయి. దీంతో నేతల మధ్య ఉన్న అనైఖ్యత పంచాయతీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తంమీద మూడు ప్రధాన రాజకీయపక్షాలకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగానే మారాయి. కాగా పంచాయతీ ఎన్నికల పుణ్యామా అని మద్యం ఏరులై పారుతోంది. మద్యంషాపుల్లో రిటైల్‌గా మద్యం అమ్మకాలు తగ్గగా, హోల్‌సేల్‌గా మాత్రం విక్రయాలు భారీగా పెరిగిపోయాయి.
ముగిసిన నామినేషన్ల పరిశీలన
పలుకూరులో స్వల్ప ఉద్రిక్తత
రెండు టిడిపి, రెండు కాంగ్రెస్, ఒకటి వైఎస్‌ఆర్‌సిపి
ఏకగ్రీవం
కందుకూరు, జూలై 14: ఈనెల 27న జరగనున్న పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్, వార్డు మెంబర్లుగా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల నామినేషన్ల స్క్రూట్ని కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. కందుకూరు మండలం మాచవరం గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన మెడబలిమి అంకయ్య నామినేషన్‌ను ఉప సంహరణ చేసుకోనున్నట్లు సమాచారం. అదేవిధంగా మండలంలోని నరిశెట్టివారిపాలెం, కమ్మవారిపాలెం పంచాయతీలలో ఒక్కొక్క నామినేషన్ రావడంతో రెండు పంచాయతీలు టిడిపి ఖాతాలో జమ కానున్నాయి. మిగిలిన 19పంచాయతీలలో 89నామినేషన్లు స్క్రూట్నిలో నిలిచాయి. అందరూ ఆసక్తితో ఎదురు చూసిన మాచవరం పంచాయతీలో వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దాసరి పోతులూరయ్య నామినేషన్ స్క్రూట్నిలో నిలిచింది. ఇక నామినేషన్ల ఉప సంహరణ పూర్తిఅయ్యే సమయానికి వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి బరిలో నిలిస్తే మొట్టమొదటిసారిగా మాచవరం పంచాయతీలో బ్యాలెట్ వినియోగం అమలు జరగనుంది. నామినేషన్ల స్క్రూట్ని సందర్భంగా పలుకూరు పంచాయతీలో వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి తన్నీరు జయమ్మ అఫిడవిట్‌లో వివరాలు పొందు పరచలేదు. స్క్రూట్ని సమయంలో టిడిపి అభ్యర్థి జయమ్మ నామినేషన్లపై అభ్యంతరం తెలిపారు. ఈనేపథ్యంలో పలుకూరు గ్రామంలో చిన్నపాటి వివాదం నెలకొంది. అధికారుల జోక్యంతో వివాదం సమసిపోయింది. పలుకూరు పంచాయతీ 2వ వార్డు వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి నామినేషన్ స్క్రూట్నిలో తొలగించడం జరిగింది. అదేవిధంగా మాచవరంలో 4వ వార్డు అభ్యర్థిగా 7వ వార్డు అభ్యర్థి ప్రతిపాదించడంతో ఆనామినేషన్ కూడా తొలగించడం జరిగింది. ఇక మండలంలో పంచాయతీల వారీగా పలుకూరులో టిడిపి అభ్యర్థి చెంబేటి లక్ష్మి, వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి జయమ్మ, జి మేకపాడులో టిడిపి అభ్యర్థి సుబ్బారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నాగేశ్వరరెడ్డి, జిల్లెలమూడిలో కాంగ్రెస్ అభ్యర్థి రాఘవాచారి, టిడిపి అభ్యర్థి మస్తానయ్య, కోవూరు టిడిపి అభ్యర్థి నల్లపు మధు, విక్కిరాలపేటలో కాంగ్రెస్ అభ్యర్థి మాధవి, టిడిపి అభ్యర్థి భూదేవి, పాలూరులో కాంగ్రెస్ అభ్యర్థి జి వెంకారెడ్డి, టిడిపి అభ్యర్థి జి వెంకటేశ్వరరెడ్డి, శ్రీరంగరాజపురంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ శ్రీనివాసులు, వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి కె శ్రీరాములు, అనంతసాగరం కాంగ్రెస్ అభ్యర్థి బత్తిన రాములు, కంచరగుంట కాంగ్రెస్ అభ్యర్థి మొరార్జీ, టిడిపి అభ్యర్థిల మధ్యన, మోపాడులో కాంగ్రెస్ అభ్యర్థి పాలేటి శ్యామల, టిడిపి అభ్యర్థి పాలేటి మాధవి, వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి మద్దాల రాధ, కొండముడుసుపాలెంలో కాంగ్రెస్ అభ్యర్థి కలవకూరి లక్ష్మి, టిడిపి అభ్యర్థి కలవకూరి నీరజ, వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి తుమ్మా చెన్నమ్మ, కొండికందుకూరులో వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి కోనంకి కుమారి, కాంగ్రెస్ అభ్యర్థి గుమ్మా సుశీల, ఓగూరులో టిడిపి అభ్యర్థి ఎ ఆదినారాయణమ్మ, కాంగ్రెస్ అభ్యర్థి జి చంద్రకళ పోటీలలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అదేవిధంగా వలేటివారిపాలెం మండలంలో స్క్రూట్ని ముగిసిన అనంతరం 21పంచాయతీలలో సర్పంచ్ పదవికి 120మంది నామినేషన్లు దాఖలు చేశారు. 398వార్డులకు వచ్చిన దరఖాస్తులలో మూడు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో 395మంది 194వార్డులలో బరిలో నిలిచారు. మండలంలోని కొండారెడ్డిపాలెం పంచాయతీకి ఒకే నామినేషన్ దాఖలు కావడంతో ఆపంచాయతీ వైఎస్‌ఆర్‌సిపి ఖాతాలోకి జమ కానుంది. లింగసముద్రం మండలంలో 16పంచాయతీలలో సర్పంచ్ పదవులకు స్క్రూట్ని అనంతరం 103మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అదేవిధంగా వార్డు మెంబర్లకు 103నామినేషన్లు స్క్రూట్నిలో నిలిచాయి. మండల పరిధిలోని మొగిలిచెర్ల, ఆర్‌ఆర్‌పాలెం పంచాయతీలకు ఒకే ఒక్క నామినేషన్ రావడంతో రెండు పంచాయతీలో కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లనున్నాయి. ఈనెల 17తేది అనంతరం ఉపసంహరణలో పై పేర్కొన్నవారిలో కొంతమంది నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయి.
వర్షాలతో ఊపందుకోనున్న ఖరీఫ్ సాగు
ఒంగోలు, జూలై 14: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్ సాగు ఊపందుకోనుంది. గత కొన్ని రోజులుగా ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తుండటంతో అటు రైతాంగంతోపాటు ఇటు ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో రెండు లక్షల 34 వేల 791 హెక్టార్లలో వివిధ పంటలు సాగుకావల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 25వేల హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలను సాగుచేశారు. ప్రధానంగా జిల్లాలో సజ్జ, నువ్వు, పత్తి పంటలను సాగుచేయగా శనగ, మిర్చి, కంది, మినుము, పెసర పంటలను విస్తారంగా సాగుచేయనున్నారు. కూరగాయల పంటలను కూడా సాగుచేసేందుకు రైతులు సమాయత్తవౌతున్నారు. ఈపాటికే కొన్ని వేల ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేశారు. ప్రస్తుతం సాగుచేసిన రైతులకు ఈ వర్షాలు ఎంతగానో మేలుచేకూర్చాయి. రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసే ఏడు గంటల ఉచిత విద్యుత్ కూడా సక్రమంగా సరఫరా కాక రైతులు ఆందోళన చెందుతున్న దశలో ఈ వర్షాలు కురిశాయి. ప్రస్తుతం కోస్తా తీరప్రాంతంలో సాగుచేసిన వేరుశనగ పంట ఏపుగా పెరిగింది. అధిక దిగుబడులు వస్తాయని వేరుశనగ రైతులు ఆశాజనకంగా ఉన్నారు. ఇదిలాఉండగా జిల్లావ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు సరాసరిన 4.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా బేస్తవారిపేట మండలంలో 36.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాలవారీగా వర్షాపాతం వివరాలు మిల్లీమీటర్లలో ఈవిధంగా ఉన్నాయి. చీరాల మండలంలో 22.2 మిల్లీమీటర్లు, కంభం మండలంలో 19.6, కారంచేడు మండలంలో 19.2, కొండెపి మండలంలో 18.2, హనుమంతునిపాడు మండలంలో 15.4, మర్రిపూడి మండలంలో 13.6, గిద్దలూరు మండలంలో 13.2, రాచర్ల మండలంలో 10.4, కనిగిరి మండలంలో 10.2, కొనకనమిట్ల మండలంలో 9.8, మద్దిపాడు మండలంలో 9, చీమకుర్తి మండలంలో 9, పిసిపల్లి మండలంలో 8.6, పొన్నలూరు మండలంలో 8.2 మిమీ వర్షపాతం నమోదైంది. కందుకూరు మండలంలో 6.4, అర్ధవీడు మండలంలో 4.8, పెద్దారవీడు మండలంలో 4.2, పొదిలి మండలంలో 3.2, ఇంకొల్లు మండలంలో 2.6, వెలిగండ్ల మండలంలో 2.4, తర్లుపాడు మండలంలో 2.4, నాగులుప్పలపాడు మండలంలో రెండు, జె పంగులూరు మండలంలో 1.8, చినగంజాం మండలంలో 1.6, వలేటివారిపాలెం మండలంలో ఒక మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. మొత్తంమీద వర్షాల ప్రభావంతో జిల్లాలో ఖరీఫ్ సాగు ఊపందుకోనుంది.
అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం
* మంత్రి కన్నా స్పష్టం
మద్దిపాడు, జూలై 14: గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. గుంటూరు నుండి తిరుపతి వెళుతూ ఆదివారం ఆయన మద్దిపాడులోని వీరభద్రా హోటల్ యజమాని పప్పు శ్రీనివాసరావు ఇంటి వద్ద కొద్దిసేపు ఆగిన ఆగారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, సన్న, చిన్నకారు రైతులకు పంటల సాగు విషయంలో అన్నివిధాలుగా తోడ్పాటు అందిస్తున్నామన్నారు. పంట పొలాలకు ఆరుతడుల కింద గుండ్లకమ్మ నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించే విధంగా అధికారులను ఆదేశిస్తున్నామన్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలు, బాలికలకు నగదు ప్రోత్సాహక పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. మంత్రి వెంట గుంటూరు జిల్లా మార్కెట్ యార్డు చైర్మన్ పర్చూరి వెంకటేశ్వరు, గుంటూరు మాజీ మేయర్ కన్నా నాగరాజు, గుంటూరు డిసిసి వైస్ ప్రెసిడెంట్ పక్కాల సూరిబాబు, స్థానిక కాంగ్రెస్ నాయకులు యు నాగేశ్వరరావు, రఘు, షేక్ రహమాన్, వహబ్, మద్దా అంజయ్య, దండే శ్రీరాములు, వెంకయ్య, మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
వాహనం బోల్తా పడి 16 మందికి గాయాలు
కురిచేడు, జూలై 14: త్వరగా ఇంటికి చేరాలనే తపనతో టాటాఎస్ వాహనంలో ప్రయాణించి ప్రాణం మీదకు తెచ్చుకున్నారు కల్లూరు గ్రామ కూలీలు. కురిచేడు మండలం కల్లూరు గ్రామానికి చెందిన 40 మంది కూలీలు ఆదివారం సాగర్ కాల్వ కాంక్రీట్ పనులకు వెళ్ళారు. పనులు ముగించుకొని సాయంత్రం తిరుగు ప్రయాణంలో టాటాఎస్ వాహనం ఎక్కారు. వాహనంలో పరిమితికి మించి కూలీలు ఎక్కారు. దీనికితోడు డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో వాహనం బయలుదేరిన కొద్దిసేపటికే బోల్తా పడింది. కూలీలందరూ ఒకరిపై ఒకరు పడటంతో తొక్కిసలాట జరిగింది. దీనితో గాయపడిన వారి సంఖ్య పెరిగింది. నిత్యం తాము రాకపోలకు ఉపయోగిస్తున్న వాహనం రావటం ఆలస్యం కావటంతో తొందరగా ఇల్లు చేరాలనే తపనతో కూలీలు టాటాఎస్‌లో కిక్కిరి ఎక్కారు. గాయపడిన 16 మందిని దర్శి, కురిచేడుకు చెందిన 108 వాహనాలలో సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసి కురిచేడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గాయపడిన వారిలో నక్కా బాలగురవయ్య, వల్లెం పెద్దయ్య, దండూరి యోగయ్య, పాలుబోయిన నాసరమ్మ, పాలుబోయిన శీను, పాలుబోయిన లక్ష్మయ్య, నక్కా ప్రవల్లిక, ఎల్లమ్మ, చిన్న గాలెమ్మ, గుర్రమ్మ, మల్లవరపు గోపి, వెంకట్రావు తదితరులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన లక్ష్మయ్య, గుర్రమ్మ, రామాంజనేయులు, తలుపూరి కోటమ్మ, కొండు సుందరమ్మలను మెరుగైన చికిత్స కోసం 108లో నరసరావుపేట తరలించారు. క్షతగాత్రులకు కురిచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు సురేష్, సునీత సిబ్బంది చికిత్స చేసారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ ప్రమాద స్థలం నుండి అదృశ్యమయ్యాడు. అయితే ఈప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. కూలీలలో కొందరు వాహనం వెనక టైరు పగలటంతో ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచ్చి వాహనం బోల్తాపడిందని పేర్కొన్నారు.
నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
ఒంగోలు , జూలై 14: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ముస్లింల పట్ల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గుజరాత్‌లోని గోద్రా మారణకాండలో చనిపోయిన ముస్లింలను కుక్కపిల్లలతో పోల్చడం నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం నగర అధ్యక్షులు ఎస్‌కె అన్వర్ బాషా ఆధ్వర్యంలో నరేంద్ర మోడి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు ముస్లింలు మాట్లాడుతూ నరేంద్రమోడి హిందుత్వ వాదాన్ని రెచ్చగొడుతూ భారత ప్రధాని కావాలని కలలు కంటున్నారన్నారు. ఇది లౌకికవాద భారత దేశమని, ఈ దేశంలో ఎప్పటికీ ఇలా జరుగదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి గోద్రా అల్లర్లకు కారణమైన నరేంద్రమోడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నరేంద్రమోడిని అరెస్టు చేసేంతవరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర ముస్లిం మైనార్టీ విభాగం ప్రధానకార్యదర్శి షేక్ జబ్బార్, ఉపాధ్యక్షులు ఎస్‌కె రియాజ్, షేక్ కపిల్‌బాషా, ఎస్‌కె కాలేషాబాబు, షేక్ హబీబ్, బుజ్జి, నాసర్‌వలి, షౌకత్, వౌలాలి, ఎండి బాషా, షేక్ కరిముల్లా, ఎస్‌కె బాషా, ఎస్‌కె అబ్థుల్లా తదితరులు పాల్గొని నరేంద్రమోడికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
‘బ్యాడ్మింటన్‌కు పెరుగుతున్న ఆదరణ’
చీరాల, జూలై 14: ప్రపంచంలో క్రికెట్ తరువాత బ్యాడ్మింటన్ క్రీడకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందని, అందుకు నిదర్శనం గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా క్రీడాకారులు బ్యాడ్మింటన్‌పై ఆసక్తి చూపటమేనని భారత్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి కెసిహెచ్ పున్నయ్య చౌదరి తెలిపారు. గత రెండు రోజులుగా చీరాలలోని డిస్ట్రిక్ స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న 42వ ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ టోర్నమెంటు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆదివారం చివరిరోజు క్రీడాకారుల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడుతూ క్రీడాకారులు గ్రామీణ, మండల, జిల్లా, రాష్టస్ధ్రాయిలో రాణించి జాతీయస్థాయిలో ఆడాలని సూచించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎపి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, ప్రకాశం బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ రఘుకిరణ్, సిహెచ్ నాగేశ్వరరావు, ఎ విజయకుమార్, కరణం వెంకన్నబాబు, పి రవిచంద్రారెడ్డి, డి రమేష్‌బాబు, చిరంజీవి, షేక్ హుమాయూన్ కబీర్ తదితరులు పాల్గొన్నారు.