శ్రీకాకుళం, జూలై 14: మున్సిపల్ కమిషనర్ రామలింగేశ్వర్‌కు ఎన్నికల కోడ్ పట్టనట్టుంది. మున్సిపాల్టీకి కమిషనర్ వచ్చిన నాటి నుండి ఆయనకు ఏ విషయంపైనా నిబంధనలు తెలియనట్లుంది. ఇటీవల బార్ లైసెన్సులు మంజూరులో మున్సిపాల్టీ ఇవ్వాల్సిన ఎన్‌వోసీ ధృవీకరణ పత్రాల్లో సైతం నిబంధనలేవీ తనకు తెలియవని పేర్కొనడం పలు విమర్శలకు తావివ్వగా, నేడు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ప్రకటనలు చేయడం వివాదస్పదమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నిబంధనల మేరకు కోడ్ అమలులో ఉండగా ఓటర్లను ప్రభావితం చేసే ఎటువంటి ప్రకటనలు చేయరాదన్నది ముఖ్య నిబంధన. అందులోనూ ప్రభుత్వ అధికారులు ఈ విషయంలో పూర్తి నిబద్ధతతో ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఆదివారం వనిత టీవీలో ప్రతి పది ఐదు నిముషాలకు ఒక పర్యాయం శ్రీకాకుళం పట్టణ పురప్రజలకు విజ్ఞప్తి పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు. పట్టణ పరిధిలోని స్లమ్ ప్రాంతాల్లో నివశిస్తున్న నిరుపేద తెల్లరేషన్ కార్డుదారులకు 3లాస్ట్ మైల్ కనెక్టివిటీ2 కింద రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం రెండు వందల రూపాయలకే మంచినీటి కుళాయి కనెక్షను ఇస్తామని, ఈ కుళాయి ఏర్పాటుకు అయ్యే రెండు వేల రూపాయల సామాగ్రి కూలి ఖర్చు మున్సిపాల్టీయే భరిస్తుందని అందులో వెల్లడించారు. శ్రీకాకుళం మున్సిపాల్టీలో శివారు కాలనీలైన కాజీపేట, చాపురం, పాతృనివలస, కిల్లిపాలెం, కుశాలపురం, తోటపాలెం, పెద్దపాడు వంటి పంచాయతీలు పట్టణ పరిసరాలకు ఆనుకునే ఉన్నాయి. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకునే నేపథ్యంలో ఇటువంటి ప్రభుత్వ ప్రకటనలు చేయడంతో అక్కడ ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఉంది. ఇటువంటి ప్రకటనలు ముమ్మాటికీ కోడ్ ఉల్లంఘనే అంటూ జిల్లా ఎన్నికల అధికారులు సుస్పష్టం చేస్తున్నారు. ఈ తరుణంలో శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్‌పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు విపక్షాలు 3ఆంధ్రభూమి2కి తెలిపాయి.
కోడ్‌పై కమిషనర్‌కు సూచనలు అందిస్తాం
కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సౌరభ్‌గౌర్
ఇప్పటికే ఆచరణలో ఉన్న ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో కోడ్ ఉల్లంఘన చేసినట్లు కానప్పటికీ, జిల్లా అంతటా ఎన్నికల కోడ్ వర్తించడంతో ప్రభుత్వ పథకాలు ప్రచారం ఎన్నికల షెడ్యూల్ వరకూ నిలుపుదల చేయాల్సి ఉందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి సౌరభ్‌గౌర్ చెప్పారు. మున్సిపల్ కమిషనర్‌కు ఈ అంశంపై తగిన సూచనలు ఇస్తామని 3ఆంధ్రభూమి2కి వివరించారు.
* ఎన్నికల కోడ్ జిల్లా వ్యాప్తంగా ఉంది - డిపివో
రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిననాటి నుండి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉందని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఎటువంటి ప్రభావిత ప్రచారం చేయరాదని, మున్సిపాల్టీ ప్రచారంపై ఉన్నతాధికారులను అడిగి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
కోడ్ ఉల్లంఘన కాదు
పట్టణ ప్రజలకు అత్యవసరమైన వౌలిక వసతులపై సమాచారం అందించడం కోడ్ ఉల్లంఘన కాదని మున్సిపల్ కమిషనర్ రామలింగేశ్వర్ చెప్పారు. కొత్తగా ప్రభుత్వం రూపొందించిన పథకం కాదని, ఆచరణలో ఉన్న ప్రభుత్వ పథకాలను అర్హులకు తెలియజేసే ప్రకటనలు కోడ్‌కు విరుద్ధంగా చేసేవి కాదంటూ ఆయన పేర్కొన్నారు.
లక్ష్మిపేటపై నిఘా!
శ్రీకాకుళం, జూలై 14: జిల్లాలో 546 గ్రామాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. కాని - ఏడేళ్ల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గుర్తించిన 943 గ్రామాలు కంటే ఇప్పుడు మరిన్ని సమస్యాత్మకమైన గ్రామాలుగా మారాయి. అలా మారిన సమస్యాత్మకమైన గ్రామాల్లో 3‘లక్ష్మిపేట’ ఒకటి. జిల్లాలో వంగర మండలంలో మడ్డువలస రిజర్వాయర్ దిగువభూభాగంలో గల లక్ష్మీపేట పంచాయతీలో బిసీలు, ఎస్సీల మధ్య రేగిన రగడ ఐదుగురు ప్రాణాలను బలితీసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పంచాయతీ పోరు వచ్చింది. అసలే సామాజిక పోరుతో అతలాకుతలమైన లక్ష్మిపేట గ్రామంపై మరల రాజకీయ రగడ ఏ పరిణామాలకు దారితీస్తోందోనన్న భయం అక్కడ గ్రామస్థుల వెన్నులో వణుకుపుట్టిస్తోంది. ఈ సామాజివర్గాల మధ్య ప్రస్తుతం పగలు, ప్రతీకారాలు లోలోపలే అణచివేసుకుంటున్నా....రాజకీయంగా బలం సాధించాలన్న తపన మాత్రం రెండు వర్గాల మధ్య ఉంది. దీంతో లక్ష్మిపేటలో మరోసారి అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉండవచ్చునంటూ జిల్లా పోలీసు యంత్రాంగం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదించింది. అలాగే, రెండో విడతలో ఈ నెల 27న లక్ష్మీపేటలో నిర్వహించాల్సిన పోలింగ్ బూత్‌ను కొట్టిస గ్రామానికి మార్చేందుకు అనుమతులు ఇవ్వాలంటూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సౌరభ్‌గౌర్ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. లక్ష్మీపేట గ్రామంలో 578 ఓటర్లు ఉండగా, అందులో బిసీలు 411 మంది ఓటర్లు కాగా, ఎస్సీ ఓటర్లు 155 మంది. మహిళా జనరల్ కేటగిరీలో రిజర్వ్ అయిన ఈ పంచాయతీలో ఇప్పటికే బిసి వర్గం బలపరిచిన మద్దతుదారులు, అలాగే ఎస్సీ వర్గాలు మద్దతు ఇచ్చిన మద్దతుదారుల మధ్య పోటీ నెలకొంది. ఎన్నికలు నేపథ్యంలో బీసీ, ఎస్సీల మధ్య రాజకీయ వైరం జరిగే ప్రమాదంఉందంటూ ఇంటెలిజెన్స్ నివేదికలు చెప్పకనేచెబుతున్నాయి.
ఇదిలా ఉండగా, పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే లక్ష్మీపేటపై పోలీసు నిఘా పెంచింది. రౌండ్ ది క్లాక్‌లో పికెటింగ్ నిర్వహిస్తున్న జిల్లా పోలీసుశాఖ సరికొత్త విధానంతో వెబ్‌కెమోరాలు కూడా ఆ పంచాయతీలో అమర్చారు. పోలింగ్ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ విధానం ద్వారా చిత్రీకరించే పద్దతిని 2009 సార్వత్రిక ఎన్నికల నుంచి ఎన్నికల కమిషన్ తీసుకువచ్చింది. ఆ విధానానే్న తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో కూడా అమలు చేసేందుకు జిల్లా అంతటా నాలుగు వందల మంది ఇంజనీరింగ్ విద్యార్ధులతో మూడు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై నిఘా పెంచేలా వెబ్‌కళ్లు అమలు చేస్తున్నారు. అంతకుముందే లక్ష్మీపేట గ్రామంలో ఇటువంటి వెబ్ నిఘాను గత కొద్దిరోజులుగా పోలీసుశాఖ అమర్చింది. దీంతో గ్రామంపై కెమెరా కన్ను రాత్రింబవళ్లు పనిచేస్తోంది!!
నామినేషన్ల పరిశీలనలో జాప్యం
శ్రీకాకుళం, జూలై 14: జిల్లాలో పంచాయతీ ఎన్నికల బరిలో దిగిన సర్పంచ్‌లు, వార్డుమెంబర్లు నామినేషన్ ఘట్టం ముగిసింది. కాగా, ఆయా మండలాల వారీగా వచ్చిన నామినేషన్ దరఖాస్తులు పరిశీలించిన అనంతరం సంబంధిత సమాచారాన్ని జిల్లా కేంద్రానికి అందించడంలో ఆయా ఇన్‌చార్జిలు సమయపాలన పాటించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా జిల్లాలో మొత్తం ఏకగ్రీవ పంచాయతీలు ఖరారులో సైతం అధికారులు అర్ధరాత్రైనా సమాచారంలో స్పష్టత లేకపోవడం గమనార్హం. ఆదివారం అర్ధరాత్రి వరకు అందిన సమాచారాన్ని ఆంధ్రభూమి2కి జిల్లా పంచాయతీ అధికారులు వివరించారు.
నామినేషన్ల గడువు ముగిసేసరికి జిల్లాలో సర్పంచ్ పదవులకు గాను 5,458 ల , వార్డుమెంబర్లకు గాను 22,947 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఆదివారం జరిగిన నామినేషన్ల పరిశీలన అనంతరం 27,356 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో సర్పంచ్ పదవులకు 5,198, వార్డు మెంబర్లకు 22,158 నామి నేషన్లు సరిగా ఉన్నట్లు గుర్తించారు. టెక్కలి డివిజన్‌కు సంబంధించి పలాస మండంలోని కొన్ని పంచాయతీలో అక్కడ నెలకొన్న వివాదాలుకారణంగా నామినేషన్ల పరిశీలన అధికారులు నేటికి వాయిదా వేశారు. ఇది మినహా అదే డివిజన్‌లోని పది మండలాలు, శ్రీకాకుళం డివిజన్‌కు సంబంధించి తొమ్మిది మండలాలు, అలాగే పాలకొండ డివిజన్‌లో తొమ్మిది మండలాల సర్పంచ్‌లు, వార్డుమెంబర్ల నామినేషన్లను అధికారులు పూర్తి చేశారు. శ్రీకాకుళం డివిజన్‌లో 1263 సర్పంచ్ నామినేషన్లు, వార్డుమెంబర్లకు 5,939 నామినేషన్లను అధికారులు పరిశీలించి ఖరారు చేశారు. అదేవిధంగా పాలకొండ డివిజన్‌కు సంబంధించి సర్పంచ్ పదవులకు 1,194, వార్డుమెంబర్లకు 5,448 నామినేషన్లు ఖరారయ్యాయి. టెక్కలి డివిజన్‌కు సంబంధించి సర్పంచ్‌లకు 1523, వార్డుమెంబర్లకు 5,429 నామినేషన్లను అధికారులు పరిశీలన జరిపి ఎంపికచేసారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఏకగ్రీవ పంచాయతీలకు సైతం అధికారులు అర్ధరాత్రైనా స్పష్టతకు రాలేదు. సోమవారం నాటికి సర్పంచ్‌లు, వార్డుమెంబర్లు సమాచారాన్ని పూర్తిస్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకుంటామని డిపివో వెంకటేశ్వరరావు తెలిపారు.
ఆగని గజరాజుల విధ్వంసం
సీతంపేట,జూలై 14:సీతంపేట ఏజెన్సీలో ఏనుగుల బీభత్సం కొనసాగుతోంది. గడచిన నెల రోజులుగా పులిపుట్టి పంచాయతీ పరిధిలో ఉన్న సుందరయ్యగూడ,పులిపుట్టి గ్రామాల సమీపంలోగిరిజనులకు చెందిన పంటలను నాశనం చేసిన ఏనుగులు, ఆదివారం వేకువజాము ప్రాంతంలో సుందరయ్యగూడ గ్రామ సమీపంలో సంచరించి ఓ గిరిజనుడి ఇంటిని నేలమట్టం చేసాయి. గ్రామానికి చెందిన ఊయక భాస్కరరావు తన పంట పొలం సమీపంలో ఓ ఇంటిని నిర్మించుకుని అక్కడే నివాసం ఉంటున్నాడు. అయితే శనివారం కొత్తూరు వెళ్లిన భాస్కరరావు రాత్రి కావడంతో ఏనుగుల భయానికి అక్కడే ఉండిపోయాడు. ఆదివారం ఉదయం తాను నివాసముంటున్న పూరిగుడెసె నేలమట్టమై కనిపించింది. ఇంటిలో భాస్కరరావు కుటుంబసభ్యులకు చెందిన దుస్తులు, కుర్చీలు, మంచం, తదితర సామాగ్రిని ఏనుగులు నాశనం చేసాయి.అలాగే ఇంటి ప్రక్కనే ఉన్న కొబ్బరి,పనస,జీడి చెట్లను విరిచి బీభత్సం సృష్టించాయి. ఏనుగులు ఇంత వరకు తమ గ్రామం చుట్టు తిరుగుతున్నాయని తెలిసినప్పటికి భయంతో బిక్కు బిక్కుమంటూ పంటలకు రక్షణగా ఇక్కడే ఉంటున్నామని, ఇప్పుడు ఇల్లు, పంట నాశనంతో నిరాశ్రయులయ్యామని భాస్కరరావు ఆవేదన వ్యక్తం చేసాడు.
ఆగని పంటల ధ్వంసం: ఏనుగులు ప్రతీ రోజు పంటల ధ్వంసం చేస్తున్నాయి.శుక్రవారం తుమ్మనకోలని గ్రామంలో సవరసురేష్‌కు చెందిన ఎకరా వరిపంటను నాశనం చేసాయి.అలాగే ఇటీవల కాలంలో చెరుకు, పనస, అరటి తోటలను నాశనం చేశాయి. ఏనుగుల నుండి తమకు ప్రాణ,పంటల నష్టం ఉందని,ప్రభుత్వం స్పందించి వీటిని ఈ ప్రాంతం నుండి తరలించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.
గిరిజనులను వెంటాడుతున్న భయం
చీకటి పడితే చాలు సుందరయ్యగూడ,పులిపుట్టి గ్రామాలకు చెందిన గిరిజనులు ఏనుగుల భయంతో వణికిపోతున్నారు. పగలంతా టేకుప్లాంటేషన్‌లో సేదతీరుతున్న ఏనుగుల గుంపు చీకటి పడగానే గ్రామ సమీపంలో తిరుగాడుతుండడంతో గిరిజనులు రాత్రి సమయాల్లో ఇంటి నుండి బయటికి కదలలేని పరిస్థితి నెలకొంది. ఏనుగుల సంచారంతో రాత్రులు కంటిమీద కునుకు లేదని సుందరయ్యగూడ గ్రామానికి చెందిన లలిత, ప్రసాద్,్ధర్మారావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూడు పంచాయతీలు, 98 వార్డులు ఏకగ్రీవం
నరసన్నపేట, జూలై 14: జరుగనున్న స్థానిక ఎన్నికల్లో భాగంగా 13వ తేదీతో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ముగిసిందని మండల ఎన్నికల అధికారి ఎం.పోలినాయుడు అన్నారు. ఆదివారం ఆయన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ మండలంలో మూడు పంచాయతీలకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే వచ్చిందని, అలాగే 312 వార్డులకు గాను 98 వార్డులకు ఒక్కొక్క నామినేషన్ దాఖలైందన్నారు. ఈ దిశగా వీటిని ఏకగ్రీవంగా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మండలంలో పది నామినేషన్ కేంద్రాలలో నామినేషన్ పరిశీలనను పూర్తిచేశామన్నారు. ఎటువంటి నామినేషన్లు తిరస్కరణకు గురికాలేదని స్పష్టంచేశారు. 17వ తేదీ సాయంత్రంలోగా నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. మండలంలో 337 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
కొండ చిలువ హతం
వీరఘట్టం, జూలై 14: మండలం చిదిమి పంచాయతీ పరిధి యు. వెంకమ్మపేట గ్రామానికి చెందిన బొత్స అప్పలనాయుడుకు చెరకు పొలంలో కూలీలకు ఎదురైన కొండ చిలువను ఆదివారం ఉదయం హతమార్చారు. ఉదయం 11 గంటల సమయంలో పొలంలోని చెరకుకు జెడలు కడుతుండగా గట్టుపై నుండి వస్తున్న కొండ చిలువ పామును ప్రమాదం పొంచి ఉండడంతో దానిని చంపివేశారు. ఈ కొండ చిలువ సుమారు పది అడుగుల పొడవు ఉంటుందని కూలీలు అంచనావేశారు.
భారీ వర్షం..రైతుల్లో హర్షం
జలుమూరు, జూలై 14: మండలం పలు గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం ఆకస్మికంగా అకాల వర్షం కురియడంతో రైతులు హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యంగా ఆకుమళ్లకు, వరి ఎదలకు ఈ వర్షం ఎంతో ఊరటనిచ్చిందని పలువురు పేర్కొంటున్నారు. గత వారంరోజులుగా ఉక్కపోతతో ఉన్న ఈ ప్రాంతం ఒక్కసారిగా వర్షం పడడంతో ప్రజలకు ఊరటనిచ్చింది. ఎండిన చెరువుల్లో మూగజీవాల దాహార్తి కోసం నీరు చేరింది.
సర్పంచ్‌గా అంగన్‌వాడీ కార్యకర్త
వీరఘట్టం, జూలై 14: మండలంలోని కుమ్మరిగుంట గ్రామంలో అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న గుడివాడ నర్సమ్మను ఆ పంచాయతీ ప్రజలు ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకొన్నారు. ఈ పంచాయతీ సర్పంచ్ పదవిని ఎస్సీ మహిళలకు రిజర్వ్ చేయడంతో ఆమెకు ప్రజలంతా బాసటగా నిలిచి ఐకమత్యంగా ఎ న్నుకొన్నారు. అదేవిధంగా వార్డు సభ్యులుగా బొద్దూరు పాపమ్మ, హనుమంతు రామినాయుడు, కనకల సూరమ్మ, అప్పలనాయుడు, బుగత చిన్నయ్య, ధర్మాన ఆదిలక్ష్మి, ఎచ్చెర్ల లక్ష్మి, ఓని గౌరీశ్వరిలను వార్డు సభ్యులుగా ఎన్నుకొన్నారు. అయితే వీరంతా ఒక్కొక్క నామినేషనే దాఖలు చేయడంతో ఏకగ్రీవమయ్యింది. అయితే అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఎన్నికల నిబంధనలను పాటించాలి
రణస్థలం, జూలై 14: ఎన్నికల నియమనిబంధనలను ప్రతీ ఒక్కరూ తూ.చ తప్పకుండా పాటించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు మహ్మద్ అబ్దుల్ అన్నారు. ఆదివారం రణస్థలం హైస్కూల్‌లో నామినేషన్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. నామినేషన్ దాఖలు ఎలా చేశారు, సర్పంచ్, వార్డుమెంబర్లకు నామినేషన్ లెక్కింపును ఏవిధంగా చేస్తున్నారు తదితర అంశాలపై అధికారులకు అడిగి తెలుసుకున్నారు. ఈయనతోపాటు మండల ఎన్నికల అధికారి వాసుదేవరావు ఉన్నారు.
సుప్రీం తీర్పుపై స్పష్టత అవసరం
* సిటిజన్ ఫోరం చర్చాగోష్ఠిలో వక్తలు
శ్రీకాకుళం, జూలై 14: వివిధ కారణాలతో జైల్లో ఉన్న పౌరునికి ఓటుహక్కు లేని నేపథ్యంలో చట్టసభలకు జరిగే ఎన్నికలకు పోటీల్లో నిలిచే అర్హత లేదంటూ సుప్రీంకోర్టు ఇటీవలి వెలిబుచ్చిన తీర్పు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ మేరకు బరాటం కామేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం అత్యున్నత న్యాయస్థానం వ్యక్తపరిచిన తీర్పును వక్తలు స్వాగతించారు. తీర్పు-నేరచరితులు, రాజకీయం, స్వపరిపాలన ప్రధానాంశంగా చర్చలో వినియోగదారుల ఫోరం చైర్మన్ పప్పల జగన్నాథం మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలు పటిష్ఠతకు మరింతగా ఊతమిస్తుందన్నారు. మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, గుండ అప్పలసూర్యనారాయణలు మాట్లాడుతూ దేశ భవితకు నష్టం వాటిల్లే రౌడీయిజం, కుట్రపూరిత రాజకీయాలకు అడ్డుకట్ట వేసే ధర్మశాసనం తీర్పు హర్షణీయమన్నారు. అయితే వెలువడిన తీర్పు స్పష్టతగా ఉంటే మరింత ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. లోక్‌సత్తా జిల్లా అధ్యక్షులు కె.పోలినాయుడు స్పందిస్తూ సి.బి.ఐ వంటి అవినీతి నిరోధక సంస్థలకు స్వయం ప్రతిపత్తిని కల్పించాలంటూ ధర్మాసనం సూచన దేశప్రగతికి ఉపకరిస్తుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని ధనుంజయ్, గొలివి నర్సునాయుడులు మాట్లాడుతూ కోర్టు తీర్పు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఓటు వినియోగించుకోవడంలో ఓటర్లకు గ్రామాలలో స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. లోక్‌సత్తా రాష్ట్ర కార్యదర్శి డి.విష్ణుమూర్తి వాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేదికలో శ్రీనివాసానందస్వామి, బిజెపి నాయకులు పైడి సత్యం, దేశం పార్టీ నాయకులు ఎస్.వి.రమణమాదిగ, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
పట్టణాల్లో పచ్చదనానికి కృషి
* జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్
శ్రీకాకుళం , జూలై 14: పట్టణాల్లో పచ్చదనం పెంచడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సౌరబ్‌గౌర్ పిలుపునిచ్చారు. స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించిన వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కొంత మేర పచ్చదనం కనిపిస్తున్నప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం కానరావడం లేదన్నారు. పట్టణ ప్రాంతాల్లో కాలనీలు, రహదారులు వంటి ప్రదేశాల్లో మొక్కలను విస్తృతంగా నాటి చక్కటి ఆహ్లాదకర వాతావరణం కల్పించడానికి దోహద పడాలని సూచించారు. అదేవిదంగా బహిరంగ మలవిసర్జన నిరోధించుటకు తోడ్పడాలని అన్నారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమానికి సహకరిస్తామని తెలిపారు. బి. ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి లజపతిరాయ్ మాట్లాడుతూ వాకర్స్ క్లబ్ చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో వాకర్స్ పాత్‌ను నిర్మించాలనే ఆలోచన ఉందని, తద్వారా ఆ ప్రాంతాల్లో బహిరంగ మల విసర్జన సమస్య నిరోధించే అవకాశం కలుగుతుందని అన్నారు. ముందుగా తాను చదివిన కళాశాల కావడంతో పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణ కలియతిరిగారు. కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ కోశాధికారి కె.వి.రమణమూర్తి, సంయుక్త కార్యదర్శి ఉపేంద్ర, కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ డి.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
అరసవల్లికి భక్తుల తాకిడి
శ్రీకాకుళం, జూలై 14: ఆరోగ్యప్రదాత, ప్రత్యక్షదైవం అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించింది. గత వారం అమావాస్య కారణంగా కాస్తంత తగ్గినా ఈ వారం భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. కేశఖండనల శాలల వద్ద తలనీలాలు అర్పించి ఇంద్రపుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసి స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. కొందరు మహిళలు దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న గోశాలలో గోమాతలకు, త్రిమూర్తి స్వరూపమైన రావిచెట్టు చుట్టూ ప్రదక్షణలు చేసి దీపారాధన చేసారు. అనంతరం క్యూలైన్లలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆలయ విధానాలనుసరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్యన్నదాన ప్రసాదం 450 మంది భక్తులు స్వీకరించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
సోంపేట ఉద్యమం దేశానికి దిక్సూచి
సోంపేట, జూలై 14: థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకిస్తూ సోంపేటలో ప్రజలు చేస్తున్న ఉద్యమాలు దేశానికి దిక్సూచిగా నిలుస్తాయని మానవహక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. ఎస్.కృష్ణ అన్నారు. జూలై 14వ తేదిన జరిగిన సంఘటనను నిరసిస్తూ ఆదివారం సోంపేటలో పర్యావరణ పరిరక్షణ సంఘం, తీరప్రాంత మత్స్యకార వేదికల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరిగాయి. డాక్టర్ కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో మానవహక్కుల వేదిక ప్రతినిధి కృష్ణ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడడంలో ఈ ప్రాంతీయులు చేస్తున్న ఉద్యమాలు గొప్పవని కొనియాడారు. సోంపేట ఉద్యమాన్ని నేడు దేశంలో అన్ని ప్రాంతాలు స్పూర్తిగా తీసుకొని ఉద్యమాలు చేస్తున్నారని, ఆ ఘనత సోంపేట ప్రజలకే దక్కుతుందన్నారు. అంతకుముందు థర్మల్ శిబిరం వద్ద నుంచి ర్యాలీగా వెళ్లిన ఉద్యమకారులు బీలలో నిర్మించిన అమరవీరుల స్థూపం వద్ద అమరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఊరేగింపుగా వెళ్లిన వీరు గొల్లగండిలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలను పోలీసులు అడ్డుతగిలేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైనాయి. ఎటువంటి అనుమతులు లేకుండా సమావేశాలు నిర్వహించకూడదని బారువ ఎస్ ఐ గోవిందరావు ఆధ్వర్యంలో తన సిబ్బందితో బీల వద్దకు వెళ్లారు. పోలీసులకు, ఉద్యమకారులకు మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. అప్పటికే వందలాది సంఖ్యలో హాజరైన మహిళలు, ఉద్యమకారులను ఎన్నికల కోడ్ అడ్డుగా ఉండడం వల్ల సమావేశాలు జరుపుకోవచ్చునని పోలీసులు సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మానవహక్కుల జిల్లా ప్రతినిధి జగన్నాధరావు, సి పి ఎం ( ఎం ఎల్) ప్రసాదరావు, ఐక్యవేదిక ప్రతినిధులు కృష్ణారావు, రాజారావు, చంద్రమోహన్‌లు, పలు గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. అనంతరం సోంపేట పట్టణం తెలుగుదేశం పార్టీ నాయకులు ఈశ్వరరావు, ఆనందరావు, చిత్రాడ శ్రీను, శేఖర్‌ల ఆధ్వర్యంలో 50 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అమరులస్థూపం వద్దకు ఘనంగా నివాళులర్పించారు.