Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కలహండికి తరలిపోయిన కోచ్ ఫ్యాక్టరీ

$
0
0

విశాఖపట్నం, జూలై 14: ప్రతిసారి ఒడిషా పెత్తనమే. ప్రతి దానిలోను ఆదిపత్యపోరే. ఏ విషయంలోను ఒడిషా వెనక్కి తగ్గడంలేదు. ఇక్కడి ప్రజాప్రతినిధులు ఒక్క అడుగు ముందుకు వేయడంలేదు. ఇదే ఒడిషాకు కొండంత బలం. తాజాగా మరో భారీ ప్రాజెక్టును ఎత్తుకుపోయి ఒడిషా అక్కడి నిరుద్యోగ యువతకు భారీగా ఉపాధి అవకాశాలను కల్పించుకోబోతోంది. విశాఖపట్నం దువ్వాడ సమీపాన దాదాపు 150 ఎకరాల స్థలంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నట్టు విస్తృత ప్రచారం జరిగింది. ఇది నిజమే అనుకున్న ఉత్తరాంధ్రవాసులకు రైల్వేబడ్జెట్ తరువాత దీనిని ఒడిషాకు తరలించారనే విషయం తెలిసింది. దీంతో అయోమయంలో పడాల్సి వచ్చింది. రూ. 200 కోట్ల విలువైన కోచ్ ఫ్యాక్టరీని కూడా ఒడిషా తన్నుకుపోయిందంటే, అదీ విశాఖకు వచ్చే అన్నింటితోపాటు దీనిని సాధించుకోగలిగిరంటే ఇదంతా అక్కడి ప్రజాప్రతినిధుల ఘనతే. అయినా ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు ఎలాగూ రోడ్డెక్కడంలేదు. ఆందోళనలు, నిరసనల జోలికి అసలుపోరు. కనీసం ఇటువంటి వాటిని అడ్డుకునే ప్రయత్నాలు చేయడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చినా తామంటే ఉంటామంటూ స్వచ్చంధ సంస్థలు, ప్రజా సంఘాలు కొనే్నళ్ళుగా గగ్గోలు చేస్తున్నాయి. అయినా ఫలితంలేకపోతోంది. ఒక దాని వెంట మరోకటిగా కోట్ల విలువైన ప్రాజెక్టులు తరలిపోతుండగా ప్రజాప్రతినిధులు ప్రేక్షకపాత్ర వహిస్తుండటంపట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. అయిదేళ్ళ కిందట ఇక్కడ ఉండే చీఫ్ ఇంజనీరింగ్ కార్యాలయం భువనేశ్శర్‌కు వెళ్ళిపోయింది. దీనికి కారణాలేమీ లేవు. ఎటువంటి వౌలిక వసతులు లేకపోయినా, అనువైన ప్రదేశం సమకూర్చకపోయినా వెళ్ళిపోయిన ఈ కార్యాలయం వలన వాల్తేరు డివిజన్ కోట్లాది రూపాయల విలువైన భారీ ప్రాజెక్టులను తెచ్చుకోలేకపోతోంది.
ప్రధానమైన రైళ్ళు
ఇప్పటికే ప్రధానమైన ప్రశాంతి, విశాఖ ఎక్స్‌ప్రెస్, ఇంటర్‌సిటీలు భువనేశ్వర్‌కు వెళ్ళిపోయాయి. వీటి వలన ఇక్కడి ప్రయాణికులు రిజర్వేషన్ ఫలాలు కోల్పోవల్సి వస్తోంది. రైళ్ళ శుభ్రత కొరవడింది. విశాఖ-యశ్వంత్‌పూర్ మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను అయిదేళ్ళ కింటద భువనేశ్వర్‌కు పొడిగించుకున్నారు. అంతకంటే ముందుగా విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను ఎత్తుకుపోయారు. ఇది విశాఖ నుంచి సికింద్రాబాద్ వరకు నడిచేటపుడు పరిశుభ్రంగా ఉండేది. సామాన్య ప్రయాణికులకు సైతం రిజర్వేషన్లు లభించేవి. ఇపుడు స్లిపర్ క్లాస్‌లతోపాటు ఏసి బెర్తులకు అతీగతీ ఉండటంలేదు. ఏమాత్రం ఆదాయం రాని భువనేశ్వర్ నుంచి నిర్వహిస్తున్న వీటి వలన అనేక మంది ప్రయాణికులు నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు.
మళ్ళింపు రైళ్ళు అంతే
చివరకు విశాఖపట్నం రైల్వేస్టేషన్ మీదుగా నడపాల్సిన వీక్లీ సూపర్‌పాస్ట్ రైళ్ళు కాస్త దువ్వాడ స్టేషన్ మీదుగా భువనేశ్వర్‌కు వెళ్ళిపోతున్నాయి. దీనివల్ల రోజూ దేశ నలుమూలలకు వెళ్ళాల్సిన వందలాది మంది ప్రయాణికులు 20 కిలోమీటర్ల దూరానున్న దువ్వాడకు వ్యయప్రయాసలపడి వెళ్ళాల్సి వస్తోంది. కేవలం ఆరేళ్ళ కిందట రెండింటితో మొదలైన మళ్ళింపు రైళ్ళు 13కు చేరుకున్నాయి. ఇవన్నీ దువ్వాడ మీదుగానే నడుస్తుండగా ప్రజాసంఘాల ఉద్యమాలతో స్పందించిన రైల్వే ఎట్టకేలకు ఇక్కడకు ఆరింటిని నడుపుతోంది. ఇదే స్ఫూర్తితో ఆందోళనలు నిర్వహిస్తే కొంత ఫలితం ఉండేదని ప్రయాణికులు అంటున్నారు.

ఏడాదికో కొత్త వైద్య కళాశాల ఏర్పాటు
బుచ్చెయ్యపేట, జూలై 14: వైద్య విద్యకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఏడాదికో జిల్లాలో కొత్తగా మెడికల్ కాలేజీని ఏర్పాటుచేయాలని నిర్ణయించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కొండ్రు మురళి అన్నారు. బుచ్చెయ్యపేటలో ఆదివారం దళిత సంఘాల అధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది నిజామాబాద్ జిల్లాలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. వచ్చే ఏడా ది నెల్లూరు, కరీంనగర్ జిల్లాల్లో కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామీణ ప్రజలకు మ రింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు మనరాష్ట్రంలో మరో 130 ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. గత ఏడాది దీర్ఘకాలిక రోగాల నివారణకు 1400 కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయిస్తే, ఈ ఏడాది 1600 కోట్లకు పెంచామన్నారు. ప్రజారోగ్యంపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని మంత్రి కొండ్రు మురళి తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో డయేరియా, అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు.
సమైక్యంగా ఉంచడమే రాష్ట్రానికి శ్రేయస్కరం
సమైక్యంగా ఉంచటమే రాష్ట్రానికి శ్రేయస్కరమని మంత్రి కొండ్రు మురళి అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే అన్ని విధాలా నష్టపోతామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విభజన వలన ఎన్నో నష్టాలుఉన్నాయని, భాషా ప్రాతిపదికన ఏర్పడిన మనరాష్ట్రాన్ని అదే విధంగా కొనసాగించడం వలన రాష్ట్రంలోని అన్ని ప్రాం తాల ప్రజలకు మేలు చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రా న్ని విభజిస్తే మాత్రం అన్ని ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోక అలమటిస్తాయన్నా రు. అయితే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక పాకేజీలు ప్రకటించాలని మంత్రి మురళీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

మావోయిస్టుల కోసం జల్లెడ
కొయ్యూరు, జూలై 14: విశాఖ మన్యం కొయ్యూరు మండల పరిధి కిండంగి గ్రామ సమీప అటవీ ప్రాంతంలో శనివారం సాయంత్రం పోలీసులు-మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో మృతి చెందిన మహిళా మావోయిస్టును పోలీసులు గుర్తించారు. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన రామభక్త అలియాస్ లక్ష్మిగా నిర్ధారించారు. ఈమె గతంలో బలిమెల బ్లాక్ కమిటీ అసిస్టెంట్ కమాండర్‌గా పనిచేసి ఇటీవలనే గాలికొండ ప్రాంతానికి బదిలీ అయినట్లు తెలుస్తోంది. రామభక్త మృతి చెందిన విషయాన్ని పోలీసు అధికారులు నిర్ధారించారు. బూదరాళ్ళ శివారు మారుమూల కిండంగి గ్రామ సమీప వణుకుల కొండ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ అక్కడి పరిస్థితులను బట్టి వాస్తవమేనని అర్ధమవుతుంది. ఈ ఘటనలో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందిన సంగతి తెలిసిందే. మూకుడుపల్లి నుండి కిండంగి అటవీ ప్రాంతం మీదుగా వస్తున్న కూంబింగ్ పోలీసులకు మావోయిస్టులు తారస పడడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం 3 గంటల సమయంలో వణుకుల కొండ అటవీ ప్రాంతం నుండి సుమారు అరగం ట పాటు తుపాకీ పేలుడు శబ్ధాలు వినిపించినట్లు పరిసర ప్రాంత వాసులు చెబుతున్నారు. మృతి చెందిన మహిళా మావోయిస్టు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఆదివారం ఉదయం గూడెం మండలం నేరెళ్ళబందకు తీసుకువచ్చారు. అనంతరం చింతపల్లికి తరలించారు.
భారీ బందోబస్తుతో మృతదేహం తరలింపు
పోలీసులకు-మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో మృతి చెందిన మహిళ మావోయిస్టు మృతదేహాన్ని భారీ బలగాల నడుమ చింతపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్ధలం నుండి మావోయిస్టు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రత్యేక పోలీసు బలగాలు ఆదివారం ఉదయం అటవీ ప్రాంతం మీదుగా నేరేళ్ళబందకు తరలించారు. కాల్పుల శబ్ధం తప్పితే ఏం జరిగిందో తెలియదని సమీప వాసులు చెబుతున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో మరిన్ని అదనపు బలగాలు మావోయిస్టుల ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశాయి. మృతదేహాన్ని మోసుకొస్తున్న పోలీసు పార్టీకి మరిన్ని బలగాలు ఆ ప్రాంతంలో రక్షణ కల్పిస్తూ మాటువేశాయి. మావోయిస్టులు ఆత్మరక్షణతో ఎదురుకాల్పులు జరుపుతూ చల్లాచెదురైనట్లు భావిస్తున్న పోలీసులు వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ఉద్ధృతం చేశాయి. దీంతో మన్యంలో మళ్ళీ భయాందోళనలు నెలకొన్నాయి.

ఎన్నికల అధికారి తీరుపై
అడ్డూరు ప్రజల ఆగ్రహం
చోడవరం, జూలై 14: నామినేషన్ పత్రాలతోపాటు అఫిడవిట్‌ను నామినేషన్ల పరిశీలన రోజున స్వీకరించడంతో ఘర్షణలు, వాదోపవాదాలతో నర్సాపు రం పంచాయతీ కార్యాలయం దద్దరిల్లింది. ప్రధానంగా నర్సాపురం నామినేషన్‌ల స్వీకరణ కేంద్రంలో పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేశవరావు వ్యవహారం పట్ల అడ్డూరు గ్రామస్థులు అభ్యంతరం తెలియజేస్తూ నామినేషన్ల పరిశీలనను అడ్డుకున్నారు. దీంతో మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు నామినేషన్ల పరిశీలనకు అంతరాయం కలిగింది. ఎట్టకేలకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. నామినేషన్ల స్వీకరణకు చివరి రోజైన శనివారం అడ్డూరుకి చెందిన దేశం పార్టీ మద్దతు అభ్యర్థి దాసరి అప్పలనాయుడు నామినేషన్ దరఖాస్తుతోపాటు ఆస్తుల వివరాలతో అఫిడవిట్‌లు దాఖలు చేయలేదు. ఆదివారం నామినేషన్‌ల పరిశీలన రోజున అఫిడవిట్, ఆస్తుల వివరాల పత్రాలను అందజేసిన సందర్భంగా అదే గ్రామానికి చెందిన స్వతంత్య్ర అభ్యర్థి నాగిరెడ్డి కృష్ణ అభిమానులు, మద్దతుదారులు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు.
ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కి నామినేషన్ల పరిశీలన రోజున అఫిడవిట్‌లు స్వీకరించడం తగదని వారు ఆందోళన చేపట్టారు. దీనిపై ఎన్నికల అధికారి కేశవరావు స్పందిస్తూ తా ను ఎటువంటి పత్రాలు తీసుకోలేదని చెప్పినప్పటికీ గ్రామానికి చెందిన నాగిరెడ్డి సత్యనారాయణ, సిమ్మునాయుడుతోపాటు మరికొందరు తమకు తగిన వివరాలను చెప్పకుంటే విధులను నిర్వహించనివ్వబోమంటూ అడ్డుకున్నారు. ఈ సందర్భంలో ఎన్నికల అధికారులకు, గ్రామస్థులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో నర్సాపురం పంచాయతీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్ల పరిశీలన మధ్యాహ్నం రెండున్నర గంటలైనప్పటికీ ప్రారంభించలేదు. దీంతో నర్సాపురం, అడ్డూరు ఇతర గ్రామాల అభ్యర్థులు ఎన్నికల అధికారిని నామినేషన్ల పరిశీలన చేపట్టాలని, లేనిపక్షంలో ఉన్నతాధికారులకు పరిస్థితిని తెలియజేయాల్సి వస్తుందని చెప్పారు. దీంతో ఎస్‌ఐ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలతో సంప్రదింపులు జరిపి ఎన్నికల అధికారుల విధులకు అడ్డుతగలడం చట్టరీత్యా నేరమని, తక్షణం ఆందోళన విరమించాలని చె ప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.

గిరిజనులకు మావోల బహిరంగ లేఖ
జి.మాడుగుల, జూలై 14: ప్రజాప్రతినిధులారా మీ క్షేమం కోరుతూ మేము సైతం క్షేమం అంటూ మావోలు ఎన్నికల బహిష్కరణపై సి.పి.ఐ.మావోయిస్ట్ పార్టీ, కోరుకొండ ఏరియా కమిటీ పేరున ఆదివారం లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో ఈనెల పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నట్టు మీకందరికీ తెలుసునని అనుకుంటున్నామని పేర్కొన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికలకు నామినేషన్లు కట్టేందుకు మీరు సిద్ధపడుతున్నట్టు మేము భావిస్తున్నాము. నామినేషన్లు కట్టే గిరిజన నాయకులు ముందుగా మీరు బాక్సైట్‌కు, అవినీతికి వ్యతిరేకంగా నిలుస్తారా? అనుకూలంగా ఉంటారా? అని ప్రశ్నించారు. మీరు ప్రజల పక్షమే అయితే మీమీ పార్టీ సభ్యత్వాలతోసహా రాజీనామా చేసి ప్రజా పోరాటాల వైపు నిలబడాలని పిలుపునిచ్చారు. మీరు ఎన్నికల్లో పాల్గొంటే అవినీతికి, బాక్సైట్‌కు అనుకూలమనే భావన మాకు కలుగుతుంది. అదే జరిగితే మావోయిస్ట్ పార్టీ నుండి తీవ్రమైన చర్యలు తీసుకోవల్సి వస్తుందని వారు హెచ్చరించారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా గిరిజన నాయకులు పంచాయతీ ఎన్నికలకు దూరంగా ఉండాలని పిలుపు ఇస్తున్నట్టు వారు పేర్కొన్నారు.

ఐదు పంచాయతీలు ఏకగ్రీవం
చీడికాడ, జూలై 14: మండలంలో ఐదు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. జైతవరం, మంచాల, బి.సింగవరం, చీడికాడ, విబిపేట పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈ పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డుమెంబర్లకు ఒక్కొక్క నామినేషన్ దాఖలు కావడంతో ఏకగ్రీవమయ్యాయి. జైతవరం సర్పంచ్‌గా కోడూరు బంగారమ్మ, మంచాల సర్పంచ్‌గా కసిరెడ్డి కొండమ్మ, బి.సింగవరం సర్పంచ్‌గా శరగడం సుబ్బలక్ష్మి, చీడికాడ సర్పంచ్‌గా కె. పంపులు, విబి పేట సర్పంచ్‌గా సబ్బవరపు రామునాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పంచాయతీల్లో వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో 23 పంచాయతీలకు 79 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని ఎంపిడిఒ డి.గుణలక్ష్మి తెలిపారు. వీరి ఎన్నిక ను అధికారికంగా ప్రకటించాల్సి ఉందని గుణలక్ష్మి తెలిపారు.

కొత్తూరు సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవం
పాయకరావుపేట, జూలై 14: మండంలంలోని కొత్తూరు పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. సర్పంచ్ పదవికి ఎస్సీ మహిళ రిజర్వ్ అయింది. గ్రామంలో ఎస్సీ కుటుంబం ఒకటే ఉండడం, అందులోనూ ఎస్సీ మహిళ ఒక్కరే ఉండడంతో తుమ్మి నాగాయమ్మ సర్పంచ్ అభ్యర్థ్ధిగా నామినేషను దాఖలు చేశారు. గ్రామంలో ఉన్న 8 వార్డులకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. వార్డు సభ్యులకు నామినేషన్ వేసిన వారిలో కాండ్రేకుల నాగేశ్వరరావు, వల్లూరు సునీత, మేడిశెట్టి వరలక్ష్మి, బుద్దాడ మంగ, బీరం రాజు, గోళ్ల జోగారావు, దాడి నాగలక్ష్మి, కొంకిపూడి యార్తలు నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు. పోటీ లో నిలబడే వ్యక్తులు లేకపోవడంతో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైం ది. వీరి ఏకగ్రీవంపై 17వతేదీన అధికారులు అధికారికంగా ప్రకటిస్తారు.

ఎన్నికలు బహిష్కరిస్తే
బాక్సైట్ తవ్వకాలు నిలిచిపోతాయా?
మావోలతో వాగ్వివాదానికి దిగిన గిరిజనులు
జి.మాడుగుల, జూలై 14: ఎన్నికలు బహిష్కరిస్తే బాక్సైట్ తవ్వకాలు నిలిచిపోతాయా అంటూ మద్దిగరువు గ్రామంలోని పోటీ దారులతో పాటు 100 మంది గిరిజనులు మావోలతో వాగ్వివాదానికి దిగినట్టు సమాచారం. స్థానికుల సమాచారం ప్రకారం ఆదివారం ఉదయం బొయితిలి, నుర్మతి పాఠశాలల నుండి నామినేషన్ పత్రాలను తీసుకువెళుతున్న మావోలను మద్దిగరువులో గిరిజనులు అడ్డుకుని వాగ్వివాదానికి దిగినట్టు తెలిసింది. గిరిజన ప్రాంతంలో అత్యంత మారుమూల ప్రదేశంలో స్థానిక సంస్ధల ఎన్నికలు బహిష్కరించినంత మా త్రాన బాక్సైట్ తవ్వకాలు నిలిచిపోతాయా? అంటూ గిరిజనులు మావోలను నిలదీసినట్టు తెలిసింది. అంతే కాకుండా తమ ప్రాంతంలో జరిగే గొడవలు, మావోయిస్టుల సమస్యలు, ఇతర సమస్యలతో పాటు ప్రభుత్వం కల్పించే కొద్ది పాటి అవకాశాలను స్థానిక నాయకత్వం లేకుండా ఎలా సాధ్యపడుతుందో తెలపాలని సూటిగా ప్రశ్నించినట్టు సమాచారం. తమ ప్రాంతానికి సంబంధించిన పనులను చేసుకునేందుకు స్థానిక నాయకులే తమకు ఆధారమని వారు ప్రాధేయపడినట్టు తెలిసింది. తాము స్థానిక సంస్ధల ఎన్నికలను బహిష్కరించలేమని, తమ అభ్యర్థనను మన్నించాల్సిందిగా మావోలతో చెప్పినట్టు తెలుస్తోంది. ఆదివారం చోటు చేసుకున్న సంఘటనపై తమ ప్రాంత ప్రజలపై పోలీసులు విరుచుకుపడి తమను సమాచారం నిమిత్తం వేధిస్తే తమవైపు నుండి మాట్లాడే నాయకుడే లేకుండా చేయడం అన్యాయమని వారు అన్నట్టు తెలుస్తోంది. గిరిజన ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులను, గెలుపొందిన నాయకులను నిర్ధాక్షిణ్యంగా చంపుకుంటూ పోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించినట్టు సమాచారం. అంతే కాకుండా గిరిజన నాయకులను చంపడం వల్ల గిరిజనుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా గిరిజనులు మావోలను ప్రశ్నించడంతో మావోలు సమాధానాలు దాటవేసినట్టు తెలిసింది. మావోలు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు బూటకమని, ఎన్నికలు బహిష్కరించాల్సిందేనని తెలిపినట్టు సమాచారం. అంతే కాకుండ గిరిజన ప్రాంతంలోని కొద్ది మంది నాయకులు స్వార్ధపరుల పంచన చేరి వారికి తొత్తులుగా మారి స్వార్ధంతో పని చేస్తున్నారని, అటువంటి నాయకులను, గిరిజనులను ఎన్నిసార్లు హెచ్చరించినా తమ ప్రవర్తనను మార్చుకోక పోవడంతోనే వారిని హతమార్చినట్టు మావోలు తమ చర్యలను సమర్ధించుకున్నట్టు సమాచారం.

ఆటోల స్పీడుకు అడ్డుకట్ట వేయరూ!
పెదగంట్యాడ, జూలై 14: రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతుండడం పట్ల ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న గాజువాక పట్టణంలో ప్రయాణికులతో రహదారులు రద్దీగా మారాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు ఈ ప్రాంతంలో గల వివిధ పరిశ్రమలకు భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడంతో భారీ వాహనాలు వేగంగా ప్రయాణిస్తూ ప్రమాదాలు జరగడానికి కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. గాజువాక, పెదగంట్యాడ, దయాళ్‌నగర్, కూర్మన్నపాలెం, బిహెచ్‌పివి, ఆటోనగర్ తదితర కూడళ్లలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాల్సిన పోలీసులు మచ్చుకైనా కానరాకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న రహదారి ప్రమాదాల్లో ఆటోలు, భారీ వాహనాల వలన చోటుచేసు కుంటున్నవేనని పలువురు పేర్కొంటున్నారు. డ్రైవింగ్‌లో అనుభవం లేక పోవడం, మద్యం సేవించడం, సెల్‌ఫోన్‌లో మాట్లాడడం, స్పీడ్‌బేకర్లు, జీబ్రాక్రాసింగ్‌ను పట్టించుకోక పోవడం, మితిమీరిన వేగం, పరమితికి మించి ప్రయాణికులతో వాహనాలను నడపడం తదితర కారణాల వలన ప్రమాదాలు చోటుచేసుకుని పలువురి ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కాలం చెల్లిన వాహనాలను నడపడం కూడా ప్రమాదాలు జరగడానికి కారణమేనని పేర్కొంటున్నారు. వీటితో పాటు ఈ ప్రాంతంలో గల వివిధ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు కాలం చెల్లిన వాహనాలను వినియోగిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. వాహనాల స్పీడుకు, కాలం చెల్లిన వాహనాలకు అడ్డుకట్టవేయడంలో ఆర్‌టిఎ అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే కనీస వయసు, డ్రైవింగ్‌లో అనుభవం, లైసెన్స్ లేకుండా వాహనాలను నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవలసి వుందని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

మన్యంలో ఉత్కంఠ

విశాఖపట్నం: మన్యంలో ఏక్షణం ఏం జరుగుతుందోనన్న భయం గిరిజనులను వెంటాడుతోంది. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్ట్‌లు.. ఎన్నికలను ఏవిధంగానైనా జరిపించాలని పోలీసు అధికారులు పట్టుపట్టడంతో మన్యంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఏజెన్సీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ అధికారులకు సవాలుగా నిలిచింది. ఏజెన్సీలోని 244 పంచాయితీలకు 23న ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో కనీసం 20 పంచాయతీలకు నామినేషనే్ల దాఖలు కాలేదు. చింతపల్లి మండలం బలపం, కుడుముసుర, వంచుల, జికె వీధి మండలం జెర్రెల, మొండిగెడ్డ, జికె వీధి మండలం ఇంజరితో పాటు మరికొన్ని పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మొత్తంమీద ఏజెన్సీలో 20 పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కాలేదని తెలుస్తోంది. నామినేషన్ల పరిశీలన ఆదివారం పూర్తయింది. సోమవారం నుంచి నామినేషన్ల విత్‌డ్రా. ఈ నేపథ్యంలో మావోయిస్ట్‌లు జి మాడుగుల మండలంలో నామినేషన్ల పత్రాలను ఎత్తుకెళ్లి, సంచలనం సృష్టించారు. దీంతో ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు వాటిని వెనక్కు ఇమ్మనమని అధికారులను కోరుతున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం అది సాధ్యం కాదు కాబట్టి, నామినేషన్ల విత్‌డ్రా సమయంలో వాటిని వెనక్కు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ వారు మావోయిస్ట్‌ల హెచ్చరికలను ఖాతరు చేయకుండా, ఎన్నికల బరిలోనే కొనసాగితే పరిణామాలు ఎలా ఉంటాయోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు ప్రచారానికి వెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ ఎన్నికల ప్రక్రియ పూర్తయి, అభ్యర్థులు విజయం సాధించినా, వారికి ప్రాణ హాని ఉండదన్న నమ్మకం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యమా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నారు. ఏజెన్సీలోని జికె వీధి, జి మాడుగుల చింతపల్లి, కొయ్యూరు, పెదబయలు, ముంచింగిపుట్ మండలాలు మావోయిస్ట్‌లకు మంచి పట్టు ఉన్న ప్రాంతాలు. ఈ మండలాల్లో ఎన్ని పంచాయితీల్లో అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉంటారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

మన్యానికి అదనపు బలగాలు : ఎస్పీ దుగ్గల్
విశాఖపట్నం, జులై 14: మన్యంలో పంచాయతీ ఎన్నికలను సవ్యంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ దుగ్గల్ తెలియచేశారు. ఆదివారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ ఏజెన్సీలో మావోయిస్ట్‌లను ఎదుర్కొనేందుకు అదనపు పోలీసు బలగాలను కోరామని చెప్పారు. నామినేషన్లను అపహరించుకువెళ్ళడం, ఎన్నికలను అడ్డుకోవడం వంటి చర్యలను తాము తీవ్రంగా పరిగణినిస్తున్నామని ఆయన అన్నారు. ఏజెన్సీలో పోలీస్ స్టేషన్లను పటిష్ఠం చేశామని అన్నారు. పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని ఆయన చెప్పారు. ఎన్నికల్లో అభ్యర్థులు నిర్భయంగా పాల్గొనవచ్చని ఆయన అన్నారు.

విశాఖ వచ్చిన విజయమ్మ
విశాఖపట్నం, జూలై 14: వైఎస్‌ఆర్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆదివారం విశాఖ చేరుకున్నారు. షర్మిల కుమార్తెలు, బ్రదర్ అనిల్ కుమార్‌తో సహా విజయమ్మ రైలులో నగరానికి చేరుకున్నారు. విజయనగరం జిల్లా పాదయాత్రలో ఉన్న షర్మిలను వీరు కలుసుకున్నారు. తిరిగి సాయంత్రం విమానంలో హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు.

మళ్ళీ పెట్రో వడ్డన
విశాఖపట్నం, జూలై 14: పెట్రోల్ ధర మళ్ళీ పెరిగింది. పక్షం రోజుల్లో ఇది రెండసారి. ఈసారి లీటర్ పెట్రోల్‌కు రూ.1.55 పెరిగింది. పెరిగిన పెట్రోల్ ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తున్నాయి. పెరిగిన ధరల ప్రకారం ఇక నుంచి లీటర్ పెట్రోల్ దాదాపు రూ.76లకు చేరుకుంది. విశాఖ జిల్లాలో వందకు పైగా పెట్రోల్ బంక్‌లుండగా, ఇందులో ఒక్క నగరంలోనే 69 పెట్రోల్ బంక్‌లున్నాయి. వీటి ద్వారా రోజుకీ దాదాపు రెండు లక్షల లీటర్ల పెట్రోల్ అమ్మకాలు సాగుతున్నాయి. ఈ విధంగా పెంచిన పెట్రో ధరల ప్రకారం వినియోగదారులపై దాదాపు ఆరు లక్షల మేర భారం పడనుంది. పక్షం రోజులు కిందట పెరిగిన రెండు రూపాయల ధరలతో నాలుగు లక్షల మేర భారం మోయగా, ఇపుడు దాదాపుగా మరో రెండు లక్షల వరకు భారం పడింది. ఈ ఏడాది వరుసగా నాలుగుసార్లు పెట్రో ధరలను పెంచగా గడచిన పక్షం రోజుల్లో ఇది వరుసగా రెండవసారి పెంచి వినియోగదారులపై పెనుభారాన్ని మోపింది. పెంచిన ప్రతిసారి కనీసం రెండు రూపాయల వరకు భారం ఉంటుండటంతో సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
రవాణా, నిత్యావసర సరకులపై తీవ్ర ప్రభావం
పెరిగిన పెట్రో ధరల ప్రభావం రవాణాచార్జీలు, నిత్యావసర సరకులపై తీవ్రంగా పడనుంది. పెట్రోలు ధరలు పెరుగుతున్న ప్రతిసారి బస్సులు, ఆటోలు, జీపుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇదే పరిస్థితిని మరోసారి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అసలే నిత్యావసర సరుకులు ఈమధ్యకాలంలో ఆకాశన్నింటుతున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా కిలో ఉల్లి రూ.30లకు చేరుకుంది. కిలో బియ్యం రూ.50లు పలుకుతోంది. పప్పులు, నూనెల ధరల సంగతి చెప్పనక్కర్లేదు. రోజురోజుకీ వీటిధరల్లో మార్పులు వస్తున్నాయి. కూరల ధరలు మండిపోతున్నాయి. మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలతో ఇవన్నీంటి ధరలు మరింత పెరుగుతాయని సామాన్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కేంద్రం ప్రభుత్వం సామాన్యులనే లక్ష్యంగా చేసుకుందని అంటున్నారు.
* నేడు ఆశీలమెట్ట వద్ద నిరసన
రెండు రూపాయలు పెంచిన కేంద్ర ప్రభుత్వం మళ్ళీ పెంచి సామాన్యులపై పెనుభారం మోపింది. ఈ ఏడాదిలో ఇది నాల్గవసారి కావడంతో వీటిని వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా ఏఐటియుసి జిల్లా ఉపాద్యక్షుడు, ఆటో వర్కర్స్ యూనియన్ ప్రతినిధి జి.వామనమూర్తి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. పెంచిన ధరలకు నిరసనగా సోమవారం ఉదయం 11 గంటలకు ఆశీలమెట్ట జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. పెట్రోల్‌పై నియంత్రణ ఎత్తివేయడం వలనే ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. విపరీతంగా పెంచిన పెట్రో ధరల తగ్గింపు కోసం ప్రజాప్రతినిధులు స్పందించి ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ప్రతిసారి ఒడిషా పెత్తనమే. ప్రతి దానిలోను ఆదిపత్యపోరే
english title: 
coach factory

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>