విజయనగరం, జూలై 14: పంచాయతీ ఎన్నికల ఘట్టంలోని నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రధాన పార్టీలు తమ ప్రచారానికి పదునెక్కించాయి. ముఖ్యంగా పార్వతీపురం, విజయనగరం డివిజన్లలో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. కాగా, పార్టీరహితంగా జరిగే ఈ ఎన్నికలకు ఇప్పటి వరకు ప్రధాన పార్టీలకు చెందిన కాంగ్రెస్, తెలుగుదేశం వారే సర్పంచ్‌లుగా గెలుపొందుతున్నారు. ఈ దఫా వైకాపా కూడా బరిలోకి దిగుతుండటంతో కొన్ని చోట్ల త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా, పార్వతీపురం పంచాయతీ ఎన్నికలకు కేవలం 8 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ డివిజన్‌లోని పార్వతీపురం, కురపాం, బొబ్బిలి, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు కాంగ్రెస్ హవా ఉంది. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందాలంటే పల్లెల బలం అవసరం. దీంతో నేతల కన్ను పంచాయతీ ఎన్నికలపై పడింది. పల్లెలో తమ సత్తాను చాటేందుకు తెలుగుదేశం వ్యూహం పన్నుతొంది. పంచాయతీ ఎన్నికల్లో తమ బలాన్ని పెంచుకోవడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో తమ గెలుపు సులభమవుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ నేతలు సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. దీంతో పల్లెల్లో రాజకీయాలు వేడెక్కాయి.
జిల్లాలో 4726 మంది సర్పంచ్ పదవులకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ దఫా పంచాయతీ ఎన్నికలకు ఏకగ్రీవాలకు కొన్నిచోట్ల ప్రయత్నాలు జరుగుతుండగా, మరికొన్ని చోట్ల బహుముఖ పోటీ నెలకొంది. ప్రధాన పార్టీలకు చెందిన అనుచరులు ఒకే పంచాయతీకి పోటీ పడటంతో బహుముఖ పోటీ నెలకొంది. ఇదిలా ఉండగా మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవులకు ప్రధాన పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు బరిలో దిగారు. ఇరు పార్టీలకు రెబెల్ బెడద తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ ఒకరికి మద్దతునిస్తే, దానిని కాదని రెబెల్‌గా మరికొందరు బరిలో దిగారు. చీపురుపల్లిలో బెల్లాన శ్రీదేవి నామినేషన్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపగా, అదే పంచాయతీలో మీసాల వరహాలనాయుడు సతీమణి సరోజిని బరిలో దిగారు. అలాగే ఎస్.కోటలో కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి ఒకరి కంటే ఎక్కువ మంది బరిలో నిలిచారు. దీంతో వారిని బుజ్జగించేందుకు నేతలు యత్నాలు చేస్తున్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో టిడిపి పట్టు ఉన్నప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో దానిని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ వ్యూహప్రతివ్యూహాలతో ముందుకెళ్తుంది. గజపతినగరంలో నిన్న మొన్నటి వరకు వైకాపావైపు పరుగులు తీసిన నాయకులు నేడు కాంగ్రెస్‌వైపు మొగ్గుచూపుతున్నారు. ఏది ఏమైనా పార్టీరహితంగా ఎన్నికలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రధాన పార్టీల మద్దతును ఆయా అభ్యర్థులు కోరుతున్న విషయం విదితమే. ఈ పరిస్థితుల్లో మేజర్ పంచాయతీలకు ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేయడంతో నాయకులకు బుజ్జగింపులు చేయడం తలనొప్పిగా పరిణమించింది.
ఇదిలా ఉండగా ఈ దఫా సగానికిపైగా స్థానాల్లో మహిళలు రంగంలోకి దిగుతున్నారు. దీంతో ఎస్‌హెచ్‌జి సంఘాల మద్దతు కోసం వారంతా సంఘాల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడటంతో పగలు ప్రచారాలు, రాత్రులు చర్చలు చేస్తున్నారు.
పంచాయతీ పోలింగ్‌పై వెబ్ కన్ను!
విజయనగరం, జూలై 14: రాష్ట్రంలో మొదటిసారిగా పంచాయతీ ఎన్నికల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. మారుమూల పంచాయతీల్లో ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకునేందుకు వెబ్‌కాస్టింగ్ పద్దతిని ఉపయోగించనున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహణవల్ల ఎంతో సౌలభ్యం ఉంటుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో 25 ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్ పద్దతిని అమలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. జిల్లాలో అత్యంత సమస్యాత్మక గ్రామాలు 61 ఉన్నట్టు గుర్తించారు. వాటిలో విజయనగరం డివిజన్‌లో 40 గ్రామాలు, పార్వతీపురం డివిజన్‌లో 21 అత్యంత సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి. అలాగే సమస్యాత్మక గ్రామాలు విజయనగరం డివిజన్‌లో 101, పార్వతీపురం డివిజన్‌లో 58 ఉన్నాయి. ఈ విధానంతో ఎన్నికలు జరిగే ప్రాంతాన్ని జిల్లా కేంద్రంలోను, రాజధానిలో ఉండి తిలకించే వీలుంది. ఎన్నిక జరిగే కేంద్రంలో ఏర్పాటు చేసిన వెబ్ కెమెరా ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోలింగ్ కేంద్రంలోని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించవచ్చు. ఇందుకోసం పోలింగ్ కేంద్రంలో ల్యాప్‌టాప్, వెబ్ కెమెరా, ఇంటర్నెట్ ఏర్పాటుచేస్తున్నారు. ప్రత్యేక కోడ్ ద్వారా ఎన్నికల సంఘం అధికారులు, కలెక్టర్, పరిశీలకులు తాము కూర్చొన్న చోటు నుంచే ఎక్కడి పోలింగ్ కేంద్రాన్నైనా ప్రత్యక్షంగా చూడవచ్చు. ముఖ్యంగా ఎన్నికల్లో రిగ్గింగ్, అల్లర్లు జరిగితే వెంటనే ఎన్నికల సంఘానికి, జిల్లా అధికారులకు వెంటనే తెలిసిపోతుంది. దీని వల్ల పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర
గరివిడి, జూలై 14 : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల పాదయాత్ర ఆదివారం గరివిడి సాయంత్రం గరివిడి చేరుకోగానే ప్రజలు స్వాగతం పలికారు. పాత గరివిడి నుంచి ప్రారంభమైన పాదయాత్ర చీపురుపల్లి వరకూ సాగింది. ఈ సందర్భంగా గరివిడిలోని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ఆమె పూల మాల వేసిన నివాళులర్పించారు. షర్మిలను చూసేందుకు ప్రజలు రావడంతో పలు ట్రాఫిక్ సమస్య ఎదురైంది. ఈ పాదయాత్ర కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ కన్వీనర్ సుజయకృష్ణ రంగారావు, జిల్లా కన్వీనర్ సాంబశివరాజు, చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు, వైకాపా నియోజకవర్గ కన్వీనర్లు కోట్ల సూర్యనారాయణ, స్థానిక పార్టీ ప్రతినిధులు సత్యన్నారాయణరెడ్డి, వాకాడ శ్రీను, వాకాడ అన్నపూర్ణ, మాజీ జెడ్‌పిటిసి కోట్ల విజయ, తదితరులు పాల్గొన్నారు.
గౌహతి రైలులో మంటలు.. ఆరుగురికి గాయాలు
విజయనగరం, జూలై 14: ఒడిషావైపు వెళ్తున్న గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఇంజన్ వెనుకవైపున ఉన్న బోగి నుంచి మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. చీపురుపల్లి స్టేషన్‌కు కూతవేటు దూరంలో రైలుబండి నుంచి మంటలు చెలరేగాయి. దీంతో రైలుబండి ప్లాట్‌ఫారం వద్దకు చేరుకునేసరికి ఆందోళన చెందిన ప్రయాణికులు కొందరు రైలు నుంచి బయటకు గెంతేశారు. వీరిలో ఆరుగురికి గాయాలైనట్టు సమాచారం. కాగా, రైల్వే వర్గాలు మాత్రం గౌహతి ఎక్స్‌ప్రెస్ నుంచి మంటలు రావడం నిజమేనని, ఎవరికి గాయాలు కాలేదని పేర్కొన్నారు. బ్రేక్ బైండింగ్ వల్ల కొన్ని సార్లు ఇలా మంటలు వస్తాయని తెలిపారు. దీంతో వెంటనే రైలును నిలుపుదల చేసి ఎయిర్ బ్రేక్ సరిచేసిన తరువాత అక్కడ నుంచి రైలు బయలుదేరింది.
విజయానికి విభిన్న రీతుల్లో ప్రచారం
గంట్యాడ, జూలై 14 : పల్లెల్లో గ్రామ పంచాయతీల ఎన్నికల పోరు ప్రధాన రాజకీయ పార్టీలుకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. అభ్యర్ధుల విజయమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి చిన్నారులు, రైతులు, వృద్ధులతో ప్రచారం నిర్వహిస్తున్నారు.ఆయా పార్టీల మద్దతుతో సర్పంచ్, వార్డు పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్ధుల విజయం కోసం విభిన్న ప్రచారంతో వ్యూహ్మాత్మకంగా నాయకులు వ్యవహరిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రీతిలో ప్రచారాన్ని నిర్వసిస్తున్నారు. ఇప్పటికే ఇంటింటి ప్రచారం, ర్యాలీలతో అభ్యర్ధుల విజయం కోసం కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్ సిపి నాయకులు గట్టి ప్రయ్నాలు చేస్తున్నారు. పార్టీ జెండాలు టోపీలు, కండువాలు ధరించి ఆయా పార్టీల అభిమానులు అభ్యర్ధుల విజయం కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది.
విద్యుదాఘాతానికి రైతు మృతి
గజపతినగరం, జూలై 14 : వివాహమై నెల రోజులు కాక ముందే కాళ్లపారాణి ఇంకా తడి ఆరక ముందే నిండు నూరేళ్లు నిండి విద్యుత్ ఘాతానికి రైతులు మృతి చెందిన సంఘటన ఆదివారం గజపతినగరంలో చోటు చేసుకుంది. గజపతినగరంలోని గంగరాజు ధియేటర్ పక్కన నివాసం ఉంటున్న బండారు చిట్టిబాబు (35) విద్యుత్ మోటారు పంప్ సెట్ వేయడానికి స్విచ్ వేయగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రావులపాలెంలోని రావి గ్రామం నుంచి గజపతినగరం వచ్చి మూడు ఎకరాల భూమిని రాయకర చెరువు క్రింద కొంత భూమిని కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చిట్టిబాబు గత ఏడాది వరకు సింగపూర్‌లో ఓడల పరిశ్రమలో ఉద్యోగం చేస్తూ వ్యవసాయం చేద్దామన్న ఉద్దేశ్యంతో గజపతినగరంలో ఉన్న అన్నదగ్గరకు చేరుకున్నాడు. చిట్టిబాబుకు మేనమామ కూతురితో ఈ ఏడాది మే 24న వివాహం జరిగింది. ఆషాడం రావడంతో భార్య కన్నవారింటికి వెళ్లిపోయింది. చిట్టిబాబు ఉదయం పది గంట సమయంలో పొలంలో ఉన్న విద్యుత్ మోటారు వేద్దామని స్విచ్ వేయగా షాక్‌కు బలయ్యాడు. దీంతో కుటుంబ సభ్యుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. విఆర్వో ఫిర్యాదు మేరకు ఎస్సై దర్యాప్తు చేస్తున్నారు.
‘యువతకు దిశా నిర్దేశం కొరవడింది’
సాలూరు, జూలై 14: భారత్ సంక్షేమమే విశ్వకళ్యాణమని ఆర్.ఎస్.ఎస్. విభాగ్ సహసంఘ చాలక్, రిటైర్డ్ డిప్యూటీ డి.ఇ.ఒ. నర్సింహం అన్నారు. ఆదివారం గురుపూజోత్సవాలలో భాగంగా స్థానిక ఆరిశెట్టి వారి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాన వక్తగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు అతి ప్రాచీనమైనవి, చాలా గొప్పవని కొనియాడారు. ప్రస్తుతం యువతకు దిశా నిర్దేశం కొరవడిందన్నారు. యువతకు గృహాలలోను, పాఠశాలలో, సమాజంలో స్ఫూర్తికొరవడిందన్నారు. యువతకు సంస్కారవంతులుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం శాఖల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. అనంతరం సభాధ్యక్షుడు ఎన్.వై. తాతలు మాట్లాడుతూ ఆర్. ఎస్. ఎస్. శాఖల్లో కాషాయ ధ్వజాన్ని గురువుగా భావిస్తు పూజలు నిర్వహిస్తారన్నారు. కాషాయం త్యాగనిరతిని సూచిస్తుందన్నారు. ప్రతీ వ్యక్తి సంస్కార వంతంగా జీవించి త్యాగ నిరతిని అలవర్చుకోవాలన్నారు. ప్రపంచానికి పనికొచ్చే శక్తిగా యువత మారాలని పిలుపునిచ్చారు. విభాగ్ భౌతిక్ ప్రముఖ్ కిలపర్తి తిరుపతిరావు, జిల్లా సహా కార్య వాహ వి.రాము, జిల్లా ప్రముఖ్ కొండబాబు, జి. లక్ష్మణరావు, వంగపండు రాజేంద్రప్రసాద్, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
సంతపేటలో అనివార్యం కానున్న పోలింగ్
లక్కవరపుకోట, జూలై 14 : వరుసగా నాలుగు ఎన్నికల్లో ఏకగ్రీవమైన సంతపేట పంచాయతీలో ఈసారి పోటీ అనివార్యమవుతుంది. లక్కవరపుకోట మండలం సంతపేట గ్రామ పంచాయతీ 1995లో రంగారాయపురం పంచాయతీ నుండి విడిపోయింది. 1995 నుంచి ఇప్పటి వరకూ అన్ని ఎన్నికలు ఏకగ్రీవం చేసుకుంది. అందులో ఓటర్లు 170 గృహాలుండగా, గ్రామం మొత్తం జనాభా 720 మంది అందులో ఓటర్లు 527 మంది ఈ గ్రామంలో ఏ కార్యక్రమం చేపట్టినా అందరూ రామకోవెలలో సమావేశమయ్యి. ఒక ఏకాభి ప్రాయానికి వచ్చి. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందింది. మేజర్ పంచాయతీల్లో లేని సౌకర్యాలన్నీ ఈ పంచాయతీల్లో గ్రామస్తులు సమకూర్చుకున్నారు. గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాతే రామమందిరాన్ని గ్రామస్తులందరూ కలిసి కుట్టుగా నిర్మించుకున్నారు. గ్రామంలో అందరూ కలిసి పరిశుభ్ర తను పాటించి నిర్మల పురస్కార్ అవార్డును పూణేలో రాష్టప్రతి చేతుల మీదుగా అప్పటి గ్రామ సర్పంచ్ గురు సన్యాసమ్మ అందుకున్న గ్రామమిది. నిర్మల్ పురస్కార్ అవార్డుతోపాటు, శుభ్ర అవార్డు కూడా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా అప్పటి సర్పంచ్ గురు సన్యాసమ్మ హైదరాబాద్‌లో అందుకున్నారు. 2013 గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ సిద్దపడుతున్నారు.
మూడు పూరిళ్లు దగ్ధం... రూ. 4 లక్షల ఆస్తి నష్టం
డెంకాడ, జూలై 14 : మూడు పూరిళ్లు దగ్ధమైన సంఘటన మండలంలోని బంగార్రాజుపేట గ్రామంలో ఆదివారం తెల్లవారు జామున జరిగింది. బంగార్రాజుపేట గ్రామానికి చెందిన వెంపడాపు అప్పలరెడ్డి ఇంటి వద్ద తెల్లవారు జామున నీరు పొయ్యిపై నీరు మరిగిస్తుండగా మంటలు చెలరేగి ఈ దారుణం చోటు చేసుకుంది. దీంతో బాధితులవి పూరిళ్లు కావడంతో కట్టు బట్టలతో మిగిలి నిరాశ్రయులయ్యారు. తగరపువలస నుంచి అగ్నిమాపక వాహనంతో సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసే సరికి జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. అప్పలరెడ్డి పెళ్లి కోసం తెచ్చుకున్న లక్షా 50 వేల రూపాయలు కాలి బూడిదైనట్లు స్థానికులులంటున్నారు. అలాగే తరిగి అప్పలనర్సమ్మ ఇళ్లు నిర్మాణం కోసం 75 వేల నగదు తెచ్చుకుని ఇంట్లో వుంచింది.
ఇది కూడా అగ్నికి ఆహుతయ్యిందని బాధితులు వాపోతున్నారు. సంఘటనా స్థలానికి ఆర్‌ఐ చిరంజీవి, విఆర్‌ఓ సూరిబంగారి చెరుకుని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. 4 లక్షలు ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేశారు. బాధితులను ఆదుకుని తగిన సహాయం చేయాలని అధికారులను బాదితులు కోరుతున్నారు. కట్టుబట్టలతో మిగిలిన తమకను ఆదుకుని తమకు సాయం అందించాలని అక్కడి వారు కోరుతున్నారు.