Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పేట కాంగ్రెస్‌కు పెద్దదిక్కేదీ?

$
0
0

సిద్దిపేట, జూలై 15 : సిద్దిపేట నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కు కరువైంది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషిచేయాల్సిన పెద్ద నాయకులు పట్టించుకోకపోవటంతో గ్రామాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. పంచాయతీ ఎన్నికలకు పోలీంగ్‌కు కేవలం వారు రోజులు గడువు వుండటంతో ఇంతవరకు నియోజక వర్గం ముఖ్య నేతలు ప్రచారంలో పాలుపంచుకోకపోవటంపై గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు తీవ్ర నైరాశ్యం అలముకొంది. కనీసం పంచాయతీ ఎన్నికల్లో కూడ తమను పట్టించుకోరా.. ? గ్రామాల్లో నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. 1985 నుండి సిద్దిపేట నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. 1985 నుండి 2004 వరకు సిద్దిపేట నియోజక వర్గంలో కెసిఆర్ ఎమ్మెల్యేగా మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా కొనసాగారు. సిద్దిపేట నియోజక వర్గాన్ని కెసిఆర్ తన కంచుకోటగా మార్చుకున్నారు. 2004లో కెసిఆర్ మేనల్లుడు తన్నీరు హరీష్‌రావు ఎమ్మెల్యేగా ఎన్నిక కాకముందే మంత్రిగా బాధ్యతలు స్వీకరించి..అనంతరం ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తన కంచుకోటగా మలుచుకన్నారు. 1985 నుండి ఇప్పటి వరకు 27 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రాతినిథ్యం కరువైంది. 2004 నుండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో,కేంద్రంలోఅధికారంలో వున్నప్పటికి నియోజక వర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలో ఏలాంటి మార్పురాలేదు. నియోజక వర్గంలోని మేజార్టీ క్యాడర్ ఇతర పార్టీలకు వలసలు పోగా.. పార్టీపై అభిమానం వున్న నేతలు, కార్యకర్తలు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ ఎంపిగా పోటీ చేసిన చాగండ్ల నరేంద్రనాథ్ పార్లమెంట్ నియోజక వర్గం పరిధిలోని అన్ని నియోజక వర్గాల్లో అధిక్యతలో వున్నప్పటికి ఒక్క సిద్దిపేట నియోజక వర్గంలో 60 వేల ఓట్లు వెనుకబడిపోవటంతో 6 వేల ఓట్లతో ఓటమిచెందారు. సిద్దిపేట నియోజక వర్గంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు అధిష్టానం చెపుతున్నప్పటికీ ఇంతవరకు ఏలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. 2011లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఫారూక్‌హుస్సేన్‌ను నామినేట్ చేశారు. ఫారూక్‌హుస్సేన్ ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన నియోజక వర్గంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. నియోజక వర్గంలో ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్‌తో పాటు మార్కెట్ కమిటి చైర్మన్ గూడూరి శ్రీనివాస్‌లు రెండు గ్రూపులు చలమణీ అవుతున్నారు. ఇటివల కాంగ్రెస్ పార్టీ పదవుల్లో గ్రూపు విభేదాలు మరోసారి స్పష్టమైనాయి. దీంతో పంచాయతీ ఎన్నికల ముందు ఇటివల సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలు నియోజక వర్గంలో గ్రూపువిభేదాలను పరిష్కరించేందుకు నియోజక వర్గం సమన్వయ కర్తగా, స్థానిక సంస్థల ఎన్నికల ఇంచార్జీగా చాగండ్ల నరేంద్రనాథ్‌ను నియమించారు. కాని ఇంతవరకు చాగండ్ల నరేంద్రనాధ్ నియోజక వర్గం కోఆర్టీనేటర్‌గా నియామకమైన తర్వాత సిద్దిపేటలో అడుగుపెట్టలేదు. నరేంద్ర నాథ్ తన సంత పనులకు విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ తన కుటుంబ పనుల నిమిత్తం సతీసమేతంగా లండన్ వెళ్లారు. మరో నెలరోజుల వరకు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు పర్వం ముగిసినప్పటికి కనీసం ఏ గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు సర్పంచ్‌లుగా, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్నారో పట్టించుకునే వారు కరువైనారు. అందుబాటులో వున్న మార్కెట్ కమిటీ చైర్మన్ గూడూరి శ్రీనివాస్ నామినేషన్ల తర్వాత ఉప సంహరణ తర్వాత పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని కాంగ్రెస్ కార్యకర్తలు వెల్లడిస్తున్నారు. సిద్దిపేట నియోజక వర్గం తొలివిడత ఈనెల 23న జరిగే పోలీంగ్ జరుగుతుండటంతో గ్రామాల్లో రంగంలో వున్న అభ్యర్థులు తీవ్ర కలవర చెందుతున్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీచేస్తున్నప్పటికి తమకు కనీసం చేయుత నిచ్చెవారు కరువైనారని వాపోతున్నారు. పంచాయతీ ఎన్నికలకు కేవలం వారం రోజుల గడువు వుండటంతో అభ్యర్థులు తమను పట్టించుకోక పోవటంపై గ్రామాల్లోని నాయకులు, కార్యకర్తలు నియోజక వర్గం నేతలపై గుర్రుగా వున్నారు. నియోజ వర్గం నాయకులపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఎన్నికల పోలీంగ్‌కు మిగిలిన ఆరురోజులైన నియోజక వర్గ స్థాయి నేతలు ప్రచారంలో పాల్గొని రంగంలో వున్న అభ్యర్థుల విజయానికి కృషిచేయాలని కాంగ్రెస్ అభిమానులు కోరుతున్నారు. నియోజక వర్గంలో నాయకుల్లో మార్పు రానంతవరకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మారదని రాజకీయ విశే్లకులు భావిస్తున్నారు.

సరికొత్త సాంకేతిక విజ్ఞానంపై
పోలీసులకు శిక్షణ
సంగారెడ్డి,జూలై 15: దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలు కాబోతున్న సిసిటి ఎన్‌ఎస్ (క్రైమ్‌అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్)లో భాగంగా టిసిఎస్ (టాటా కంప్యూటర్ కన్సల్‌టెన్సీ) ఆధ్వర్యంలో జిల్లా పోలీసులకు సోమవారం శిక్షణ ఇచ్చారు. ఈకార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జి భూపాల్ పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో ఛేంజ్ మెనెజ్‌మెంట్‌పై శిక్షణ కూడా ఇచ్చారు. సదస్సులో టిసిఎస్ కు చెందిన కరుణాకర్ కుంభవాత్ పోలీసు సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. సాంకేతిక పరిజ్ఞానం పోలీసులు కూడా పట్ట సాధిస్తూ పోలీసు విచారణంలో వేగంగా పురోగతిని సాధించడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డిఎస్పీ వెంకటేశ్, రామచంద్రాపురం డిఎస్పీ మధుసూదన్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

అక్రమ మద్యంపై అప్రమత్తం
సంగారెడ్డి,జూలై 15: ఈ నెలలో జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కల్తీకల్లుతో పాటు అక్రమ మద్యాన్ని పూర్తి స్థాయిలో అరికట్టాలని జిల్లా కలెక్టర్ ఎ. దినకర్‌బాబు సంబంధిత అధికారులు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన అధికారులు సమావేశంలో ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. కల్తీకల్లు, అక్రమ మద్యం అరికట్టేందుకుగాను జిల్లాలో విస్తృతంగా దాడులను నిర్వహించాలని ఆయన సమావేశంలో పాల్గొన్న ఏక్సైజ్ అధికారులను ఆదేశించారు. జిల్లా, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామాల్లో అనాధికారికంగా కొనసాగుతున్న బెల్ట్‌షాపులను నిరోధానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరారు. ఈనెల 23వ తేదీన మొదటి దఫా ఎన్నికలు సిద్దిపేట డివిజన్‌లో ఉన్న నేపథ్యంలో 44 గంటల ముందు మద్యం దుకాణాలను మూసివేసే విధంగా ముందస్తు చర్యలను తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎక్కవ మొత్తంలో మద్యం సేవించడం ద్వారా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే ఇందుకు ఆబ్కారీ శాఖ సిబ్బందిని బాధ్యులుగా భావించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.సిద్దిపేట డివిజన్‌లో మొదటి దఫా ఎన్నికల సందర్భంగా పోలింగ్ సమాగ్రిని తరలించేందుకుగాను 60 రూట్లకు పోలింగ్ అధికారులతో పాటు జోనల్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. 162 బస్సుల ద్వారా 82 జీపుల ద్వారా ఈసామాగ్రిని చేరవేయడం జరుగుతుందన్నారు.మెదక్ డివిజన్‌లో రెండవ విడుతకు సంబంధించి కూడా ఎలాంటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలను తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న డిపివో అరుణను ఆయన ఆదేశించారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ శరత్, డిఆర్‌వో, ఏజెసి మూర్తి, డిఆర్‌వో ప్రకాష్ , ఎక్సైజ్ అధికారులు జీవన్‌సింగ్, హరికిషన్ , ఆర్టీ ఏ అధికారులు, మధుసూధన్, రాజు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌కు తిరుగులేదు
నర్సాపూర్, జూలై 15: నర్సాపూర్ నియోజకవర్గంలో ఎన్ని పార్టీలు ఏకమైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మెజార్టీ స్థానాలు గెలుపొందుతారని రాష్ట్ర స్ర్తిశిశుసంక్షేమశాఖ మంత్రి వాకిటి సునీతారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారంనాడు నర్సాపూర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక అన్ని పార్టీలు ఉమ్మడిగా ఏర్పడి ఎన్నికల బరిలో నిలుస్తున్నాయని అన్నారు. అయినప్పటికి కాంగ్రెస్ పార్టీ శక్తి ముందు నిలబడలేకపోతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల వల్ల ప్రజలు తమ వెంట ఉన్నారని స్పష్టం చేశారు. గత 14 సంవత్సరాల కిందట నియోజకవర్గం పరిస్థితి ఇప్పుడు ఉన్న పరిస్థితులు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పార్టీ రహిత ఎన్నికలు అయినప్పటికీ ఏదో ఒక పార్టీ బలపరిచిన అభ్యర్థులే సర్పంచ్‌లుగా గెలుపొందుతున్నారని అన్నారు. నర్సాపూర్, శివ్వంపేట, హత్నూర మండలాల్లోని పలు గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ తరపున ఇద్దరేసి అభ్యర్థులు నిమినేషన్లు వేశారని వారు ఉపసంహరణ గడువులోగా విత్‌డ్రా చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రత్యేక దృష్టిపెట్టినట్లు తెలిపారు. సమావేశంలో మండల పార్డీ అధ్యక్షుడు కృష్ణారావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యంగౌడ్, మాజీ ఎంపిపి లలిత పాల్గొన్నారు.

జిల్లా అధికారులు సమన్వయంతో పని చేయాలి
* కలెక్టర్ దినకర్‌బాబు సమీక్ష
సంగారెడ్డి,జూలై 15: జిల్లా అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లా రాష్ట్రంలో అన్ని కార్యక్రమాల్లో ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ ఏ దినకర్‌బాబు కోరారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని మినిసమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రీయ సూచన విజ్ఞాన కేంద్రం ద్వారా జాతీయ పశువ్యాధి సమాచార సేకరణ కేంద్ర వ్యవస్థ ద్వారా అత్యధిక కేసులను జిల్లా నమోదు చేయడం పట్ల ఆయన సంబంధిత పశసంవర్థక శాఖను అభినందించారు. అధికారులు అంకిత భావంతో పని చేస్తే ఇలాంటి మంచి ఫలితాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇదే రీతిలో 20 సూత్రల అమలు పథకం, 15 సూత్రాల అమలు పథకాన్ని జిల్లా అధికారులు అమలు చేయాలని ఆయన కోరారు. జిల్లాలో పాల ఉత్పత్తి మరియు సంబంధిత శాఖ ద్వారా జరిగే కార్యక్రమాలను జిల్లాలో భారీ స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఉద్యానవన శాఖ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. జిల్లాలో 46 మండలాల నుండి 12500 పశువ్యాధి కేసులను గుర్తించి ఆన్‌లైన్ ఆప్‌లోడ్ చేయడంలో దేశంలో మొదటి స్థానంలో జిల్లా నిలవడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ శరత్, ఏ జెసి మూర్తి, డి ఆర్ వో ప్రకాష్‌కుమార్ , పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి , ఎన్‌ఐసి అధికారి శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమానికి కట్టుబడిన కాంగ్రెస్
తూప్రాన్, జూలై 15: పేదల సంక్షేమానికి కట్టుబడిన కాంగ్రెస్ వివిధ పథకాలకు రూపకల్పన చేసి ఆమలు చేస్తున్నట్లు కాంగ్రెస్ పరిశీలకులు ఎన్‌సి రాజవౌళిగుప్త పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని సర్పంచ్ అభ్యర్థులు, పార్టీ శ్రేణులకు తూప్రాన్‌లోని లింగారెడ్డి ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని, అయితే ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిపై ప్రజలను చైతన్యం చేయాల్సిన భాద్యత పార్టీ శ్రేణులపై ఉందని స్పష్టం చేశారు. కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించగా, సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రచ్చబండ ద్వారా వివిధ పథకాలకు ప్రత్యేక నిధులు కెటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలే గీటురాయి కాగా, మెజార్టీ స్థానాలను దక్కించుకునే దిశగా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలని కోరారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు విజయభాస్కర్‌రెడ్డి, నాచగిరి ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ మహిపాల్‌రెడ్డి, మాజీ చైర్మన్ నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ సభ్యుడు లింగారెడ్డి, నేతలు వెంకటస్వామి పాల్గొన్నారు.

28మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానం
సంగారెడ్డిరూరల్,జూలై 15: జిల్లా గెజిట్‌లో నోటిఫై చేసిన 28 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్ జీవన్‌సింగ్ తెలిపారు. ఈ నెల 15నుంచి 21వ తేదీ వరకు సంగారెడ్డి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ఈ నెల 22న ఉదయం 11గంటలకు లాటరీ పద్ధతిలో ఎంపిక చేయబడుతుందని తెలిపారు.

తూప్రాన్‌లో చోరీ
తూప్రాన్, జూలై 15: తూప్రాన్ పెట్రోల్‌బంక్ సమీపంలోని నాగార్జున కాలనీలో సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దొంగలు తాళం పగల గొట్టి చోరీకి పాల్పడ్డారు. కాలనీలో ఉంటున్న సత్తయ్య పనిపై ఆదివారం వేరే గ్రామానికి వెల్లగా, ఇదే అదనుగా భావించిన దొంగలు తాళం పగలగొట్టి లోన ప్రవేశించారు. అనంతరం బీరువాలో దాచుకున్న 2తులాల బంగారు వస్తువులు, 20తులాల వెండి, రూ,40వేల నగదును దోచుకెల్లారు. అయితే దొంగలు ఎలాంటి అనవాళ్లు చిక్కకుండా ఇంటిని శుభ్రం చేసి వెల్లడం గమనార్హం కాగా, ఉదయం ఇంటికి వచ్చిన యజమాని సత్తయ్య చోరీ జరిగినట్లుగా గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పట్టణ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ముందు ధర్నా
సంగారెడ్డి,జూలై 15: సంగారెడ్డి పట్టణంలోని మగ్దుంనగర్, రిక్ష కాలనీల మురికి కాలువల సమస్యను పరిష్కరించాలని కోరుతూ డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఎ.శరత్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.రాజు మాట్లాడుతూ మగ్దుంనగర్,రిక్ష కాలనీల్లో మురికి కాలువల నిర్మాణాలు లేక వర్షాలు కురిస్తే ఆ మురికి నీరంత ఇండ్లలోకి చేరుతుందని, దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.ఇటివల కురిసిన వర్షాలకు కూలీపోయిన రెండు ఇండ్లకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ మురికి కాలువలకు శాస్వత పరిష్కారం చూపాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నాయకులు దుర్గేష్, దత్తు, బాబామియా, సతీష్, తాజోద్దీన్, రాజక్ తదితరులు పాల్గొన్నారు.

* మొదటి విడత ఎన్నికలైనా అభ్యర్థులకు చేయూత కరువు * విదేశాల్లో ఎమ్మెల్సీ ఫారూక్, నరేంద్రనాథ్ * ప్రచారంలో కానరాని ముఖ్య నేతలు * అభ్యర్థుల్లో కలవరం
english title: 
peta congress

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>