Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

‘పంచాయతీ’పై ఖాకీ నిఘా

$
0
0

నల్లగొండ, జూలై 15: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ అధికార యంత్రాంగానికి కత్తిమీద సాముల మారింది. గతంలో కంటే ఎక్కువ పార్టీలు..ఎక్కువ మంది అభ్యర్థులు రంగంలో ఉండటం..గత ఎన్నికల కంటే ఖర్చులు సైతం భారీగా జరుగుతుండటంతో పల్లెల్లో గ్రామ పంచాయతీల ఎన్నికల పోరు కాస్తా పార్టీలు..ప్రజల మధ్య పంచాయతీలకు దారితీసే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జిల్లాలో 1196 గ్రామ పంచాయతీలు..11686 వార్డు స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా తరుముకొస్తున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మంగా తీసుకుంటున్నాయి. ఇందుకు తాజాగా దాఖలైన నామినేషన్ల వ్యవహారమే నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ నేపధ్యంలో పంచాయతీ ఎన్నికలలో సమస్యాత్మక గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ అధికార యంత్రాంగానికి సవాల్‌గా మారింది. జిల్లాలో కలెక్టర్-ఎన్నికల అధికారి వైపు నుండి 306 పంచాయతీలు అతిసున్నితమైన, 147 సున్నితమైన సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. 178 గ్రామాల్లో వీడియో చిత్రీకరణ..87పంచాయతీల్లో వెబ్‌కెమెరాల వినియోగం..సూక్ష్మ పరిశీలకులను వినియోగిస్తు ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీస్ శాఖ వైపు నుండి జిల్లాలో 760పంచాయతీలను సమస్యాత్మక పంచాయతీలుగా గుర్తించగా అక్కడ ఎన్నికల నిర్వహణపై ముందస్తు నిఘాను..బందోబస్తు చర్యలను చేపట్టారు. ముఖ్యంగా రాజకీయ కక్షలు..్ఫ్యక్షన్ గొడవలు..తీవ్రవాద ప్రాబల్యం ఉన్న సమస్యాత్మక గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణపై పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే కొనసాగుతున్న ‘గ్రామపోలీస్’తో గ్రామాల్లో శాంతిభద్రతల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. సమస్యాత్మక గ్రామాలకు అదనంగా నలుగురు పోలీసులను నియమించారు. వారి సమాచారం ఆధారంగా అవసరమైతే ప్రత్యేక టాస్క్ఫోర్సు..ట్రబుల్ షూటింగ్ పోలీస్ బృందాలు ఉద్రిక్తతలు చోటుచేసుకునే గ్రామాలకు నిమిషాల్లో చేరేలా రూట్‌ప్లాన్..యాక్షన్ ప్లాన్‌లను రూపొందించారు.
కట్టడికి బైండోవర్లు..దాడులు
పంచాయతీ ఎన్నికల బందోబస్తు భాగంగా గత ఎన్నికల సందర్భంగా దాడులకు, నేరాలకు పాల్పడిన వారిని, రౌడీషీటర్లను గుర్తించి బైండోవర్ చేస్తున్నారు. 800 మందికి పైగా నేరగాళ్ల కదలికలపై దృష్టి సారించి వారిని స్టేషన్‌కు రప్పిస్తున్నారు. లైసెన్స్‌డ్ ఆయుధాల సరెండర్‌కు ఆదేశాలిచ్చారు. 30 పోలీస్ యాక్ట్‌ను అమలు చేస్తున్నారు. అటు మావోయిస్టు మాజీలు..సానుభూతిపరులపై సైతం ఓకనే్నసి ఉంచారు. ఎన్నికల్లో వివాదాలకు కారణమయ్యే మద్యాన్ని, నాటుసారా అక్రమ విక్రయాలను అదుపు చేసేందుకు ఇప్పటికే సివిల్, ఎక్సైజ్ పోలీసు బృందాలు జిల్లా వ్యాప్తంగా ముమ్మర దాడులను సాగిస్తున్నాయి. బెల్ట్‌షాపుల నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేసి పోలింగ్‌కు నాలుగైదు రోజుల ముందుకల్లా వాటిని బంద్ చేయించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అంతేగాక మద్యం అమ్మకాలు పెరిగిపోకుండా అమ్మకాలపై జాయింట్ కలెక్టర్ రోజువారి నివేదికలు సేకరిస్తున్నారు. ఎస్పీ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో చెలరేగే సమస్యలపై 9490619446కు, 08682-24462కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. జిల్లా పంచాయతీ ఎన్నికల బందోబస్తులో ఒక ఎస్పీ, ఎఎస్పీ, ఆరుగురు డిఎస్పీలు, 31మంది సిఐలు, 96మంది ఎస్‌ఐలు, 1129ఎఎస్‌ఐలు, 389జమిందార్లు, 1383మంది కానిస్టేబుల్స్, 500మంది హోంగార్డులు, 14 సెక్షన్ల ఎపిఎస్పీ సిబ్బంది పాలుపంచుకుంటున్నారు. వారికి అదనంగా ట్రైనీ ఎస్‌ఐలు 41 మంది జిల్లాకు చేరుకోగా ర్యాపిడ్ యాక్షన్, సిఆర్‌పిఎఫ్‌లతో కూడిన నాలుగు కంపెనీల అదనపు బలగాలు జిల్లాకు రానున్నాయి. అయితే జిల్లాలోని ఐదు డివిజన్‌లలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతో బందోబస్తు కోసం సిబ్బంది కొరత సమస్య ఉండబోదని ఈ నేపధ్యంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పెద్దగా సమస్యలు ఉండబోవని పోలీస్ శాఖ ధీమాతో ఉండటం విశేషం.

పాల ఉత్పత్తిదారుల సంక్షేమమే ధ్యేయం
నార్మాక్స్ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి
భువనగిరి, జూలై 15: రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పాల ఉత్పత్తిదారుల సంక్షేమమే నార్మాక్స్ ధ్యేయమని ఆ సంస్థ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక పాలశీతలీకరణ కేంద్రంలో జరిగిన పాల ఉత్పత్తిదారుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మదర్‌డైరి(నార్మాక్స్)కు పాలు సరఫరా చేస్తున్న రైతులకు సబ్సిడీపై పశువుల దానా అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా రైతుల సంక్షేమాన్ని దృష్టియందుంచుకొని అన్ని విధాలుగా నార్మాక్స్ వారిని ఆదుకుంటుందని పేర్కొన్నారు. నాణ్యమైన పాలను ఉత్పత్తి చేసే రైతులకు గిట్టుబాటు ధర అందించడంలో నారాక్స్ ముందంజలో ఉందన్నారు. అదేవిధంగా పాల ఉత్పత్తిదారుల సంక్షేమంలో భాగంగా ఆయా కుటుంబాలలో ఉన్నత విద్యనభ్యసించే వారి పిల్లలకు ఉపకారవేతనాలతో పాటూ ప్రత్యేక ప్రోత్సాహక నగదు బహుమతులను అందించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా నార్మాక్స్ పరిధిలోని పాల ఉత్పత్తిదారుల కుటుంబ సభ్యుల పిల్లలకు మంజూరైన ఉపకార వేతనాలను ఆయన పంపిణీ చేశారు. అదేవిధంగా పదవ తరగతిలో అత్యంత ప్రతిభ కనబరిచిన పాల ఉత్పత్తిదారుల పిల్లలకు ఒక్కొక్కరికి 5వేల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు.

వ్యయపరిమితి దాటితే అనర్హత వేటు
* ఎన్నికల జిల్లా వ్యయపరిశీలకుడు చంద్రమోహన్‌రెడ్డి
నల్లగొండ టౌన్, జూలై 15: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్, సర్పంచ్ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల కమీషన్ విధించిన వ్యయపరిమితికి మించి ఖర్చు చేసినట్లయితే ఎన్నికల్లో గెలిచినగాని అనర్హులుగా ప్రకటించబడతారని ఎన్నికల వ్యయపరిశీలకులు చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఉదయాధిత్య భవనంలో డిజిగ్నేటేడ్ అధికారులతో ఎన్నికల ఖర్చు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నామినేషన్ వేసిన నాటి నుండి పోలింగ్ కౌంటింగ్ వరకు అభ్యర్థులు చేసిన ఖర్చులకు సంబంధించి రోజు వారి వివరాలు రిజిస్ట్రర్‌లోనమోదు చేసి మండల స్థాయి అధికారులచే ఆమోదం పొందాల్సి ఉంటుందని అభ్యర్థులకు సూచించారు. 10వేల జనాభా గల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీచేయు అభ్యర్థులు 80వేల రూపాయలు, 10వేల జనాభాకంటే తక్కువగా ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థులు 40వేల రూపాయలకు మించకుండా ఖర్చు చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల కమీషన్ నిర్దేశించిన నియమనిబంధనల ప్రకారం డిగ్జినేటెడ్ అధికారులు రోజువారి అభ్యర్థుల ఖర్చు లెక్కలు పరిశీలించాలని నిర్దేశించిన నమూనా పట్టిక 1,2లో చూపిన అంశాల వారిగా రిజిష్టర్లు పరిశీలించాలని, ప్రతి రెండు రోజులకు ఒకసారి అభ్యర్థుల ఖర్చు వివరాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల పరిశీలకురాలు ప్రియదర్శిని మాట్లాడుతూ పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థి తమ ఖర్చుకు సంబంధించిన అవసరమైన ఆధారాలు చేపించాల్సి ఉంటుందని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముక్తేశ్వర్‌రావు మాట్లాడుతూ ఓటర్లను ప్రలోబాలకు గురిచేయకుండా ధనాన్ని విచ్చల విడిగా ఖర్చు చేయకుండా నియంత్రించేందుకు ఎన్నికల కమీషన్ పరిమితిని నియమించిందని అభ్యర్థుల ఖర్చు పరిమితి మించకుండా చూడాల్సిన బాధ్యత మండల స్థాయి డిజిగ్నేటేడ్‌లపై ఉందని సూచించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి డి ఆర్‌వో ఆర్.అంజయ్య, డిపివో కృష్ణమూర్తి, జిల్లా ఆడిట్ అధికారి సిహెచ్.వేణుగోపాల్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
నాలుగు మోటార్‌సైకిళ్ళు, నాలుగు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం
దేవరకొండ, జూలై 15: దుకాణాల ముందు నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాలను చాకచక్యంగా దొంగిలించే దేవరకొండకి చెందిన రాపాల నర్సింగ్ అనే దొంగను సోమవారం దేవరకొండలో అరెస్ట్ చేసి అతని నుండి నాలుగు మోటార్‌సైకిళ్ళు, నాలుగు ల్యాప్‌టాప్ కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నట్లు దేవరకొండ ఎస్‌హెచ్‌వో నాగేశ్వర్‌రావు చెప్పారు. సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అరెస్ట్ చేసిన దొంగను మీడియా ఎదుట చూపించి అతడు చేసిన దొంగతనం వివరాలను వెల్లడించారు. నిందితుడు నర్సింగ్ దేవరకొండలో కారుడ్రైవర్‌గా పని చేస్తూ దొంగతనాలకు అలవాటుపడ్డాడని చెప్పారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఎనిమిది నెలల క్రితం ఒక వైన్స్‌షాప్ ఎదుట నిలిపి ఉంచిన మోటార్‌సైకిల్‌ను నిందితుడు దొంగిలించాడని, పది రోజుల తర్వాత అదే వైన్స్‌షాప్ ఎదుట నిలిపి ఉంచిన మరో మోటార్‌సైకిల్‌ను దొంగిలించాడని చెప్పారు. రెండు దొంగతనాలు చేసిన అనంతరం తుక్కుగూడలో మరో వైన్‌షాప్ ఎదుట నిలిచి ఉంచిన మోటార్‌సైకిల్‌ను నిందితుడు దొంగిలించాడని చెప్పారు. ఈ నెల 8 వ తేదీన హైద్రాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో ఒక ఇంటి ఎదుట నిలిపి ఉంచిన మోటార్‌సైకిల్‌ను నిందితుడు దొంగిలించాడని తెలిపారు. ఈ నెల 10వ తేదీన దేవరకొండలోని గురుకుల పాఠశాల సమీపంలో ఇంజనీరింగ్ విద్యార్ధులు నివాసం ఉండే రూం తాళం పగులగొట్టి మూడు ల్యాప్‌ట్యాప్‌లను, గాంధీనగర్‌లో మరో ఇంజనీరింగ్ స్టూడెంట్‌కు చెందిన ఒక ల్యాప్‌టాప్‌ను నిందితుడు నర్సింగ్ దొంగిలించాడని చెప్పారు. దొంగిలించిన ల్యాప్‌టాప్‌లను అమ్మేందుకు సోమవారం పట్టణంలోని ముత్యాలమ్మ వీధిలో తిరుగుతుండగా అరెస్ట్ చేసి నిందితుడి నుండి దొంగిలించిన వాహనాలను, కంప్యూటర్లను రికవరీ చేసినట్లుచెప్పారు. ఈ విలేఖరుల సమావేశంలో క్రైం ఎస్ ఐ కలీల్‌ఖాన్, ఐడి పార్టీ సిబ్బంది విజయశేఖర్, శ్రీనివాస్‌రెడ్డి, హోంగార్డు సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.

వైకాపాపై కాంగ్రెస్, టిడిపి కుట్ర
మిర్యాలగూడ, జూలై 15: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు పోటీ చేయకుండా అధికారకాంగ్రెస్, ప్రధానప్రతిపక్షం టిడిపి కుట్రలుపన్నుతున్నాయని వైకాపా జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు నర్సింహ్మారావు, వైకాపా సిఇసి సభ్యురాలు పాదూరి కరుణ ఆరోపించారు. సోమవారం పట్టణంలోని పాదూరి కరుణ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ వైకాపా అభ్యర్థులు పంచాయతీ ఎన్నికల్లో బరిలో ఉండకుండా కాంగ్రెస్,టిడిపి ఎత్తుగడలు వేస్తున్నాయని విమర్శించారు. కార్యకర్తలు మనోధైర్యంతో అధికారకాంగ్రెస్, టిడిపి ఎత్తుగడలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆత్మస్థైర్యంతో కార్యకర్తలు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో అధికారకాంగ్రెస్‌పార్టీ, ప్రధానప్రతిపక్షమైన టిడిపికి సమానంగా గ్రామపంచాయతీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు గెలుపొందుతారని వారన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వైకాపా అభ్యర్థుల గెలుపునకు దోహదం చేస్తాయని వారన్నారు. కాంగ్రెస్, టిడిపి కుట్రలను తిప్పికొడుతూ జిల్లాలో మెజార్టీ పంచాయతీలను గెలుచుకునేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. సమావేశంలో మారేపల్లి అమృతారెడ్డి, రాము పాల్గొన్నారు.

ఒకే పంచాయతీలో తండాల మధ్య పోరు
దామరచర్ల, జూలై 15: పంచాయతీ ఎన్నికల్లో ఈసారి చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. మండలంలోని వాచ్యతండా గ్రామపంచాయతీ పరిధిలో బెట్టెతండా, గంగ్యాతండా, బొల్లిగుట్టతండాలు ఉన్నాయి. ఏ గ్రామపంచాయతీలోనైనా అభ్యర్థులు పార్టీల మధ్య పోటీ ఉంటుంది. కాగా ఈ గ్రామపంచాయతీలో వాచ్యతండాకు మిగిలిన తండాలైన బెట్టెతండా, గంగ్యాతండా, బొల్లిగుట్టతండాల ఓటర్ల మధ్య పోటీ నెలకొంది. వాచ్యతండా గ్రామపంచాయతీ రిజర్వేషన్ బిసి మహిళకు కేటాయించారు. ఈ రిజర్వేషన్ రావడమే తండాల మధ్య పోరుకు ఆజ్యం పోసింది. బిసి సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు ఈ పంచాయతీ పరిధిలో రెండే ఉన్నాయి. ఒక కుటుంబం వారు వాచ్యతండాలో నివసిస్తుండగా మరొక కుటుంబం వారు బెట్టెతండాలో నివసిస్తున్నారు. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో 1469 ఓటర్లున్నారు. గత నాలుగు పర్యాయాలుగా వాచ్యతండాకు చెందినవారే సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. ఈసారి శివారుతండాల అభ్యర్థులకు సర్పంచ్ అవకాశం ఇవ్వాలని బెట్టెతండా, బొల్లిగుంటతండా, గాంగ్యతండా ఓటర్లు గ్రామపెద్దల సమావేశంలో తెగేసి చెప్పారు. అందుకు వాచ్యతండా పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో వాచ్యతండా నుండి కాతోజు అనసూర్య బెట్టెతండా నుండి కనె్నగంటి శశికళ సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. వాచ్యతండాకు 500 పైచిలుకు ఓటర్లు ఉండగా శివారుతండాకు 800పై చిలుకు ఓటర్లు ఉన్నారు. దీంతో ఎవరికి వారు తాము బలపర్చిన అభ్యర్థిని గెలిపించుకోవాలని తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. గెలుపు ఎవరిపక్షాన నిలుస్తుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
సూర్యాపేట, జూలై 15: పట్టణంలో అన్ని ఎన్నికలకు వార్డులవారీగా పోలింగ్‌కేంద్రాలను ఏర్పాటుచేసి ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలని కోరుతూ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం స్థానిక మున్సిపల్ కమిషనర్ సిహెచ్.నాగేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, టిడిపి పట్టణ అధ్యక్షుడు ఎండి.షఫిఉల్లా మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల పోలింగ్‌కేంద్రాలను ఒకవార్డు కేంద్రాలను మరోవార్డులో దూరంగా ఏర్పాటు చేయడం వల్ల శాసనసభ ఎన్నికల్లో పోలింగ్‌శాతం తక్కువగా నమోదవుతుందన్నారు. అదే మున్సిపల్ ఎన్నికల్లో ఆయా వార్డులవారీగా పోలింగ్‌కేంద్రాలను ఏర్పాటుచేయడం వల్ల ఓటర్లకు సులువుగా ఉండటంవల్ల 80శాతం వరకు పోలింగ్ నమోదవుతుందన్నారు. అందువల్ల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కేంద్రాలను మున్సిపల్‌వార్డుల వారీగా ఏర్పాటుచేసి ప్రజలు ఓటుహక్కును సులువుగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ బిజెపి అధ్యక్షుడు కొండేటి ఏడుకొండలు, వైకాపా నాయకుడు తండు శ్రీనివాస్‌గౌడ్, పట్టణ టిడిపి ప్రధానకార్యదర్శి బూర బాలసైదులు, సిపిఐ ప్రాంతీయ సహయకార్యదర్శి దోరేపల్లి శంకర్ పాల్గొన్నారు.
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
కనగల్, జూలై 15: తండ్రికి తలకొరివి పెట్టి కూతురురుణం తీర్చుకున్న ఘటన మండలంలోని బుడమర్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పంతంగి లక్ష్మయ్య(45) అనారోగ్యంతో గత కొంత కాలంగా బాధపడుతూ సోమవారం మృతి చెందాడు. దీంతో మృతునికి ఒకే ఒక కూతురు ఉండడంతో మగపిల్లలు లేని లోటును తీర్చి తండ్రికి తలకొరివి పెట్టింది.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చింతపల్లి, జూలై 15: మండలంలోని వింజమూరు గ్రామసమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరోనలుగురు తీవ్ర గాయాలకు గురయ్యారు. హైద్రాబాద్‌లోని జీడిమెట్లలో నివాసం ఉండే షాద్‌నగర్‌కు చెందిన క్షీరోద్(30) తన మిత్రులైన కృష్ణ, నాగమణి, వారి కుమార్తెలు మహేశ్వరి, జానకిలను తన కారులో ఎక్కించుకుని నాగార్జున సాగర్ నుండి హైద్రాబాద్‌కు వెళ్తుండగా హైద్రాబాద్ నుండి మల్లెపల్లి వైపు వెళ్తున్న డిసిఎం వింజమూరు సమీపంలో కారును ఢీకొనడంతో ఈప్రమాదం జరిగింది. తీవ్రగాయాలైన ఐదుగురిని అదే రోడ్డులో చింతపల్లి వైపు వస్తున్న తహశీల్దార్ పర్హిన్‌షేక్ దగ్గర ఉండి వారిని హైద్రాబాద్‌కు తరలించారు. తీవ్రగాయాలైన క్షీరోజ్ మార్గమధ్యంలో మృతి చెందాడు. ఆందోళనకరంగా ఉన్న నలుగురుని హైద్రాబాద్‌లోని ఆరెంజ్ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
కనగల్, జూలై 15: నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎన్నికల అధికారి ఎన్.చంద్రమోహన్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం ఎంపిడివో కార్యాలయంలో అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభ్యర్థులు ఎన్నికల నియమావళీని ఉల్లంఘించి అధిక నిధులతో ప్రచారాలు నిర్వహించరాదన్నారు. సర్పంచ్, వార్డు స్థానాల్లో పోటీ చేయు అభ్యర్థులు ప్రతి రోజు ఖర్చులు నమోదు చేయాలని, ఎన్నికలకు సంబంధించిన వివరాలను అధికారులకు అందజేయాలని సూచించారు. సర్పంచ్ 40 వేలు, వార్డు సభ్యులు 6వేల రూపాయలకు మించి ఎన్నికలకు ఖర్చు చేయరాదన్నారు. కార్యక్రమంలో ఎంపిడివో సీతాకుమారి, తహశీల్దార్ సైదులుగౌడ్, వేణుకుమార్, లక్ష్మారెడ్డి, చందుచారి పాల్గొన్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
రామన్నపేట, జూలై 15: ఎన్నికల సందర్భంగా గ్రామాలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తప్పవని రామన్నపేట ఎస్‌ఐ ఎండి. మాసియొద్దిన్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలలో ఈనెల 23న జరిగే గ్రామపంచాయతి ఎన్నికలను పురస్కరించుకుని సోమవారం గ్రామాలలో తన సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వివిధపార్టీల నాయకులతో మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేటట్లు సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించి ఎన్నికల అధికారులకు సహకరించాలని సూచించారు. గ్రామాలలో అలజడులు సృష్టించేవారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సవాల్‌గా మారిన సమస్యాత్మక పల్లెలు * శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు
english title: 
nigha

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles