Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

తప్పులతడకగా ఓటర్ల జాబితా

$
0
0

నెల్లూరు, జూలై 15: నగరపాలక సంస్థ పరిధిలో ఓటర్ల జాబితా తప్పులతడకగా ఉందని, తక్షణం అధికారులు సవరించకుంటే టిడిపి ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలను దిగ్భందం చేసి ఆందోళన చేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర హెచ్చరించారు. సోమవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో రవిచంద్ర మాట్లాడుతూ నగరంలోని ఏ డివిజన్‌లో కూడా ఓటర్లు వరుస సంఖ్యలో లేరని, జాబితా గందగోళంగా ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు, అధికారులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఒక డివిజన్‌లో 15వేల ఓట్లు, మరో డివిజన్‌లో 5వేల ఓట్ల చొప్పున ఉన్నాయని, కాంగ్రెస్‌కు అనుకూలమైన డివిజన్లలో 5వేల ఓట్లు మాత్రమే పెట్టారని విమర్శించారు. డి లిమిటేషన్ ప్రకారం ఉన్న ఓటర్ల జాబితాను గందగోళం చేశారన్నారు. 2010వ సంవత్సరం నుంచి ఓటర్ల జాబితా సక్రమంగా లేదన్నారు. ఓటర్ల జాబితాలు గందరగోళంగా ఉన్నాయని గత మూడు సంవత్సరాల నుంచి తమ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నా అధికారులకు మాత్రం పట్టడం లేదన్నారు. అక్రమాలపై ఎన్నికల అధికారి బన్వర్‌లాల్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు వెల్లడించారు. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారి అప్పటి కలెక్టర్‌ను తీవ్రంగా మందలించడంతోపాటు చర్యలు తీసుకున్నారన్నారు. అయినా నిస్సిగ్గుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకోకపోతే తగినమూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని హెచ్చరించారు. కొత్తగా వచ్చిన కలెక్టర్ శ్రీకాంత్ గతంలో మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసి ఉన్నారని, నగరంలో జరిగే అక్రమాలపై దృష్టిసారించాలన్నారు. 2005లో నెల్లూరు ఆర్‌డివో కార్యాలయంలో దొంగ ఓట్లు వేస్తుంటే తమ కార్యకర్తలు రెడ్‌హ్యాండెట్‌గా పట్టించారని గుర్తుచేశారు. ప్రజలు తమవైపు ఉన్నారని, ఎన్నికల్లో అసమర్థ కాంగ్రెస్, అవినీతి పిల్ల కాంగ్రెస్‌ను తరిమికొడతారని రవిచంద్ర తెలిపారు. ఈ సమావేశంలో నగర పార్టీ అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రూరల్ కన్వీనర్ కిలారి వెంకటస్వామినాయుడు, తెలుగుయువత జిల్లా అధ్యక్షులు పమిడి రవికుమార్‌చౌదరి, నాయకులు అన్నం దయాకర్‌గౌడ్, నూనె మల్లికార్జున, ధర్మవరపు సుబ్బారావు, మండవ రామయ్య, ఉచ్చి భువనేశ్వరప్రసాద్, పాముల రమణయ్య, జలదంకి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

పట్టపగలు బుజబుజనెల్లూరులో దోపిడీ
* రూ.2.50 లక్షల సొత్తు గల్లంతు
* బెంబేలెత్తుతున్న ప్రజలు
నెల్లూరు, జూలై 15: పట్టపగలు దొంగలు ఇంట్లోకి ప్రవేశించి ఒంటరిగా ఉన్న వృద్ధురాల్ని బెదిరించి రూ.2.50 లక్షల సొత్తును దోచుకెళ్లిన సంఘటన సోమవారం నగర పరిధిలోని బుజబుజనెల్లూరులో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఉచ్చూరు అరుణమ్మ అనే వృద్ధురాలు భర్త ప్రభాకర్‌రెడ్డి మృతి చెందడంతో ఆమె ఒంటరిగా ఉంటోంది. ఇంట్లో మహిళ ఒంటరిగా ఉంటోందని గ్రహించిన దొంగలు ఇనుపరాడ్‌తో ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించారు. అప్పటికే బాత్‌రూమ్‌లో ఉన్న అరుణమ్మ తలుపులు తెరవడాన్ని గమనించి బయటకు వచ్చింది. దొంగ రాడ్డు చూపించి అరిస్తే చంపేస్తానని బెదిరించాడు. ఆమె ఒంటిపై ఉన్న 10 సవర్ల బంగారు ఆభరణాలతోపాటు రూ.10వేల నగదును దోచుకొని పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత బాధితురాలు చుట్టుపక్కల వారికి తెలియజేయడంతో స్థానికులు ఐదవ నగర పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్ ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి, క్లూస్ టీం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి మహిళ నుండి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఇంట్లో ఒంటరిగా ఉందని బాగా గమనించిన వ్యక్తే ఈ దొంగతనానికి పాల్పడి ఉండవచ్చనని తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదుచేసి దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
బెంబేలెత్తుతున్న ప్రజలు
నిత్యం ఏదోఒక ప్రాంతంలో పట్టపగలు దొంగలు మారణాయుధాలతో ఇంట్లోకి చొరబడి బంగారు నగలు, నగదు దోచుకెళ్లడంతో స్థానిక ప్రజలు బెంబేలెత్తుతున్నారు. దొంగలపై నిఘా ఉంచాలని పోలీస్ ఉన్నతాధికారులు క్రైం సమావేశాల్లో సూచనలు ఇస్తున్నా సిబ్బందిలో మాత్రం మార్పు రావడం లేదని, గస్తీలు నామమాత్రంగా చేపడుతున్నారని మహిళలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దొంగలపై పటిష్టమైన నిఘా ఉంచేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అవినీతిని అంతమొందించేందుకు
యువత ముందుకు రావాలి
* టిడిపి నేత సోమిరెడ్డి పిలుపు
నెల్లూరు, జూలై 15: దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న అవినీతిని అంతమొందించేందుకు యువత ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నగరంలోని 28,29 డివిజన్లకు సంబంధించిన యువకులు పార్టీలో చేరిన సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ సిద్ధాంతాలు లేని పార్టీల కోసం యువత పోరాడాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా రాజకీయ ప్రవేశం చేయాలంటే దేవతలను పూజిస్తారని, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరాలంటే జైలుకు పోవాల్సిందేనన్నారు. రాష్ట్రాన్ని పాలించగల ఏకైక నాయకుడు చంద్రబాబునాయుడు మాత్రమేనన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర మాట్లాడుతూ రాష్ట్రానికి మంచి పరిపాలన, సమర్థ నాయకత్వం కావాలని ప్రజలు ఆలోచిస్తున్నారని, అది చంద్రబాబుకే సాధ్యమన్నారు. సిద్ధాంతం లేని రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడంపై ప్రజలు ఆలోచనలో పడ్డారన్నారు. జిల్లాలో రానున్న రోజుల్లో టిడిపిలోకి భారీగా వలసలు ఉంటాయన్నారు. 28,29 డివిజన్లకు సంబంధించి 20 మంది యువకులు కొల్లూరు నారాయణనాయుడు ఆధ్వర్యంలో అనుచరులతో సోమిరెడ్డి, బీద రవిచంద్ర సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నాయకులు కిలారి వెంకటస్వామినాయుడు, పడవల కృష్ణమూర్తి, అన్నం దయాకర్‌గౌడ్, బద్దెపూడి రవీంద్ర, జలదంకి సుధాకర్, నూనె మల్లికార్జున, భాలకృష్ణచౌదరి తదితరులు పాల్గొన్నారు.

ప్రజా చైతన్య సదస్సును విజయవంతం చేయండి
బిజెపి నాయకుల పిలుపు
నెల్లూరుసిటీ, జూలై 15: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 7వ తేదీన జరిగే జిల్లా ప్రజాచైతన్య సదస్సును విజయవంతం చేయాలని జిల్లా భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు సురేంద్రరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం బిజెపి కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యుపిఎ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక చర్యలు, అవినీతి, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంపై ప్రజా చైతన్య సదస్సులో చర్చిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రధానకార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 11వ తేదీన హైదరాబాదులో జరిగే నవభారత యువ సమ్మేళనానికి జిల్లా నుంచి యువకులు, విద్యార్థులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనంలో భావి భారత ప్రధాని ప్రస్తుత గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఎన్నడు లేని విధంగా యువకులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో బిజెపి అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, డాక్టర్ వరదయ్య, కె సుధాకర్, అన్న శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

మా నామినేషన్లు సక్రమమే
ఎన్నికల అధికారికి అభ్యర్థుల అప్పీలు
నెల్లూరుసిటీ, జూలై 15: జిల్లాలోని 931 పంచాయతీల్లో 303 క్లస్టర్ కేంద్రాల్లో పంచాయతీ ఎన్నికల నామినేషన్ పరిశీలన పర్వం ఆదివారం పూర్తయిన విషయం తెలిసిందే. సర్పంచ్ పదవులకు సంబంధించి 74 నామినేషన్లు తిరస్కరించగా, వార్డులకు సంబంధించి 520 నామినేషన్లు తిరస్కరణకు గురయినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వార్డులు, సర్పంచ్ స్థానాలకు గాను 26,521 నామినేషన్లు తేలాయి. వీటిలో సర్పంచ్ పదవులకు 4382 నామినేషన్లు, వార్డులకు 22,139 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. నామినేషన్లను తిరస్కరించిన కొంతమంది అభ్యర్థులు సోమవారం ఎన్నికల అధికారి వద్ద అప్పీలు చేసుకున్నారు. అందులో మొత్తం 24 మంది సర్పంచ్ అభ్యర్థులు, 138 మంది వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్న వారు తమ నామినేషన్లు సక్రమైనవేని ఎన్నికల అధికారికి అప్పీలు చేసుకున్నారు. అప్పీలు చేసుకున్న వారి భవిష్యత్తు మంగళవారం తేలనుంది. డివిజన్లవారిగా వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు డివిజన్‌లో 10మంది సర్పంచ్‌లు, వార్డులకు పోటీ చేసే అభ్యర్థులు 40 మంది, గూడూరు డివిజన్ నుండి సర్పంచ్ 6, వార్డులు 38మంది, కావలి సర్పంచ్ 1, వార్డులు 10, నాయుడుపేట సర్పంచ్ 1, వార్డులు 25, ఆత్మకూరు సర్పంచ్ 6, వార్డులకు పోటీ చేసే 25 మంది అభ్యర్థులు ఎన్నికల అధికారికి అప్పీలు చేసుకున్నారు.

బెల్ట్‌షాపులపై ఎక్సైజ్ అధికారుల దాడులు
మద్యం స్వాధీనం, ఇద్దరిపై కేసు నమోదు
రాపూరు, జూలై 15: రాపూరు ఎక్సైజ్, ప్రొహిబిషన్ పరిథిలోని పలు ప్రాంతాలలో సోమవారం మద్యం బెల్ట్‌షాపులపై దాడులు చేసారు. పొదలకూరు మండలం చాట్లగుట్ట గ్రామసమీపంలో అక్రమంగా మద్యం నిల్వవున్న ఎం గోపాల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని 10 మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకోవటం జరిగిందని ఎక్సైజ్ సిఐ ప్రసాద్ తెలిపారు. అలాగే మరుపూరు గ్రామంలో దాడులు చేసి వెంకటరమణయ్య అనే వ్యక్తి వద్ద అక్రమంగా నిల్వ వున్న 8 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయటం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పరిధిలోని రాపూరు, పొదలకూరు, చేజర్ల మండలాలలో ఎక్కడన్నా అక్రమ మద్యం నిల్వ ఉన్నా, బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నా తమకు సమాచారం ఇవ్వాలని అన్నారు.

సాయిబాబాకు వైభవంగా పల్లకీ సేవ
కోవూరు, జూలై 15: గురుపూర్ణిమ మహోత్సవాలలో భాగంగా సోమవారం సాయిబాబాకు వైభవంగా పల్లకీసేవ చేపట్టారు. మండలంలోని మసీదువీధి, పడుగుపాడులలో ఉన్న శ్రీషిరిడీ సాయిబాబా మందిరంలో ఉదయం అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసారు. రాత్రి హారతి, భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాను రంగురంగు విద్యుద్దీపాలతో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.

15 మంది రౌడీషీటర్లు బైండోవర్
ఇందుకూరుపేట, జూలై 15: మండలంలోని 20 పంచాయతీలలో ఈనెల 27న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ముదివర్తిపాలెం, మైపాడు, కొరుటూరు తదితర గ్రామాలలోని 15 మంది రౌడీషీటర్లను తహశీల్దార్ అనుమతితో సోమవారం అదుపులోకి తీసుకున్నట్టు స్థానిక ఎస్‌ఐ కె శేఖర్‌బాబు తెలిపారు. ఈ 15 మంది గతంలో పలువివాదాల్లో ఉండగా, వీరి రౌడీషీటర్లుగా పేర్కొన్నామన్నారు.

పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
అధికారులకు ఎన్నికల పరిశీలకులు రవిచంద్ర ఆదేశం
గూడూరు, జూలై 15: గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు ఎం రవిచంద్ర ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి విమర్శలకు తావులేకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సక్రమంగా విధులు నిర్వహించాలన్నారు. సోమవారం ఆయన గూడూరు ఆర్డీవో కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డివిజన్‌లోని అన్ని మండలాల ఎన్నికల అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ల దాఖలు, పరిశీలన కార్యక్రమం ముగిసిందన్నారు. ఇక ఉపసంహరణకు ఈనెల 17వ తేదీ వరకు గడువు ఉన్నందున ఇప్పటివరకు ఎన్నికలకు సంబంధించి వచ్చిన అప్పీళ్లను ఏవిధంగా పరిష్కరిస్తున్నారన్న దానిపై ఆయన ఆర్డీవోను ప్రశ్నించారు. ఎన్నికల చివరి రోజున పలువురు నామినేషన్లు ఒక్కసారిగా వేసేందుకు రావడంతో కొంత గందరగోళం ఏర్పడిందని ఆర్డీవో వివరించారు. అయినా అధికారులు నిబంధనల ప్రకారం నిర్ణీత సమయానికి నామినేషన్ కేంద్రానికి వచ్చిన వారి దగ్గర నుండి నామినేషన్లు స్వీకరించారని తెలిపారు. అలాగే పరిశీలనలో వెంకటగిరి, వాకాడు మండలాలకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు వచ్చినట్లు, వాటిని పరిశీలిస్తున్నట్లు ఆర్డీవో ఎన్నికల పరిశీలకులకు వివరించారు. వెంకటగిరి మండలం సోమసానిగుంట పంచాయతీ సర్పంచ్ పదవికి సంబంధించి నామినేషన్ వేసే సమయంలో కుల ధ్రువీకరణ పత్రం అవసరం లేదని ఎన్నికల అధికారి చెప్పి, పరిశీలన రోజున కుల ధ్రువీకరణ పత్రం లేదని నామినేషన్ తిరస్కరించారని వైఎస్‌ఆర్‌సిపి నాయకులు ఎల్లసిరి గోపాలరెడ్డి, పాశం సునీల్‌కుమార్‌లు ఆర్డీవో దృష్టికి తీసుకొచ్చారు. వాకాడు మండలం ముట్టెంబాక గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్‌లో ఓటర్ల క్రమసంఖ్య తప్పుగా వేయడం, బలపరిచిన అభ్యర్థి క్రమసంఖ్య తప్పుగా వేసినందున నామినేషన్‌లను తిరస్కరించడంపై కూడా వైకాపా నాయకులు ఆర్డీవోకు అప్పీలు చేశారు. వాటిని పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం అభ్యంతరాలను పరిష్కరించనున్నట్లు వారికి ఆర్డీవో తెలియచేశారు. ఈ సందర్భంగా సోమవారం అప్పీళ్లను ఆర్డీవో స్వీకరించనుండటంతో అధికమంది తమ అప్పీళ్లను దాఖలు చేయడానికి గూడూరు ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు.

* సవరించకుంటే ఆందోళన * టిడిపి జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర హెచ్చరిక
english title: 
tappula tadaka

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>